అడివి బాపిరాజు రచనలు/హిమబిందు
హిమబిందు అడివి బాపిరాజు 1944లో రాసిన చారిత్రక నవల. ఇది ఆంధ్రుల చరిత్రలో శాతవాహనుల కాలానికి సంబంధించిన నవల. ప్రథమ ఆంధ్ర శాతవాహన చక్రవర్తియైన శ్రీముఖ శాతవాహనుడు, అతని కుమారుడు శ్రీకృష్ణ శాతవాహనుడు, శిల్పి సువర్ణశ్రీ, వ్యాపారవేత్త చారుగుప్తుడు, అతని తనయ హిమబిందుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
చారుగుప్తుడు ఒక వ్యాపారవేత్త. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి మూలస్థంభం వంటి వాడు. చక్రవర్తి శ్రీముఖుడికి కుడిభుజం లాంటివాడు. స్థౌలతిష్యుడు ఒక హిందూ మహర్షి. బౌద్ధమతం ప్రధానంగా గల శాతవాహన సామ్రాజ్యాన్ని రూపుమాపి ఆ పునాదుల మీద హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని స్థౌలతిష్యుని ఆకాంక్ష. అందుకోసం ఆయన ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. చారుగుప్తునిది మరో కల. పాటలీపుత్రాన్ని జయించి తన చక్రవర్తి సకల జంబూద్వీపానికి చక్రవర్తి కావాలనీ, కూతురు హిమబిందును ఆయన కొడుకు శ్రీకృష్ణ శాతవాహనుడికిచ్చి పెళ్ళి చేసి, ఆమెను భావి సామ్రాజ్ఞిని చేయాలని కోరిక. తన మనమరాలైన చంద్రబాలను విషకన్యగా మార్చి ఆమెను ఎరవేసి శ్రీకృష్ణమహారాజును హతమార్చాలనేది స్థౌలతిష్యుని కోరిక. అందాల రాశులైన చంద్రబాల, హిమబిందు తమకు తెలియకుండానే తమ పెద్దల ఆటలో పావులైపోతారు.
స్థౌలతిష్యుడు శ్రీముఖుడి చిన్న కుమారుడైన మంజుశ్రీ అపహరణకు పథకం వేసి తాను నిర్మించబోయే హిందూ సామ్రాజ్యానికి అతన్ని చక్రవర్తిని చేయాలని చూస్తాడు. చారుగుప్తుడు, చక్రవర్తి శ్రీముఖుడు పాటలీపుత్రం మీదకు దాడి వెడలడానికి కావలసిన సొమ్మంతా సమకూరుస్తాడు. స్థౌలతిష్య మహర్షి తనకున్న ప్రజ్ఞాపాటవాలన్నీ ఉపయోగించి శాతవాహన సామ్రాజ్యాన్ని కూలదోయాలని చూస్తుంటాడు. విధి వశాత్తూ వీరివురి ఆశలు అడియాసలవుతాయి. హిమబిందు శిల్పి ధర్మనంది కుమారుడైన సువర్ణశ్రీ ప్రేమలో పడుతుంది. అతన్ని పొందడానికి తన సమస్త సంపదలూ పోగొట్టుకోవడానికి కూడా వెనుకాడదు ఆమె.