యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/అనైతికం
ఈ నవల స్త్రీవాదం ప్రధానాంశంగా రాయబడింది. ఇది ముగ్గురు మహిళల కథల సమాహారం.
బ్రిటన్లో ది విమెన్ అనే పుస్తకంపై నిషేధం గురించి కోర్టులో వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఆ పుస్తకం స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకమనీ దాన్ని నిషేధించాలని వాదించేది బ్రిటన్లో స్థిరపడ్డ భారతీయ యువ మహిళా న్యాయవాది శ్యామల. ఆమెకు బ్రిటన్లో అనేకమంది మహిళలే కాక పురుషుల మద్ధతు కూడా ఉంటుంది. ఆ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నోట్స్ తయారు చేసుకుంటుంది శ్యామల. ఆ కేసులో గెలుపు తనదేననీ చాలా ధీమాగా ఉంటుంది. కానీ వాదనకు ముందే ప్రచురణకర్తల తరఫున ప్రతివాది సూర్యం అని తెలుస్తుంది శ్యామలకు. సూర్యం ఆమెకన్నా రెండేళ్ళు సీనియర్. ఇద్దరికీ అంతకుముందే పరిచయం ఉంటుంది.
కోర్టులో వాదోపవాదాలు మొదలవుతాయి. పుస్తకంలో రచయిత మహిళల గురించి ఎంత అవమానంగా రాశాడో, స్ర్తీ పురుష సమానత్వం గురించి ఎంత కించపరుస్తూ రాశాడో సోదాహరణంగా వాదిస్తుంది. సూర్యం ఆ వాదనలను తిప్పికొడుతూ రచయితకు స్త్రీల పట్ల ఉండే గౌరవాన్ని ఎత్తి చూపడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాడు. పుస్తకంలో రాసిన విషయాలకు ఆధారంగా కొన్ని పరిశోధనలు కూడా చూపిస్తాడు. సూర్యమే కేసు గెలుస్తాడు.
శ్యామల అవమాన భారం తట్టుకోలేక పోతుంది. సూర్యం గెలుపు ఓటములను సమానంగా తీసుకోమనీ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఆవేశంలో అతన్నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది.
అక్కడ జరిగిన పురస్కారాల ప్రధానోత్సవంలో శ్యామల మహిళలు, న్యాయం మీద తాను రాసిన పుస్తకానికి తనకు పురస్కారం లభిస్తుందని అనుకుంటూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా శ్యామల తల్లి అహల్య రాసిన మరో పుస్తకానికి ఆ పురస్కారం లభిస్తుంది. ఈ లోపు శ్యామల కంటే రెండేళ్ళ చిన్నవాడైన ప్రకాష్, తాము ఒకే తండ్రికి పుట్టిన పిల్లలని చెబుతాడు. అహల్య మరో సంబంధం పెట్టుకోవడం వలన తమ తండ్రి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడనీ, తర్వాత ఆమెతో విడిపోయి మరో పెళ్ళి చేసుకున్నాక తాను పుట్టాననీ చెబుతాడు. ఇదంతా శ్యామల నమ్మలేకపోతుంది. తల్లి ఇదంతా ఆమెకు చెప్పి ఉండదు. తల్లితో గొడవపడి తన తండ్రిని కలుసుకోవడానికి భారతదేశానికి వస్తుంది.
అహల్య కథ అమ్మ, నాన్న, అన్నయ్యతో కూడిన అందమైన కుటుంబం అహల్యది. పరువ మర్యాదలతో పెరిగిన కుటుంబంలోకి ఆమె అన్నయ్య హఠాత్తుగా తాను ఓ మోసపోయిన, దళితురాలైన అచ్చమ్మ అనే మహిళను భార్యగా తీసుకుని వస్తాడు. మొదట్లో అహల్య బాధ పడ్డా వదిన మనస్తత్వం తెలుసుకుని ఆమెను అభిమానించడం మొదలు పెడుతుంది. మరోవైపు అహల్యకు కూడా మంచి సంబంధం చూసి వివాహం చేస్తారు.
అత్తవారింట్లోకి బెరుకుగా అడుగుపెడుతుంది అహల్య. మొదట్లో అంతా మంచి వారే అనిపించినా, నెమ్మదిగా ఆమె మీద అన్ని పనుల భారం వేస్తుంటారు. భర్త కూడా ఆమె వైపు నిలవకుండా కుటుంబ సభ్యులకే వత్తాసు పలుకుతూ ఉంటాడు. రాను రాను ఆమెలో అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. తన ఆర్థిక అవసరాలను కూడా భర్త మీద ఆధారపడటం ఆమెకు ఇష్టం ఉండదు. ఈ లోపు పెళ్ళికి ముందే ఆమె రాసిన పరీక్షలో ఉత్తీర్ణురాలై లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. ఆమె భర్త కూడా ఇంట్లో పనులు చేస్తూనే ఉద్యోగం చేయమని అందుకు అంగీకరిస్తాడు. కానీ ఆ తర్వాత కూడా ఆమెకు భర్తతో సఖ్యత ఉండదు. శారీరక సంబంధం కూడా అంతంతమాత్రమే. కాలేజికి రోజూ బస్సులో వెళ్ళి రావడం, ఇంట్లో పనులు చూసుకోవడం ఆమెకు కష్టంగా ఉంటుంది. అందుకని ఆమె తాను సంపాదించిన డబ్బుతో ఒక స్కూటీ కొనుక్కోవాలనుకుంటుంది. భర్తకి తెలియకుండా షోరూములో అడ్వాన్సు కూడా ఇస్తుంది. కానీ ఆమె భర్త, ఇంట్లో తమ చెల్లెలు పెళ్ళి ఉందనీ, దుబారా ఖర్చులు ఎందుకని అడ్డు చెబుతాడు. దాంతో ఆమెకు భర్త మీద మరింత అసంతృప్తి కలుగుతుంది.
ఈలోపు ఆమెకు ఇంటికి పెద్ద కొడుకైన బావగారు పరిచయమవుతాడు. అతను ఇంట్లో అందరికంటే భిన్నంగా ఆమెను అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఆమె తెలివైందని అర్థం చేసుకుంటాడు. అతను ఒక సంస్థను నడిపిస్తూ ఉంటాడు. ఆమె తెలివితేటలు పరీక్షించడానికి తాను ఏ షేర్లు కొనాలో ఆమెను సలహా అడుగుతాడు. ఆమె సూచించిన షేర్లలో మంచి లాభం వస్తుంది. క్రమంగా వారి పరిచయం ఎక్కవవుతుంది. బస్సులో వెళ్ళడానికి ఆమె కష్టపడుతుందని తెలిసి తన కార్లోనే ఆమెను కాలేజీలో దిగబెట్టడం, తీసుకురావడం చేస్తుంటాడు. ఆమె భర్తకూ, ఆమెకూ మధ్య కలిగిన అభిప్రాయ బేధాలను ఎలా పరిష్కరించుకోవాలో సలహాలు ఇస్తుంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేస్తున్నందుకు అభ్యంతరం ఏమీ చెప్పరు.
నెమ్మదిగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధంగా మారుతుంది. ఫలితంగా ఆమె గర్భం దాలుస్తుంది. భర్తకు ఆ సంగతి తెలిసినా అతనిలో పెద్దగా మార్పు ఉండదు. నెమ్మదిగా ఆమె తాను చేస్తున్నది తప్పు అని తెలుసుకుని బావతో సంబంధం నుంచి దూరంగా జరగాలనుకుంటుంది. ఆమెకు కూతురు పుడుతుంది. ఈ లోపు బావగారి భార్య చెల్లెలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళ పంచన చేరుతుంది. ఆమె బావగారికీ, ఆమెకు సంబంధం ఉందని అవమానిస్తుంది. కొద్ది రోజులుకు బావగారి చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది. చనిపోయేనాటికి ఆమె గర్భవతి అని కూడా తెలుస్తుంది. ఆమె బావ గారినే అనుమానిస్తుంది. కానీ చనిపోయిన ఆమె తనకు రాసిన లేఖ చదివి ఆమె మరణానికి కారణం తన భర్త ఆమెతో సంబంధం పెట్టుకోవడం అని తెలుసుకుంటుంది.
మరో వైపు బావగారితో తాను ఆఫీసులో ఉండగా భర్త ఆమెను చూసి నిలదీస్తాడు. ఆమె జరిగిన తప్పును అంగీకరించి, ఇద్దరి వైపు నుంచి తప్పు జరిగింది కాబట్టి ఒకరినొకరు క్షమించుకుని దూరంగా వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంది. దానికి ఆమె భర్త, తన వైపు ఏ తప్పూ లేనట్టూ, తప్పంతా ఆమెదే అన్నట్లు మాట్లాడతాడు. దాంతో ఆమె కోపంతో ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి విడాకులు తీసుకుంటుంది. అన్న, వదిన సాయంతో ఇంగ్లండు చేరుకుని ఒక్కటే కూతురుని పెంచి పెద్ద చేస్తుంది.
అచ్చమ్మ కథ అచ్చమ్మ ఓ దళిత కుటుంబంలో పుడుతుంది. తండ్రి చెప్పులు కుట్టే కార్మికుడు. పెద్దన్నయ్య రిజర్వేషన్ల సాయంతో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా ఒక స్టేటస్ లో బతికాలని చూస్తుంటాడు. చిన్నన్నయ్య ఓ తాగుబోతు. ఆమె చదువుకి అడుగడుగునా అడ్డపడుతుంటాడు. ఇంటి పోరు భరించలేక పెళ్ళయిన అక్క దగ్గరికి వచ్చేసి చిన్న ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజిలో చదువుతూ ఉంటుంది. ఆమె బావ మంచి వ్యక్తి. ఆమెను చదువుకోని, కష్టపడి పైకి రమ్మని ప్రోత్సహిస్తుంటాడు. అతను కలెక్టరు ఆఫీసులో ఓ గుమాస్తా. గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తుంటాడు. కానీ ఆమె అక్క మాత్రం సంపాదన కోసం, అడ్డమైన దారులు తొక్కుతూ ఉంటుంది. అది ఆమె భర్తకి తెలిసినా ఆమె మసస్తత్వమే అంత అని సర్దుకుపోతుంటాడు. ఆమె అక్క చివరికి తన్ను కూడా ఆ రొంపిలోనికి దింపాలని ప్రయత్నిస్తుంది. ఇక అక్కడ నుంచి బయటపడి వర్కింగ్ విమెన్ హాస్టల్లో ఉంటూ పని చేస్తూ చదువుకుంటుంది.
ఆమె పనిచేసే సంస్థలో ప్రతిభను గుర్తించిన యజమాని ఆమెకు శిక్షణ ఇచ్చి పదోన్నతి కల్పించాలనుకుంటాడు. ఆ శిక్షణలో భాగమైన సురేష్ ఆమె దారిని మరో మలుపు తిప్పుతాడు. తాను ఓ సీరియల్ కి దర్శకత్వం చేస్తున్నాననీ, అందులో హీరోయిన్ గా నటించమని అడుగుతాడు. ఆమె అయిష్టంగానే అందుకు ఒప్పుకుంటుంది. ఆ చిత్రీకరణ సమయంలోనే సురేష్ ఆమెకు దగ్గరయ్యి పెళ్ళవకుండానే కలిసి ఉందామని ప్రతిపాదిస్తాడు. సీరియల్ నత్త నడక నడుస్తూ ఉంటుంది. మరోవైపు శిక్షణకు సరిగా రానందుకు ఆమెను మళ్ళీ వెనక్కి పిలుస్తాడు ఆమె బాసు. తనవల్లే ఆమెకు పదోన్నతి పోయిందని ఆమె సానుభూతి నటిస్తూ ఆమెను తన అవసరాల కోసం వాడుకుంటాడు. కొన్నాళ్ళకు మరో మహిళతో సంబంధం పెట్టుకుంటాడు. ఇవన్నీ తెలిసిన ఆమె అతనితో దూరంగా వచ్చేసి మళ్ళీ తన ఉద్యోగ బాధ్యతలలో పడిపోతుంది. తాను సంబంధం పెట్టుకున్న అమ్మాయి మరో సంబంధం వెతుక్కుంటూ వెళ్ళిపోవడంతో సురేష్ ఆమెను వేధించడం మొదలుపెడతాడు. ఆమె నానా కష్టాలూ పడి చివరికి ఓ ఏ.సి.పి సాయంతో అతని పీడ వదిలించుకుంటుంది. మళ్ళీ పదోన్నతి సంబంధించిన శిక్షణ తీసుకుని అందులో విజయం సాధిస్తుంది. ఈ తతంగంలో తనుకు తోడుగా నిలిచిన శ్రీకాంత్ ని పెళ్ళి చేసుకుంటుంది.
శ్యామల కథ భారతదేశానికి వచ్చిన శ్యామల తన తండ్రిని కలుసుకుంటుంది. వారు ఆమెను గౌరవంగానే చూస్తారు. అప్పటికీ ఆమె తల్లి చేసిందే తప్పు అని భావిస్తుంటారు. సరిగ్గా అప్పుడే ఆమెకు మేనమామ శ్రీకాంత తమ ఇంటికి తీసుకువెళ్ళి జరిగిన సంగతంతా చెబుతాడు. అప్పుడు ఆమెకు తల్లి గురించిన విలువ తెలుస్తుంది. తిరిగి ఇంగ్లండుకు ప్రయాణమవుతుంది.