యదువంశము/ఏడవ ప్రకరణ
ఏడవ ప్రకరణము
మార్చుఅక్రూరుఁడు బృందావనమునకు వచ్చుట:-
మార్చుబలరామ కృష్ణుల యసమాన శౌర్య పరాక్రమ విశేషంబులు భూనభోంతరాళంబులఁ బ్రతిధ్వనులీనుచుండ మధురాపురంబునఁ గంసుండు రేయింబవలు నిద్రాహారంబుల మాని బలరామకృష్ణుల వధోద్యోగంబును గూర్చియే పెక్కుభంగులఁ జింతింపఁ దొడంగెను. తానొనర్చిన ప్రయత్నంబులన్నియు నిష్ఫలంబులగుటవలనఁ గపటోపాయంబునఁ వారల నెవ్విధినైన నిజపురంబునకు వచ్చునట్లొనర్చి మట్టుపెట్టవలయునని తుదకు నిశ్చయించుకొని వారలను మధురాపురంబునకుఁ గొనివచ్చుటకై యక్రూరుండను వానిని బృందావనంబునకుఁ బంపెను. అక్రూరుండును శ్రీహరినిఁ గన్నులారఁ జూచుభాగ్యంబు తనకు లభించినందుకు జన్మంబు సార్థకంబయ్యెనని తలపోయుచుఁ; గృష్ణుని లీలలఁగూర్చి యనేక విధంబులఁ దనలోఁదాను భాషించుకొనుచుఁ; గ్రూరుండగు కంసుని పంపునఁ దానరుగుచున్న వాఁడగుట వలనఁ దన్నాతఁడు వేఱుగాభావించి కరుణింపఁడేమో యని శంకించుచు; భక్తపాలకుండగు హరి, యతని కమలయుగళసేవాపరాయణుండగు తన్నేల కనికరింపకుండునని తనకుఁదానే ధైర్యంబు సెప్పికొనుచు; సకలభూతాంతర్భహిర్మధ్య సంగతుండగు కృష్ణుండు తన నిజస్వభావమును గుర్తింపనేరఁడా యని తర్కించుకొనుచు; నివ్విధంబున గతిపయ దివసంబులు ప్రయాణంబు నొనర్చి, యచిరకాలంబుననే చందనకుందకుటజ తాలసాలకురువక వటమాకందతరు పరిశోభితంబగు బృందావనంబును జేరి, యందుఁ బ్రవేశించి, శ్రీకృష్ణ బలరామ బాహుదండ ప్రాకార రక్షావిశేషభూషంబైన ఘోషంబున నొక్కదెసఁగల నందుని మందిరంబును జొచ్చి, యందు మందహాస రుచిరోదంచిత వదనారవిందుఁడగు నరవిందదళాక్షుని సందర్శించెను.
టీక:- ఘోషము = గొల్ల మంద; రుచిరము = అందమైనది; ఉదంచితము = పైకి వచ్చినది.
అక్రూరుడు తాను వచ్చినకార్యమునుగూర్చి కృష్ణునకుఁ దెలుపుట.:-
మార్చుఅక్రూరుండట్లు తన్ను సందర్సించినంతనే కృష్ణుండాతని కెదురేగి తోడ్కొనివచ్చి సముచిత ప్రకారంబుల నర్ఘ్యపాద్యాదివిధులఁ బూజించి సుఖాసీనుఁగా నొనర్చి కుశల ప్రశ్నమడిగెను. అక్రూరుండును దనువునఁ బులకాంకురంబులు ముమ్మరంబుగ మల్లడిఁగొన నానందబాష్ప పూరిత నేత్రుడగుచుఁ గృష్ణునిఁ బెక్కు తెఱంగులఁ గొనియాడి యచ్చోటనున్న నందాది ప్రముఖులైన యాదవులందఱును వినునట్లు దాను వచ్చిన కార్యముఁగూర్చి కృష్ణబలరాములతో “మహాత్ములారా! క్రూరాత్ముండును, మీకు మామయునగు కంసుడిప్పుడు ధనుర్యాగంబు సేయనున్నవాఁడు. అట్టి శుభకార్యమునకు మిమ్ముఁ దోడ్కొనిరమ్మని నన్ననుప మిమ్ముఁ గొనిపోవుటకై నేనిచ్చోటి కరుదెంచితిని. కాని యిందేమో మోసంబుగలదని నాకుఁ దోచుచున్నది. ఐనను సర్వజ్ఞులరగు మీకుఁ దెలియనిదేమియునులేదు. మీయిష్టానుసారము వర్తించెద” నని తెలియఁజెప్పఁ గృష్ణుండును నగుచు స్వజనంబులఁ గాంచి ‘బంధువులారా! నేఁడే మీరందఱును దగిన కానుకలఁగొని మధురాపురంబున కరుఁగుడు. మే మక్రూరునితో రేపు బయలుదేఱి మిమ్మందఱ నచ్చోటఁ గలిసికొనెదము. యాగమునకుఁ బిలువఁబడకయే యరుగుట శాస్త్రసమ్మతము. అట్టియెడఁ బిలువఁబడియుఁ బోకుండుట మంచిది కాదు. కావున మీరిప్పుఁడే బయలుదేరి పొం” డని పలుక వారును వల్లెయని తమశక్తికిఁ దగినట్లు కానుకలఁగొని శకటారోహణం బొనర్చి యప్పుడే మధురాపురంబున కరిగిరి.
టీక:- మల్లడిగొను = ముప్పిరిగొను, అల్లుకొను.
కాళిందియందు రామకృష్ణుల నక్రూరుండు గాంచుట.:-
మార్చుమఱునాటి యుదయమునఁ దనవియోగఁబునకు సహింపఁజాలక మధురానగరంబున కరుగవలదని తన్ను నిరోధించు వల్లవీజనంబులఁ దాను దిరిగివచ్చెదనని యనేకవిధంబుల నూరడించి; బలభద్రసమేతుండై యక్రూర చోదితంబైన మణిస్యందనంబునెక్కి శ్రీకృష్ణుండు మధురాభిముఖుండై యరిగెను. అట్లు చనుసమయంబున మధ్యేమార్గంబునఁ గాళిందీ నదియొద్ద స్యందనంబు నిలిపి యన్నతోఁ గృష్ణుండు తన్మధుర సలిలపానం బొనర్చి కొంతతడవు తత్సమీప తరుచ్ఛాయా శీతల సికతాతలంబున విశ్రమించి తిరిగి రథంబును బ్రవేశించెను. అట్టియెడ నక్రూరుండు స్నానంబు సేయ నిచ్చగించి రథంబునఁ గృష్ణ బలభద్రుల భద్రంబుగా నుండజేసి నదిఁజొచ్చెను. అందాతఁడు జలంబులమునిఁగి స్నానంబుసేయచుండఁ దన్నదీతోయగర్భంబున బలభద్ర ద్వితీయుండైన శ్రీకృష్ణపరమాత్మ యాతనికిఁ బ్రత్యక్షమయ్యెను. ఇదియేమా యని విస్మయంబునొంది యాతండు లేచి రథంబువంకఁ దిలకింప శ్రీకృష్ణబలభద్రులు రథంబునందే యుండిరి. తిరిగి యాతండు జలంబుల మునిగినంతనే క్షీరసాగర శయనుండైన శ్రీమహావిష్ణుమూర్తి యాతనికిఁ గానఁబడియెను. అప్పు డక్రూరుండు, కృష్ణుండు కేవలము పరమాత్మ స్వరూపుండనియు; బలభద్రుం డాదిశేషుండనియు నెఱింగి భక్తిపారవశ్యంబున నామహాత్ములఁ బ్రస్తుతించుచు మేను మఱచియుండఁ, గృష్ణుండాతనిఁ బ్రొద్దాయెనని హెచ్చరించెను. అక్రూరుం డప్పటికి తెలివినొంది జలంబులనుండి వెలువడి, రథంబు నధిరోహించి, బలరామకృష్ణుల ననేకవిధంబుల గీర్తించుచుఁ; బ్రొద్దుగ్రుంకువఱకు మధురానగరంబును సమీపించునట్లు రథంబును నడిపెను. కృష్ణుండు బలరామునితో బురంబు వెలుపలనే యరదంబునుండి డిగ్గి యక్రూరుని వీడ్కొలిపి, పురోపవనంబునఁ దన రాకకై యెదురు సూచుచున్న బంధువులఁ జేరఁజనియెను.
టీక:- స్యందనము = రథము; సికతము = ఇసుక; తలము = చదునైన ప్రదేశము; అరదము = రథము; ద్వితీయుండు = జత యయి యున్నవాడు; పురోపవనము = ఊరి ముందరి ఉద్యానవనము.
మధురానగరప్రవేశము:-
మార్చుతెల్లవాఱినదేతడవుగా శ్రీకృష్ణబలభద్రులు కాలకృత్యంబుల నిర్వర్తించుకొని మధురానగరప్రవేశ మొనర్చిరి. అట్టియెడ రజకుండొక్కరుండు భూపరిపాలకోచితంబులగు దుకూలంబులఁ గొని యెదురు సనుదెంచుచుండఁ గృష్ణుండు వానిఁగని యా వస్త్రంబులఁ దనకిమ్మని యడిగెను. అతండును దుర్మదావివేకంబున నగుచు “ఏమీ వెఱ్ఱిగొల్లలకుఁగూడ దుకూలంబులు గావలయునా? యని పరిహాసంబొనర్చెను. అంత కృష్ణుం డాతనిపైఁ గినుకవహించి పిడికిట నాతని శిరంబు వగులఁజేసి యాతనివద్దనున్న పట్టువస్త్రంబులఁ గొని తానును బలభద్రుండును ధరించుకొనిరి. టీక:- భూపరిపాలకులు = దేశాన్నేలే రాజులు; ఉచితంబులు = తగినవి; రజకుడు = బట్టలు ఉతుకువాడు; దుర్మద = చెడ్డ గర్వము; అవివేకము = తెలివితక్కువతనము.
పౌరజనాభిప్రాయము.:-
మార్చునూతనవస్త్రాధారణంబున నినుమడించిన మోహనాకారముంబుతో నరుగుచున్న కృష్ణునిఁగాంచి పౌరకాంతలు “ఆహా! ఈసుందరాకారునితోఁ గలసిక్రీడించుటకు గోపికలెట్టినోములు నోచికొనిరో కదా?” యని తమ్ముగూర్చి నిందించుకొనఁజొచ్చిరి. పురుషులగువారును, నాతని మోహనాకారంబునకుఁ దన్మయులగుచు నాతని యమానుషతేజోవిశేషంబుఁ గూర్చియుఁ బనులఁ గూర్చియుఁ బలువిధంబులఁలృదలంపసాగిరి. వాయకుని గరుణించుట.
బలరామకృష్ణులట్లు గొంతదవ్వరుగునప్పటికి వాయకుండొక్కండు వారల కెదురొచ్చి, భక్తిపూర్వకంబుగా నమస్కరించి, మిక్కిలి మనోహరంబులగు వస్త్రంబులను, విలువఁగల భూషణములను సమర్పించెను. కృష్ణుండును వానిఁగైకొని యాతనియెడఁ గరుణవహించినవాఁడై యాతఁ డొనర్చిన యంతమాత్రపుబనికే యాతని కష్టైశ్వర్యములు గలుగునట్లు వరంబొసంగెను. టీక:- దవ్వు = దూరము; వాయకుడు = బట్టలు నేయువాడు.
సుదాముని కరుణించుట:-
మార్చుఅచ్చోటునువాసి మఱికొంత దవ్వరగునప్పటికి సుదాముండను మాలాకారుం డెదురు సనుదెంచి వినయపూర్వకంబుగా రామకృష్ణులకు దివ్యములైన సురభి కుసుమదామములను సమర్పించెను. ఆ పనికిఁ గృష్ణుండు సంతసించి “ఏమివలయునో కోరుకొనుము. ఇచ్చెద” నని యాతనితోఁ బలుక నమ్మాలికుఁడును గరంబులుమోడ్చి “మహాత్మా! నాకితరంబులేవియును వలదు. నాకు వలయున దేమనగా.
నీపాదకమలసేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపారభూతదయయును
దాపసమందార నాకు దయసేయుఁగదే!”
అని వేడికొనఁ గృష్ణుం డట్లకాకయని వెండియు నాతనికి బలాయుః కాంతికీర్తి సంపదల నొసంగి, యగ్రజునితో ముందునకరిగెను.
టీక:- సురభి = సువాసనలు గల.
కుబ్జను సుందరాంగిగా నొనర్చుట.:-
మార్చుఅట్టియెడఁ గుబ్జయను కంసుని దాసియొక్కర్తుక విలేపనంబులఁ గొని రాజభవనంబున కరుగుచుండఁ గృష్ణుఁ డాదాసిని సమీపించి “ఓ సుందరాంగీ! మాకుఁగూడ విలేపనంబుల నొసంగెదవా?” యనియడుగఁ గుబ్జయు “ఓసుందరాకారా! కుబ్జనగు నన్ను సుందరాంగీయని యెందుకుఁ బరిహాసించెదవు? ఇవిగో విలేపనంబులఁ గొను” మని ప్రేమపూర్వకంబుగా నొసంగెను. కృష్ణుండును వానినందుకొని తాను నుడివిన వాక్యము వృథాకాగూడదని, యామెను సుందరాంగిగాఁ జేయఁదలంచి; దాని పాదంబులను దనచరణంబులతోఁ ద్రొక్కిపట్టి, హస్తాంగుళద్వయము నబల గవుదక్రింద నునిచి మీదికినొత్తి వక్రస్వరూపంబును జక్కఁజేసి యాకాంతను గేవలము మోహినీదేవతగా నొనర్చెను. కుబ్జయుఁ దనసౌందర్యంబునకుఁ దానే యాశ్చర్యపడినదై, మోహనాకారుఁడగు కృష్ణునిపై మోహంబునుగొని కామభిక్షపెట్టుమని యాతనిఁ బ్రార్థించెను. కృష్ణుండును, నాకామిని కోర్కె తరువాత సఫలతఁబొందునని వరంబొసంగె. యవ్విధంబున దన్ను నమ్మినవారినిఁ గరుణించుచుఁ గొంతవఱకుఁ బురంబున గలయందిరిగి నాటికిఁ బురవిహరంబు సాలించి యన్నతో వెడలి విడిదులకుఁజని తనవారలఁ గలసికొనెను.
టీక:- కుబ్జ = మఱుగుజ్జు; విలేపనములు = చందనాది మైపూతలు; గవుద = చుబుకము, గడ్డము.
కువలయాపీడమను గజంబును కృష్ణుండు సంహరించుట.:-
మార్చుతనపురంబునందే కృష్ణుండొనర్చిన యద్భుతకార్యంబులకుఁ గంసుఁడు వెఱుఁగంది యాలసించుట యెంతమాత్రమును తగదని మఱుచటి యుదయముననే నందాదులను గృష్ణ బలరాములను సభాభవనంబున కాహ్వానించెను. నందాదులు ముందరగ బలభద్రకృష్ణులు వెనుకగ నరిగిరి. కృష్ణబలరాములు సభామంటప ప్రవేశద్వారప్రవేశంబొనర్చునెడ నాకస్మికంబుగాఁ గువలయాపీడమను మదగజంబొండు నిజపరిపాలక ప్రేరితంబై కృష్ణునిపై గవిసెను. కృష్ణుండు నీషన్మాత్రంబేనియుఁ జలింపక తనపైకిఁ బరతెంచుచున్న యాగంధనాగంబున కెదురు నడచి హర్యక్షంబు వడువున నవలీల దానిపైకి లంఘించి దనుజ మస్తకవిదారితంబగు హస్తంబునఁ దదీయ గుంభస్థలంబు వగులునట్లు చఱచెను. ఆ ముష్టిఘాతంబునకది తెలివిఁదప్పి ధరణిపై నొరగి నెత్తురులు గ్రక్కుచుఁ గొంతతడవునకుఁ బ్రాణంబులఁబాసెను. అట్లా మదగజంబును గనురెప్పపాటు కాలంబుననే హతంబొనర్చి దానిదంతంబుల నూఁడబెరికి యున్నయుఁ దానును వానినే యాయుధంబులుగాఁ గైకొని భీకరాకారముతో బలభద్ర ద్వితీయుండై సభాభవనంబును ప్రవేశించెను.
టీక:- కవియు = కలియబడు; గంధనాగము = ఏనుగు; హర్యక్షము = సింహము; వడువున = వలె, పోలె.
చాణూర ముష్టికుల వధ.:-
మార్చుఅప్పటి శ్రీకృష్ణబలరాముల రౌద్రాకారములఁ గాంచి కంసుఁడు గడగడ వడకసాగెను. అట్టియెడఁ జాణూరముష్టికులను మల్లులిద్దరు దమనాధునకుఁ బ్రియంబు సేయఁదలంచి, శ్రీకృష్ణ బలరాములను గొంత తడవు తమతో మల్లయుద్ధమును సల్పుట కాహ్వానించిరి. పిలువఁబడి నప్పుడు వెనుదీయుట వీర లక్షణంబుగాదని కృష్ణుండు చాణూరుని, బలుండు ముష్టికుని మార్కొని మల్లయుద్ధ మొనర్పసాగిరి. నందాదులు తమపుత్రుల కేమిహాని గలుగునోయని దిగుల్పడసాగిరి. ప్రేక్షకులందఱును బెక్కుమల్లయుద్ధంబులం దారితేరిన చాణూర ముష్టికులను గేవలము పసివారకు యాదవ కుమారులపైఁ బురికొల్పుట చాలా యన్యాయమని కంసుని దూషింపసాగిరి. కంసుఁడు దనమల్లసింహంబుల వలన గోపాలకుంజరంబులు మడియుట నిక్కమని తలంపసాగెను. అట్టియెడఁ గృష్ణబలభద్రులు తమ్ము మార్కొనిన యామల్లులను విచిత్ర గతులనొప్పించి చూచువారాశ్చర్య పడునట్లును, గంసుండు హతాశుండగునట్లును, వారినిఁ బంచత్వంబు నొందించి భీషణంబుగ సింహనాదంబులుసేసిరి.
టీక:- గడగడ = వడవడ, వణుకుట యందు ధ్వన్యనుకరణ; వడుకట = వణకుట; మార్కొను = ఎదిరించు, ఎదుర్కొను.
కంసవధ.:-
మార్చుపేరువడిన చాణూరముష్టికులు మడసినంతనే కంసుఁడు తత్తరంబున నిజభటులంజూచి “భటులారా! చూచెదరేల? యాదవుల నందరిని బట్టినుగ్గాడుఁడు. దేవకీవసుదేవుల ప్రాణంబుల హరింపుడు. నాకుఁ దండ్రియయ్యు నాపై శత్రుత్వమువహించియున్న యుగ్రసేనుఁబట్టి ముక్కలుముక్కలుగాఁ గోయుఁడు. లెండు. మార్కొను” డని హెచ్చరించినంతనే రక్కసభటులుక్కుమిగిలి యాదవులపై విజృంభించిరి. అట్టియెడ బలుడొక్కరుండే యా దానవభట సంఘంబుల నెదుర్కొని గుట్టలు గుట్టలుగాఁ గూల్పసాగెను. అంతఁ గృష్ణుండు రణోల్లాసంబున మల్లడిఁగొన; నెల్లరుఁ దెల్లబోవ, సింహంబు పిల్లవలెఁ గంస భూవల్లభునిపైకి లంఘించి; కేశబంధంబువట్టి యవలీలఁగ గ్రిందఁబడవైచి; యాతని యురంబునఁ దిరంబుగ నాసీనుండై; దైత్యభట సంఘాతంబులు తల్లడిల్లునట్లు సకలలోకంబులు సంతసించునట్లు “ఓరీ శిశుహంతకా! నీ పాపఫలమిప్పుడే యనుభవింపగల” వని కంసునిఁగూర్చి పలుకుచు వజ్రసన్నిభంబగు తనపిడికిట నాతనిఱొమ్ము వగులునట్లు వొడచి విగతజీవునిగా నొనర్చెను. అట్టియెడ దేవతలందరును గృష్ణునిపైఁ బువ్వులవానఁ గురియించిరి; అప్సరసలు నాట్యమాడిరి; దేవదుందుభులు మ్రోగెను; మరియు నయ్యవసరంబున —
చేతులఁ దాళము లొత్తుచుఁ
జేతోమోదంబుదోడ సిగముడి వీడం
బాతిరలాడుచు మింటను
గీతము నారదుఁడు వాడెఁ గృష్ణా యనుచున్.
బంధుజన సంరక్షణము.:-
మార్చుకృష్ణుండు కంసవధంబు నొనర్చుసరికి బలభద్రుండును దన్నెదుర్కొనిన దైత్యులనందరిని రూపుమాపెను. ఆగోపబాలకుల యసమాన శౌర్యధైర్య పరాక్రమ తేజోవిశేషంబులకు రక్కసులు భయపడి తలకొక్కదిక్కువంతునఁ బారిపోయిరి. శత్రుసంహారము సంపూర్తి నొందుటవలన బలభద్రకృష్ణులు కారాగారంబుననున్న తమ తల్లిదండ్రుల — దేవకీ వసుదేవుల — సందర్శించుట కరిగిరి. దేవకీవసుదేవులును దమపుత్రుల గాంచినంతనే శరీరంబులుప్పొంగఁ గౌగిటఁజేర్చి ముద్దాడదొడంగిరి. కృష్ణుండును దల్లిదండ్రుల బంధవిముక్తులుగా నొనర్చి, తమవలన వారికి గలిగిన కష్టంబులకుఁ దమ్ము క్షమింపవలసినదని బ్రార్థించెను. లీలామానుషవిగ్రహుండైన శ్రీహరి తమ్ము క్షమాపణంబును వేడినంతనే దేవకీవసుదేవులు మోహితులై కుమారుల నిజాంక పీఠంబులనిడుకొని వారివదనంబులఁ దమవేడికన్నీటితో దడుపసాగిరి. అట్టియెడఁ గృష్ణుండు మాతామహుండైన యుగ్రసేనుని రావించి, వినయపూర్వక నమస్కారంబులొనర్చి, “తాతా! పుణ్యపురుషుడవైన నీ విప్పుడే సింహాసనంబునధిష్ఠించి రాజ్యపరిపాలన మొనర్పు” మని పల్కుచు, నప్పుడే యాతనిని రాజుగా నొనర్చెను. అనంతరము మున్ను కంసునకు భయపడి పరదేశంబుల కరిగియున్న యదువృష్టి భోజమరుదశార కుకురాంధక ప్రముఖులగు సకల జ్ఞాతి సంబంధులను రావించి వారి వారి నివాసంబుల నునిచి యివ్విధంబున సర్వంబును గాపాడెను.