యదువంశము/తొమ్మిదవ ప్రకరణ

తొమ్మిదవప్రకరణము

మార్చు

పాండవుల చరిత్ర:-

మార్చు

 పాండురాజతనూభవులైన యుధిష్ఠర భీమార్జున నకుల సహదేవు లను వారు తమపెద్దతండ్రియైన దృతరాష్ట్రుని యాజ్ఞానుసార మింద్రప్రస్తపురంబు రాజధానిగా ధరణీపాలన మొనర్చుచుండిరి. కృష్ణునకుఁ బాండవులు మేనత్తకుమారులును, నిజచరణసరసీరుహ యుగళస్మరణ సుధారసాస్వాద సంజనిత సంతత సంతోష సంపత్పరిపూర్ణులును. నందుఁ బాండవమధ్యముఁడగు నర్జునుఁడు, నిజసోదరీ ప్రాణనాథుం డగుటవలనను, దుర్యోధన ప్రముఖులగు కౌరవుల మూలఁబునఁ గష్టంబులు పెక్కులు వారికిఁ గలుగుచున్నను, నెల్లప్పుడు వారి యోగక్షేమములు విచారించుచు, నన్నింటను జేఁదోడుగా నిలచి వారినిఁ గాపాడుచుండెను. ధర్మజుండు కేవలము ధర్మస్వరూపుఁడా యేమి యనునట్లు నయగుణ వర్తనంబున నిలచి యుండుటవలనను, నాతని యనుజన్ములతని యాదేశంబు ననుసరించి వర్తించుట వలనను, రాజలోకంబంతయుఁ బాండవుల ననేకవిధంబుల గొప్పగాఁ జూచుచుండెను. కాని, దాయాదులును, దృతరాష్ట్రనందనులును నగు సుయోధనాది కౌరవులు మాత్రము వారిని నసూయతోఁ జూచుచుండిరి.

రాజసూయాధ్వర ప్రయత్నములు.:-

మార్చు

 ఇట్లుండ నారదప్రేరితులగు పాండవులు తమ చిన్న తనంబునందే మృతినొందిన తమ జనకుని యాత్మశాంతికై రాజసూయం బను మహాధ్వరంబు నొకదానిని జేయ సమకట్టిరి. అందుకు శ్రీ కృష్ణుండును వారల ప్రోత్సహించెను. అన్నింటికిని మూలకారణుం డగు శ్రీహరి తమవాఁడగుటవలనఁ బాండవులును ధైర్యము వహించి యా మహాధ్వరంబును సలుపుటకుఁ గడఁగిరి. ధర్మజుని నల్వురు తమ్ములగు భీమార్జున నకుల సహదేవులు నాల్గుదిక్కులకరిగి, యందున్న రాజచక్రంబును నవక్రవిక్రమ పరాక్రమక్రమ విశేషంబున నవలీల జయించి తమ యగ్రజునిపేరఁ గానుకలను గొనితెచ్చిరి. కాని జరాసంధుఁడుమాత్రము జయింపఁబడక మిగిలియుండెను.

జరాసంధ వధ.:-

మార్చు

 జరాసంధుఁడు తనకాగర్బశత్రుండగుటవలనను, నాతనివలన సాధుహింసయు స్వబంధు హింసయు జరుగుచున్నందువలనను, నాతండు జయింపబడనిచోఁ దనభక్తులైన పాండవుల యధ్వరోద్యమమునకు విఘ్నంబు గలుగనున్నందువలనను, శ్రీకృష్ణుండు, జరాసంధవధోద్యోగ సమాచరణంబునకు, భీమార్జున సహితంబుగా బ్రాహ్మణవేషమునుదాల్చి, భూసురాభీష్ట ఫలప్రదాత యగు మాగధునికడ కేగెను. ఆతండును బ్రాహ్మణవేషంబులతో నున్న శ్రీకృష్ణ భీమార్జునులఁగాంచి, యేమి కావలయునో తెల్పుఁ డొసంగెద నని పలికెను. అంతఁ గృష్ణుండును, దమ కాజిభిక్ష దక్క యన్యంబువలదని నుడువుచు, వారును దానును స్వస్వరూపంబులఁ దాల్చి తామెవ్వరైనదియు నాతని కెఱుగఁ బల్కెను. జరాసంధుఁడును, దన్నెదుర్కొనఁజాలక పెక్కు మారులు పారిపోయిన కృష్ణునిఁ గాంచి నగుచు, “కృష్ణా? మదీయబలపరాక్రమంబు లింతలోనే మఱపునకు వచ్చెనా? నన్నెదుర్కొనఁజాలక నట్టనడిసముద్రంబున నగరు గట్టుకొన్న జగదేకజెట్టివి నీవేగదా? అయినఁ గానిమ్ము. నీవు నన్నుఁ గెలువఁజాలవు గనుక నిన్ను నేను మార్కొనను. అర్జునుండు నాకన్నఁ బిన్నవాఁ డగుటవలన నాతనితోఁ బోరుట నాయట్టి యుత్తమవీరునకు ధర్మంబుగాదు. అన్నివిధంబుల భీముండు నాకుఁ దగియున్న వాఁడుగావున నాతనితో బోరెద” నని పల్కుచు ద్వంద్వయుద్ధమునకు వాయుపుత్రుని నాహ్వానించెను. భీముండును, గృష్ణానుమతంబున నుద్దండ గదాదండంబును గొని తొలుఁదొల్త నాతనితో గదాయుద్ధంబునకుఁ దలపడెను. జరాసంధుఁడును బాహుబల పరాక్రమము సమానమగుచుండెను. గదాయుద్ధంబు ఘోరంబుగా జరుగుచున్న సమయంబున నన్యోన్యసంఘర్షణంబున నిరువురి గదలు ముక్కలగుడునంత నొకరితోనొకరు ముష్టాముష్టి, బాహాబాహి, కచాకచి, పోరాడఁదొడంగిరి. అట్టియెడ భీముండలసటనొంది, యరినిరసనోపాయంబు గానక చింతించుచుండఁ గృష్ణుండది తెలిసికొని, భీముండు తనదిక్కు సూచుచుండ నొక్క శాఖాగ్రంబును రెండుగాఁజీల్చివైచి, జరాసంధు నట్ల హతమొనర్చవలసినదని సంజ్ఞగాఁజూపెను. గాడ్పుపట్టి యాకీలు దెలిసికొని, యినుమడించిన సమరోత్సాహంబున, సమధిక బాహుబలాతిశయుండగుచు, జరాసుతుని నవలీలఁ బుడమికిఁబడఁద్రోసి, నిజచరణంబును నాతని చరణంబొండు ద్రొక్కిపట్టి బాహుయుగళంబున రెండవచరణంబును గదలకుండఁ బట్టి, హరికృపాలబ్ధబలోన్మత్తాతిరేకంబున లేఁగొమ్మను జీఱునట్లు పాదజానుజంఘోరుకటిమధ్యోదరాంస కర్ణవయనంబులు సమానంబులుగ వేఱుభాగంబులగు చాడ్పున వ్రయ్యలువాపి విష్ణుద్రోహియు, లోకద్రోహియు నగు జరాసంధుని హతమొనర్చి సింహనాదం బొనర్చెను.

శ్రీకృష్ణుని సభాపతిత్వము:-

మార్చు

 అవ్విధంబున మాగదుని సంహరించి కృష్ణభీమపార్థులు ధర్మజుని జేరంజనినంతనే యాతండును, దిగ్విజయంబు సంపూర్తి నొందినదగుటవలన, విధ్యుక్త ప్రకారంబుగా నధ్వరదీక్షను గైకొనెను. ఆయధ్వర మహోత్సవంబునకు, నారద సాత్యవతేయ కశ్యప భరద్వాజ విశ్వామిత్ర వీతిహోత్ర మైత్రేయ మధుచ్ఛంద గౌతమ భార్గవ వసిష్ఠ వామదేవ ధౌమ్య పరాశర కణ్వ వైశంపాయన ప్రముఖులగు సకల మునీంద్రులును, వివిధ దేశాధీశులగు భూపాలురును, యాదవ దృపద కౌరవ ప్రముఖులగు బాంధవులును భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ విదురాది యాత్మీయులును మొదలగు వారందఱును వచ్చియుండిరి. శ్రీకృష్ణుఁడన్నివిధంబుల ధర్మజునకుఁ దోడుగా నుండెను. అధ్వర మంటపంబుననున్న సకలజనులు వినునట్లు, నారదుండు ధర్మజుని ధర్మప్రవర్తనముఁ గూర్చియుఁ బలుదెఱఁగులఁ గొనియాడెను. అట్టియెడ భీష్ముండు తత్క్రతు వైభవంబున కెంతయు సంతోషించి ధర్మజుఁజూచి, “ధర్మజా! స్నాతకుండును, ఋత్విజుఁడును, సద్గురుఁడును, భూతలేశుడును, సంయుజుఁడును ననువారలు పూజనీయులగుచున్నారు. అట్టివారి యందు సద్గుణ శ్రేష్ణుండగు వాఁడుత్తముఁ డగుచున్నాఁడు. కావున నిచ్చోటనున్నవారిలో నట్టివాని నొక్కని గుర్తించి, యాతని కగ్రతాంబూలంబు నిడి, యధ్వరం బొనర్పఁ గడంగుము. ఇది ధర్మపద్ధతి” యని వచింప, ధర్మజుఁ డట్టివానిని గురుతింపనేరక “తాతా! అట్టిపుణ్యపురుషునిఁగూడ నీవేనిర్ణయింపు” మని భీష్మునితోఁ బలికెను. అంత బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుండగు మందాకినీనందనుండు “ధర్మజా! క్రతుహర్తయు, క్రతుభోక్తయు, శత్రుమూర్తియు, క్రతుకర్తయు నగు శ్రీహరి యిందు వెలుంగుచుండ నట్టి పుణ్యపురుషునికొఱకు వెదుకుట యేల? చింతించుట యేల? నిర్ణయించుట యేల! అన్నింటికిని శ్రీకృష్ణపరమాత్మయే యాధారభుతము. కావున నా మహాత్మున కగ్రతాంబూలంబుని” మ్మని పలుక, ధర్మజుండును, కేవలము యజ్ఞస్వరూపుఁడైన కృష్ణునిఁ బూజించి యగ్రతాంబూలంబు నొసంగెను. అచ్చటనున్న వారందఱును గరతాళంబులొనర్చి తమ యంగీకారమును సూచించిరి. శ్రీకృష్ణుండు సంతసించుటవలన సకలభూతములు సంతసించెను. నభోకాంతామణి కనుఁగొనలనుండి యానందబాష్పములు రాలుచున్నవాయేమి యనునట్లు పువ్వులతోఁ గూడిన యాకాశగంగోర్మిశీకరంబులు రాలఁజొచ్చెను. విశ్వమంతయు, విశ్వమయునిఁగూర్చి యానందలహరియందు మునుంగఁజొచ్చెను.

శిశుపాలుఁడు ధర్మభీష్ములను దూషించుట.:-

మార్చు

 ఆనందరస సాగర సముత్తుఁగ తరంగ డోలికా నివహంబుల నుయ్యెలలూగుచున్న నా సభికుల యందొక్కరుమాత్రము కృష్ణుని యందసూయాపరులై చింతాసాగరంబున మునింగియుండిరి. అట్టివారెవ్వరోగాదు. కృష్ణున కాజన్మవైరి యగు శిశుపాలుఁడే? ధర్మరాజునకు భీష్ముండుపదేశించుటయు నాతని యుపదేశప్రకారము ధర్మనందనుఁడు కృష్ణున కగ్రతాంబూలంబు నొసంగుటయు దానికి సభికులెల్లరుఁ గరతాళంబులమూలంబునఁ దమయంగీకారంబును సూచించుటయు మొదలుగాఁగలవన్నియు శిశుపాలునకు హృదయవిదారకములుగ నుండెను.

శిశుపాలుఁడు శ్రీకృష్ణుని దూషించుట.:-

మార్చు

 అతడెంతమాత్రమును సహింపఁజాలక కృద్ధుఁడై లేచినిలువఁబడి ధర్మజునిఁగాంచి “ధర్మనందనా! ఇన్నినాళ్ళనుండియు సకలధర్మాధర్మ విచక్షణుఁడవని నిన్నుఁ దలఁచియుంటిని. నీ ధర్మబుద్ధియంతయు నేఁడు దెలియవచ్చినది. వృద్ధాప్యమువలన యుక్తాయుక్తజ్ఞానంబుఁ గోల్పోయిన భీష్ముండు సెప్పినంతనే, దానియందుండు నిజానిజంబుల నరయక విశిష్టారాధ్యులగు వారెందఱో యిచ్చోటనుండ, వారలఁగాదని కృష్ణున కగ్రతాంబూలంబు నొసంగుట నీకుధర్మమేనా? కృష్ణునియందేమి గుణంబులున్నవని యాతనిని సభాపతిగా నొనర్చితివి? వృద్ధుని పూజించితినంటివా యందఱికన్నా వృద్ధుండగు వసుదేవుఁడు లేడా? ఆచార్యుఁడని పూజించితినంటివా యాతనికంటె గొప్పవారగు కృపద్రోణులు లేరా? ఋత్విజుఁడని పూజించినంటివా, ద్వైపాయనుండులేడా? భూనాధుండని పూజించితినంటివా, యయాతి శాపంబువలన యదువంశమున కాగౌరవములేదని యెఱుంగవా? ధర్మనందనా!”కృష్ణునేమని పూజించితివి? ముదుసలియగు భీష్ముఁడా నీకు ధర్మము నుపదేశించువాఁడు? అనపత్య దోషుండును, రాజకన్యాపహరణుండును నగు గాంగేయఁడు ధర్మమును దెలుపునంతటివాఁడా? ‘ఆహ! ఏమి కాలవైపరీత్యము! రాజకులంబున కంతకు నేడు నీమూలంబునఁ దలవంపు సంఘటిల్లెఁ గదా? ఒకవేళ నీవును భీష్ముండును మూఢాభిప్రాయములై యున్నచోఁ కృష్ణుండేనియు సభాపతిత్వము తనకుఁదగదని చెప్పవలదా? తానేమీ గుణములు గలవాఁడని యగ్రతాంబూలంబును గైకొనవలయును? ధర్మము ననుసరించినచో, స్త్రీగోబ్రాహ్మణ హింసాపరులగువారు పూజార్హులు గాకపోవుటయేగాక మీదుమిక్కిలి యట్టివారు దండనార్హు లగుచున్నారు. ఈకృష్ణుండు, స్త్రీవధయును, గోవధయును, నమ్మినవారిని జెఱుచుటయును మొదలగు దుష్కార్యముల నెన్నింటినో యొనర్చియుండ నట్టివానిని పూజార్హుండని నీ వెట్లు భావించితివి? యేదియోనొకకార్యము సలుపనున్నప్పుడు యుక్తాయుక్తంబుల నెఱుంగవలదా? ఇదియేనా నీ ధర్మప్రవర్తనము? ఇదియేనా భీష్ముని ధర్మోపదేశము? ఇదియేనా కృష్ణునిగొప్పతన” మని యనేకవిధంబుల ధర్మజ నదీసుత కృష్ణులను దూలనాడఁదొడంగెను.

శిశుపాలుని జన్మవృత్తాంతము.

మార్చు

 శిశుపాలుని దూషణ వాక్యములకు సభికులెల్లరును జెవులుమూసికొని, “హరిహరీ” యని చింతించుచుండ, నట్టియెడ సహదేవుండు రోషకషాయిత నేత్రుండై లేచి యందఱిఁ గలయఁజూచి “ఓ సభికులారా! ఇంక ముందెవ్వఁడేనియు శ్రీకృష్ణదూషణం బొనర్చినచో నట్టివాని శిరంబున నిదిగో మదీయ వామపాదంబు నుంచెద’ నని పలుకుచు విజృంభించెను. సహదేవునకుఁ దోడుగా నాతనియన్న యగు భీముండు, ప్రళయకాల పర్జన్య గర్జనంబును నిర్జించు భీషణ గర్జనంబొనర్చుచు నుద్దండ గదాదండమండితుండై యాటోపించి “నేటితో శిశుపాలున కాయువు నిండె” నని విజృంభించెను. అదిగని, శిశుపాలుఁడు నిజసైనికులఁ బురికొల్పసాగెను. అట్టియెడఁ దనకుంచెయుఁ గృష్ణమృగాజినంబును బలుమఱు వీచుచుఁ గలహబంధువగు నారదుఁడు నృత్యము సేయసాగెను. అట్టి కలకలంబునుగాంచి ధర్మజుండు యాగభంగమగునేమో యని దిగులొందుచుండ భీష్ముండాతనికి ధైర్యముసెప్పి భీమసహదేవులఁ గాంచి “కుమారులారా! మీరొనర్పఁదలఁచియున్న పనిని కృష్ణుండే యొనర్చుచును. శిశుపాలుండు దమఘోషుండనువానికి సాత్వతి యందు జనించినప్పుడు నాల్గుభుజంబుల తోడను, లలాటంబునఁ గన్నుతోడను బుట్టెను. తల్లిదండ్రులా వికృతాకారంబునకు భయఁపడి చింతించుచుండ నశరీరవాణి “ఓ దంపతులారా! మీరేల చింతించెదరు? ఎవ్వరేని వీని నెత్తుకొనినప్పుడు మిక్కిలి చేతులును, మిక్కిలి కన్నును దొలఁగిపోయినయెడల నట్టివాని వలననే యీతండు సచ్చునుగాని యన్యులవలనఁ జావనేరఁ” డని తెలియఁజెప్పెను. ఇట్లుండ బలరామసహితుండై కృష్ణుం డొకనాఁడు వారింటికరుగ మేనత్తయగు సాత్వతి కృష్ణునకుఁ దన కుమారు నందిచ్చెను. కృష్ణుం డాతని నెత్తికొనినంతనే మిక్కిలి చేతులును, మిక్కిలి కన్నును దొలఁగిపోయెను. అప్పుడు తనకుమారుఁడు కృష్ణునిచేత మడియునని యెఱింగి, నూరుతప్పులవరకుఁ దన పుత్రుని క్షమింప వలసినదని కృష్ణునిఁ బ్రార్థింప నాతండు వల్లెయని నిజపురంబున కరిగెను. ఆ వరంబువలనఁ గృష్ణుం డుపేక్ష సేయుచుండెకాని లేకున్న వీనిప్రాణము లెప్పుడో యెగిరిపోయియే యుండు” నని వారల శాంతపఱచెను.

శిశుపాలవధ.:-

మార్చు

 అట్టియెడఁ గృష్ణుండగ్రపీఠంబునుండి డిగ్గి సభికులఁజూచి, “మహాత్ములారా! నేను శిశుపాలుని తల్లికొసంగిన వరప్రకార మీతని శతాపరాధంబుల క్షమించితిని. ఇంకమీద నీతని క్షమింపజాలను. నేటితో నీదుష్టుం డంతమొందగల” డని చిత్తంబున సుదర్సనంబును దలంచెను. ఆ క్షణంబుననే సకలదైత్య దానవ దుష్టజనారణ్య వీతిహోత్రంబగు సుదర్సనంబు విస్ఫులింగంబులెగయఁ బరతెంచి శ్రీకృష్ణుని పాణితలంబు నలంకరింప, నాతండును గెంగేల నద్దానిని గిరగిరంద్రిప్పి శిశుపాలునిపైఁ బ్రయోగించెను. ప్రయోగించుటయే తడవుగాఁ గృష్ణద్వేషియగు శిశుపాలుని మస్తకము రుధిరపూరితంబై ధరణిపైఁ బడెను. దుష్టసంహారంబగుటవలన దేవతలు శ్రీకృష్ణునిపైఁ గుసుమవృష్టిని గురిపించిరి. ధర్మజ రాజసూయమహాధ్వరంబును నిర్విఘ్నముగా ముగింపఁబడెను. సర్వవ్యాపియు, సర్వకారణుండును సర్వాధారుండును, సర్వజ్ఞుండును సర్వవస్తుభూతాత్మకుండును, నగు శ్రీకృష్ణపరమాత్మున కెగ్గాచరించి ప్రాణములతో మనఁ గలవారెవ్వరుగలరు? ఆమహాత్మునకే గాక, యాతనిపాదసేవకుల కేనియు, సేవకులకేగాక, సేవకజనసేవకుల కేనియు, నెగ్గాచరించి ప్రాణములతో నుండనోపువారెవ్వరుగలరు?

శ్రీకృష్ణుఁడు సాల్వపౌండ్రక దంతవక్త్రులను వధించుట.

మార్చు

 శిశుపాలుని వధానంతర మాతని యనుచరులగు, సాల్వ పౌండ్రక దంతవక్త్రులనువారు మువ్వురు సకల సైన్యంబుల సమకూర్చుకొని కృష్ణునిపై దాడివెడలిరి. అందు సాల్వుండు శివునివలనఁ బెక్కువరంబుల నందినవాఁడగుటవలన “ధరణిపై యాదవులనుపేరు లేకుండ నొనర్తు” నని ప్రతిజ్ఞఁ గైకొని యుండెను. అట్లు వారు మువ్వురును దన్నెదుర్కొన హరియును వారల నెదుర్కొని మహాహవ మొనర్పసాగెను. బలరాముం డట్టియెడ యాదవసైన్యంబులఁ గూర్చుకొని విరోధిసైనికులఁ బరిమార్పఁ దొడంగెను. దోమలు పదివేలు చేరియైనను సామజమును మరలింపఁగలవా? శ్రీకృష్ణుండు కొంతవరకు వినోదార్థంబు సంగరంబొనర్చి, పరప్రాణాపహరణోద్యోగాచరణంబున నమోఘంబగు తనసుదర్సనంబును బ్రయోగించి వారల హతమొనర్చెను. వారి చావును గాంచి విరోధిసైన్యంబులన్నియుఁ బలాయనములయ్యెను. ఇవ్విధంబునఁ గృష్ణుండు భూభారంబు దగ్గించుచుండెను.