యదువంశము/రెండవ ప్రకరణ
రెండవ ప్రకరణము
మార్చువసుదేవుని జన్మక్రమము.:-
మార్చుయదువంశోద్భవుఁ డగు శూరుఁడను ధారుణీనాథునకు మారీష యను కాంతారత్నమునందు వసుదేవుం డుదయించెను. వసుదేవుండు పుట్టిన వెంటనే యనిమిత్తముగ నెల్లడల శుభసూచకంబులు పెక్కు గానంబడెను. ఇతఁడు సామాన్యమైన మానవజన్మమును ధరించినవాఁ డు గాఁడు. తొలుఁదొల్త నీతండు సుతపుఁడను ప్రజాపతియై యుండెను. అట్టియెడ ననపత్యతవలన శ్రీహరిఁ గూర్చి యితఁడు పెక్కుసంవత్సరములు తపంబొనర్ప హరియుఁ గరుణించి ప్రత్యక్షమై యేమికావలయునో కోరుకొమ్మని బలుకఁ బుత్రానురాగంబుఁ బెంపున నక్షరంబగు మోక్షంబు నాకాంక్షింపక సుతభిక్షకై యామహామహునిఁ బ్రార్థించెను. శ్రీహరియు నాతని గుణశీలాదులకు మెచ్చినవాడై తానే యాతనికి మూడు జన్మంబుల యందుఁ బుత్రుండై పుట్టుందని తెలియచెప్పి యదృశ్యుండయ్యెను. అదేప్రకారము మొదటిజన్మంబునఁ బృశ్నిగర్భుండను నర్భకుండుగను, రెండవజన్మంబున నాతండు కశ్యపప్రజాపతియైయుండఁ దాను వామనుండుగను శ్రీహరి పుత్రుడై యాతనికి జన్మించియుండెను. మూడవజన్మంబున నీతడు వసుదేవుండను పేరునఁ బుట్టియుం శ్రీహరియు నాతనికిఁ గృష్ణుండనుపేరున నుద్భవించి యిలాభారంబు వాపనుండెను. భగవంతుఁ డీతనికిఁ బుత్రుఁడై జన్మింపనుండెననియే వసుదేవుఁడు పుట్టినప్పు డనిమిత్తముగఁ బెక్కు శుభసూచకములు గానవచ్చెను.
టీక:- అనపత్యత = పుత్రసంతానము లేకపోవుట , అర్భకుడు = బాలుడు
దేవకీదేవి జన్మక్రమము.:-
మార్చువసుదేవుఁడు యుక్తవయస్సునందే రాజ్యభారంబును వహించి పెండ్లియీడున దేవకీదేవి యనుకన్యని భార్యఁగాఁ గైకొనెను. దేవకీదేవి దేవకుండను వాని పుత్రిక. దేవకుఁడు దానవనాథుఁడైన యుగ్రసేనునకు సహోదరుడు ఉగ్రసేనునకుఁ గంసుఁడను కుమారుఁ డొకండు గలడు. కంసుఁడు దేవకినిఁ దోఁబుట్టిన దానిగాఁ బ్రేమించుచుండెడివాడు. వసుదేవునకీమె మొదటిజన్మంబున బృశ్నియను పేరునను, రెండవజన్మంబున నదితియనుపేరునను, నిప్పుడు దేవకీదేవియని పేరునను బత్నియయ్యెను. గతజన్మ ద్వయంబునందీమె శ్రీహరినిఁ బుత్రునిఁగాఁ బడసియుండెను. వసుదేవుండును బూర్వజన్మంబుల నీమెతనయెడలఁ చూపిన పతిభక్తి విశేషంబులకు నలరి, మూడవ జన్మంబునను, నీమెయే తనకు సతికావలెనని నోచినవాఁ డగుటవలన నా ప్రకారమే దేవకీదేవి యాతనికిఁ బత్నియయ్యెను. ఈ దేవకీ వసుదేవులే యదువంశమునకు ముఖ్యులై యుండిరి. అశరీరవాణి పలుకుట
దేవకీ దేవియందు మిక్కిలి మక్కువఁ గల వాఁడగుటవలన ఆమె వివాహానంతరమునఁ జెల్లెలిని , మఱిదిని, దగిన విధంబున నరదంబున నిడుకొని కంసుఁడు కొనిపోవుచుండెను. కంసునియందాక్షణమువఱకు దుష్టబుద్ధి యనునది యెంత మాత్రమును లేదు. అతఁడు పుట్టుకవలన రక్కసుండే గాని వర్తనంబువలన రక్కసుఁడు గాఁడు. అట్టి సాధుస్వభావము గలవాఁడగుటవలననే యెంతమాత్రము ను గుటిలస్వాంతుఁ డు గాక, తన చెలియలని, బావను, సురక్షితముగాఁ గొనిపోవుచుండెను. కాని విధిమాత్రము కంసునకు బ్రతికూలముగా నుండెను. అతఁడిట్లు సంతోషపారవశ్యంబున నొడలెఱుంగక యరదంబును నడుపుచుండ నశరీరవాణి యాతనిని సంబోధించి — “కంసా
తుష్టయగు భగినిమెచ్చఁ గ
నిష్టుఁ డవై రథముగడపె । దెఱుఁ గవు మీఁ దన్
శిష్టయగు నీతలోదరి
యష్టమగర్భంబు నిన్ను । హరియించుఁ జుమీ।”
అని పలికెను.
వసుదేవుని మొఱ.:-
మార్చుఅట్ల శరీరవాణి పలికినపలుకులు సెవులకు ములుకులై సోకఁ దోకఁద్రొక్కిన త్రాచువలె బుసఁగొట్టుచు దిగ్గున నరదంబు డిగ్గనుఱికి, నిజప్రాణరక్షణ పరాయణుండై, చెల్లెలినిఁ గొప్పువట్టి పుడమికీడ్చి, యామె ప్రాణంబులను గొనుటకై తన నిశితకరవాలమును బైకెత్తెను. ఆహా। స్వార్థపరాయణత్వమెంత నీచమైనది? ఏకగర్భసంజనితులకుఁ గూడ నొకానొకప్పుడు విరోధంబును బెంపొందించునుగదా? నిజప్రాణరక్షణోద్యోగాసక్తసహోదరీ ప్రాణాపహరణ ప్రయత్నంబున నున్న కంసునిఁ గాంచి వసుదేవుఁడు భయపడినవాఁడై తేరు డిగ్గి యాతనిని సమీపించి “బావా! ఇదేమి యాగడము? ఎన్నఁడో యాపద వచ్చునని యశరీరవాణి వ్రాక్కుచ్చినంతమాత్రమున నీ యట్టి శూరుఁడు భయపడుటయేగాక మీదుమిక్కిలి ప్రేమాస్పదురాలగు చెలియలిని - నూతన పాణిగ్రహణోత్సవానందతత్పరయగు చెలియలిని— ఈ విధముగా— ఇంత దయాశూన్యముగా వధింపఁ దలంచుటయా? కంసా। సహోదరియందు నీకుఁ గల ప్రేమయంతయు నశించినదా? నీ చెలియలి ప్రాణము మాత్రము నీ ప్రాణము వంటిదికాదా? పురుషుఁడవైన నీవే ప్రాణరక్షణోపాయము నెఱుంగజాలక సోదరిని జంపనుండ నాడుదియగు నీ తోఁబుట్టువు ఏమి చేయగలదు? ఇదియేనా పౌరుషధర్మము? అదిగాక—
అన్నవు నీవు చెల్లెలికి నక్కట? మాడలు సీర లిచ్చుటో
మన్నన సేయుటో మధుర మంజులభాషల నాదరించుటో
మిన్నుల మ్రోఁతలే నిజము. మేలని చంపకుమన్న మాని రా
వన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేఁడెదన్.”
అని వసుదేవుఁడు దేవకీదేవి ప్రాణములను రక్షించుటకై కంసుని ననేక విధముల బ్రార్ధించెను. కాని యా పాపుని మనస్సు కరుగలేదు. అతని నిశ్చయము మారలేదు.
వసుదేవుని మనోధైర్యము.:-
మార్చువసుదేవుఁడు. తన ప్రార్ధనము కంసునియెడ నిష్ఫలమైపోవుటఁ గాంచి నిజసతీమణికి ముప్పు తప్పదని తలంచియుఁ గొంత ధైర్యమవలంబించి ‘కానిమ్ము. ఈ తలోదరి యష్టమగర్భంబుగదా కంసునిప్రాణములు హరించునదియని ఆకాశవాణి తెల్పినది. అట్టియెడ నిప్పుడు నిష్కారణముగాఁ గాంతను గోలుపోవుటేల? ఈమెకుఁ గలుగు శిశువులనందఱిని నీతనికే యర్పించెదను. మీద దేవుఁడేగలడు. ఈఁతడెంత యత్నించినను దైవవిధితప్పదుగదా? కానిమ్ము, చూతము’. అని తనలోఁదాను సమాధానమును బొందినవాఁడై కంసునిఁ గాంచి “కంసా! నీ సోదరిని నిష్కారణముగా నేలచంపెదవు? ఈమెకుఁ బుట్టువారలుఁ గదా నిన్ను సంహరించునది? దానికై నీ వెంత మాత్రమును భయపడనక్కఱలేదు. ఈమెకుఁ గలుగు శిశువులనందఱినిఁ బుట్టినతోడనే నీకప్పగించెదను. ఆ శిశువులను సమయించి నీప్రాణములను కాపాడుకొనుము.” అని తెలియజెప్పెను.
కారాగృహవాసము:-
మార్చువసుదేవుఁ డట్లు తనకుఁ దెలియఁ జెప్పగానే కంసుఁడును కొంతవఱ కాలోచించి యదియే సమ్మతమని తలంచినవాఁడై “బావా! నీ పల్కులను శిరసావహించెదను. ఆడినమాటను దప్పక యీమెకుఁ గలుగు శిశువులను నాకప్పగింపవలయును సుమా! మాటఁ దప్పినయెడల మీయిర్వురుప్రాణంబులును దప్పిపోవును. ఈ కంసుఁ డెంతమాత్రమను దయఁజూపువాఁడుగాఁడు.! అని తనమనోనిశ్చయమును వసుదేవునకుఁ దెలియపఱచి యా క్షణముననే వారలనిద్దఱినిఁ గొని తనపురంబునకరిగెను. పురమును బ్రవేశించినవెంటనే కంసుడు వసుదేవుని మాటయందు నమ్మకములేనివాఁడై చెలియలిని, మఱఁదిని, శృంఖలాబద్దులుగ నొనర్చి కారాగృహమందుంచెను. అప్పటికిని నిండార నమ్మకములేనివాఁడై శిశువు పుట్టినతోడనే తనకుఁ దెలియజేయవలసినదని కాప్తులైనవారినిఁ గొందఱిని కాపు పెట్టెను.
సత్యవాక్యపరిపాలనము.:-
మార్చుదేవకీ వసుదేవులట్లు కంసునివలనఁ గారాగృహవాసమొనర్చుచు సంతతము భగవచ్ఛింతన సేయుఁచు గాలమును గడుపుచుండిరి. ఇట్లు దినములు గతించినకొలఁది, దేవకీదేవి క్రమక్రమముగా గర్భమును ధరింపసాగెను. వసుదేవుఁడును సత్యవ్రతాచరణ తత్పురుషుండగుటవలన గర్భోత్పత్తి యైనవెంటనే పుత్రానురాగమును గూడ లెక్కింపక యాపొత్తుల కందువులను గంసున కర్పించుచుండెను. అతఁడును దయాశూన్యుఁడై యా పసిపాపలను దన నిశితకరవాలమున కెరఁజేయుచు నశరీరవాణి పల్కులు దనయెడల నెట్లు సార్థకంబులగుననియు, దైవవిధి తనకెట్లు ప్రతికూలము కాఁగలదనియుఁ దనకుఁదాను సమాధానము సెప్పికొనుచు నిజసహోదరి యష్టమగర్భంబువలనఁ దనకెంతమాత్రమను బ్రాణహాని సంభవింపనేరదను నమ్మకముతో నుండెను. వసుదేవుఁడును బుట్టినవారు పుట్టినట్లే గిట్టుచుండినను, దుఃఖముల పాలుఁగాక, సంతతము శ్రీ హరి చింతనంబునునఁ దవిలియుండెను. దేవకీదేవియుఁ బురాకృతకర్మఫలంబు ననుభవింపక తీరదను నిశ్చయంబునఁ బుత్రశోకమును దిగమ్రింగుచు దైవమునే నమ్మియుండెను. ఆపదలు ముమ్మరంబుగఁ జుట్టుముట్టిన ముట్టుఁగాక; ధీరస్వభావమెంతమాత్రము జలింపనేరదు. పౌరుషంబు దైవంబును దప్పింపఁజాలదు.