అమ్మాయికి గొడుగు

అమ్మాయికి గొడుగు

ఎలాంగబమ్‌ దీన మణిసింగ్‌

మణిపురి కధ


అయ్యో! పారిపోతున్నాడు... పట్టుకోండి... పట్టుకోండి... దొంగ... దొంగ... అయ్యో! కాస్త పట్టుకోండయ్యా! దొంగ... దొంగ పారిపోతున్నాడు.

బజార్లోని జనమంతా అతడ్ని తరుముకొస్తున్నారు. మధ్యాహ్నం దాటింది. అరగంట క్రితం వరకు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది.

"ఫాయిరెన్‌" (మణిపురి క్యాలండర్‌ లోని పదకొండవ నెల) మాసంలో కురిసే వర్షాన్ని తలపిస్తోంది. ఈ రోజు కురిసే వర్షం. బురద ఎక్కడ అంటుకుంటుందోనని జనాలు చాలా జాగ్రత్తగా అటు, ఇటు చూసుకుంటూ పరిగెత్తుతున్నారు. ఆ బురదలో పరిగెట్టటం కష్టంగా ఉన్నా అతగాడు వాళ్లకి అందకూడదనే దృఢ నిశ్చయంతో శరవేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే జన సందోహంతో నిండిపోయిన ఆ బజార్లో ఎవరికీ చిక్కకుండా పరిగెట్టాలంటే అతడికి కష్టంగానే ఉంది మరి. ఇంతా కష్ట పడ్డాక ఏం జరిగింది... పాపం సాలెగూటిలో చిక్కుకున్న ఈగలాగా జనాలకి చిక్కిపోయాడు.

అతగాడిని చూసిన ఎవరైనా అతను నగరానికి మొదటిసారి వచ్చాడని, పచ్చి పల్లెటూరి బైతని ఇట్టే చెప్పేస్తారు.

అందరూ అనుకున్నట్టుగానే అతను ఓ పల్లెటూరి రైతే. వచ్చిన పని త్వరగా ముగించుకొని గ్రామానికి వెళ్ళి పోవాలనీ అనుకున్నాడు. కాలం కలిసిరాక యిదిగో... ఇలా ఈ జనాలకే చిక్కిపోయాడు. పట్టణానికి వచ్చి మూడు రోజులైనా, ఉండటానికి గూడు కానీ, తినటానికి తిండి కానీ లేక తెగ అవస్థ పడ్డాడు. అన్నం తిని మూడు రోజులు కావస్తోంది. ఆ రోజు బజార్లోకి వచ్చే ముందు యేదో కాస్త ఎంగిలి పడ్డానని అనిపించుకున్నాడు. పొలంలో కాయ కష్టం చేసుకుని ముతక బియ్యంతో వండిన అన్నంలో మిరపకాయ నంజుకుని తిని, పంచ భక్ష్య పరమాన్నం తిన్నంత ఆనందపడిపోయే అమాయకుడు అతను.

తినటానికి కడుపు నిండా తిండి దొరక్క పోయినా, కాయ కష్టం చేసుకుంటూ పోవటం తప్పించి మరొక ఆలోచన లేని, తెలియని బండోడు. బాధని, దుఃఖాన్ని సైతం గుర్తించక పోవటం అతని ప్రత్యేకత అనుకోవాలా, లేక అమాయకత్వం అనుకోవాలా!!! ఓ రెండున్నర ఎకరాల భూమిని కామందు దగ్గర కూలీకి తీసుకొని ఒంటరిగానే కష్టపడే కష్టజీవి అతగాడు. అద్దెకు తెచ్చుకున్న ఎడ్లని క్షణమైనా కూర్చోనివ్వకుండా పొలాన్ని దున్నిస్తాడు. మళ్లీ మళ్ళీ ఎడ్లని అద్దెకి తెచ్చుకుని డబ్బు ఇచ్చే స్తోమత అతగాడి దగ్గరెక్కడుంది? ఒకవేళ తన పని అయిపోతే అడిగినా అడక్కపోయినా పక్క వాళ్ల పొలం కూడా దున్ని పెట్టే యితగాడిని ఏమనాలండీ!! ఇంతా కష్టపడి యింటికొస్తే, వంట కాలేదని తెలిసిందా... అంతే... పార పట్టుకుని తన చిన్న తోటలోని మొక్కలకు బళ్లు కట్టి నీళ్లు పెట్టటంలో నిమగ్నమై పోతాడు. తిండి మీదకన్నా అతగాడికి పనిమీద ధ్యాసెక్కువని అర్థమవుతోంది కదూ!!! ఇంత కష్టపడ్డా కూడ అతగాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడా! అంటే... అది ఆ భగవంతుడికే తెలియాలి. కాయ కష్టం చేసుకోవటం తప్పిస్తే, చక్కగా నలుగురితో కలిసి తిరగాలని. వాళ్ళతో మాట్లాడాలని గానీ బహుశా అతను ఎన్నడూ అనుకోలేదనుకుందాం. ఒకవేళ ప్రయత్నం చేసినా అది అంతగా రాణించదని అతగాడి భయం. పోయిన 'పోయినూ' (మణిపురి క్యాలెండర్‌ లోని 7వ మాసం) మాసంలో పంట కాస్తా చేజారిపోయింది. కామందు అగ్గిమీద గుగ్గిలమవుతూ "ఏంటిరాయిది? ఇలాగయితే నేను బతికినట్టే" అన్నాడు.

"ఏం చేయను బాబాయ్‌! నేపడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తూనే వున్నావుకదా ఇంతకన్న నన్నేం చేయమంటావు?"

"కిందిటిసారి యిదే పాట పాడావ్‌. నీతో కానప్పుడు నన్నెందుకురా ముంచుతావు. ఇప్పుడే కాదు నువ్వెప్పటికీ నా చేతిలో నాలుగు గింజలు కూడా రాల్చలేవు. నేను ఈ పొలం మీదేకదా ఆధారపడింది. 15 వేలు ఖర్చుపెడితే ఏ మిగిలింది. డబ్బు ఖర్చుపేట్టేది వెనకది, ముందు వేసుకుతినటానిటికా గాడిద కొడకా...

"లేదు, నన్ను నమ్ము బాబాయ్‌! వచ్చే ఏడాది ఈ లోటుని తప్పక తీరుస్తాను"

ఈ ఏడాది ఏం తిని బతకమంటావురా? గాలి భోజనం చేయమంటావా! నాకు పిల్లాజెల్లావున్నారు. వాళ్ళ కడుపులెలా నింపమంటావు? ఏదైనా అన్నానంటే చాలు, పెద్ద పెద్ద దణ్ణాలు పెడుతూ నా కాళ్ళమీద పడియేడుస్తావు. చచ్చే చావొచ్చిందిరా నాకు. ఈ మోటరు నీళ్ళతో నడుస్తుందనుకొంటున్నావా! ప్రతి సంవత్సరం ఏదో వంకతో ధాన్యం తగ్గిస్తూనే వస్తున్నావు. నీతో కాదుకానీ మరెక్కడైనా చూసుకో".

మరెక్కడైన పని దొరకడం అంటే మాటలా! బతిమిలాడటం, కాళ్ళావేళ్ళాపడటం యివేమీ చేతగాని పరమశుంఠ మనవాడు. రెండుమూడు సంవత్సరాల లోటు ఒక్క ఏడాదితో తీరుస్తానని గట్టిగా చెప్పటం అయితే చెప్తున్నాడు. ఇతగాడిని ఆ భగవంతుడే రక్షించాలి.

తాగుడు అలవాటులేదు. అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టడం, శరీర శ్రమకు వెనకాడడం యివేమీ చాతకావు. ఎత్తలేని బరువుని ఎత్తటం మూలానే ఈ రోజు ఇంత అనర్ధం జరిగింది. అన్నీ బాగావున్నరోజులో 15 కి బదులు 10 బస్తాలు సేద్యం చేసేవాడు. కానీ ఈ రోజు కలిసిరాక యిన్ని తిప్పలు పడాల్సి వస్తోంది. ఏడాది, ఏడాదిన్నర వ్యత్యాసంలో ఒకరి తరువాత ఒకరు పిల్లలు పుట్టుకు రావటంతో చూస్తుండగానే సంతానం ఎనిమిది మందైకుర్చున్నారు. అందులోను ఆరుగురు ఆడపిల్లలు, యిద్దరు మగపిల్లలు. వీళ్ళందరితో పాటు అస్తమానం ముక్కుతు, మూలుగుతూవుండే యిద్దరు ముసలివాళ్ళు. వైద్యుడి అవసరం లేకుండా పూటకూడా గడవదు.

కేవలం తిండి వరకే అయితే ఫరవాలేదు. బడికూడా యింటికీ దగ్గర్లోనే ఏడ్చింది. ఇక పిల్లల్ని బడికి పంపక తప్పదుగా! చదువు, తిండి రెండు ఒకేసారి కావాలంటే కష్టమే మరి వసంతంలో శ్రీపంచమి ఎందుకొస్తుంది? 'లమదా' (మణిపురి కాలెండర్‌లో చివరి నెల) మాసం గుట్టుచప్పుడు కాకుండా ఎందుకెళ్లిపోదో? వర్షం తన హద్దులో వుండకుండా కట్టలు తెంచుకుని ఎందుకు కురుస్తోందో? అదీ నగరంలోనో, గ్రామంలోని పోలాల్లోనో కాకుండా మాలతిపైనే ఎందుకు కురుస్తోంది? ఇవన్నీ అతగాడి బుర్రని తోలిచేసే ప్రశ్నలు.

మాలతి అతని పెద్దకూతురు. పక్క గ్రామంలోని స్కూల్లో చదువుకుంటోంది. తనకంటూ ఓ చిన్న గొడుగు కొనుక్కొవాలని ఎప్పటినుంచో ఆశ పడుతోంది. ఈ విషయమై తండ్రిదగ్గర చాలాసార్లు గొడవ పడింది కూడా. ఇదివరకటి లాగా యిప్పుడు స్నేహితురాలి గొడుగులో స్కూలుకెళ్లిరావటమో లేకపోతే వర్షం తగ్గేవరకు ఆగి వెళ్ళటమో చేయటంలేదు. వర్షం మరీ ఎక్కువగా పడుతుంటే స్కూలు మానేయటమో లేక తడుచుకుంటూ పోవటమో చేస్తోంది. తన స్నేహితురాళ్ళంతా చక్కగా గొడుగులో వెళుతుంటే ఆ పసి హృదయం పాపం బాధగా మూలిగేది. గొడవ చేస్తే గొడుగు వస్తుందన్న విషయం ఆ పసి మనసుకి తెలియక పోలేదు. నిజం చెప్పాలంటే అవసరమైనప్పుడు అలగడం, ఏడవడం, కోపగించుకోవడం సహజమే కదా! కోప తాపాలు మనిషి నైజంలో ఒక భాగమే అలాగే వాటిని ఉపయోగించుకునే హక్కు ప్రతి వారికీ ఉంది.

తండ్రి తన బిడ్డ కోరికని గుర్తించలేక పోతున్నాడనుకుంటే అది మీ అవివేకమే అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలపు మేఘాలు చూడగానే అతనిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కానీ తిండి గురించి పట్టించుకునే అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి గొడుగు విషయం పక్కకి పెట్టాల్సి వస్తోంది అతగాడికి.

దేవుడి దయవల్ల ఈసారి అన్నీ కలిసొచ్చాయి. బహుశా ఆమె కోరిక తీరే రోజు దగ్గరకొచ్చిందేమో!!! మాలతి తన పాత పుస్తకాలని అమ్మేసి కొంత సొమ్ము కూడబెట్టింది. దానికి తోడు పోయినసారి వర్షంలో బాగా తడిసి, ముద్దయి ఒణికి పోతూ, నీళ్ళు కారుకుంటూ వచ్చిన కూతుర్ని చూసి గొడుగు కొనాలనే నిశ్చయించుకొన్నాడు. అంతే కాదు అప్పు చేసైనా సరే గొడుగు కొనటానికి వెళ్లాలని తీర్మానించుకొన్నాడు. తన నిర్ణయాన్ని కూతురికీ చెప్పాడు. మాలతి ఆనందానికి హద్దులు లేకపోయాయి. కూని రాగాలు తీస్తూ పడుకోవటానికి వెళ్లిపోయింది. తెల్లారే లేచి స్నానం చేసి సంతోషంగా బస్సెక్కాడు.

"దీని ఖరీదెంత?"

"బాబయ్యా! 20 రూ.లు"

"అమ్మో! 20 రూపాయలా!!!"

"దీని బట్ట చూడండి ఎంత అందంగా ఉందో! పైగా గాజుతో చేసిన దీని పిడి చూస్తే దీని ఖరీదు తెలియటం లేదూ!

అతగాడు మారు మాట్లాడకుండా బయటికొచ్చేశాడు. పక్క కొట్లోకి వెళ్ళే ముందు ఓ సారి రొంటిన దాచుకున్న డబ్బును తడిమి చూసుకున్నాడు. డబ్బు మూట చేతికి బరువుగా తగలడంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు.

చుట్టు పక్కల దుకాణాలలో సైతం గొడుగు ఖరీదు 25 రూ్హ్హ అనటంతో అతగాడికేం చేయాలో తోచలేదు. ఎలాగో అలా ధైర్యం కూడగట్టుకుని చివరికి మూలగా ఉన్న ఓ దుకాణంలోకి దూరి గొడుగు ఖరీదు అడిగాడు. "25 రూపాయలు" అని అనేలోగానే అతని మాటలకు అడ్డం పడుతూ "కాస్త తక్కువ ధరలో చూపించవయ్యా" అన్నాడు.

"తక్కువ ధరా! ఎంతలో చూపించమంటావు... 20 రూ... 15 రూ... అంటూ కొన్ని గొడుగులు చూపిస్తూ "ఇందులో యేది కావాలో యేరుకో... అన్నాడు.

"ఇంతకన్నా తక్కువ... ధరలో లేవా?"

"లేవు"

"నీ దగ్గర కాకపోతే కనీసం చుట్టు పక్కల యెక్కడా తక్కువ ధరలో గొడుగు దొరకదా? అన్నాడు నిరుత్సాహంగా.

"దొరుకుతాయేమో ప్రయత్నించు"

అతని మాటల మీద విశ్వాసంతో పాపం అతనెంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. గొడుగులతో నిండిన దుకాణాలన్నీ దాదాపు అయిపోయాయి. ఆఖరికి ఓ మూలగా ఉన్న దుకాణంలో కొద్దిగా పాడైనా కాస్త నదరుగా ఉన్న గొడుగు అతని కంట పడింది. గొడుగు పిడి గాజుదై ఉండటమే కాకుండా లోపల విచ్చుకొన్న పువ్వు డిజైను ఉంది. లోపల దారాలు చెమ్కీతో చేసినవై ఉండటం మూలాన చక్కగా మెరుస్తూన్నాయి. పైగా ఖరీదు 8 రూ. 50 పైసలే! అతగాడి ఆనందానికి హద్దులు లేకపోయాయి.

అంత రద్దీలో దోవ చేసుకొంటూ పోతున్నప్పుడు కూడా గొడుగు చేతిలో ఉంది. కొత్త గొడుగు ఎక్కడ మాసిపోతుందోనని కాగితంలో చుట్టి పట్టుకున్నాడు. అతనికి ఒక్క సారిగా కూతురి ముఖం కనిపించింది. పిచ్చి తల్లి... ఎన్ని రోజులుగా ఎదురు చూస్తోందో దీని కోసం" అనుకుంటూ వడి వడిగా బస్‌స్టాండ్‌ వేపుగా నడిచాడు. నడుస్తున్నంతసేపు సంతోషంతో వెలిగిపోయే కూతురి ముఖమే కనిపిస్తోంది అతగాడికి. రెండు మూడు రోజులదాకా చెప్పిన పనల్లా చేస్తుంది. తల్లిని నిర్లక్ష్యం చేయదు. నేను వెళ్లేసరికి గుమ్మంలోనే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబోలు...

హఠాత్తుగా ఆలోచనల లోంచి బయటికొచ్చిన అతనికి గొడుగు కనిపించలేదు. అతనికి ఒక్కసారిగా కళ్ళు చీకట్లో కమ్మినట్టయ్యాయి. "అయ్యో! నా గొడుగు! నా గొడుగు! అమ్మో!... మీరుగాని నా గొడుగుని చూశారా?"

"లేదు నాయనా! శనగలు కొంటూ నువ్వు రుమాల్లోంచి డబ్బులు తీయటం మాత్రమే చూశాను".

"అవును... డబ్బు తీసిన మాట వాస్తవమే కానీ... గొడుగు యిదిగో... యిక్కడే... ఈ పక్కకే పెట్టాను... కొత్తది... చిన్నది..."

"నాకేం తెలియదు".

కర్మగాలీ యెవరైనా ఎత్తుకుపోయారా! ఓరి భగవంతుడా... ఏం చేయాలి?"

గొడుగు పోయిందని అతగాడికి అర్థం అయిపోయింది. ఎవరినడగాలో, ఏం చేయాలో తోచటం లేదు. బాధతో పెదవులు కొరుక్కున్నాడు చేసేది లేక బస్టాండ్‌ వదిలేసి బజారు వేపుగా కదిలాడు.

  • * *

"నీ పేరేమిటి?"

"నిజంగా నేనే తీశాను".

"నీ పేరేవిటిరా? దొంగ వెధవా... గట్టిగా దవడ పగిలేలా కొట్టాడు. జవాబు చెప్పేలోగా ప్రశ్నల పరంపరలో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఆ పోలీసు. ప్రతి ప్రశ్నకి ముందు వెనక లారీ౮ దెబ్బలతో ఒళ్లు హూనం అయిపోతోంది. దెబ్బలకి కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి. భరించలేక అతను మోకాళ్ల మీద కూర్చున్నాడు. జేబులో చిరిగిన కాగితంలోంచి శనగ్గింజలు చుట్టు పక్కల దొర్లాయి.

"ఇవి ఎవరి దగ్గర కొట్తేశావురా దొంగ..." అంటూ ఠపేల్‌ మని ఎడమ కాలి మోకాలి చిప్ప మీద లారీ౮ దెబ్బ బలంగా పడింది. దెబ్బలు నొప్పికి నడుమ అంతరాత్మలోంచి ఓ నవ్వు బయటికెగసింది. కళ్లల్లోంచి కారుతున్న నీళ్లని చేతులతో తుడుచుకుంటూ

"నన్ను... నన్ను... తోమాల్‌ అంటారు" అంటూ జవాబిచ్చాడు.

"ఎక్కడుంటావు?"

... గ్రామంలో... అనువాదం: డా్హ్హ ఆర్‌. రాజి