-:అంగారపర్ణుఁడు కౌరవులకుఁ బురోహితునిఁ 
బురక్సరిపుఁ డని చెప్పుట:- 
సం. 1_159_17 

సీసము: 
అనవద్యు వేదవేదాంగవిశారదు 
జపహోమయజ్ఞ ప్రశస్తు సత్య 
వచను విప్రోత్తము వర్గచత్రుష్టయ 
సాధనసఖు సదాచారు సూరి 
సేవ్యుఁ బురోహితుఁ జేసిన భూపతి 
యేలు నుర్వీతలంబెల్ల నిందుఁ 
బరలోకమునఁ బుణ్యపరులలోకంబులు 
వడయు జయస్వర్గఫలము సూవె 

ఆటవెలది: 
రాజ్య మదియు నుర్వరాసురవిరహితుఁ 
డయిన పతికిఁ గేవలాభిజాత్య 
శౌర్యమహిమఁ బడయసమకూరునయ్య తా 
సత్య నిత్యసత్యభాషణుండ, 

1_7_62 
వచనము: 
మీరు ధర్మానిలశ క్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు వేదవేదాంగధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల రఖిలలోకహితులరుం గావునం బురోహితరహితుల రై యుండఁదగదు. 

ఆటవెలది: 
పాండుపుత్త్ర నీవు బ్రహ్మచర్యస్థుండ 
వగుటఁ జేసి మన్మథార్తు నన్ను 
నొడిచి తిందు రాత్రియుద్ధంబు సేసి కా 
మోపభోగనిరతుఁ డోటు వడఁడె. 

1_7_64 
వచనము: 
మఱియుఁ గామప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుండగునేని యెల్లయుద్దంబు శత్రుల జయించు. 

1_7_65. 
ఉత్పలమాల: 
వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యుఁ డగణ్యపుణ్యసం 
పాది పురోహితుం డయినఁ బాపము వొందునె భూపతిం బ్రతా 
పోదయ కాన మీదగుగుణోన్నతికిం దగ ధర్మత త్త్వసం 
వేదిఁ బురస్కరింపుడు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్‌. 

1_7_66. 
తేటగీతి: 
అనిన వానికి నర్జునుం డనియె మమ్ము 
ననఘ తాపత్యు లని పల్కి తతిముదమున 
నేము కౌంతేయులము మఱి యెట్లు సెప్పు 
మయ్య తపతి కపత్యుల మైన తెఱఁగు. 

-:తపతీసంవరణోపాఖ్యానము:- 

సంఖ్య: 1_160_3 

వచనము: 
అనిన నర్జునునకు నంగారపర్ణు డి ట్లనియె. 

సీసము: 
ఆదిత్యునకుఁ బుత్త్రి యనఘ సావిత్రికి 
ననుజ యుత్తమలక్షణామలాంగి 
తపతి యంకన్యక ధవళాయతేక్షణ 
యౌవనసంప్రాప్త యైన దానిఁ 
జూచి యక్కన్యక సురుచిరగుణముల 
కనుగుణుం డగు నిర్మలాభిజాత్యుఁ 
బతి నెవ్విధంబునఁ బడయుదునో యని 
తలఁచుచునున్న యత్తపనుగుఱిచి 

ఆటవెలది: 
భక్తిఁ దపము సేసెఁ బ్రభుఁ డజామీఢనం 
దనుఁడు భరతకులుఁడు ధర్మవిదుఁడు 
సర్వగుణయుతుండు సంవరణుం డను 
వాఁడు కృతజపోపవాసవిధుల. 

చంపకమాల: 
గగనమునందు నెందు నధిక ప్రభ నేను వెలుంగునట్టు లి 
జ్జగతిఁ బ్రసిద్దుఁ డై వెలుఁగుసంవరణుండ మదీయపుత్త్రికిం 
దగుపతి వీని కిచ్చెద ముదంబున నీలలితాంగి నంచు మా 
నుగ నెడ నిశ్చయించెఁ దపనుండు దదీయతపః ప్రసన్నుఁ డై. 

వచనము: 
అంత నొక్కనాఁడు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబునఁ బరిభ్రమించి యధికక్షుత్పిపాసాపీడితపతితతురంగుం డయి యేకతంబ పాద చారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు. 

1_7_71 

కందము: 
కనియె నొకకన్య గోమలిఁ 
గనక ప్రభ నిజశరీరకాంతి నుపాంతం 
బున వృక్షలతావలిఁ గాం 
చనమయముగఁ జేయుచున్నచంద్రనిభాస్యన్‌. 


-: సంవరణుఁడు దపతిం జూచి మోహించుట:- 
సంఖ్య: 1_160_25 

వచనము: 
కని యనిమిషలోచనుండయి మనంబున నిట్లని వితర్కించె. 

1_7_73. 

సీసము: 
త్రిభునలక్ష్మి యేతెంచి యేకాంత మి 
ట్లేలొకో యున్నది యివ్వనమున 
గగనమణి ప్రభ గగనంబునందుండి 
యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ 
శంభుండు లావణ్యసద్గుణసముదాయ 
మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ 
దీనియంగముల బొందిన యివ్విభూషణ 
శ్రీ యేమిపుణ్యంబుఁ జేసెనొక్కొ 

ఆటవెలది: 
యమరకన్యయొక్కొ యక్షకన్యకయొక్కొ 
సిద్దకన్యయొక్కొ శ్రీసమృద్ధి 
సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య 
కన్య యగు ననంతకాంతి పేర్మి. 

1_7_74 
చంపకమాల: 
నెఱికురులన్‌ విలోలసితనేత్రయుగంబును నొప్పులోల్కువా 
తెఱయును దీనియాననముతెల్వి కరంబు మనోహరంబు నా 
యెఱిఁగినయంతనుండి సతి నిట్టి లతాలలితాంగిఁ జూచి యే 
నెఱుఁగ సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాససంపదన్‌. 

వచనము: 
అని వితర్కించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం డయి తదీయ గుణమయపాశబధుండునుంబోలెఁ గదలనేరక తన్నివేశితచేతనుండునుం బోలెఁ ద న్నెఱుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం బొందిన తననయనంబులు దానియంద నిలిపి సంవరణుం డక్కన్యకకి ట్లనియె. 

1_7_76. 

ఆటవెలది: 
ఎఱుఁగఁ జెప్పు మబల యెవ్వరిదాన వి 
ట్లేల యున్నదాన వేకతంబ 
క్రూరవనమృగములు గ్రుమ్మరుచున్న యీ 
విజనవిషమశై లవిపినభూమి. 

కందము: 
అని పలుకుచున్న నృపనం 
దనునకు మఱుమాట యీక తామరసనిభా 
నన మేఘమధ్యసౌదా 
మని వోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌. 

వచనము: 
ఇట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబుపయిం బడి ప్రలాపించుచున్న నాతనినభినవయౌవనవిభ్రమోద్భాసితు నంగజాకారుం జూచి తపతి తానును మదనబాణబాధిత యై తనరూపంబుఁ జూపి మధురవచనంబుల ని ట్లేల మోహగతుండ వయి తని పలికిన దానికి సంవరణుం డి ట్లనియె. 

1_7_79. 
చంపకమాల: 
ధరణి నతి ప్రతాపబలదర్పములన్‌ విన నేన పెద్ద నె 
వ్వర్కిని మున్‌ భయంపడనివాఁడ భయార్తుఁడ నైతి నిప్డు పం 
కరుహదళాయతాక్షి దయఁ గావుము నన్ను భవన్నిమిత్తదు 
ర్భరతరపంచబాణహతిఁ బంచతఁ యుండునట్లుగన్‌. 

1_7_80. 
వచనము: 
నన్ను గాంధర్వవివాహంబున వరియింపు మనిన సంవరణునకుఁ దపతి యిట్లనియె. 

కందము: 
భువనైకదీపకుం డగు 
సవితృనకుఁ దనూజ మఱియు సావిత్రికి నే 
నవరజ నవినయవర్జిత 
నవనీశ్వర వినుము తపతి యను సురకన్యన్‌. 

1_7_82. 
వచనము: 
నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయజనకు నడుగుము న న్నిచ్చు నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుంగుదువు గాదె కావున ననవరత జప నియమ ప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు మని చెప్పి తపతి యాదిత్య మండలంబున కరిగె నంత సంవరణుండు మూర్ఛాగతుం డయి పడియున్న 
నాతనియమాత్యుండు వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్ఛదేఱి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు నారాధించుచు. 

:- వసిష్టుఁడు తపతినిఁ గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట:- 
సంఖ్య. 1_162_12 

చంపకమాల: 
ప్రతిహతరాగకోపభయుఁ బంకరుహప్రభవ ప్రభావు దూ 
రితదురితున్‌ మునీశ్వరవరిష్టు వసిష్టమహామునిం బురో 
హితు నతిభక్తితోఁ దలఁచె నిష్ట మెఱింగి వసిష్టుఁడున్‌ సమా 
హితమతి నేఁగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌. 

1_7_84. 
వచనము: 
ఇట్లు దలంచిన పండ్రెండగు దివసంబునకు వచ్చి వసిష్టుం డవిరతవ్రతోప 
వాసకృశీభూతశరీరుం డయి యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం డగుట తనయోగదృష్టి నెఱింగి. 


1_7_85. 
చంపకమాల: 
జగదభివంద్యుఁ డాక్షణమ సమ్మతి సంవరణప్రయోజనం 
బొగి నొనరింప గా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం 
డగుదిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న 
త్యగణిత వేదమంత్రముల నమ్మునినాథుఁ డతిప్రియంబునన్‌. 

వచనము: 
సూర్యుండును వసిష్టమహాముని నతిగౌరవంబున సంభాచించి భవదాగమనప్రయోజనంబు సెప్పు మనిన వసిష్టుం డి ట్లనియె. 

1_7_87. 

సీసము: 
అలఘుండు పౌరవకులశేఖరుండు సం 
వరణుఁ డన్వాఁ డనవరతకీర్తి 
విదితుండు ధర్మార్థవిదుఁడు నీపుత్త్రికి 
నగణితగుణములఁ దగువరుండు 
గావున నతనికి దేవిఁగాఁ దపతి నీ 
వలయుఁ గూఁగులఁ గన్నఫలము దగిన 
వరులకు సద్ధర్మచరితుల కీఁగాంప 
కాదె నావుడు సూర్యుఁ డాఏరించి 

ఆటవెలది: 
వరుఁడు రాజవంశకరుఁడు సంవరణుండ 
యనుగుణుండు దీని కని కరంబు 
గారవమున నిచ్చి యాఋషితోడఁ బు 
త్తెంచెఁ దపతిఁ గురుకులాంచితునకు. 

1_7_88. 
వచనము: 
ఇట్లొక్కనిమిషంబున మున్నూటయఱువదినాలుగుయోజనంబులు పఱచు 
నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి తపనదత్త యయిన తపతిం దోడ్కొనివచ్చి వసిష్టుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ గావున మహాత్ము లయిన పురోహితులం బడసినరాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి. 

కందము: 
ఆతరుణియందుఁ జేతో 
జాతసుఖప్రీతిఁ దగిలి శైలాటవులన్‌ 
వీతనృపకార్యధర్మ 
వ్రాతుం డయి పదియురెండువర్షము లుండెన్‌. 

1_7_90. 
వచనము: 
దానంజేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్టుండు శాంతిక పౌష్టికవిధు లొనరించి సంవరణు దోడ్కొని హస్తిపురంబున కరిగిన నఖిల ప్రజలకు ననురాగం బయ్యె ననావృష్టిదోషంబునుం బాసె నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుం డై వంశకరుండు పుట్టె నదిమొదలుగా మీరును దాపత్యుల రయితి రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు నిట్లనియె. 





"https://te.wikibooks.org/w/index.php?title=ఆ_భా_1_7_61_to_1_7_90&oldid=2544" నుండి వెలికితీశారు