ఉబుంటు/సాధారణ ఉత్తరాలు, లావాదేవీ పత్రాలు, నివేదికలు

మీరు ప్రభుత్వాధికారికో, పత్రికా సంపాదకునికో ఉత్తరం లేక అద్దె ఒప్పందం పత్రము లేక మీ పరిశోధన నివేదిక తయారుచేయాలనుకుంటే మీకు ఉపయోగపడేది లిబ్రెఆఫీస్ రైటర్. ఇది ఓపెన్ఆఫీస్ నుండి వేరుపడి డాక్యుమెంట్ ఫౌండేషన్ వారిచే అభివృద్ధిచేయబడుతున్న కార్యాలయపు సూట్ లో పత్రాలు తయారు చేయటంకోసం అనువైనది. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోని వర్డ్ తో దీటైన లక్షణాలు గల సాఫ్ట్వేర్. విండోస్ వర్డ్ ఆకృతి గల ఫైళ్లు దీనితో తెరవవచ్చు, ప్రామాణికమైన ఓపెన్ డాక్యుమెంట్ తీరు లో రాయవచ్చు లేక మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్ లోనైనా రాయవచ్చు. దీనిని ఉపయోగించి ఒక చిన్న వుత్తరము ఎలా చేయాలో మనం పరిశీలిద్దాం.

లిబ్రెఆఫీస్ రైటర్

ఉత్తరం తయారీ

మార్చు
 
ఉదాహరణ ఉత్తరము

లిబ్రెఆఫీస్ రైటర్ పై నొక్కి అనువర్తనం ప్రారంభించండి. మీకు ఒక ఖాళీ పత్రం కనబడుతుంది. దానిలో ఈ క్రింద ఇవ్వబడిన వివరం టైప్ చేయండి

హైద్రాబాదు
తేది:12 ఏప్రిల్ 2011
నుండి:ప్రసాద్ రేవుల
ఇంటి నెంబరు 24, 12 వ అడ్డ రోడ్డు
పి&టి క్వార్టర్స్
చిక్కడపల్లి
హైద్రాబాదు-20

కి:ఎక్జెక్యూటివ్ ఇంజినీర్
విద్యుత్ సబ స్టేషన్
చిక్కడపల్లి
హైద్రాబాదు-20

అయ్యా,

మా కాలనీలో విద్యుత్ సరఫరా గత కొన్ని రోజుల నుండి సక్రమంగా లేదు.చాలా అంతరాయాలున్నాయి. విద్యార్థులకు, వృద్ధులకు దీనివలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీలైనంత త్వరలో విద్యుత్ సరఫరా సక్రమం చేయవలసినదిగా కోరుచున్నాను.

భవదీయుడు
ప్రసాద్ రేవుల

తరవాత పై సమాచారాన్ని అకృతీకరించటానికి మెనూ నుండి లేక సాధనాల పట్టీనుండి అదేశాలు ఎంచుకోండి.
ఉదాహరణకు:తొలివరుసను ఎంచుకొని కుడివైపు అనుగుణం (ఆకృతీకరణ-అనుగుణం-కుడి) లేక కుడివైపు అనుగుణం చూపే ప్రతిమపై నొక్కితే ఆ పదం కుడివైపుకి జరపబడుతుంది.అలాగే మిగతా ఆకృతీకరణ పూర్తి చేయండి.