నాగమ్మగారు నాగుల చవితి

నాగమ్మగారు నాగుల చవితి

జయంతి వెంకటరమణ


కాంతారావు కారు పంపించాడు. పంపుతూ "మా అమ్మ కాలిఫోర్నియా నుంచి వచ్చింది. కార్తీకమాసం వరకు ఉంటుంది. నీతో మాట్లాడాలట. నేను పంపిన కారులో రా" అని కబురుపెట్టాడు. నాకేం అర్థంకాకపోయినా మిత్రుడు కదాని వైజాగ్‌ బయలుదేరాను. ఆ సాయంత్రం

కాంతారావు గేటు దగ్గరే ఎదురొచ్చి హాల్లోకి తీసుకెళ్ళాడు. అప్పటికే హాలులో నాగమ్మ గారు నాకోసం ఎదురుచూస్తున్నారు. అంతవరకు గుర్తురాని అతని తల్లిపేరు ఆమెను చూడగానే గుర్తొచ్చింది. ఆమె చూపులు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆమె సోఫాలో కూర్చోడంలో ప్రత్యేకమైన 'రీ౮వి' ఉంటుంది. ఒకవేపు నుండి మరోవేపుకు తల తిప్పిందంటే అందులో 'దర్పం' ఉంటుంది. కోపమొచ్చిందంటే నాగుపాములా బుస కొట్టగలదు. పేరునుబట్టి ఆమె ఆ లక్షణాలు అలవరచుకున్నదో, లేక ఆ లక్షణాలబట్టి ఆమెకాపేరు పెట్టారో నాకు తెలియదు. కానీ, ఆమెకు ఆ పేరొచ్చిన కారణం అప్పుడే నాకు తెలుస్తుందని నేననుకోలేదు. ఆమెది మా అమ్మ వయసు. అరవైఅయిదు దాటాయి. కానీ, మా అమ్మకన్నా ఆరోగ్యంగా చలాకీగా ఉంటుంది. నన్ను 'ఏంఁవాయ్‌ మాష్ట్రూ!' అని, 'ఏం పంతులూ' అని పిలుస్తుంది. నేనేమీ అనుకోను. చదువు చెప్పే మాస్టర్లంటే ఆమెకు చిన్నచూపే. ఆమె మూడోక్లాసు చదివేటప్పుడట అయిదో ఎక్కం సరిగా రాయలేదని మాస్టారు బెత్తం తీస్తే పలక అతనికేసి విసిరి చదువుకు భరతవాక్యం పాడిందట. కానీ, ఏమీ చదువుకోకపోయినా ఇంగ్లిషు, తెలుగు బాగా మాట్లాడుతుంది. కారణం సంవత్సరంలో సగభాగం స్టేట్స్‌లో కొడుకు దగ్గర ఉండటమే. నన్ను చూడగానే "రావోయి కిష్టారావూ! బాగున్నావా?" అని పలుకరించింది. ఏదో పెద్ద అవసరం ఉంటేగానీ ఆమె ఎవర్నీ గుర్తుపెట్టుకోదు, పేరుపెట్టి పలుకరించదు. అతిధి సత్కారాలు అయిన తరవాత "నీవో 'ఫేవర్‌' చేసిపెట్టాలోయి నాకు. మా 'కాంతం' వల్ల అవదు. పల్లెటూరిలో ఉంటావు కాబట్టి నీవల్ల అవుతుంది..." అని ఆగిందామె. "నన్నంతా 'నాగమ్మ', 'నాగమాంబ' అనేస్తున్నారు కానీ... నా అసలు పేరు 'నాగేశ్వరి'. కీపింగ్‌ ఇట్‌ ఎపార్ట్‌ అసలు నాకా పేరు ఎలా వచ్చిందో తెలుసా?..." ఆగిందామె. ఆమె అలా ప్రసంగం ప్రారంభించడంలో అంతరార్థం తెలియక గబుక్కున "ఫ్లాష్‌బ్యాకా!" అన్నాన్నేను. పొరపాటు ఆమె మాట్లాడేటప్పుడు ఆమె వెతుక్కునే పదాన్ని ఎవ్వరూ అందివ్వకూడదు దాన్ని ఆమె ఆమోదించదు. తన ప్రజ్ఞ ప్రదర్శించాలనే చూస్తుంది. 'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడ'ని ఎవరన్నా 'కచ్చితంగా తూర్పే ఎప్పుడయింది? ఆగ్నేయమో... ఈశాన్యమో కాలేదూ? నీకెదురుగా సూర్యుడుండేది ఎంతకాలం?' అని వాదిస్తుంది. ఏ విషయమైనా అంతే. "ఫ్లాష్‌బ్యాక్‌ అనకు. 'పుష్షింగ్‌ ది బాక్‌ టు ది ఫార్వర్డు' అను. ఎందుకంటే దీనికంత చరిత్ర ఉంది. విను... నేను పుట్టకముందు మేమంతా ఓ పల్లెటూరిలో ఉండేవారమట. పల్లెలో మాది మాత్రం పెద్ద ఇల్లు... పెద్ద వాకిలి... పెద్ద పెరడు... అంతా వాస్తు ప్రకారమే. మామిడి, కొబ్బరి, పనస, సపోటా, సీతాఫలం, అరటి వృక్షాలేకాక పూలమొక్కలు, పారిజాతాలు, ఫలసంపెంగ, పండ్ల సంపెంగ వృక్షాలూ ఉండేవి పెరట్లో. ఆ సంపెంగలపై నాగుపాముల జంట ఉండేదట. అందులో ఒకటి మా ఇంట్లోకీ మా గదుల్లోకీ వచ్చేదట. అప్పుడు మాది పెంకుటిల్లే. అలా వచ్చినా అది ఎవర్నీ ఏమీ చేసేదికాదట. మా నాన్నమ్మ గారు ఓ గిన్నెలో పాలు పోసి ప్రతీ రాత్రి గడప అవతల ఉంచితే, తాగేసి పోయేదట. ఓసారి ఏమైందంటే ధనుర్మాసంలో మా నాన్నమ్మ యధావిధిగా మూడు గంటలకే లేచి స్నానాదికాలు ముగించుకుని వేణుగోపాలస్వామి కోవెలకు తిరుప్పావై వినడానికి వెడుతూ, ప్రతి రోజులాగే ఇంటిల్లిపాదికి సరిపడే నీళ్ళు డేగిసాలో మరగబెట్టడానికి కట్టె పొయ్యిలో నిప్పు వేసిందట. మా అమ్మ లేచి పెరట్లోకెళ్ళి కడుపు తిప్పేంత వాసనొచ్చి, వాంతి అయ్యేంత పర్యంతమై మరి పెరట్లో ఉండలేక మంచంమీద పడిపోయిందట. 'అమ్మకెందుకలాగయిందో' అని కంగారుగా అందరూ మంచం చుట్టూ చేరడం, వైద్యుడు రావటంతో పెరట్లో ఏమయిందో ఎవరూ గమనించలేదట. పాలు తీయడానికి వచ్చిన పనివాడు 'ఏంటమ్మా! ఈ కమురు కంపు?' అని అన్నాడే తప్ప వాడూ తెలుసుకోలేకపోయాడు. ఆ సాయంత్రం మాకు తెలిసిందేమిటంటే జంట పాముల్లో ఒకటి కప్పను తిన్నదో ఏమో కదలలేక పొయ్యిలో కర్రల మధ్య పడుకుని అగ్గికి ఆహుతి అయిపోయిందని. పాలు తాగే పాము ఆ రాత్రి రాలేదట. ఉదయం లేచి చూస్తే సంపెంగ దగ్గర రాతికి తల పగలగొట్టుకుని చచ్చిపడి ఉందట. మా నాన్నమ్మ గుర్తుపట్టి ఏడ్చింది. గంధంచెక్కల మధ్య అగ్ని సంస్కారాలు చేసినా ఎవరికీ శాంతి లేకపోయిందట. మూడు నెలల మా అమ్మ గర్భం పోయిందట. అప్పటినుండి ప్రతీసారి అదే తంతు. ఎన్ని పూజలూ... శాంతులూ చేయించినా లాభం లేకపోయిందట. చివరికి ఎవరో 'నాగులచవితినాడు నిష్ఠగా పూజ చేసి, పుట్టలో పాలుపోసి, జంటపాముల విగ్రహాన్ని పుట్టలోవేసి, ఉపవాసం ఉండి ప్రయత్నించండి' అన్నారట. మా నాన్నమ్మ అలాగే చేయించిందట. అద్భుతం పూజ ఫలించింది. మళ్ళీ నాగులచవితికి నేను నెల పిల్లనట. ఆనాటినుండి మా ఇంట్లో అందరి పేర్లకి 'నాగుడి' పేరు కలిపి పెట్టడం, ప్రతీ నాగులచవితికి పుట్టలో బంగారంతో చేసిన 'సర్ప మిధునం' వేయడం మాకు ఆనవాయితీ అయిపోయింది. అయితే ఈమధ్య కొన్ని ఏళ్ళుగా నేను ఇండియాలో ఆ టైముకి లేకపోవడతో మిగతావాళ్ళు సరిగా పట్టించుకోలేదు. కొంత ఎగతాళి చేసినవాళ్ళూ ఉన్నారనుకో. 'కీపిట్‌ ఎలూఫ్‌' ఈ సంవత్సరం ఎలాగైనా నాగులచవితి పండుగ యధావిధిగా జరపాలని స్టేట్స్‌ నుంచి వచ్చాను. ఈ పట్నాల సంగతి నీకు తెలుసుగా. ఈ అపార్టుమెంట్ల సంస్కృతిలో... కర్మాగారాల కల్చరులో... చెట్లు, పుట్టలు కరవైపోతూంటే ఇక నాగులచవితి ఎక్కడ? నాగమయ్య పూజలెక్కడ?అఫ్‌కోర్స్‌ అపార్టుమెంట్ల దగ్గరికీి పాములొస్తాయి తెస్తారు. అది నాకిష్టం లేదు. అందుకే నీకు కబురు పెట్టాను. దీపావళి వెళ్ళగానే మేమంతా మీ ఊరొస్తాం. చవితి అక్కడ చేస్తాం. ఏర్పాట్లు నీవు చూడాలి. మేముండడానికి ఇల్లు... పాలు పోయడానికి పుట్ట... పుట్టలో పాముండాలి. ఇంకోమాట ఒకరు పాలుపోసిన పుట్టలో మేం పాలు పొయ్యం. అంతేకాదు. ఆ పుట్టలో మరెవ్వరూ ఆ రోజు పాలు పోయకూడదు..." అని ఆగిందామె. అంతవరకు ఆమె మాటలు వింటున్నట్టు నటిస్తున్న సీతాపతిరావు గారు "నీవలా చెయ్యాలి. ఎందుకంటే ఆమె నమ్మకాలు ఆమెవి" అన్నారు. ఆయన కాంతారావు తండ్రి. రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఆ ఇంట్లో నాగమ్మ గారి మాట ఎవరూ కాదనరు. వాళ్ళ మాటలు వింటూంటే నా గుండెలో రాయిపడినట్టయింది. మాది పల్లెటూరే. కానీ, ఇప్పుడు దాని స్వరూపమే మారిపోతోంది. తోటలు, చెరువులు మాయమయ్యాయి. చీమలు పెట్టిన పుట్లను పాములు ఆక్రమించినట్లు, కబ్జాస్వాములు మా ఊళ్ళోనూ అవతరించారు. పొలాలు బీడులవుతున్నా... నీరందక పంటలు ఎండిపోతున్నా 'నాకో పెళ్ళాంనాకో ఇల్లు' సిద్ధాంతంతో వ్యష్టి కుటుంబాలు బలపడటంతో మా పల్లెటూరు కూడా పట్నవాసపు వాసనలనందుకుంది. మిద్దెలు, మేడలు లేచాయి. ఖాళీ స్థలాల చుట్టూ ప్రహరీ గోడలూ ముళ్ళ కంచెలూ ఏర్పడ్డాయి. 'మమ్మీడాడీ' బడులూ వచ్చాయి. "అవునూ! మా వూళ్ళోనే మొక్కు తీర్చుకోవాలని మీకెందు కనిపించింది" అని అడిగాను ఆ రాత్రి భోజనాల దగ్గర. "మీ వూళ్ళో శివాలయం వెనుక పెద్దపుట్ట ఉందనీ అందులో వూరిలో సగంమంది పాలు పోస్తారనీ విన్నాను" అన్నారు సీతాపతిగారు. "అంతేకాదు. నేను ఫిలడల్ఫియాలో ఉన్నప్పుడు తెలిసివాళ్ళలో మా ఫ్రెండు నాకొక పార్శిల్‌ పంపింది. దాని రేపరు తెలుగు పేపరు. అందులో న్యూస్‌ ఏమిటో తెలుసా? 'మారేడు వనంలో పాముకాటుకు ఒకరు మృతి' అని. ఆ వెంటనే మీ ఊరినే డిసైడ్‌ చేసేశాను. అంతేకాదు. తోడుగా నీవూ ఉన్నావు. మరి 'మారేడు వనం' మీ వూరేగా?" అంది నాగేశ్వరి గారు. మా వూరిపేరు అమెరికాలో ఆ విధంగా ప్రతిధ్వనించినందుకు నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియలేదు. మా ఊళ్ళో శివాలయం ఉందిగానీ పుట్టలేదు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి కోవెల కట్టారు. 'యధార్థస్థితి ఇది' అని చెప్పినా వాళ్ళు నమ్మరు. మరి నాకు తప్పలేదు. ఎందుకంటే ఆమె తన దగ్గరున్న పేపర్‌ కటింగ్‌నే నమ్ముతోంది.

  • * *

"గోవరాజూ! అదిరా కధ. నీవు గొడ్లను కాయడానికి పొలాల వెంటా... పుట్లవెంటా తిరుగుతుంటావు. ఒక పుట్టను వెతికిపెట్టరా బాబూ! నీకు పుణ్యముంటుంది. అందులో మాత్రం పాముండాలిరోయ్‌! నీ కష్టం ఉంచుకోను" అన్నాను. నా దగ్గర వాడికి చదువు బాగా రాకపోయినా నన్ను 'గురూ గారూ' అంటూ గౌరవిస్తూ చెప్పిన పని చేస్తూంటాడు. గోవరాజు ఆలోచనలోపడ్డాడు. స్కూలు వరండాలో మసిబొగ్గుతో గీతలు గీస్తూ "బాబూ! ఇది సెరువుగట్టు... ఇది బహిర్భూమి... ఇటు పెద్ద ఇస్కూలు... ఈ మూల టూరింగ్‌ టాకీసు... ఇటు కొండ..." "అదంతా ఎందుకురా! మన వూరివాళ్ళు పాలు పోసేందుకు ఎక్కడికి వెళతారు?" "ఏడికెళ్తారు సావీ! కొండమీదిగ్గాదూ... ఆడనే ఉండయికదా పుట్టలు. ఆయమ్మ ఎక్కలేరు గదా! పొలాల్లో ఉండయిగానీ మనదాక రానిత్తారూ..." అంటూ గొంతుకిల్లా కూర్చుని ఆలోచనలోపడ్డాడు గోవరాజు. అంతలో కాంతారావు 'కార్యక్రమం అయ్యేంతవరకు ఉంచుకో' అని నాకిచ్చిన సెల్‌ మోగింది. సెల్‌ అందుకుని 'హల్లో' అన్నా. "ఆ! నేనేరా మాష్ట్రూ! మొన్న మా అమ్మ ఒక విషయం చెప్పడం మరచిందట. మనకు కావలసిన పుట్ట వేపచెట్టు కిందదే అయ్యుండాలట" అన్నాడు. నా గుండెలో రాయిపడింది. నోరు పెగుల్చుకుని "మా వూళ్ళో కరచిన పాము వేపచెట్టు కింద పుట్టలోనిది కాదేమోరా!" అన్నాను. "నోరు ముయ్యి! పాము కుట్టడం ఎవరికి కావాలోయ్‌! వేపచెట్టు చెట్టుకింద పుట్ట పుట్టలో పాము ఆ పాముకే పాలు పొయ్యాలి" అంటూ కట్‌ చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోని పాము సంపెంగ చెట్టు మీద కదా ఉంది... ఈ వేపచెట్టు ఎక్కడిది? అయినా ఇప్పుడు సంపెంగ గుర్తుచేస్తే... కూడదు... నేను ఏ సింహాచలమో వెళ్ళి సంపెంగ వృక్షాన్ని తేలేను. నోరు మూసుకుంటూ 'అదిరా కొత్త కధ' అంటూ వివరించా. గోవరాజు విని, తల పంకించి, యుంకించి "సావీ! తవరు నిబ్బరంగా ఉండండి. ఆయమ్మగారు వచ్చేతలికి ఏపచెట్టు పుట్ట పాము యాడున్నా ఎతికిపెట్టే పూచీ నాది" అంటూ గేదెల్ని తోలుకుంటూ వెళ్ళాడు. దీపావళి వెళ్లిన మూడో రోజున కాంతారావు, భార్య, సీతాపతిగారు, నాగమ్మగారు ఇద్దరు మనవలతో పడవలాంటి పెద్ద కారులో మా ఊరొచ్చారు. అంతకుముందే మా పక్కింటిని వాళ్ళకోసం ఏర్పాటుచేశాం. రాగానే అందులోకి ప్రవేశించి పద్ధతి ప్రకారం పాలు పొంగించారు. మా ఆవిడ, పిల్లలు ఒదిగి ఒదిగి వాళ్ళకు కాఫీలూ టిఫిన్లూ భోజనాలూ ఏర్పాటుచేశారు. ఆరోజు సాయంత్రం ఆకాశదీపం పెట్టే వేళకు ముందుగా గోవరాజు వచ్చాడు. వస్తూనే "బాబూ! ఆయమ్మగారు గొప్ప అదృష్టవంతులండీ! గొప్ప జాతిపాము సావీ! గోధుమరంగు, మంచి పొగరులో ఉంది. మన పుట్టలోనే సావీ! అది సరింగా మన పుట్టమీదే పొర ఇడిసిపెట్టినాది. వచ్చి సూత్తారేటి?" అన్నాడు. నాగమ్మగారు, కాంతారావు, పిల్లలు వాడి మాటలకు లోపలి నుండి వచ్చారు. "రాండి... సూదురుగాని" అన్నాడు నాగమ్మగార్ని చూసి. "నేనొస్తా పద" అన్నాడు కాంతారావు. నేనూ పిల్లలూ పుట్టను చూడ్డానికెళ్ళాం. మా ఇంటికి దగ్గరలోనే వేపచెట్టు కింద పుట్ట చాలా పెద్దది. పుట్టమీద పాము కుబుసం. ఎవ్వరూ దగ్గరికి చేరకుండా చుట్టూ తుమ్మకంచె పడేశాడు గోవరాజు. కాంతారావు తృప్తిపడ్డాడు. "గోవరాజూ! పాము ఎప్పుడూ ఇందులోనే ఉంటుందా?" అని భయపడుతూ అడిగాను. "మనం మనింటిలో ఉండక యాడికిపోతాం సావీ! ఇదీ అంతే" అన్నాడు. పాము పాలు పోసేటప్పుడు బయటికి వస్తే భయపడుతూనే ఇల్లు చేరాను. చవితినాడు దేవుడి గదిలో పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు నాగమ్మగారు. వాళ్ళకు కావలసిన సరంజామా అంతా నేను సమకూర్చిపెడితే మా శ్రీమతి వాళ్ళకు పనుల్లో సాయపడింది. గోవరాజు ఉదయాన్నే ఆవుపాలు లీటరు సంపాదించి తెచ్చాడు. నువ్వులు, బెల్లం దంచి ఉండలు కట్టారు. అత్తా కోడళ్ళు నానబెట్టిన బియ్యం దంచి, నూరిన పంచదార, కొబ్బరికోరు, యాలకుల పొడి కలిపి ఉండలు కట్టారు. ఇంటి దగ్గర గద్దె నాగయ్యకి పూజచేసి, పాలుపోసి, ప్రసాదం నివేదన చేసి అత్తా కోడళ్ళు పట్టుచీరలు కట్టుకుని పెద్ద వెండి పళ్ళాలలో పూలు, పళ్ళు, చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, నాగుల గావంచా పట్టుకుని బయలుదేరగా, పట్టుపంచెలు కట్టుకుని తండ్రీ కొడుకులు, వెండి చెంబుల్లో పాలు, నీళ్ళు పట్టుకుని బయలుదేరారు. పుట్టకెళ్ళే ఆచారం మాకులేదు కనుక మావాళ్ళెవరూ బయలుదేరకపోయినా, కార్యక్రమం పూర్తయేంతవరకు ఉండాలి కాబట్టి నేనూ గోవరాజు వాళ్ళతో బయలుదేరాం. చెట్టు, పుట్ట, ఆ వాతావరణం చూసి అందరూ తృప్తిపడ్డారు. గోవరాజు ముళ్ళకంచె తొలగించి, పాము కుబుసాన్ని పైకి లాగి ఓ పక్కగా ఉంచాడు. పూజ మొదలైన దగ్గర్నుండి నాకు భయంగానే ఉంది. ఒక్కసారి బుసకొడుతూ పాము బయటికి వస్తే 'ఏమిటో గతిరా దేవుడా' అని నేను భయపడుతూంటే గోవరాజు నా భయంతో నిమిత్తం లేకుండా దగ్గరుండి పూజ నడిపించాడు. పుట్ట దగ్గర నీళ్ళు చల్లి, ముగ్గులు పెట్టి, పసుపు కుంకుమలతో పూజలు చేసి "ఇన్ని కన్నాలున్నాయి కదా పాలు ఎందులో పోయమంటావు?" అని అడిగారు అత్తా కోడళ్ళు. "ఏ పుట్టలో ఏ పాముంటాదో ఎవురికెరుక తల్లే! కాసినేసి పాలు అన్నిట్లా పోసేండమ్మా! అలాగే సనివిడి, సిమ్మిలీనూ!" అని సలహా ఇచ్చాడు గోవరాజు. చేతులు కట్టుకుని, వాళ్ళలా చేసిన తరవాత సీతాపతిగారు, కాంతారావు అలాగే చేశారు. పిల్లలు వాళ్ళననుసరించారు. నాగుల గావంచా పుట్టమీద వేసి, పుట్ట మన్నుతీసి ఇచ్చారు నాగమ్మగారు అందర్నీ పెట్టుకోమని చెవికి. తరవాత అరతులంతో చేసిన బంగారపు సర్ప మిధునాన్ని నాగమయ్యని స్మరించుకుంటూ పుట్టలో వేశారు. పదేపదే దండాలు పెట్టుకుని తిరిగి వస్తూ మూడుచోట్ల నీళ్ళు చల్లి, మూడేసి చిన్నరాళ్ళను కుప్పగాపోసి, వరిపిండి జల్లి వెనక్కి చూడకుండా తిరిగివచ్చారు నాగమ్మగారు. వస్తూ "ఒరేయ్‌ అబ్బాయ్‌! ఈ రోజున ఈ పుట్టలో మరెవరూ పాలు పోయకూడదు. పూజ చేయకూడదు. చూసే బాధ్యత నీది. ఇదిగో ప్రసాదం. ఇదిగో వంద... ఇంద... తీసుకో" అంటూ ప్రసాదం, ఓ వంద రూపాయల నోటు వాడి చేతిలోపెట్టి వచ్చారు. ఆరోజు పచ్చి మంచినీళ్ళయినా తాగకుండా అత్తా కోడళ్ళు ఉపవాసముండి నాగపంచమినాడు మాతో భోజనాలు చేసి ఆ మర్నాడు అందరూ వైజాగ్‌ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్తూ "నా పెద్ద మనుమరాలు కన్సీవ్‌ అయింది. సవ్యంగా పురుడు రావాలనమ్మా ఈనా తాపత్రయమంతా..." అని చెప్పిందామె. వెళ్ళిన తరవాత ఏ కబురూ కాకరకాయ లేకపోయినా కొన్ని నెలల తరవాత ఆమె కాంతారావుచేత నాకు ఫోన్‌ చేయించి, పెద్ద మనుమరాలికి కూతురు పుట్టిందని చెప్పింది. నాకా వార్త ఆనందాన్ని కలిగించినా... ఎక్కువ భయాన్నే కలుగజేసింది. 'మొక్కు తీర్చుకోడానికి మళ్ళీ మా ఊరు ఎక్కడ వచ్చేస్తానంటుందో' అనే నా భయం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మూడో రోజు సాయంత్రం మా అబ్బాయి ఏదో చెబితే అటు వెళ్ళి చూశాను. అక్కడ వేపచెట్టయితే ఉందిగానీ... పుట్ట మాత్రం లేదు. గోవరాజు కూడా నాకు కనపడటం మానేశాడు. ఇక నే చెప్పేదేముంది?!