నార్ల సమగ్ర సాహిత్యం

పరిచయం

మార్చు

» తెలుగునాట ప్రముఖపాత్రికేయులు, హేతువాది, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. » ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. » పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసారు. » రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈ- రూపంలో వెలువడుతున్న నార్లవారి రచనలకు ముందుమాట:


బహుముఖ ప్రజ్ఞాశాలి నార్ల వెంకటేశ్వరరావు గారి సమగ్రరచనలను నార్లవారి కుటుంబం వారు 2004 ప్రచురించారు. ప్రస్తుతం వారి రచనలు అందుబాటులో లేవు. మారుతున్న సాంకేతిక సౌకర్యాలవల్ల నార్లవారి రచనలు అన్నిటినీ తెలుగు వారందరికీ అందించే సంకల్పంతో నార్ల కుటుంబీకులు ముందుకు వచ్చారు.

నేను ఈ బాధ్యతలను స్వీకరించాను. నార్లవారి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, వారిని గురించి ఎందరో మహానుభావులు కురిపించిన చిరుజల్లులు, గాలి తుఫానులను అందించే ప్రయత్నం చేశాను.

గొప్ప ముందడుగు :

మార్చు

కంప్యూటరులో MS 365 ఆఫీసు అందుబాటులో గల వారు ఈ పుస్తకంలోని ఏ భాగాన్నయినా కంప్యూటరు సహాయంతో చదువుకోవచ్చు. ప్రచురణ ప్రణాళికను ఈ పుస్తకం చివరలో అందించాను. పెద్ది సాంబశివరావు, 9441065414, pedddissrgnt@Gmail.com, teluguthejam.com


జననం, విద్య

మార్చు

నార్ల వెంకటేశ్వరరావు మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 న మహాలక్ష్మమ్మ, లక్ష్మణరావు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం నుండి అక్కడికి వ్యాపార రీత్యా వెళ్ళారు. కాని నార్ల విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది.

నార్లవారి జీవిత విశేషాలు

మార్చు

వి.ఆర్. నార్లగా ఆంధ్రదేశానికే కాదు యావద్భారత దేశానికి ఉత్తమ సంపాదకులుగా సుపరిచితులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు. ఆంధ్రదేశంలో ఉన్న కొద్దిమంది ఉత్తమ సంపాదకులలో అగ్రేసరులుగా, తెలుగుజాతి మేధావి వర్గంలో అనుపమ వ్యక్తిత్వం గలవారు. రచయితగా నార్లవారు విలక్షణమైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. వారు ఉత్తమ సంపాదకులేకాదు విమర్శకులు, వ్యాసరచయిత. ఉత్తమ కవులేగాదు తాత్త్వికులు, ప్రజాస్వామ్య ప్రియులు, హేతువాదులు వీటిని మించి మానవతావాదులు.


నార్లవారి పూర్వీకుల చరిత్ర

మార్చు

కృష్ణాజిల్లా కాటూరు నార్లవారి పూర్వీకుల గ్రామం. 18, 19 శతాబ్దాలలో ఈండియా కంపెనీ వారికి యుద్ధసామగ్రిని చేరవేసే కాంట్రాక్టర్లుగా నార్ల రామయ్య, రమణయ్య, తాతయ్య నియుక్తులై సాగరు ప్రాంతానికి వలస వెళ్ళారు. నార్ల తాతయ్య కుమారుడు మాధవరావు సిపాయి పితూరీలో కంపెనీ మెప్పుపొంది సాగర్ లో స్థిరపడ్డారు. శ్రీ వెంకటేశ్వరరావు తాతలైన హనుమయ్య వెంకయ్యగారలు అతి సాహసవంతులు. వెంకయ్యగారి సంతానంలో గోవిందరావు,.


లక్ష్మణరావు ఒక ఆడబిద్ద మాత్రమే బ్రతికారు. అధిక వ్యయానికి అలవాటు పడ్డ గోవిందరావు మూలంగా కుటుంబౌన్నత్యం క్షీణింప సాగింది. లక్ష్మణరావు, మహాలక్ష్మమ్మ అనే పుణ్యదంపతులకు 1908 డిసెంబర్ 1వ తేదీన వెంకటేశ్వరరావు జన్మించారు. పుట్టింది జబల్ పూర్లో. పెరిగింది. సాగర్, లక్ష్మణరావు పోయిన ఆస్తిపోగా 1914-15 ప్రాంతంలో లక్ష్మణరావు భార్య స్వగ్రామమైన కృష్ణాజిల్లా కౌతరంలో స్థిరపడ్డారు. జన్మించింది సాగర్, కాబట్టి నార్ల వారికి మొదట హిందీయే అలవడింది. తల్లిదండ్రులు ఆంధ్రదేశంలో స్థిరపడ్డాక ఏడవ సంవత్సరంలో తెలుగు నేర్వను ఆరంభించారు.


నార్లవారి విద్యా జీవితం కౌతరం బోర్డు ఎలమెంటరీ పాఠశాలలో ప్రారంభమైంది. చిన్ననాటనే బాలభటోద్యమం లో చేరారు. కౌతరంలోని ఆంధ్ర లక్ష్మీ ఎడ్వర్డు మెమోరియల్ స్కూల్ లో ప్రవేశించి సెకండుఫారంలో కృతార్ధులయ్యారు. గుడివాడ హైస్కూల్ లో ఎస్.ఎస్.ఎల్.సి. 1920 వరకు చదివారు. అప్పుడు ‘సోదర సమితి’ స్థాపించారు. ఆదర్శవంతులైన నార్ల పెత్తండ్రి నార్ల వెంకటరామన్నగారు వీరి చదువుకు ఆర్థిక సాహయ్యం చేశారు. 1927లో గుంటూరు హిందూ కాలేజి హైస్కూలులో యస్. యస్.ఎల్.సి. పరీక్షకు వెళ్ళి ఇంగ్లీషులో ఒక్క మార్కు తక్కువ రావటంతో తప్పారు. 1927 డిసెంబర్ లో జరిగిన మద్రాసు కాంగ్రెసు సమావేశానికి నార్ల ప్రేక్షకునిగా హాజరయ్యారు. 1928లో అందులో ఉత్తీర్ణులయ్యారు.


నార్ల వారి పై అప్పటికే బ్రహ్మసమాజ ప్రభావం పడింది. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజిలో ఇంటర్మీడియట్ చేరినపుడు ఆ భావాలు బాగా బలపడ్డాయి. విగ్రహారాధనను మాని మానవతావాదిగా మారారు. సామాన్య మానవుల స్థితిగతులను మెరుగు పరచడానికి 'సోదర సమితి' అనే సమాఖ్యను ఏర్పాటు చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుఫాన్ కు గురియైన ప్రజలకు ధన, వస్త్రాలను వసూలు చేయడంలో సహాయపడ్డారు. సాంఘిక, రాజకీయ కారణాలవల్ల వారి చదువు సరిగా సాగలేదు. 1928లో పూర్వం మద్రాసు సమావేశ పునః పరిశీలన కలకత్తాలో కాంగ్రెస్ పార్టీ చేయగా దానిపై ఆగ్రహంతో శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్యగారికి రాసిన వ్యక్తిగత లేఖను, వారు 'కాంగ్రెసు' పత్రికలో వ్యాసరూపంలో ప్రచురించారు.


అదే వారి అచ్చయిన మొదటి రచన. 1930లో ఒక్క తెలుగులో మాత్రమే ఇంటర్మీడియెట్ కృతార్థులుకాగా, 1942లో గుంటూరు ఏ.సి. కళాశాలలో ప్రైవేటుగా పరీక్ష రాసి కృతార్థులయ్యారు.


ఉద్యోగాన్వేషణ

మార్చు

ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనడానికి చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలురయ్యారు. మహోద్రేకంతో సాగుతున్న ఉప్పు సత్యాగ్రహంలో చేరిపోయారు. ప్రతి ఆదివారం డా॥ పట్టాభిగారి'జన్మభూమి' పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం వీరిపై తప్పుడు కేసు బనాయించి 7 మాసాలు కఠిన కారాగార శిక్ష విధించింది. 1930-32 ప్రాంతాల్లో పోలీసుల చర్యల మూలంగా తీవ్రవాదుల్లో చేరిపోయారు. 1932లో బందరు నోబుల్ కళాశాలలో బి.ఏ.లో చేరారు. వేసవి సెలవులలో “కృష్ణా పత్రిక” కు ఉపసంపాదకులుగా పనిచేశారు. అప్పుడప్పుడు “భారతి”కి వ్యాసాలు రాసి కొంత డబ్బు సంపాదించేవారు. 1933లో బి.ఏ. చదివే రోజుల్లో మొదటి గ్రంథం "స్వదేశీ సంస్థానాలు” ప్రకటించారు. స్వదేశీ సంస్థానాలలో ప్రజల కష్టసుఖాలు ఇందులో వివరించగా శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు “కృష్ణా పత్రిక”లో మెచ్చుకుంటూ సమీక్షిస్తూ సంపాదకీయం రాయటంతో ఈ గ్రంథానికి అనన్య ప్రచారమొచ్చింది. తమిళంలోకి అనువదించబడింది. అయితే నిజాం, మైసూరు, తిరువాన్కూరు ప్రభుత్వాలు బహిష్కరించాయి.


1934లో బి.ఏ. మొదటిసారి ఉత్తీర్ణులయ్యారు. బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఎం.ఏ. చెయ్యాలన్న బలమైన కోరికను సుకరం చేసుకోడానికి తన చెల్లెల బంగారు గాజులమ్మి “నేటి రష్యా" అనే గ్రంథాన్ని ప్రకటించారు. రష్యాను గురించి తెలుగులో వచ్చిన మొట్టమొదటి గ్రంథం. కాని ప్రకటించిన నెలలో ప్రభుత్వం దీనిని నిషేధించింది. 1935లో ఇంగ్లీషు జర్నలిజంలో చేరాలన్న కోరికతో మద్రాసు చేరారు. శ్రీరామకృష్ణ మొదిలియార్ సంపాదకత్వంలో గల “జెక్టస్” పత్రికలో చేరారు. పూర్వ రాజకీయ చరిత్ర వలన, విప్లవ వాదులలో గల సంబంధాలవల్ల నెలకే ఉద్యోగం పోయింది. సమదర్శిని, భారతి, ప్రజామిత్ర వంటి పత్రికల్లో ప్రకటించిన వ్యాసాల ద్వారా తామొక పత్రికా రచయితగా నిరూపించుకున్నారు. తర్వాత “స్వరాజ్య" అన్న ఇంగ్లీషు పత్రికలో చేరి విలేకరిగా, ప్రూఫు రీడర్‌గా, ఉపసంపాదకునిగా, రాత్రిపూట సంపాదకునిగా పనిచేసేవారు. చేరిన తొమ్మిది నెలల లోపల స్వరాజ్య మూత బడింది. 1936 సం॥ పిఠాపురం మహారాజా వారు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో నడపబడే “జనవాణి” పత్రికలో నార్లవారు న్యూస్ ఎడిటర్, శ్రీ తాపీ ధర్మారావు సంపాదకులు. అభిప్రాయ భేదాల కారణంగా రాజీనామాచేసి 'ప్రజామిత్ర' తెలుగువార పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. 1938 ఏప్రిల్ 24వ తేది సులోచనాదేవితో మద్రాస్ లో రిజిష్టర్ మ్యారేజి జరిగింది. అక్టోబర్ నెలలో హిట్లర్ చేసిన ఆస్ట్రియా దురాక్రమణను, అంతర్జాతీయ రాజకీయాలను తెలియజేస్తూ 'ఆస్ట్రియా ఆక్రమణ' పేరుతో రసవత్తర గ్రంథం వెలువరించారు. ఆగష్టు 1వ తేదీన ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా ప్రవేశించి 1942 మధ్యలో ప్రధాన సంపాదకులై 1959 వరకు ఆ పని నిర్వహించారు. 1939 జనవరిలో హిట్లర్ జెక్ దేశాన్ని రాజకీయ తంత్రాలతో ఎలా కూలదోసింది తెలుపుతూ 'జెక్ రాజ్య విచ్ఛేదం' అన్న పేరుతో ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో పాలస్తీనా ఆరబ్బులు, బ్రిటీషు ఇంపీరియలిజంతో సంఘర్షించిన విషయాలను 'పాలస్తీనా' గ్రంథంలో వివరించారు, 1943లో 'రష్యన్ కథలు' అన్న పేరుతో కథల అనువాదాన్ని చేశారు. 1944 అక్టోబర్ 19వ తేదీ ఆంధ్రుల శిల్ప సంపదపై ఆంధ్రప్రభలో రాసిన సంపాదకీయంవల్ల ప్రముఖుల్లో నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఘంటసాల మొదలగు ప్రాంతాల్లోని శిల్పాలను ఇతర ప్రాంతాలకు తరలించకూడదన్న ఆశయం ప్రబలింది.


1945లో కథలు, వ్యాసాలు, నిర్వచనాలు సంపాదకీయాలతో కూడుకున్న వివిధ విషయాలను సంకలనం చేసి 'కదంబం'గా రూపొందించారు. 1945 డిసెంబరు 30న మద్రాసు మహాజన సభహాలులో ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల సంఘం 5వ వార్షికోత్సవ సభాధ్యక్షులుగా నార్లవారు పత్రికారచయితల బాధ్యతలను గురించి ఉపన్యాసం చేశారు. 1946 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని కాదని గాంధీజీ శ్రీరాజగోపాలాచారిని ముఖ్యమంత్రి చెయ్యాలని సంకల్పిస్తే, నార్లవారు దానిని వ్యతిరేకించి ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేశారు. ప్రకాశంగారి ప్రభుత్వం పనితీరు పట్ల అసంతృప్తి చెందిన నార్ల వారు 'ప్రజా ప్రభుత్వం' అన్న శీర్షికతో రాసిన 5 సంపాదకీయాలతో ప్రభుత్వం పడిపోయింది. 1945లో తూర్పు కోస్తానిధికి, 1952లో రాయలసీమ క్షామనిధికి, 1953లో గోదావరి వరదబాధితులకు నిధులను వసూలు చేసి రామకృష్ణ మిషన్ ద్వారా పంపిణీ చేయించుటలో నార్లవారు ప్రధాన పాత్రను వహించారు. 1947లో రైతు జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి 'కొత్తగడ్డ' అనే పదహారు నాటికల సంపుటి ప్రకటించారు. 1949 సెప్టెంబర్ 6వ తేదీ బెజవాడలో అప్పటి ఆస్థానకవి శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి సన్మానం సందర్భంగా యేర్పాటైన పత్రికా ప్రదర్శనకు నార్లవారు ప్రారంభోత్సవం చేశారు. 1950 ఫిబ్రవరిలో మంచిర్యాలలో నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆరో వార్షిక సభకు ప్రారంభోత్సవం చేశారు. 1951 సెప్టెంబర్ లో 'కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు'కు అభ్యంతరం తెలుపుతూ 'నాగార్జున సాగర్' ప్రాజెక్టు ఆవశ్యకాన్ని వెల్లడించగా నందికొండ ప్రాజెక్టును 'నాగార్జున సాగర్'గా పేరు మార్చారు. 1953లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి, కమ్యూనిస్టుల ఘోరపరాజయానికి ఆంధ్రప్రభ ద్వారా నార్లవారు ఎంతో కృషి చేశారు. 1954లో ఒకసారి నార్లవారు యూరప్ యాత్ర చేశారు. మనదేశానికి కమ్యూనిస్టు వ్యవస్థ తగునా? తగదా? అన్న విషయంపై “ప్రగతి” అనే పుస్తకం రాశారు. 1956 డిసెంబర్ లో “వాస్తవమ్ము నార్ల వారిమాట” అన్న మకుటంతో గురజాడ వారిని అనుకరిస్తూ “నార్ల వారిమాట” అన్న పద్యాల సంపుటి వెలుగులోకి తెచ్చారు. 1957లో అప్పుడప్పుడు రాసిన యాభై అయిదు గేయాలను సంకలనం చేసి “జగన్నాటకం” అన్న కవితా సంపుటి ప్రకటించారు.


కొన్ని గేయాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదాలయ్యాయి. వీరి 'కొత్తగడ్డ' నాటికల సంపుటిని శ్రీ బాలశౌరిరెడ్డిగారు “నయా ధర్తీ” పేరుతో హిందీలోకి అనువదించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలుగా నిర్ణయింపబడ్డాయి. ఈ నాటికలు 1958లో ఒక పర్యాయం, 1964లో రెండో పర్యాయం రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1958లో పారిస్ లో జరిగిన పదో యునెస్కో మహాసభలకు మనదేశం పక్షాన డా॥ సర్వేపల్లివారి నాయకత్వంలో వెళ్ళిన ప్రతినిధి బృందంలో నార్లవారు సభ్యులు. 1959లో విజయవాడ దుర్గాకళామందిరంలో వీరి స్వర్ణోత్సవం జరిపారు. రాజమన్నార్ గారు “హాఫ్ వే' సన్మాన సంచికను బహుకరించారు. సమ్మెచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమంజస మైన కోర్కెలకు సానుభూతిగా 1959 మే 12వ తేదీన ఆంధ్రప్రభ నుంచి ఉద్యోగవిరమణ చేశారు.


1960లో నార్ల వారిని అభిమానిస్తున్న స్నేహితులు కలసి 'ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్సు'ను స్థాపించి జులై 1వ తేదీ 'ఆంధ్రజ్యోతి' దినపత్రికను విజయవాడలో నార్లవారి సంపాదకత్వాన వెలువరించారు. ఎన్నో కొత్త విషయాలను పత్రికాముఖంగా ప్రకటించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో నార్లవారి పాత్ర ప్రశంసనీయం. 1957 నుంచి చాలాకాలం కేంద్రసాహిత్య అకాడమీ సభ్యులుగా ఉన్నారు. ఒక్క ఆస్ట్రేలియా తప్ప మిగిలిన ఆధునిక నాగరికత విస్తరించిన దేశాలన్నీ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాతి వహించిన పత్రికా యజమానులను, సంపాదకులను, వారి సిబ్బందిని కలుసుకొని వారితో చర్చలు సాగించారు. డాక్టర్ రాధాకృష్ణన్ 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన భారత రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతిలో రాయించిన 5 వ్యాసాలను గ్రంథంగా ప్రచురించారు. దీన్ని ఒరియా భాషలోకి అనువదించారు.


భారతీయ సాహిత్య నిర్మాతలు (Makers of Indian Literature) అన్న శీర్షిక క్రింద ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడెమివారి ఆధ్వర్యంతో అంతర్జాతీయ భాషయైన ఆంగ్లంలో వీరేశలింగం, వేమన, గురజాడలపై నార్లవారిచే గ్రంథాలు ప్రచురించారు. ఇవి భారతీయ భాషలన్నిటిలోకి అనువదించబడ్డాయి. 1968 డిసెంబర్ లో ఆంధ్ర పార్లమెంటు సభ్యులు, అధికార, అనధికార ప్రముఖులు నార్లవారికి ఢిల్లీలోను, 1969 జనవరి 26వ తేదీ గుడివాడలోను షష్ట్యబ్ది పూర్తి సన్మానం చేశారు. అదేకాలంలో వేమనను గూర్చిన పాశ్చాత్యుల అభిప్రాయాలను (Vemana through Western eyes) అధిక వ్యయప్రయాసల కోర్చి పరిచయం చేయగా శ్రీ మరుపూరు కోదండరామిరెడ్డిగారు 'వేమన-పాశ్చాత్యులు' అను పేరుతో తెలుగులోకి అనువదించారు. వ్యాసాలు, చర్చా ప్రసంగాలు, రేడియో ప్రసంగాలతో కూడిన 'Traditional Indian culture and other essays' ముద్రించారు. 1971లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్నడ స్టడీస్, మైసూరా వారి గోష్టిలో Gandhiji in Indian Literature అన్న అంశంపై చేసిన ఉపన్యాసం ముద్రించి కన్నడంలోకి అనువదించారు. 1969 తెలంగాణా ఉద్యమంలో, 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్ర సమైక్యతకు పాటుపడ్డారు.


1973 సెప్టెంబర్ 29వ తేదీన గవర్నర్ ఖండుభాయిదేశాయి గారి నుంచి ఆంధ్రవిశ్వ విద్యాలయం ద్వారా “డాక్టర్ ఆఫ్ లెటర్సు" గౌరవబిరుదాన్ని స్వీకరించారు, 1975 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టంపొందారు. “వాస్తవమ్ము నార్లవారి మాట” అన్న మకుటం మార్చి "నవయుగాలబాట నార్లమాట” అన్న శీర్షికతో 1974లో కొన్ని పద్యాలు చేర్చి ప్రకటించారు. 'Ramamohun Roy - A.B.O. Centenary Tribute' అనే పరిశోధనా గ్రంథం, 1974 సం॥లోనే సాంప్రదాయ వ్యతిరేకమైన సనాతన వ్యాఖ్యతో, విపుల పీఠికతో “జాబాలి” అనే నాటికను ప్రచురించగా తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. మాటా మంతీ, పిచ్చా పాటీలను కలిపి “కొత్త పాత” పేరుతో కొన్ని వ్యాసాలు జోడించి, “కదంబం”ను పునర్ముద్రించారు. సాహిత్య అకాడమీ పక్షాన గురజాడవారి “కన్యాశుల్కము"ను 1975లో కుదింపు కూర్పును చేశారు.


1975 జులై 25న దేశంలో అత్యయిక పరిస్థితి ప్రకటించబడింది. 1976 మార్చిలో సంజయ్ గాంధి గుంటూరు రాకసందర్భంగా నార్లవారికి చెప్పకుండా ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక ప్రచురించారు. దీనికి నిరసనగా నార్ల రాజీనామా ఇచ్చారు. పత్రికాధిపతియైన శ్రీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ గారి కోరిక పై ఉపసంహరించుకొన్నారు. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ పత్రికలో రాయమని అధిపతులు కోరగా అందుకు సమ్మతించని నార్లవారు 1977 జనవరిలో రాజీనామా చేశారు.


1976 ఆగష్టులో 1944-77 మధ్యకాలంలో ఎన్నికచేసిన సంపాదకీయాలను “మూడు దశాబ్దాలు” పేరుతో ప్రకటించారు. 1978లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ఉపన్యాసాన్ని వారే "Poverty of Intellectualism in India" ప్రచురించారు. 1979లో విస్తృతపీఠికతో “సీతజోస్యం” ప్రకటించగా 1981లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందినది. మానవతావాదానికి పట్టంకట్టే "Gods, Goblins and Men" ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవం సందర్భంగా సోషియాలజీ విభాగం వారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఉపన్యాసము "Indian Culture and its Caste Complex" నాగార్జున విశ్వవిద్యాలయం ప్రథమోపాధ్యక్షులు ప్రొ॥ వి. బాలయ్య ధర్మోపన్యాసాల సందర్భంగా 1980లో డిసెంబర్ 4, 5 తేదీల్లో చేసిన ఉపన్యాసం "East and West : Myth of Dichotomy" నూతన వ్యాఖ్యానంతో కూడుకున్న వీరి “నరకంలో హరిశ్చంద్రుడు” వీరి ప్రముఖ గ్రంథాలు. హిరణ్యకశ్యపుని హత్య, పంచరాత్రం అనే నాటకాలు పీఠికలు రాయక ముద్రించలేదు. మా ఊరు, ఆషామాషి, సంస్కృతం - సంస్కృతి, స్కాండినేవియన్ కథలు వెలుగుచూడవలసిన గ్రంథాలు.


వీరి భార్య శ్రీమతి సులోచనాదేవి వీరి వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడే నార్లవారిని వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడిన ఆదర్శజీవి. ఈ దంపతులకు ముగ్గురు కుమాళ్ళు, ఐదుగురు కుమార్తెలు. ఇంట్లో పుట్టినవారు, ఇంటికి వచ్చినవారు (అంటే అల్లుళ్ళు కోడళ్ళు) అంతా డాక్టర్లు కావడం ప్రత్యేకం. పెద్దకూతురు డాక్టర్ కొల్లి శారద, అల్లుడు డాక్టర్ కొల్లి గంగాధరరావు తప్ప మిగతా అందరూ అమెరికాలో ఉండటం విశేషం.


బుద్ధుడన్నా, బౌద్ధమన్నా నార్లవారికి ఆదరాభిమానా లెక్కువ కాబట్టి వారి ఇంటికి 'లుంబిని' అని పేరు పెట్టారు. వీరికి పుస్తకాలు సేకరించడం ఒక హాబి. విదేశీ పర్యటనలో విలాసవస్తువులు కాక, మంచిగ్రంథాలు కొనేవారు. కొనడమే కాదు వాటిని అందంగా బైండింగ్ చేయించి. అమర్చిన తీరు వారి జ్ఞానతృష్ణకు నిదర్శనం. దాదాపు 20 వేల గ్రంథాలున్నాయి.


ఆంధ్రదేశంలోని సొంత గ్రంథాలయాల్లో పెద్ద గ్రంథాలయమే కాదు అత్యుత్తమ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో ఉత్తమ శిల్ప కళాఖండాలు అమర్చబడి ఉన్నాయి. Retreat అంటే తిరోగమనం, Encirclement అంటే దిగ్బంధనం, Refugee అంటే 'కాందిశీకుడు', U.N.O. అంటే 'ఐక్యరాజ్య సమితి' UNESCO అంటే 'ప్రపంచ విజ్ఞాన సమితి', Non alliened కు 'అలీన' అన్నవి నార్లవారి ఉత్తమ అనువాదాలు. ఇన్ని ఆంగ్ల పదాలను తెలుగులో అనువదించినా “సంపాదకుడు” అని కాకుండా “ఎడిటర్” అని రాయటం నార్లవారి ప్రత్యేకత.


ఇంతటి ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించి జాతికి సేవచేసి, నవమేధావి అనిపించుకున్న నార్ల 1985 ఫిబ్రవరి నెలలో మరణించారు. “చదువు సంధ్యలేల సంస్కృతి లేకున్న వ్రాత కోతలేల నీతిలేక తెలివి తేటలేల విలువలు లేనిచో నవయుగాల బాట నార్ల మాట.” - పి. కృష్ణమూర్తి, నార్ల సంస్మృతి నుండి


నార్లవారి శకంలో మైలు రాళ్లు

మార్చు

ఒక అడవిలో రెండు దారులు చీలిపోయాయి. నేను చాలా తక్కువ మంది నడచిన బాటను ఎంచుకున్నాను. అదే తేడా అంతటికీ కారణం అయింది. రాబర్ట్ ఫ్రాస్ట్


1928 కాకినాడ, పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంటరు విద్యాభ్యాసం. కాకినాడలో యువజన పత్రిక - లిఖిత పత్రికగా నిర్వహణ.

1929 మద్దూరి అన్నపూర్ణయ్యగారు నిర్వహించిన కాంగ్రెస్ పత్రికకు తొలి రచనలు. టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడం, జైలు జీవితం.

1931 భారతి, కృష్ణా పత్రికలో రచనలు.

1932 మచిలీపట్నం, నోబుల్ కళాశాలలో డిగ్రీ విద్యాభ్యాసం.

1933 స్వదేశ సంస్థానాలు - గ్రంథ రచన.

• కృష్ణా పత్రికలో కొంత కాలం రచనలు చేశారు.

• మేడే రోజున మచిలీపట్నం నుంచి గద్దె లింగయ్యగారు ప్రారంభించిన ‘ ప్రభ’ పత్రిక నిర్వహణ బాధ్యతలు.

1934 నేటి రష్యా గ్రంథ ప్రచురణ. ఈ గ్రంథాన్ని వెంటనే బ్యాన్ చేశారు.

1935 జూలై ఇంగ్లీషు జర్నలిజంలో చేరేందుకు చెన్నై పయనం.

• ప్రజాబంధు ఎడిటరు ఎస్.జి. ఆచార్యతో పరిచయం. స్వరాజ్య పత్రికలో రిపోర్టరుగా చేరిక.

• శ్రీ రామకృష్ణ ముదలియార్ నిర్వహించే జస్టిస్ పత్రికలో చేరిక.

• జ్యోతి పత్రిక సంపాదకత్వ బాధ్యతలు.

1935-38 ప్రజాబంధు, వినోదిని, జనవాణి, సమదర్శినిలో రచనలు

1935-39 తాపీ ధర్మారావుగారు నిర్వహించిన జనవాణిలో అసిస్టెంటు ఎడిటరుగా కొంతకాలం పనిచేశారు.

1937 ప్రజామిత్ర పత్రికలో కొంతకాలం పని.

1938 ఆగష్టు 1 ఆంధ్రప్రభ - దిన పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరిక.

1938 ఏప్రిల్ 2 చి.సౌ. సులోచనాదేవిగారితో మద్రాసులో రిజిష్టర్ వివాహం.

1939 జెక్ రాజ్య విచ్చేదం, పాలస్తీనా గ్రంథాల ప్రచురణ, ఆస్ట్రియా ఆక్రమణ ప్రచురణ

1942 ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ బాధ్యతలు.

1943 రష్యన్ కథలు (అనువాదం) ప్రచురణ

1944 అక్టోబర్ 19 ఆంధ్ర శిల్పసంపద పై రాసిన సంపాదకీయాల వల్ల నాగార్జున కొండ, జగయ్య పేటలో గల శిల్ప ప్రాధాన్యం అందరికీ తెలిసింది.

1945 కదంబం-కథలు, కొన్ని సంపాదకీయాల ప్రచురణ. - కోస్తా తుపాను నిధి సేకరణ.

1945 డిశంబర్ 30, ఆంధ్రరాష్ట్ర పత్రికా రచయితల సంఘ నవ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించారు.

• రాయలసీమ క్షామనిధి సేకరణ, ఆంధ్రప్రభ ద్వారా

1946 ఆంధ్రరాష్ట్ర పత్రికా రచయితల సంఘ అధ్యక్షులు

1947 కొత్తగడ్డ నాటికల సంపుటి ప్రచురణ

1947 ఫిబ్రవరి 12 ప్రకాశం ప్రభుత్వం పడిపోయే సమయంలో ప్రజాస్వామ్య విలువలు వివరిస్తూ ప్రజా ప్రభుత్వం పేరిట ఐదు సంపాదకీయాల రచన.

1949 సెప్టెంబరు 6 ఆస్థాన కవి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి సన్మాన సందర్భంగా ఏర్పాటైన పత్రికా ప్రదర్శనకు నార్ల ప్రారంభోత్సవం.

1950 మద్రాసు ప్రభుత్వము ఏర్పరచిన డ్రామా రివైవల్ కమిటీ సభ్యులు.

• నల్గొండ జిల్లా మంచిర్యాలలో ఏర్పాటైన నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆరవ వార్షిక సంఘ ప్రారంభోత్సవం.

1951 సెప్టెంబరు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ప్రాజెక్టు అవసర వివరణ.

• మాటమంతీ, పిచ్చాపాటీ - వ్యాస సంపుటాల ప్రచురణ. -

1952 ఆంధ్రప్రభ ద్వారా రాయలసీమ క్షామ నిధి వసూలు.

• ఆగష్టు 15 - ఆంధ్రప్రభ - వారపత్రిక సంపాదక బాధ్యత.

1953 ఆంధ్రప్రభ ద్వారా గోదావరి వరదబాధితుల నిధి వసూలు.

1954 యూరపు పర్యటన.

1955 కమ్యూనిస్టు వ్యవస్థ తగదని ప్రగతి పేరుతో 9 సంపాదకీయాల ప్రచురణ.

• సంస్కృతం సంస్కృతి - 15 సంపాదకీయాల పరంపర ప్రచురణ.

• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య గ్రంథాల విధాయక కమిటీ సభ్యులు.

1956 నార్లవారి మాట పద్య సంపుటి ప్రచురణ.

1957 జగన్నాటకం - గేయాల, గీతాల ప్రచురణ.

• సాహిత్య అకాడెమి, ఢిల్లీ సలహా కమిటీ సభ్యులు.

• ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులు.

1958 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రాజ్యసభకు సభ్యునిగా ఎన్నిక.

• యునెస్కో ప్రతినిధి వర్గంలో డాక్టర్ రాధాకృష్ణన్ నాయకత్వంలో పారిస్, యూరపు దేశాల పర్యటన.

• డిశంబరు 1 విజయవాడలో 51వ జన్మదినోత్సవ నిర్వహణ, Halfway అభినందన గ్రంథ ప్రచురణ.

• కేంద్ర పురావస్తు బోర్డు సభ్యులు

• ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ పునర్వవస్థీకరణ సంఘ అధ్యక్షుడు.

1959 మే 12 ఆంధ్రప్రభ - దిన పత్రిక నుంచి రాజీనామా.

1960 ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపన.

• జూలై 2 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటరు బాధ్యతలు.

• ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక కళా అకాడమీ సభ్యులు.

1963 రాష్ట్రపతి రాధాకృష్ణన్ అభినందన గ్రంథ సంపాదకత్వం.

1964 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రెండవసారి రాజ్య సభకు ఎన్నిక.

• ఢిల్లీలో జరిగిన షేక్ స్పియర్ సెమినార్ లో పాల్గొనడం

• విదేశీ పర్యటన.

1967 ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ బాధ్యత.

1968 హైదరాబాదులో 'లుంబిని' పేరుతో బంజారా హిల్స్ లో భవన నిర్మాణం.

• హైదరాబాదులో స్థిరపడడం.

1968 న్యూఢిల్లీ సాహిత్య అకాదెమీ చే (వీరేశలింగం) Veeresalingam మోనగ్రాఫ్ ప్రచురణ.

• డిశంబర్ 1 ఢిల్లీలో నార్ల షష్ట్యబ్ది పూర్తి ఉత్సవాల నిర్వహణ. ప్రత్యేక సంచిక ప్రచురణ.

• నార్లకు షష్టిపూర్తి సందర్భంలో ప్రదానం చేసిన గ్రంథం (1968). - న్యూఢిల్లీ సాహిత్య అకాడెమీచే

• Vemana - మోనగ్రాఫ్ ప్రచురణ - గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం నాటకం (కుదింపు) ప్రచురణ.

• Studies in the History of Telugu Journalism.Ed:KR Seshagiri Rao.Delhi :

• Narla Shastyabdipurti Celebration Committee

1969 Traditional Indian Culture and other Essays. విజయవాడ : విజయ బుక్స్ ప్రచురణ.

• జనవరి 20 కృష్ణా జిల్లా గుడివాడలో నార్ల షష్టిపూర్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ, Vemana

• Through Western Eyes.( పాశ్ఛాత్యుల దృష్టిలో వేమన) ప్రచురణ.

1970 బెంగళూర్ లో జరిగిన లెనిన్ శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడం.

1972 అఖిల భారత రాడికల్ హ్యూమనిస్టు సమావేశంలో ప్రారంభోపన్యాసం.

1973 డిశంబరు 29, ఆంధ్ర యూనివర్శిటీ నుంచి డి.లిట్ గౌరవ స్వీకారం.

1974 జాబాలి - ఏకాంకిక రూపకం, నవయుగాలబాట ప్రచురణ.

1975 అమెరికా, పశ్చిమ, తూర్పు యూరపు దేశాలు, దూర ప్రాచ్యదేశాలైన జపాన్, హాంగ్ కాంగ్, కంబోడియా,

• వియత్నం, ధాయ్ లాండ్, ఇండోనేషియా పర్యటన.

• శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డి.లిట్ గౌరవ స్వీకారం.

1976 మూడు దశాబ్దాలు - పేరుతో 1944-1974 మధ్య ఎంపిక చేసిన సంపాదకీయాల ప్రచురణ

1977 ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకత్వం నుంచి రాజీనామా. -

• Poverty of Intellectualism in India ప్రచురణ మైసూరు యూనివర్సిటీ ఉపన్యాసాలు.

1978 నార్ల 71వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో నిర్వహణ. ప్రత్యేక సంచిక ప్రచురణ.

1979 Gods, Goblins and Men ప్రచురణ.

• Indian Culture Its Caste Complexion ప్రచురణ.

• న్యూఢిల్లీ సాహిత్య అకాదెమిచే Gurazada మానగ్రాఫ్ ప్రచురణ.

• సీత జోస్యం ప్రచురణ.

1980 విదేశ పర్యటన.

1981 సీత జోస్యం గ్రంథానికి న్యూఢిల్లీ సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటన. నార్ల తిరస్కృతి.

1982 నరకంలో హరిశ్చంద్రుడు - నాటక ప్రచురణ.

  • East and West : Myth of Dichotomy నాగార్జున యూనివర్సిటీ ఉపన్యాసాలు గ్రంథ ప్రచురణ.

1983 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్కృతిక సలహాదారుగా నియామకం.

1984 పై పదవికి రాజీనామా

• Man, and His World ప్రచురణ.

1985 ఫిబ్రవరి 16 మరణం.


నార్లగారి తరువాత...

మార్చు

1986 హరిహరప్రియకు నార్ల రాసిన ఆంగ్ల లేఖల ప్రచురణ.

1988 కొల్లా శ్రీకృష్ణరావు సంపాదకత్వంలో నార్ల సంస్కృతి - సంస్మరణ సంచిక ప్రచురణ.

పురాణ వైరాగ్యం అసంపూర్తి నవల న్యూ హ్యూమనిస్టు పత్రికలో ప్రచురణ. పూరణ : పైడి చంద్రలత.

The Truth About the Gita ప్రచురణ.

1989 An Essay on the Upanishads ప్రచురణ.

1990 హిరణ్యకశిపుని హత్య, పంచరాత్రం (ద్రౌపది) నాటికల ప్రచురణ.

1996 నార్ల గ్రంథాలయాన్ని హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అప్పగింత. నార్ల ధర్మనిధి ఉపన్యాసాల ప్రారంభం.

Preservation for Women in Legislatures - VS Rama Devi.

1997 Corruption in Public Life and Parliamentary Democracy. GS Bhargava.

1998 3. Political parties and Indian Democracy, Dr Jaya Prakash Narayana.

1999 4. తెలుగు పత్రికలలో భాషా ప్రమాణాలు - డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు.

2000 5. Frightful problems in India - DrTH Choudary

2001 6. తెలుగు జర్నలిజం - పథ నిర్దేశకుడు నార్ల - సి. రాఘవాచారి.

2002 7. పత్రికా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్.

2003 8. తెలుగు పత్రికల ప్రభావం - ప్రాధాన్యతలు - ఐ వెంకటరావు

2004 నార్ల రచనలు. తెలుగులో 7 సంపుటాలు, ఇంగ్లీషులో 5 సంపుటాలు ప్రచురణ.


తెలుగు మాగాణంలో నార్లవారి మాటకు ఎంతో పలుకుబడి ఉంది. నార్లవారు బహుముఖ ప్రజ్ఞాశాలులు కావడం చేత, వారి పలుకుబడి కూడా అనేక రంగాలలోనే అనేక వీథులలో విహరించిన వాడాయన. ఆయన లేఖిని, అనేక శక్తులను రంగరించుకుని, ఆస్వాదించి జీర్ణించుకొని, మునుపదును పొందింది. ఆయన ప్రగతిశీలి, చారిత్రక దృష్టి అలవరచుకున్న వాడు. భావుకుడు, రసోద్వేగి. అన్యాయాన్ని సుతరామూ సహించలేని సాహసుడు. అన్నిటికీతోడు నార్లవారి ప్రతి అణువులోను రైతుతనం స్పందిస్తుంది, ప్రతిబింబిస్తుంది. ఈ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆయనలేఖిని తెలుగు సాహిత్యానికి ఎన్ని అలంకారాలనో సంతరించి పెట్టింది. క్రొత్త మార్గాలను ఆవిష్కరించింది. పాతపుంతలను నవీనంచేసింది. అన్నిటినీ మించి నార్లవారి మాటకు తెలుగు వచన రచన పై గల ప్రభావం చెప్పుకోదగ్గది; శాశ్వతమైనది.


నార్లవారు గేయాలు వ్రాశారు; పద్యాలూ వ్రాశారు. ఆ వ్రాయడం 'నార్లవారి మాట'గానే వ్రాశారు. వేమన్నను గుర్తుకు తెచ్చారు. రసాత్మకాలైన నాటికలుకూడా వ్రాశారు. 'కొత్తగడ్డ'ను ఏ సాహితీపరుడు మరువగలడు! అయితే ఆయన ప్రధానంగా వచన రచయిత. “నేటి రష్యా", "స్వదేశ సంస్థానాల"తో ప్రారంభమైన నార్లవారి వచన రచన, పత్రికాభిముఖంగా నూతన స్థాయిని సంతరించుకున్నది. అంతే కాదు. తెలుగు వచన రచనకే ఒక క్రొత్త తేజస్సును సంతరించి పెట్టింది.


పటుత్వంతో, పటిమతో వచన రచన చేసిన తెలుగు రచయితలు మహాశిల్పులు - చాలామంది వున్నారు. పానుగంటి, చిలకమర్తి, ఉన్నవ, చలం, గోపిచంద్ మొదలైన మహారచయితలు వచన రచనా శిల్పానికి క్రొత్త శోభలను కల్పించారు. అయితే నార్లవారు చిన్నయసూరి, వీరేశలింగం కోవకు చెందినవారు.


నవవాక్య నిర్మాణంలో ఈనాటి తెలుగు వచన రచనకు నాందీ ప్రస్తావన చేసినవాడు చిన్నయసూరి. నవ్య వచన రచనా రీతికి సృష్టికర్త చిన్నయసూరి. చిన్నయసూరి గ్రాంథిక శైలిలో వచనం వ్రాశాడు. “మిత్రలాభము”, “మిత్రభేదము" వరకే ఆయన వచన రచన పరిమితమైంది. ఈ వచన రచనను బహుళ ప్రచారానికి తెచ్చినవాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆదిలో తానుకూడా గ్రాంథిక శైలితోనే వచన రచన చేసినవాడు వీరేశలింగం. అయితే తాను సంస్కారోద్యమకర్త కావడంచేత, తన సందేశాన్ని ప్రజాసామాన్యానికి అందజేసి ఉద్యమ ప్రచారం చెయ్యవలసిన అవుసరం కలగడం చేత వీరేశలింగం ప్రధానంగా వచన రచన వ్యావహారిక భాషలోనే నడిపాడు. వ్యావహారిక భాషతో వచన రచన చెయ్యడాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినవాడు వీరేశలింగం; వ్యావహారిక భాషావాదానికి మూలవిరాట్టు గిడుగు రామమూర్తి పంతులు.


అయితే ప్రజాయుగం ప్రారంభమైన నాటినుండి పత్రికల అవుసరం, ప్రభావాన్ని వీరేశలింగం గుర్తించాడు. అందువల్లనే తన ఉద్యమ ప్రచారానికి వీరేశలింగం కొన్ని పత్రికలు నడిపాడు. కాని, పత్రికలు ప్రభావం స్వాతంత్రోద్యమంతోగాని పరాకాష్ఠను అందుకోలేదు. అందునా తెలుగునాట, తెలుగు పత్రికల పలుకుబడి, నార్లవారు పత్రికా రంగంలో ప్రవేశించిన పిమ్మటనే పెరిగింది. తెలుగు పత్రికా చరిత్రలో ఈ కాలాన్ని స్థూలంగా 'నార్లవారి శకం' అన్నా అతిశయోక్తి కాదు. ఈనాటి పత్రికా భాషను 'నార్లవారి మాట' 'నార్లవారి భాష' అన్నా అతిశయోక్తి కాదు. వార్తలను పాఠకుని బుద్ధికి సూటిగా అందించడానికి, నవభావాలను పాఠకుని హృదయానికి హత్తడానికి, నార్ల వారి భాష చక్కగా - అందుకే అది పుట్టుకువచ్చినట్టుగా సరిపోతుంది. ఆ భాషలో, నార్లవారి ఆ శైలిలో, సంతోషం, కోపం, విమర్శ, మెప్పు, హేతువాదం, అనుశాసనం తరంగ విన్యాసంతో తేలియాడుతూ పాఠకుని అందుకుంటయ్. అతన్ని అలరిస్తయ్. అలజడి కలిగిస్తయ్. ఆలోచనా నిమగ్నుణ్ణి చేస్తయ్. నార్లవారి పత్రికాభాష విశిష్టమయింది. వినూత్న మయింది. అది తెలుగు వచన రచనా రీతులమీద ఒక క్రొత్తపంథాను సృష్టించింది. చెరగని శాశ్వత ముద్రను వేసి తెలుగు వచన రచనకు ఒక శకారంభకులైనారు. తద్వారా నార్లవారి మాట అమోఘమైంది. - ఆవుల సాంబశివరావు, హంస మాస పత్రిక నుండి.


జగమెరిగిన జర్నలిస్టు : నార్ల

మార్చు

జర్నలిజం వృత్తిగా చేపట్టిన వాళ్ళకు ఆర్జవ అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాని కష్టాలకు కొదువ ఉండదు. శరీరం డస్పిపోయింది. అంతులేని మానసిక సంఘర్షణలను ఎదుర్కోవాల్సొస్తుంది. జీవితం సందిగ్ధంగా గడుస్తుంది. సంశయాలు కోకొల్లలు. అంతా అనిశ్చితమే. ఇది ఖాయం, అని చెప్పుకోడానికికేమీ కనపడదు. జర్నలిస్టు వ్యాసంగం చేపట్టిన తొలిదశలో నార్ల కూడా తనవంతు కష్టాలు, బాధలు, వ్యధలు అనుభవించక తప్పలేదు. సిఫార్సులు, అండగా నిలబడే వ్యక్తులు లేకుండానే ఆయన జర్నలిస్టయ్యారు. కేవలం తన కృషి, ప్రవర్తన నిజాయితీ, ఉదాత్తతలను ఆలంబనగా చేసుకుని జర్నలిజంలో మహోన్నత స్థానం అధిష్టించి, తెలులు భాషా ప్రపంచంలో అజరామరమైన కీర్తి నార్జించారు.


శ్రీ ప్రకాశంగారి ఆంగ్ల దినపత్రిక 'స్వరాజ్య' విలేకరిగా చేరినప్పుడు, శ్రీ నార్లతో నాకు పరిచయమైంది. ఆ రోజుల్లోనే తన విధి నిర్వహణలో ఆయన ప్రదర్శించిన సౌలభ్య వైఖరి ఒక విశిష్ట చిహ్నంగా నాకు గోచరించింది. ఎంత కష్టమైన పనినైనా, అతి తేలికగా చేయగల నేర్పు శ్రీ నార్లకుంది. ఆ పిమ్మట శ్రీ రామ్ నాధ్ గోయెంకా ఆంధ్రప్రభను స్థాపించినప్పుడు, పత్రికకు సంపాదక వర్గ సిబ్బందిని మొదటగా ఎంపికచేసే బాధ్యత నామీద పడింది. త్వరలోనే త సహోద్యోగులందరికంటే తానేమిన్న అని రుజువుచేసి, వారందరికీ నార్ల నాయకుడయ్యారు. విలేకరిగా ఆయన గడించిన అనుభవం ఆ కాలంలో ఎన్నో విధాల తోడ్పడింది. వార్తా ప్రచురణలో సామాన్యంగా ఉండే ఆంక్షలు, నిబంధనలు కొంత అసహజత్వాన్ని కృత్రిమ ధోరణులను సృష్టిస్తాయి. వాటికి దూరంగా ఉండి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రవీలిస్తూ, వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ తన సంపాదకీయాల ద్వారాను, సిసలైన వార్తల ప్రచురణలోను ప్రజా సమస్యలకు దర్పణంగా నిలిచారు. నార్లలో ఉన్న రెండు విశిష్ఠ లక్షణాలు ఆయన ఔన్నత్యాన్ని అనుమడించాయని చెప్పాలి. ఒకటి ఆయన మేధాశక్తి, రుజువర్తన. రెండు - శ్రామికుడుగా అన్ని విషయాలలో ఆయన చూపిన కార్యదీక్ష, బాధ్యతల నిర్వహణ. పని విషయంలో నార్ల విరామ మెరుగని రాక్షసుడు అలా ఎందుకనాల్సొస్తున్నదంటే, శ్రమలో ఉన్న ఆనందం, సంతృప్తిలను క్షుణ్నంగా తెలుసుకున్న వ్యక్తి నార్ల. జీవితంలోని గొప్ప రహస్యమదేనని ఆయన గ్రహించారు. కష్టించి పనిచేసి తన వృత్తి మీద గౌరవం, గర్వం పెంచుకోగలిగారు.


తన విద్యుక్తధర్మ నిర్వహణ నుంచి దృష్టిని మళ్ళించే ఒత్తిడులను, ఆకర్షణలను ఆయన తన దరికి రానీయలేదు. తన వృత్తి ధర్మాన్ని మరువకుండా, నిర్విరామకృషితో ఆంధ్రప్రదేశ్ లో వాడవాడలా అన్ని వర్గాల ప్రజల ఆదరణను, అనురాగాన్ని ఆయన చూరగొన్నారు. విజయవాడలో నార్లకు జ రిగిన సన్మానం ప్రజలకు ఆయన మీదున్న అభిమానానికి ప్రజల నిదర్శనం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిమితమైన జర్నలిజం వృత్తిలో, లక్ష్యాన్ని విస్మరించని సాధకుడు ఎంతటి ఉన్నత కీర్తి శిఖరాలనధిరోహించగలడో రుజువు చేసిన నార్లకు, విజయవాడ సన్మానం ప్రజలు వ్యక్తం చేసిన అపూర్వ ప్రశంస. - ఖాసా సుబ్బారావు, ఈనాడు, - 1986


నార్లవారి సులోచన

మార్చు

నార్లవారి సులోచన అంటే ఆయన రాసిన నవలకాదు, నాటకంకాదు, కథకాదు. కావ్యం కాదు. మరి ఈ సులోచన ఎవరు? “బిహైండ్ ఎవ్వెరి గ్రేట్ మాన్ దేరీజ్ ఎ వుమన్” అన్న ఆంగ్లసూక్తికి ఈమె ఒక ఉదాహరణ. ప్రఖ్యాత తత్వవేత్త మార్క్స్ కు వారి సతీమణి జెన్నీలాగే నార్లకు వారి సతీమణి సులోచన జీవితంలో కష్టసుఖాలు పంచుతున్న సహచరి. నార్లవారి వివాహం 1938లో జరిగింది. ఆయనకు తోడు నీడగా వచ్చారు సులోచనగారు. ఆమె అంతగా పెద్ద చదువులకు నోచుకోని మధ్యతరగతి రైతు కుంటుంబంలో పుట్టిన మహిళ. వివాహం అయిన కొద్ది రోజులకే ఆమె భర్తతో కాపురానికి చెన్నై చేరుకుంది. ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా ఉండేవారు. జీతం సుమారు 25 రూపాయలు. ఈనాటి విలువతో పోలిస్తే అది సరైన జీతమే కాదు. ఆనాటి విలువతో పోల్చుకున్న అది గొప్ప రాబడి కిందకు రాదు. ఆ రోజుల్లో దేశం పరాయిపాలన కింద ఉంది. కరువు కాటకాల వల్ల ఏర్పడిన ఒడిదుడుకులతోపాటు స్వాతంత్ర్య పోరాటం వల్ల ఎదురైన ఇబ్బందులు కూడా సామాన్య కుటుంబాలకు ఆర్థికంగా సమస్యలు సృష్టిస్తూ వుండేవి. అయినా గృహ నిర్వహణలో చాకచక్యంతో వ్యవహరించి కుటుంబ సమస్యల మూలంగా నార్లవారి రచన సర్వం కుంటుపడకుండా చూసేవారు సులోచన.


పాత్రికేయులుగా, సుప్రసిద్ధ సంపాదకులుగా మాత్రమే చాలామందికి నార్ల తెలుసు. కానీ, వారితో వున్న సాన్నిహిత్యాన్ని బట్టి వారి ఇంటి కెదురుగానే మేము చాలా రోజులుగా ఉంటూ ఉండడం వల్ల ఏర్పడిన సాహచర్యాన్నిబట్టి గృహస్తుగా, ఇంటి పెద్దగా నార్ల గురించి నాకు తెలుసు. నార్ల వెనుక వున్న ధార్మిక శక్తిగా ఆయన సహధర్మచారిణిగా సులోచనగారి గురించి నాకు తెలుసు. మొదటిసారి నార్లను నా విద్యార్థి దశలో చూశాను. అప్పుడు ఆయన ఒంగోలులో జరిగే పశువుల సంత చూడడానికి వచ్చారు. అప్పటికే పత్రికారంగంలో వారు లబ్ధ ప్రతిష్ఠులు. కండువాను వల్లెవాటుగా వేసుకుని, చేతిలో సిగరెట్ డబ్బాతో ముఖ్య అతిథుల మధ్య ఠీవిగా, నిటారుగా నడిచిపోతున్నవారి మూర్తి నేటికీ నా మనఃఫలకం మీద నిలిచివుంది. అలాగే పత్రికా రచయితగా వారి ప్రభావం కూడా నా మీద చాలా వుంది. అప్పటివారి సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతర రచనలు, అందులోని వారి శైలి, భాష, సరికొత్త పదాల సృష్టి, రాజకీయ చమత్కారాలు - వీటన్నిటికి ఎందరో నాటి తెలుగు యువకులలో నేనూ ప్రభావితుడ్నయ్యాను. ఇంటర్ చదివేటప్పుడు 1944-46లో తెలుగు వ్యాసరచన పోటీలలో నార్ల వారి శైలిలో వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. మా తెలుగు లెక్చరర్ ధరణికోట వెంకటసుబ్బయ్య నా వ్యాసానికి పదికి ఆరు మార్కులు ఇచ్చి “ఎవాయిడ్ న్యూస్ పేపర్ స్టయిల్” అని మార్జిన్లో రిమార్క్ రాశారు. నార్లవారి భాషా ప్రభావం నామీద అంతగా ఉండేది.


కొన్నాళ్ళకు నేను ఒంగోలు జిల్లా కలెక్టరుగా ఉంటున్నప్పుడు ప్రకాశం దినోత్సవాలకు ఒంగోలు జిల్లా ప్రముఖులు నీలంరాజు వెంకట శేషయ్య, రాయప్రోలు సుబ్బారావు, నటీమణి భానుమతి, శాస్త్రవేత్త గంగాప్రసాద్ ను పిలుస్తూ నార్లవారిని కూడా ఆహ్వానించాను. అనారోగ్య కారణాల వల్ల ఆయన సభకు రాలేదు. తరువాత ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వచ్చాను. బంజారా హిల్స్ లో వారి 'లుంబిని'కి ఎదురుగా నివాసం ఉండంచేత 1973 నుంచి మా పరిచయం బాగా అభివృద్ధి చెందింది. వారిని పలకరించడానికి, పుస్తకాలు తీసుకోవడానికి తరచుగా వారింటికి వెళుతూ ఉండడంవల్ల వారికోసం వచ్చే ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ నాయకులు, సారస్వత ప్రియులు మొదలైనవారితో వారు జరిపే చర్చలు నేనూ వింటుండే అవకాశం కలిగింది. ఆయా సందర్భాలలో నార్లవారి సంభాషణ, వ్యాఖ్యలు, ఛలోక్తులు, గతకాలపు విశేషాలు వినే వీలు కలిగింది. వారి సీతజోస్యం' రచనకు అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా మా ఇంట్లో ఉడతాభక్తిగా వారికి సన్మానం చేశాం. సన్మానాలంటే ఇష్టం లేకపోయినా నా మీద ఉండే వాత్సల్యం కొద్దీ అంగీకరించారు. ఆ సభకు జస్టిస్ గంగాధరరావు, మాధవరెడ్డి, పున్నయ్య, బోయి భీమన్న, గజ్జల మల్లారెడ్డి సి.నరసింహం మొదలైనవారు వచ్చారు. నార్లవారి సతీమణిని కూడా భర్త పక్కనే కూర్చోబెట్టి సన్మానించాము.


ఉద్యోగపు తొలి దినాల్లో నార్లవారి ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉండేది. ప్రకాశం పంతులుగారి పత్రికలో పనిచేసిన రోజులలో ఒకసారి జీతం బకాయి వసూలుకు పంతులుగారి ఇంటికి వెళ్ళారట. పంతులుగారుకూడా ఆ రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు. ఏమైనాసరే కాస్తో, కూస్తో ఇవ్వందే పోలేనని పట్టుబట్టారు. నార్లగారి వాలకం చూసి పంతులుగారు ‘కొడావట్రా' అంటూ 'పది రూపాయలు' విసిరారు. తనకు కావలసింది ఆ పదే. అది తీసుకుని చక్కా వచ్చేశారట. ఆ రోజుల్లో పది రూపాయలు ఉంటే నెల గడిచేది.


నాటి గడ్డు రోజులు గతించాయి. క్రమక్రమంగా నార్లవారి పేరుతో పాటు, జీతం ఆస్తిపాస్తులు కూడా సంతృప్తికరంగా అభివృద్ధి చెందాయి. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలతో కుటుంబం పెద్దదయింది. కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు వారి చదువులు నొప్పుళ్ళూ, పురుళ్ళు, పుణ్యాలు కుటుంబంలో బాదరబందీ కూడా పెరిగింది. ఈ గృహకార్యాలలో నార్లవారి తల నలిగిపోకుండా పాత్రికేయ వృత్తికి భంగం కలుగకుండా సజావుగా సాగిందంటే సులోచనగారు నార్లగారికిచ్చిన అమోఘమైన సహకారం ఫలితమేనని ఆనాటి ఇల్లాలు కూరలు తెమ్మని తరుముతుంటే కూతురుకు కట్నాలు తెమ్మని సణుగుతుంటే ఏ మగాడైనా మరేమి ఆలోచించగలడు? సులోచనగారు ఆయనకు ఇబ్బంది కలిగించకుండా సంసార భారమంతా ఎక్కువగా తామే మోస్తారు. ఇటీవలి కాలంలోనే ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు కుమార్తెలు పెళ్ళిళ్ళు జరిపించారు. ఆ తల్లి కృషి వలనే పిల్లలందరు ఉన్నత విద్యలు అభ్యసించి ఎంతో వృద్ధిలోకి వచ్చారు.


గృహకార్యాలు నిర్వర్తించడమే కాక సులోచనగారు మరో ముఖ్యమైన నిర్వహించేవారు. నార్ల బహుముఖ ప్రజ్ఞ వున్న మనిషి. ఆయన కోసం పండితులు, కవులు, మర్శకులు, రచయితలు, శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు ఇలా (కొన్ని పంక్తులు అదృశ్యం).


సంస్కారం, పాండిత్యం వున్న మహామహులు ఇంటికివస్తే వాళ్ళతో సభ్యతగా మాట్లాడి తగు రీతిలో మర్యాదుచేసే నైపుణ్యం సులోచనగారికి స్వతహాగా ఉంది. ఒకోసారి విదేశీయులు కూడా వారింటికి వచ్చేవారు. సులోచనగారు వారిని కూడా సొంత కుటుంబ సభ్యులవలె ఆదరించేవారు. ఇంటి బాధ్యతలేకాక, భర్త సాంఘిక జీవితంలో కూడా ఎంతో విలువైన పాత్ర నిర్వహించిన సులోచనగారికి 1961 నుంచి మరో కొత్త బాధ్యత మీదపడింది. అప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది. దానికితోడు కంటి చూపు తగ్గడం, కొంచెం చెవుడు వంటి రుగ్మతలు ప్రవేశించాయి. లోకాన్ని రోజూ చదివి, విని జీర్ణం చేసుకునే సంపాదక లక్షణం ఉన్న నార్లవారికి ఇది అశనిపాతం. అప్పుడు వారి ధర్మపత్ని సులోచనగారు నార్లగారికి కళ్ళూ, చెవులు తానే అయి కొత్త శక్తినిచ్చారు. కన్ను, కాలు స్వాధీనంలో లేని చరమదశలో వారు భగవద్గీత మీద పరిశోధనాపత్రం రాయబూనుకున్నారంటే అది ఎవరి అండ చూసుకుని? ఆయనకు ఘోస్ట్ రైటర్ లేడే? కనీసం లిటరరీ సెక్రటరీ కూడా లేడే? అలాంటిది ఈ వయస్సులో దాదాపు వందదాకా ఉన్న వివిధ భగవద్గీత వ్యాఖ్యాన గ్రంథాలను పరిశీలించి శోధించే ధైర్యం వారికి సులోచనగారి వల్లే కలిగిందని నిర్ద్వంద్వంగా చెప్పవలసి వుంది.


ముదిమి మీదపడి గొంతులోంచి మాట కూడా పైకిరాని దశలో సైతం వారికున్న జ్ఞాపక శక్తి అపారం. సులోచనా, ఫలానా పుస్తకం ఫలానా అలమారాలో ఫలానా చోట ఉంటుంది పట్టుకురా అనగానే ఆ ఇల్లాలు స్వయంగా తెచ్చి క్షణాల్లో అందించేది. పుస్తకాన్ని తెచ్చివ్వడం ఒక ఎత్తయితే, మళ్ళీ యధాస్థానంలో ఉంచడం మరో ఎత్తు. నార్లవారి గ్రంథాలయం పుస్తకాల సంఖ్య తెలిసిన వారికి ఈ విషయం అర్థమౌతుంది. రేడియోలో వార్తలు విని ఆయన చెవిలో “ఇందిరా గాంధీని చంపేశారట, రామ్ లాల్ రాజీనామా చేశాడట”, అంటూ వినిపించేది. కొన్ని కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలువున్న నార్లవారు రాజకీయ నాయకులమీద, ప్రముఖుల మీద కత్తులూ, కలాలు నూరు తుంటే “ఇప్పుడెందుకు లెండి, ఆరోగ్యం చూసుకోండి” అని సుతారంగా ఆయన్ని అనవసర వివాదాల నుంచి మళ్ళించేది. నార్ల వారికి పురావస్తు సంపద అన్నా, ఆంధ్రుల శిల్పాలు అన్నా గౌరవం ఎక్కువ. ఇంట్లో పుస్తకాలకెంత ప్రాధాన్యం ఇచ్చారో, కళాఖండాలకూ అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇంట్లోని ఈ కళాఖండాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ కనుపాపల్లా చూసుకొనే బాధ్యత కూడా నార్లవారి సులోచనదే.


ఈ పనులన్నీ ఒక ఎత్తయితే, వృద్ధాప్యంలో వేళకు అన్నపానాలు, మందులు మాకులూ సక్రమంగా అందిస్తూ భర్తను పసిపాపగా సాకే ఆమె గొప్పతనం ఒక ఎత్తు, చివరి క్షణం వరకు భర్తకు తోడునీడగా ఉండి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి... అన్నట్టు వ్యవహరించిన ఆ ఇల్లాల్ని ఆధునిక గృహిణులకు ఆదర్శమూర్తిగా భావించవచ్చు. - కె. చంద్రయ్య, ఉదయం దిన పత్రిక, 17-2-1986