బమ్మెఱ పోతన చరిత్రము

బమ్మెర పోతన చరిత్రము

రచన:- మద్దూరి శ్రీరామమూర్తికవి –1944

ఆర్కైవ్.కాం వారి సౌజన్యంతో

బమ్మెరపోతరాజు కవి

హిందూజనంబులకెల్ల పవిత్రగ్రంథములు మూడు. (1) శ్రీమద్రామాయణము (2) భాగవతము (3) భారతము. ఈ మూడు గ్రంథములును సమగ్రముగా నొక్కకవివర్యునిచే రచింపబడియుండలేదు. రామాయణము, భాగవతము, ఈరెండును దొలుత నొక్కరిచే రచింపబడినను కాలక్రమమున నందలిభాగములు నశింపగా నితరులు వానిని పూరించిరి. కాని భారతము సమగ్రముగా నొక్కనిచే రచింపబడి యుండలేదు.

1. భాస్కరరామాయణము: ఇద్దానిని దొలుత భాస్కరుడు రచించెను.

బాలకాండము:— భాస్కరామాత్యపుత్ర మల్లిఖార్జున భట్ట ప్రణీతము

అయోధ్యకాండము:— నిశ్శంక వీరమారయకుమారి రుద్రదేవ ప్రణీతము.

అరణ్యకాండము:— భాస్కరప్రణీతము.

కిష్కింధాకాండము:— మల్లిఖార్జునభట్ట ప్రణీతము.

సుందరకాండము :— మల్లిఖార్జునభట్ట ప్రణీతము.

యుద్ధకాండము:— అయ్యలార్యప్రణీతము.

2. భాగవతము భాగవతమును సమగ్రముగా నాంధ్రమున రచించిన వాఁడు బమ్మెరపోతనామాత్యుఁడు. ఈతఁడు రచించిన గ్రంథములోని భాగములు నశింపగా నీతని శిష్యులగు సింగరాజు, వెలిగందల నారాయణ మున్నగువార లా నశించినభాగములను రచించియుండిరి.

ఉ.
మానినిలీడుగారుబహు । మానని వారితదీనమానస

గ్లానికి దానధర్మమతి । గౌరవమంజులతాగభీరతా
స్థానికి ముగ్దసానికి । సదాశివపాదయుగార్చనానుకం
పానయవాగ్భవానికిని । బమ్మెరకేసయ లక్కసానికిన్.

క.
ఆమానినికిం బుట్టితి
మేమిరువురమగ్రజాతుఁ । డీశ్వరుసేవా
కాముఁడు తిప్పన పోతన
నామవ్యక్తుం డసాధు । నయయుక్తుండన్.

ఈతడు భాగవతగద్యయం దిట్లు వ్రాసియున్నాడు.

గ.
ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలితకవితావిచిత్రకేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైస,

ఇట్లు వ్రాయుటచేత నీతఁడు స్వయంకృషి చేతనే విద్యాధనమును సంపాదించియున్నాఁడని మనము తలంపవలసివచ్చుచున్నది. మఱియు పరమేశ్వరకరుణాకలితుండనికూడ చెప్పుకొనియున్నాఁడు. కాని వీరభద్ర విజయములోని గద్యయు భాగవతగద్యవలెనుండక వేరువిధముగా నుండుట గమనించవలసియున్నది.

వీరభద్రవిజయములోని గద్యము: 

ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్యదివ్యప్రసాద పాదపద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయప్రణీతంబయిన వీరభద్రవిజయంబు.

ఇట్లు భిన్నముగా ఆశ్వాసాంతగద్యముండుటకు కారణమగపడదు. తొల్లిటిపుస్తకమునకు భాగవతమును రచించునెడల గల సహజ పాండిత్యబిరుదము వీరభద్రవిజయములోని గద్యంలో లేకుండుట ఆలోచన కవకాశ మిచ్చుచున్నది. మఱియు వీరభద్రవిజయములో గల యివటూరి సోమనారాధ్య ప్రశంస భాగవతమునందెచ్చటను గానరాదు. ఈ కారణములవలన వీరభద్రవిజయమితని కృతియగునా కాదా యని సందేహింపవలసి వచ్చుచున్నది.

వీరభద్రవిజయములో భాగవతమునందలి శయ్యాసౌభాగ్యములంతగా కానరావు. పోతనభాగవతమునం దెచ్చటజూచినను విచ్చలవిడిగా ప్రయోగించిన అంత్యప్రాసముగల యలంకారము గానరాదు. మఱియు భాగవతమునందు లేనట్టి దోషములు పెక్కులుగా వీరభద్రవిజయమునంగలవు. ఇందువలన నీతఁడు వీరభద్రవిజయమును భాగవతమునకంటె ముందుగా రచించియుండునని యనుకొనవలసి యున్నది. కాని భాగవతమును రచించుటలో శివదూషణచేయుటచే నతనికి నేత్రావరోధము కలిగినట్టును అందులకై యాతఁడు బంధుజన ప్రేరితుడై వీరభద్రవిజయము రచింపసమకట్టెనని అనుశృతముగా వచ్చుకథలవలన తెలియవచ్చుచున్నది. ఇందుకనుగుణ్యముగా వీరభద్రవిజయములో,

ఉ.
భాగవతప్రబంధమతి । భాసురతన్ రచియించి దక్షదు
ర్యాగ కథాప్రసంగమున । నల్పవచస్కుడనైతి దన్నిమి
త్తాగతవక్త్రదోషపరి । హారముకై యజనైకశైవశా
స్తాగమ వీరభద్రవిజ. । యంబు రచించెద వేడ్కనామదిన్.

భాగవతమునందు పోతన గావించిన శివదూషణ, శివభక్తాగ్రేసర దూషణ మొదలైనవి.

సీ.
అనయంబులు ప్తక్రి । యాకలాపుడుమాన

హీనుడు మర్యాద । లేనివాడు

మత్తప్రచారుడు । న్మత్తప్రియుడు దిగం

బరుడు భూతప్రేత । పరివృతుండు

దామసప్రమథ భూ । తములకు నాథుండు

భూతిలిప్తుండస్థి. । భూషణుండు

నష్టశౌచుండు ను । న్మదనాధుడును దుష్ట

హృదయుడుగ్రుడును బ । రేతభూని

కేతనుడు వితతవిస్రస్త । కేశుడశుచి
యయినయితనికి శివనాము । డను ప్రవాద
మెటులగలిగె నశివుడగు ని । తనికి నెఱిగి
యెఱిగి వేదంబు శూద్రున । కిచ్చినటుల.

తే.
వసుధనెవ్వారు ధూర్జటి । వ్రతులు వారు
వారి కనుకూలురగుదురె । వ్వారు వారు
నట్టిసచ్ఛాస్త్ర పరిపంథు । లైనవారు
నవనిపాషండులయ్యెద । రని శపించె.

ఇది యిట్లుండగా భోగినీదండకము యొక్క అంత్యమునందీ క్రింది పద్యము కానవచ్చుచున్నది.

ఉ.
పండితభర్తనీయుడగు । బమ్మెరపోతన యాసుధాంశు మా
ర్తాండ కులాచలాంబునిధి । తారకమై విలసిల్లభోగినీ
దండకమున్ రచించె బహు । దాన విహర్తకురావుసింగ భూ
మండలభర్తకున్ విమత । మానవనాధమదాపహర్తకున్.

పోతన జననకాల నిర్ణయము.
ఈతఁడు భాగవతమును రచించినపిమ్మట రచించిన భోగినీదండకమును సర్వజ్ఞసింగమనాయున కంకితము గావించియుండెను. సర్వజ్ఞ సింగమనాయుఁడు 15 వ శతాబ్దముయొక్క మొదటనుండినవాడగుటచే నీతడును ఆ కాలముననే యుండెనని తలంపవలసి వచ్చుచున్నది. మఱియు వీరభద్రవిజయమున బేర్కొన్న యివటూరి సోమనారాధ్యులవారుగూడ ప్రౌఢరాయులకాలములో నుండియుండుటచే నీతఁడు గూడ ప్రౌఢదేవరాయుల కాలములోనివాడని తలంపవలసివచ్చుచున్నది. శ్రీనాథునకును యీతనికి బాంధవ్యమున్నటులను శ్రుతముగావచ్చు కథలవలన తెలియుచున్నది. కావున శ్రీనాధునకీతఁడు సమకాలీనుఁడని చెప్పవలయును. పదునాల్గవ శతాబ్దముయొక్క అంత్యమున నీతడు జనించి యించమించుగా పదునేనవ శతాబ్దముయొక్క మధ్యవరకును జీవించియుండెననుట సత్యమునకు సమీపముగా వచ్చును.

పోతన నికేతనము. ఈతఁడు తననివాస మేకశిలానగరమని భాగవతమున నిట్లు జెప్పి యున్నాడు.

వ.

ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాతపాదపసమాశ్రయంబునను హరి కరుణావిశేషంబునను గృతార్థంబు సిద్ధించెనని బుద్ధినెఱింగి లేచి మరలికొన్నిదినంబులకు నేకశిలానగరంబునకు జనుదెంచి యందు కురువృద్ధబంధుజనానుజ్ఞాతుండనై,

ఏకశిలానగర మిప్పుడెక్కడను గానరాదు. ఏకశిలయన నొంటిమిట్టుమని కొందరును, ఓరుగల్లు అని కొందరును యర్ధములను దీసి తమతమవాదములను స్థిరపరచుకొన దీర్ఘములగు నుపన్యాసములనిచ్చి యున్నారు. ఆవిషయములను గూర్చి చర్చించుటకిందు తావు చాలమిని విడువవలసి వచ్చినది.

పోతనామాత్యుని వాక్సుద్ధి.
పోతనామాత్యుడు పల్కినయెల్ల నిక్కమగుచుండుననుట జనశ్రుతముగానున్నది. అందులకీ క్రిందికధ యుదాహరణములని వచింతురు.

శ్రీకృష్ణుండు మహానుభావుండు గావున బ్రాహ్మణకుమారుండు మృతిజెంది దుఃఖించుచుండగా నక్కుమారుని సజీవితుం జేసెనని వ్రాయుచుండగా పోతన కుమారులలో నొక్కడు మరణించుటయు మరల జీవించుటయు గల్గెను.

రుక్మిణీకల్యాణమున రుక్మిణీదేవిని వర్ణించుచు నీ క్రిందిపద్యమును రచించునెడ.

సీ.
దేవకీసుతుకోర్కె । తివలు వీడంగ

వెలదికి మైదీవ । వీడదొడగెఁ

గమలనాభుని చిత్త । కమలంబు వికసింపఁ

గాంతినింతికి ముఖ । కమలమొప్పె

మధువిరోధికి లోన । మదనాగ్ని పొడసూపఁ

బొలతికి కనుదోయి । బొడవు సూపె

శౌరికి ధైర్యంబు । సన్నమై డాయంగ

జలజాక్షి మధ్యంబు । సన్నమయ్యె

హరికి బ్రేమబంధ । మధికంబుగాఁ గేశ
బంధ మధికమగుచు । బాలకమరె

యని వ్రాయునంత కుయ్యలతొట్టిం బరుండి నిద్రించుచున్న యాతని బాలిక దొర్లి క్రిందనున్న కుంపటిలోబడి కమరివాసన వేయనారంభించెను. అంతట పోతన్న
పద్మనయనువలన । బ్రమదంబు నిండారె
నెలత యౌవనంబు । నిండియుండె
యని పద్యమును పూర్తిగావించునప్పటికి యా బాలిక కుంపటినుండి లేచి సుఖముగా నుండెను.

ఇట్టి విషయములనేకముల నుదహరింపవచ్చును గాని యివి సత్యమునకు దూరమైయుండునని యీ కాలముననతలంపకపోరు. ఇవి యాతనియందుగల గౌరవము చేతను, యాతనికూలంకష ప్రజ్ఞ చాటుటకును కల్పితములై యుండును.

పోతనకు సరస్వతీదేవి ప్రత్యక్షమగుట.
పోతన భాగవతమును రచించుచుండగా నొక్కనాడు శ్రీ నాధుడరుదెంచి హాలికులకు గుశలమాయని పరియాచకమునకై పల్కెను. అంత పోతరాజు.

ఉ.
బాలరసాలసాల నవ । పల్లవకోమల కావ్యకన్యకన్
కూళలకిచ్చి యప్పడుపుఁ।గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహ । నాంతర సీమలకందమూలకౌ
ద్దాలికులైననేమి నిజ । దారసుతోదరపోషణార్థమై.

అని యుత్తరు వొసంగెను. శ్రీనాథుఁ డంతసిగ్గుపడి “బావా ! పరిహాసమున కట్లంటిని. ఇంతలోననే కోపింపవలయునా!” అని కొంతతడ విష్టాగోష్ఠియందు గడపెను.

నాటినుండి నాలుగైదు దినంబులు శ్రీనాథుండు పోతనతో “బావా! పాపమో పుణ్యమో! యెవ్వరుచూచినారు. ఈకుటుంబమును పోషించుకొనిన పిమ్మటగదా పరము సంగతి యాలోచించుకొనవలయును. దారిద్ర్యముకంటె నీచమేమియును లేదుగదాయని బలుకుచు నాతని మది ద్రిప్పబోయెను.

శ్రీనాథుఁడు వెడలిపోయినపిమ్మట పోతన యొక్కనాడింటియందు బియ్యము మున్నగునవేమియు లేకుండుటచే మిగుల వ్యసనపడి కట్టా! ఎన్నిదినములు నేనుపవసింతును. నేనెట్లో యేజలాహారముతోడనో నిలువగలను గాని యాలుబిడ్డలమాట యేమి, ఏమైననుసరే గ్రంథము నెవ్వరికైన నంకితమిచ్చి ధనంబును గొనియెదనుగాకయని నిశ్చయించుకొని భాగవతమును చంకబెట్టి యుత్తరీయమును కప్పికొని వీధిలోని కరుదెంచెను. తోడనే యాతని కట్టెదుట వలవల కన్నీరు గార్చుచు విలపించు సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమెనుగాంచి పోతనమది కరిగిపోయెను. అంతనాతఁడు సరస్వతి నద్దేశించి యిట్లనియెను.

ఉ.
కాటుక కంటినీరు చను । కట్టుపయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని । గాదిలికోడల! యోమదంబ ! యో
హాటకగర్భురాణి నిను । నాకటికింగొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల । కమ్మ ద్రిశుద్ధిగనమ్ము భారతీ!

భాగవత కృతిపతిత్వ నిర్ణయము.
పోతనామాత్యుడొకయుద్గ్రంధమును రచింపకోరి యొక్కరాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్రసముత్తుంగభంగ యగు గంగకుంజని క్రుంకులిడి వెడలి మహానియమంబయిన పులినతలమంటపమధ్యంబున మహేశ్వరధ్యానంబుసేసి కించిదున్మీలితనేత్రుండనై యున్నయెడ,

సీ.
మెఱుగు చెంగటనున్న । మేఘంబుకై వడి

నువిదచెంగటనుండ । నొప్పువాడు

చంద్రమండలసుధా । సారంబుపోలికి

ముఖమున జిరునవ్వు । మొలచువాడు

వల్లీయుతతమాల । వసుమతీజముభంగి

బలువిల్లుమూపున । బరగువాడు

నీలనగాగ్ర స । న్నిహితభానునిభంగి

ఘనకిరీటముదల । గలుగువాడు

ఆ.
పుండరీకయుగము । బోలుకన్నులవాడు
వెడదయురమువాడు । విపులభద్ర
మూర్తివాడు రాజు. । ముఖ్యుడొక్కరుడు నా
కన్నుగవకు నెదుర. । గానబడియె.

వ.
ఏను నారాజ శేఖరుం దేఱిచూచి భాషింప యత్నంబుసేయు నెడ నతండు దాన రామభద్రుండ, మన్నామాంకితముగా శ్రీ మహాభాగవతంబు దెనుంగుసేయుము, నీకు భవబంధములు దెగునని యానతిచ్చి తిరోహితుండనై సమున్మీలితనయనుండనై వెఱగుపడి చిత్తంబున,

క.
పలికెడిది భాగవతమట
పలికించువిభుండు రామ । భద్రుండుట నే
బలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాధ । పలుకగనేలా .

అని పరమేశ్వరునకు కృతినీయదలంచి,

ఉ.
ఇమ్మనుజేశ్వరాధముల । కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్నిపుచ్చుకొని । చొక్కి: శరీరమువాసి, కాలుచే
సమ్మెటవాటులం బడక । సమ్మతితో హరికిచ్చిచెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు. । భాగవతంబు జగద్ధితంబుగన్.

అని వక్కాణించి కృత్యాదిని,

శా.
శ్రీ కైవల్యపదంబు జేరుటకునై । చింతించెదన్ లోకర
క్షాకారంభకు భక్తపాలన కళా । సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళిలోలవిలస । ద్దృగ్జాలసంభూతనా
నా కంజాత భవాండకుంభకు మహీ । నందాంగనాడింభకున్.

అని శ్రీ కృష్ణభగవానుని సంస్తుతించియున్నాడు. కాని స్కంధాంత పద్యంబులందునను, తక్కిన స్కంధాదులయందును శ్రీరాముని సంబోధించియున్నాడు.

ఉదాహరణలు. 


మాలిని.
అనుపమగుణహరా । హాస్యమానారివీరా
జనవితతవిహారా । జానకీచిత్తచోరా
దనుజఘనసమీరా । దానవశ్రీవిదారా
ఘనకలుషకఠోరా । కంధిగర్వాపహారా.

ఉ.
క్షంతకు గాళియోరగని । శాలఫనణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధ । రాజచతుర్విధఘోరవాహినీ
హంతకు నింద్రనందున ని । యంతకు సర్వచరాచరావళీ
మంతకు నిర్జితేంద్రియ స । మంచితనభక్త జనాననగంతకున్.

ఉ.
న్యాయికి భూసురేంద్రమృత । నందనదాయికి రుక్మిణీ మన
స్థ్సాయికి భూతసమ్మదవి । ధాయికి సాధుజనానురాగసం
ధాయికి పీతవస్త్రపరి । ధాయికి పద్మభవాండభాండని
ర్మాయికి గోపికానివహ । మందిరయాయికి శేషశాయికిన్.

పైపద్యములను బట్టియు, స్కంధాదిపద్యములను బట్టియు నీతడు రామకృష్ణుల యవతారములయెడ నభేదబుద్ధిగల్గి యిరువురును యొక్కరేయని దలంచువాడనుట తెల్లమగుచున్నది. అయినను ఈతఁ డద్వైతియగుటచే భాగవతమును అద్వైతపరముగనే రచించియున్నాఁడు గాని విశిష్టాద్వైతపరముగ నాంధ్రీకరించి యుండలేదు.

పోతనకు మహావిష్ణువు గ్రంథరచనయందు తోడ్పడుట.
పోతన మహాభాగవతమున నష్టమస్కంధమును ఆంధ్రీకరించుచు గజేంద్రమోక్షకథా సందర్భమున,

మ.
అలవైకుంఠపురంబులో నగరిలో ……….

అనునంతవరకును పద్యమునువ్రాసి యాపైనేమివ్రాయుటకును దోపక బెద్దయుంబ్రొద్దు చిందించి యానాటికింక గ్రంధరచన పొసగదని కట్టిపెట్టి కుమార్తెను బిలిచి అమ్మా! పుస్తకమును గొనిపోయి జాగ్రత్తపరుపుము అని చెప్పి యటనుండి లేచి యాహ్నికముల దీర్చికొనుటకు నదికరిగెను.

భక్తవత్సలుడును కరుణాంతరంగుడును అగు శ్రీ మహావిష్ణువు తన భక్తుడగుపోతన తనయానతిచే భాగవతమును దెనిగించుచు నాలోచన కుదరక గ్రంథరచనముగించి స్నానార్థమరిగినతోడనే యాతనికి దోడ్పడనెంచెను. తోడనే యాతఁడు పోతనరూపమును ధరించి యింటిలోని కరుదెంచి కుమార్తెను బిలిచి అమ్మా! ఇందాకటి పుస్తకమను గంటమును గొనితెమ్మ, పద్యమును సంపూర్తిగావించెదను. అని వచించెను. పోతనకుమార్తె నిక్కమునకు తనతండ్రియే మరలివచ్చి యిట్లడుగుచున్నాడని తలంచి యాపుస్తకమును గొనివచ్చి యిచ్చెను. మహావిష్ణువా గ్రంథమున పోతనవిడచిన పాదమును యిట్లు పూరించెను. 



మ.
అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబుదాపల,

అని మాత్రము వ్రాసి యటుపిమ్మట పోతన సులభముగా నా పద్యమును పూరించగలడని యెంచి పుస్తకమును యెప్పటియట్లు కట్టి పోతనకుమార్తెకిచ్చి వెలికేగెను. ఆబాలికయు గ్రంథమునుగొని జాగ్రత్తపరచెను. పోతన యా దినమంతయును నాపద్యమునుగూర్చియే యాలోచించుచు గడిపివైచి మరునాఁడు ప్రాతః కాలమున కుమార్తె “నంపించి కుమారీ ! పుస్తకమునుగొనితెమ్ము. ఎట్లో యద్దానిని పూర్తి చేసెదను” యని పల్కెను. కుమార్తె పుస్తకమును గొనివచ్చి యందించెను. పోతన గ్రంథమును విప్పిచూడగా నందు దన వ్రాతగాక ముత్యములకోవవలె వ్రాయబడియున్న వ్రాతను దిలకించి, యాపద్యము తానువ్రాసిన దానికంటె నెక్కుడుగా నుండుటయుగాంచి కుమార్తెను పిలిచి “అమ్మా! ఇది వ్రాసినవారెవ్వరు చెప్పు”మని ప్రశ్నించెను. అంత నామె “జనకా! నిన్నమీరు స్నానమునకేగిన కొన్ని నిముషములకు దిరిగివచ్చి నా చే పుస్తకమును దెప్పించి వ్రాసియుండిరికాదా. ఇప్పుడిది యెవ్వరు వ్రాసిరని యడిగెదరేల” యని ప్రశ్నించెను. అంత పోతన, “నిన్న నేను పుస్తకము మరల ముట్టుకొనలేదు.. ఆ మహావిష్ణువేవచ్చి యియ్యదివ్రాసియుండును. కుమారీ! నీవు చాల యదృష్టవంతురాలవు. వెన్నుని జూడగల్గితివని నుడివి యా పద్యమును యొకనిముషములో నిట్లుపూరించెను.

మ.
అలవైకుంఠపురంబులో నగరిలో । నామూల సౌధంబు దా

పలమందారవనాంతరామృత సరః । ప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోదియగు నా । పన్న ప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రముపాహిపాహి ణియనుగు। య్యాలించిసంరంభియై.

ఇయ్యది యనుశ్రుతముగా వినవచ్చుకధల నాధారముగా గొని వ్రాయబడియున్నది.

పోతన గ్రంథరచనయందుండ మహావిష్ణువాతనిని సర్వజ్ఞ సింగమనాయుని బారినుండి రక్షించుట.
పోతనరచించు భాగవతమును దానెట్లైనను కృతిగొనవలయునని సంకల్పించుకొని సర్వజ్ఞసింగమనీడు తనసేనానాయకునకు గొంతబలమునొసంగి నీవేగి బమ్మెరపోతనామాత్యుని దండించియైన బట్టుకొని మహాభాగవతముతోగూడ నాతని నిచ్చటకు గొనిరావలసినదని నియమించెను. ఆసేనానాయకుఁడును తృటిలో నాకార్యమును సాధించుకొనివత్తు నని బీరములు పలికి వెడలిపోయెను. భక్తపరాధీనుడగు వెన్నుడు తనభక్తున కపకారముసేయబోవుచున్న నాతని యభిప్రాయమును గ్రహించి యాతని మందలించి వెనుకకు పంపనెంచెను. కాని యంతలోనిట్లు వితర్కించెను. ఈతనిని వెనుకకిపుడే పంపినచో రేపో లేక మరియొకనాడో చనుదెంచి యీతఁడు పోతనను బాధింపకమానడు. సర్వజ్ఞసింగమనీఁడు ముష్కరుఁడు. అతనికి తగినశిక్ష విధించినగాని సరియైన మార్గమునకురాఁడు.అని వితర్కించుకొని తనతొలుతటి యభిప్రాయముపహరించుకొనియెను. ఈసేనానాయకుఁడు పోతనయింటిని ముట్టడించెను. ఆసమయమున పోతన నిర్భీతితోనుండెను. అపుడు పోతన భాగవతమున యజ్ఞవరాహవతార ఘట్టమును వ్రాయుచుండెను. అందీ క్రింది పద్యమును రచించెను.

సీ.
కఠినసటాచ్ఛటో । త్కట జాతవాతని

ర్ధూతజీమూత సం । ఘాతముగను

క్షురనిభసునిశిత. । ఖరపుటాహతచల

త్ఫణిరాజ దిగ్గజ । ప్రచయముగను

జండ దంష్ట్రోత్థ వై । శ్వాన రార్చిస్స్రవ

ద్రజితహేమాద్రి వి । స్రంభముగను

ఘోరగంభీరఘు । ర్ఝరభూరి నిస్వన

పంకిలాఖిలవార్థి । సంకులముగ

బొరలుఁ గెరలునటించు నం । బరము దెరల
రొప్పునుప్పర మొగయును । గొప్పరించు
ముట్టెబిగియుంచు ముసమున । మూరుకొనుచు
నడరు సంరక్షితక్షోణి । యజ్ఞ ఘోణి.

అనుపద్యమును రచించునప్పటి కేవిధానపోతనను రక్షింతునాయని యాలోచించుచున్న శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహరూపముదాల్చి యా సేనానాయకుని సైన్యమును ప్రతిఘటించుచుండె.

సీ.
తివిరిచతుర్దశ । భువనంబులను దొంతు

లొరగఁ గొమ్ములజిమ్ము. । నొక్కమాటు

పుత్తడికొండ మూ । పురమును నొరయంగ

నురుకుచురాపాడు । నొక్కమాటు

నాభీలవాలహ తాహతిచేమింటి

నొరసిబ్రద్దలుసేయు । నొక్కమాటు

గన్నుగోనల విస్ఫులిం । గములు సెదర
నురుభయంకర గతిఁదోచు । నొక్కమాటు
పరమయోగీంద్ర జనసేవ్య । భవ్యవిభవ
యోగ్యమైకానఁగా నగు । నొక్కమాటు

అని రచించునప్పటికి యజ్ఞవరాహరూపముననున్న హరివిక్రమించి నిర్వక్రపరాక్రమంబున దన్ను ప్రతిఘటించిన ప్రతివీరులనెల్ల నొక్కుమ్మడిగూల్చుచుచు సేనానాయకునిబట్టి తొల్లి యజ్ఞవరాహము హిరణ్యాక్షునిఛేదించివధించిన తెరంగున మట్టు

బెట్టెను.ఇట్లు సర్వజ్ఞసింగమనాయని సైన్యమును ధ్వంసముసేసి దీనితో యా నృపాలునకు బుద్ధివచ్చును. ఇక నెన్నడును పోతనను బాధింప బలమును పంపకుండును. అని వితర్కించుచు నంతర్హితుండయ్యెను. సింగమనాయుడు తనకనేక యుద్ధములలో దోడ్పడినట్టియు, విశ్వాసపాత్రుఁడైనట్టియు సేనానాయకుడు మరణించినందుల కెంతయో విలపించెను. పోతనకు యీ సంగతియంతయు దరువాత తెలియవచ్చెను. పరమేశ్వరునకు దనయందుగల వాత్సల్యమునకెంతయు సంతసించినవాఁడై తా నాసమయమున రచించుచున్న ఘట్టమగు బ్రహ్మాదులు యజ్ఞవరాహమూర్తిని సంస్తుతించుటయందు భక్తి భావమును యిట్లువెల్లివిరియునట్లు వర్ణించియున్నాఁడు.

చ.
తలఁప రసాతలాంతరగతక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై
గలుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే? రమేశ్వరా!

చ.
సకల జగన్నియామక విచక్షణలీలఁ దనర్చు నట్టి నం
దకధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా
జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
టకుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా

ఉ.
విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్
విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని సన్నుతిసేయఁగ మాకు శక్యమే?

సీ.
పంకజోదర! నీ వపారకర్ముండవు;
భవదీయకర్మాభ్ది పార మరయ
నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు
; పరికింపఁగా మతిభ్రష్టు గాఁక
విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ;
మాయాపయోనిధి మగ్న మౌటఁ
దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల;
నే మన నఖిలలోకేశ్వరేశ!
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత!"

సీ.
పంకజోదర! నీ వపారకర్ముండవు;
భవదీయకర్మాభ్ది పార మరయ
నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు;
పరికింపఁగా మతిభ్రష్టు గాఁక
విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ;
మాయాపయోనిధి మగ్న మౌటఁ
దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల;
నే మన నఖిలలోకేశ్వరేశ!
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత

భాగవతమున గొన్నిభాగములు శిధిలమగుటకు గల కారణములు. ఇపుడు ముద్రితమై మనకు లభించుచున్న భాగవతము సంపూర్ణముగా పోతనామాత్య ప్రణీతముగాదు. పోతనామాత్యుఁ డు రచించిన భాగవతములో కొన్ని భాగములు శిధిలములు కాగా నట్టిభాగములను యితరులు పూరించిరి. పోతనామాత్యకృతమగు నా భాగములేల నశించినవి యను ప్రశ్నకు జనశ్రుతముగా నొండు రెండుకథలు వినవచ్చుచున్నవి. వానిని క్రింద బొందుపరచుచున్నాడను.

పోతనామాత్యుఁడు మహాభాగవతము నాంధ్రీకరించుచున్నట్లును, అతని కవిత్వమత్యంత మనోహరమైనదై సుధామయోక్తులతో నిండి యున్నదనియు వేంకటగిరి సంస్థానమున కధిపతియైన రావు సర్వజ్ఞ సింగమనాయునకు దెలియవచ్చెను. అతఁడు పోతనను ప్రార్థించి యా గ్రంథమును దానంకితమును పొందనభిలషించెను. పోతనామాత్యుఁడు తన భాగవతమును తనయిష్టదైవమగు శ్రీరాములకే యంకితమొసంగుటకు కృతనిశ్చయుఁడై యుండెను.అందువలన సింగమనాయుని యభిమత మీడేరదయ్యెను.

పోతనకు మఱదియగు శ్రీనాధుఁడు పోతనచెంతకరుదెంచి యాతఁడు మిగులదరిద్రుడై తినతిండియైనలేక యవస్థపడుచుండుట దిలకించి యాతనితో “బావా! యేల ఈవిధముగా కష్టము లనుభవించెదవు. నీవు రచించుచున్న యీ భాగవతము నెవ్వరికైన నంకిత మొసంగరాదా? నీ యట్టివాడంకిత మొసంగిన నెంతేని ధనంబు నొసంగుట కెందఱెందఱో సిద్ధముగానున్నా”రని పల్కెను, కాని పోతన యంగీకరింపడయ్యెను.

సింగమనాయుఁడు తనకోర్కెనెఱవేఱమికి గివిసిపోతనచెంతనున్న భాగవతమున దెప్పించి యద్దానిని నశింపుజేయవలయునను తలంపున దనయంతఃపురమున నొక్కచో పాతిపెట్టించెను. పోతనయు రామచంద్రున కంకితముగా నేను గ్రంథమురచించితిని. అయ్యది లోకమునవెలసి కలకాలముండుట యా రామచంద్రునకు సమ్మతమయ్యెనేని యాతఁడే యా గ్రంథమును వెలిగొనివచ్చును,అని తలంచి మిన్నకుండెను. కొన్నిదినములుగడచెను.

ఒక్కనాడు సింగమనాయుని స్వప్నమున శ్రీ రామచంద్రుఁడు సాక్షాత్కరించి యాతనికిట్లనియెను. “ఓయీ! లోకములోనున్నస్వార్థపరులలో నగ్రగణ్యుండవై యేల భగవదపచారము గావించెదవు. మహాత్ములగు కవి సౌర్యభౌములు తుచ్ఛములగు నీయీ ధనంబుల కాసజెంది నిన్ను సేవింతురనియే తలంచితివా? పోతన్నవంటి భక్తశిఖామణి, కవిపుంగవుఁ డు నిన్నాశ్రయించునా! అతఁడు తన భక్తిప్రభావమున నన్నే తన హృదయపంజరమున బంధించి యున్నాఁడు. అట్టివానియెడ నీవు మహాపచార మాచరించి యుంటివి. అజ్ఞానవశంబునగాని జ్ఞానవశంబునగాని నాకపచార మాచరించినవారిని మన్నింతునుగాని నా భక్తునకు గీడొనరించిన వాని నెన్నటికిని క్షమింపను. కావున నీవు పాతిపెట్టించిన గ్రంథమును వెలికిదీసి యద్దానిని సభక్తిపూర్వకముగా పోతనామాత్యునకర్పించి క్షమాభిక్షకోరుకొనుము. అట్లుగాదేని నీవు నా కోపానలంబున బగ్గునమాడిభస్మావశేషుఁ డయ్యెదవు.”  ఇట్లు పలికి రామచంద్రుఁ డంతర్హితుడయ్యెను.సింగమనాయఁ డుదయమున మేల్కాంచి కాలోచితముల దీర్చుకొని సుస్నాతుఁడై శ్రీరామచంద్రుని భక్తితాత్పర్యములు ముప్పిరిగొన పూజించి స్వయముగా నా గ్రంథమును ద్రవ్వి యద్దానిని శిరముపైనిడుకొని పోతనామాత్యుని గృహమునకు గొనిపోయి యర్పించి పోతనపాదములపైవ్రాలి “మహానుభావా! తమయెడ మహాపరాధము గావించియుంటిని. రక్షించవలయును.” అని పెక్కువిధముల ప్రార్థించెను. పోతనామాత్యు డాతనిని మన్నించి పంపివైచెను.

పోతన గ్రంథమును విప్పిచూడగా నందు గ్రంధపాతములు బొడకట్టెను. పోతన తిరుగవానిని రచింపక యేలనో విడచెను. తరువాత వెలిగందల నారయారు లద్దానిని పూరించియుండిరి.

పోతనామాత్యుఁడు స్వవిరచితమగు భాగవతమును తన దేవతార్చన పెట్టెయందుంచి నిత్యపూజలు సలుపుచు గౌరవించుచుండెడివాఁడు. అటుపిమ్మట దన యవసానకాలమున కుమారుఁడగు మల్లనను బిలచి “నాయనా! ఎట్లో కష్టపడి గ్రంథమును సమగ్రముగా రచించితిని. పొట్టకూటికై యద్దాని నొరులకు విక్రయింపక యిన్నిదినములవరకు దాచియుంచితిని. నాకవసానము సమీపించినది. నేనీగ్రంథమును నీ హస్తమునందిడి పోవుచున్నాను. నీవు నా యందెట్టి భక్తివిశ్వాముల జూపియుంటివో యట్లే యీగ్రంథమునెడగూడ భక్తివిశ్వాసములు గల్గి లోకమున వెలయింపుము.” అని జెప్పి మరణించెను. తదనంతరము మల్లనాదులు గ్రంథమును పరిశోధింపగా నందు కొన్నిభాగములు క్రిములచే నాశనముగావింపబడినవి. పోతనామాత్యుని శిష్యులుమల్లన మున్నగువారాలోపములను పూరించియుండిరి.

శ్రీనాధుఁడు.
శృంగారనైషధము కాశీఖండము మున్నగు గ్రంధరాజములను రచించి విశేషవిఖ్యాతి గడించిన శృంగార శ్రీ నాధకవిసార్వభౌముఁడు పోతనామాత్యునకు మఱది. శ్రీనాధుఁడు పోతననుగూడ తనవలెనే యొక భూపాలునాశ్రయముననుంపవలెనని, విశ్వప్రయత్నము లొనరించుచుండువాఁడు. ఈతఁడు పోతనామాత్యుని నివాసభూమి యగు యేకశిలానగరమునకు తరచుగా పోవుచుండునాఁడు. పోతన గాన్పించినప్పు డెల్ల “బావా! ఇదేమి దుక్కిటెడ్లనుగొని పొలముదున్నుచు నెంతకాలము గడిపెదవు.

క.
కమ్మని గ్రంథమ్మొకటి
ఇమ్ముగ నే నృపతికైన । కృతియిచ్చినచో
గొమ్మని యియ్యరె వెయ్యా
ర్లిమ్మహిదున్నంగనేల । యిట్టిమహాత్ముల్.”

అని వచించుచుండువాఁడు. పోతనయు యెప్పటికప్పుడు యేదో విధముగా తగినసమాధాన మొసంగుచుండువాఁడు. ఒకనాఁడు శ్రీనాధుఁడు పల్లకియందెక్కి పోతనామాత్యుని జూడ నరుదెంచుచుండెను. ఆ సమయమున పోతన తన చేనుగట్టున గూర్చిండి యేదోవిషయమును గూర్చి యాలోచనలు సలుపుచుండెను. పోతన కుమారుఁడగు మల్లన యరకకట్టి పొలము దున్నుచుండెను. శ్రీనాధుఁడు పోతనకు తన శక్తి సామర్థ్యములు జూపవలయునని పల్లకి మోయువారలను బిలచి “ఓరీ వెనుకప్రక్కనున్నవారు. పల్లకిదండిని వదలిపెట్టుఁడు పల్లకి యెప్పటియట్లు నడువగలద”నియెను. బోయీలు పల్లకిదండిని వదలివైచిరి. పల్లకి మామోలుగా నేగుచుండెను. పొలమును దున్నుచున్న మల్లన యదిగాంచెను. తోడనే యాతఁడాశ్చర్య మగ్నుండై “నాయనా ! మామ శ్రీనాధుఁ డరుదెంచుచున్నాఁ డు. పల్లకి వెనుకబోయీలు లేకుండగనే నడచుచున్నది. చాల విచిత్రముగా నున్నదని పల్కెను. పోతన తన యాలోచనమును చాలింపక “కుమారా! వింతయేమున్నది. దాపలియెద్దును విప్పివేయుము.నీ నాగలికూడ యట్లే నడువఁ గల”దనియెను. మల్లన యావినోదమును జూడవలయునని దాపలకట్టిన యెద్దును విప్పివైచెను. నాగలి యెప్పటియట్లు నడుచుచుండెను. మల్లన యెంతయు వింతనొంది తిలకించుచుండెను. శ్రీనాధుఁడు బోయీలవలన నాగలి దాపలియెద్దు లేకుండగనే నడచుచుండుట విని యెంతయు సంతసించి మరల బోయీలనుపిలచి, “ఓరీ! ముందుభాగమునుగూడ వదలిపెట్టు”డని యాజ్ఞాపించెను. బోయీలు పల్లకిదండిని వదలివైచిరి. పల్లకి యెప్పటియట్లు నడచిపోవుచుండెను. మల్లన యదిగాంచి తండ్రి కెఱింగించెను. పోతనయు “గుమారా! ఆశ్చర్యము జెందకుము. వలపలియెద్దునుగూడ విప్పివేయుము. నాగలి యెప్పటికంటె సులభముగా నడువగల”దని పల్కెను. మల్లనయు నట్లే గావించెను. నాగలి యధాప్రకారముగా సాగిపోవుచుండెను. బోయీలు రెండువైపులను యెద్దులు లేకుండ బోవుచున్న విషయమును శ్రీనాథునకు తెలియజేసిరి. శ్రీనాథుఁడు తన యపరాధమును గుర్తించి దిగ్గున పల్లకినుండి దిగి పోతనామాత్యుని సమీపించి, “బావా! క్షేమమా! తమ దర్శనార్ధ మగుదెంచుచుంటి”నని వచించెను. పోతనయు నాతని సముచితగౌరవమున నాదరించి తనగృహమునకు గొనిపోయెను.

విందుభోజనములు.
పోతనామాత్యుఁడు స్నానసంధ్యాదికములు గావించుకొని దేవతార్చన గావించుచుండెను. శ్రీనాథుఁడు వీధియరుగుపై గూర్చుండి మల్లన మున్నగువారితో నేదో విషయములను గూర్చి ముచ్చటించుచుండెను. శ్రీ నాథుఁ డాగర్భశ్రీమంతుఁడు. బుద్ధివచ్చినదాది గ్రంథముల రచించి యే భూపాలునకో యంకితమొసంగి వారిచే మన్నన లందుచుండువాఁడు. కావున భోగలాలసుఁడై యుండెడువాఁడు. గడియ భోజనమున కాలస్యమైన యుగముగా దలంచి తల్లడిల్లువాఁడు. అట్టివాఁడు పోతనయింటి కతిథిగా వచ్చెను. దేవతార్చన యగుచున్నది. అంత నింతట నది తెమలునట్లు గాన్పడదు. అతని ఆకలి ఆకసమంటుచున్నది. అట్టిస్థితిలో నాతఁ డెట్లుండునో పాఠకమహాశయులే యూహింతురుగాక. మరియు శ్రీనాథుండొక్కడు మాత్రమేగాక యాతనితో నరుదెంచిన వారును, శిష్యులును, మరికొందరు పండితులును గూడ నుండిరి. వీరందరికిని పోతన యానాడు విందుచేయుట కుద్దేశించెను. పోతన యెంతటిభాగ్యవంతుడో శ్రీనాథుండు చక్కగా నెఱుంగును. రెండుజాములు కావచ్చినది. ఇంట వంట జరుగుచున్నసవ్వడి యేమాత్రమును వినబడుటలేదు. ఇదంతయును గమనించి శ్రీనాథుఁడు ‘కట్టా’ ఈతని సం సారము లేమిడిగల్గినది. నేనొక్కడనేగాక పలువురు నాతో వచ్చినవారు గలరు. వీరికందరికిని దగు పదార్థముల నీతఁ డెక్కడనుండి తేనోపును’ అని విచారించుచుండగా పోతన దేవతార్చనము పూర్తిగావించుకొని వెలికరుదెంచి “బావా! ప్రొద్దుపోయినది లెమ్ము మడికట్టుకొనుము. వడ్డన యగుచున్న”దనియెను. శ్రీనాథుండు ఆకలితో నున్నవాడుగావున బ్రతుకుజీవుఁడా యని లేచి మడి గట్టుకొనియెను. అతనితోబాటుగ పండితులెల్లరును మడిగట్టుకొనుటకై లేచిరి. భోజనమునకు శ్రీ నాధుడు మున్నగు వారెల్లరును పీటలపై కూర్చునుండిరి. అంత పోతన “అక్కా! తడవేల వడ్డన గావింపు” మని కేకవైచెను. తోడనే భారతీదేవి చక్కని స్త్రీ రూపము ధరించి ప్రత్యక్షమై వివిధ భోజ్యములను వారి కెల్లరకును వడ్డించెను. శ్రీనాదుఁడు తానీవరకెన్నడును రుచిచూడని భోజ్యము లభించుటచే నెంతయు సంతసించి తృప్తితీర భుజించెను. శ్రీ నాధుఁడు పోతన మాహత్యమున కెంతయు సంతసించి యాతని నెన్నియోవిధముల నుతించెను.

భాగవత విమర్శనము
పోతన భాగవతము వ్రాయుచు నొక్కనాడు దన్నుజూచుట కరుదెంచిన శ్రీనాథున కద్దానినిచూపెను.ఆ శ్రీనాథుడు గ్రంథమక్కడక్కడ దిలకించి అందు అష్టమస్కంధములోని గజేంద్రమోక్షసందర్భమున జెప్పిన యీ క్రిందిపద్యమును ముమ్మారు చదివెను.

మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

అట్లు చదివి చెంతనేయున్న పోతన్నను గనుంగొని “బావా! యిదే మిట్లు వ్రాసితివి. ఆయుధములు లేకుండ గజరాజును విడిపింపనేగుటలో నాతని యభిప్రాయమేమి మకరమును చేతులతో గ్రుద్ది జంపదలచెనా? లేక మరేమి చేయదలంచెను?” పోతన యప్పటికేమియు సమాధానమొసంగక నవ్వుచు యూరకుండెను. తదనంతరము శ్రీనాధుడు తనపంక్తిని గూర్చుండి భోజనము చేయుచుండగా తనకేదియో పనియున్న దని చెప్పి వడివడిగా భోజనమంతరించి లేచిపోయెను. వీధిలో నాడుకొనుచున్న శ్రీనాథుని కుమారుని లాలించుచు నెత్తుకొని దీసుకొనిపోయి సమీపమున నున్న మరియొకరి ఇంటిలో నాబాలుని దాచి నూతిపెరటిలోని కరుదెంచి, యొక పెనురాతిని గభాలున నూతిలో నెత్తివైచెను. అంతట పోతన యెలుగెత్తి “బావా! శ్రీనాధా ! రమ్ము రమ్ము” నీ కొమరుఁడు నూతపడినాడు”. అని యఱచెను. శ్రీనాధుడింకను భోజనము జేయుచుండెను. ఆమాట వినబడినంతనే విస్తరినుండి గభాలున లేచి చేయి కడుగుకొనకుండా నతివేగమున నూతిపెరటిలోని కరుదెంచి “అయ్యో!” యని రోదనము చేయుచు, “హా! కుమారా!” యని నూతిచుట్టూ ప్రదక్షిణము చేయుచు, గుండెలు బాదుకొనుచు బేలవలె వాపోవదొడగె. లేకలేక చిరకాలమునకు గలిగిన కుమారుడగుటచే యెవరి కట్టి బాధయుండదు? “అకటా! నా నోములపంట ! నీవేమో వంశోద్ధారకుడ వనియు, చిరాయుష్మంతుండవనియు, సుగుణఖనివనియు, దైవజ్ఞులెందరో పేర్కొని యుండిరే. అన్నా ! యెంతకష్ట మెంతకష్టము. ఇక నా కీజన్మమేల? నేను కూడ నీ బావి జొచ్చెద”నని, నూతిలోపడుటకు యత్నించుచుండ , నంత పోతన “ఏదీ, బావా ! ఆపదలందు ధైర్యమువహింపవలయును గాదా! ఇది యేనా నీ ధైర్యము.’ అని యాక్షేపించుచు శ్రీ నాధునిగాంచి నవ్వుచు వెండియు నిట్లనెను. “నా వెన్నియో యిట్టి యిక్కట్టులపట్ల ధైర్యము వహింపవలెనని చెప్పిన యుపన్యాసము లన్నియు నేమైపోయినవి? ఇంతియేనా నీ ధైర్యసాహసములు. ఆడుదానివలె వాపోవుచు నూతిలో నురకజొచ్చెదవా? చాలులెమ్ము, నూతిలోబడ్డబిడ్డను దీయుటకై యత్నపడుము. అవును. నిచ్చెనయేది? త్రాళ్ళేవి? తట్టలేవి? తగిన యుపకరణముల సంపాదించి బిడ్డను పైకి దీయునుపాయ మాలోచింపవలెనుగాని. యూరకవాపోవుట పురుషలక్షణమా” అని యనుచుండ పోతన మాటలయొక్క భావమును కనిపెట్టి నాబిడ్డ కేవిధమయిన తొందరయు గలుగలేదు. ఇదంతయు పోతన గావించిన కపటనాటక విశేషమే. నాడు భాగవతములో “ సిరికింజెప్పడు” అను పద్యమును తాను చదివినప్పుడు నే నేదియో యాక్షేపణలొనరించితిని. ఇప్పుడీ పన్నాగమంతయు పన్ని యుండెనని తెలిసికొనియెను. అప్పుడు శ్రీ నాధుఁడు పోతనను కుమారుని జూపవలసినదని ప్రార్థించెను. పోతన యిట్లనియెను. “బావా! నీ కుమారునిపై నీ కెంతటి వాత్సల్యమో భక్తునియెడల పరాత్పరునకు కూడా నంతటి వాత్సల్యమే గలదు. ఆ వాత్సల్యము చేతనే గజేంద్రుని యాలాపము వినవచ్చినంతనే యున్నపాటునేలేచి భగవంతుడు పరువిడి వచ్చుచుండెను. ఆతఁ డాయుధము లేకున్న మాత్రమున మకరిని ద్రుంప లేడా! మనము నూతులలోబడిన వానిని పైకి సాధనములుపయోగింప వలయునేగాని యా మహానుభావునకు ఆయుధములతో పనియేమి? నాడు శిశుపాలుని వధించునాడు ధర్మరాజు పూజాద్రవ్యములతో నొసంగిన పళ్ళెరమేగదా చక్రమయ్యెను. అని వివరించి యాతని యాక్షేపణకు సోదాహరణంగా ప్రత్యుత్తర మొసంగెను.

భాగవతమును లక్షణగ్రంథముగా గొనకుండుట
భాగవతమున గొన్ని చోట్ల రేఫఱకారమనలకు ప్రాస స్థానములందును విశ్రమ స్థానములందును మైత్రియుండుట గాన్పించుటచేత అప్పకవి తన యప్పకవీయములో నిట్లు వ్రాసియున్నాడు.

ఉ.
బమ్మెరపోతరాజకృత । భాగవతమ్ము సలక్షణమ్ముగా
కిమ్మహినేమిటంగొదవ । యెంతయునారసిచూడగానురే
ఫమ్ములు ఱాలునుంగలసి । ప్రాసములైనకతంబునంగదా
యిమ్ములనాదిలాక్షిణికు। లెల్లరు మానిరుదాహరింపగాన్.

కాని పరికింపగా నీరేఫఱకారసాంకర్యము పోతనకృతములగు భాగము లందంతగా గనబడదు. నారయ, సింగన, గంగన మున్నగువారు రచించిన భాగములలో మాత్రమే గనబడుచున్నది. ఈవిషయమును చర్చించి కూచిమంచి తిమ్మకవి తన “సర్వలక్షణసార సంగ్రహమున” నిట్లు వ్రాసినాడు.

ఆ.
కాకునూరియప్ప । కవి యహోబలపతి
ముద్దరాజు రామ । ముఖ్యులెల్ల
బోతరాజు కబ్బ. । ముననఱాలు రేఫలు ।
గదిసెవంచు జెప్పి । రది హుళక్కి

సీ.
ఘనుడు పోతన మంత్రి । యును భాగవతము ర

చించి చక్రికి సమ । ర్పించు నెడల

సర్వజ్ఞసింగమ । క్ష్మావరుడదితన

కిమ్మనివేడగా । నీయకున్న

నలిగియా పుస్తకం । బవని బాతించిన

జివికియందొకకొంత । శిధిలమయ్యె

గ్రమ్మఱ నది వెలి. । గండల నారప్ప

రాజును మరిబొప్ప । రాజు గంగ

రాజు మొదలగు కవివరుల్ । తేజమొస
గ జెప్పిరాగ్రంథములయందె । తప్పులొదనె
గానిపోతకవీంద్రుని కవితయందు
లక్షణంబెందుదప్పునా । దక్షహరణ

కూచిమంచి తిమ్మకవి రేఫఱకారసాంకర్యములేని పద్యములను గొన్నిటిని నిరూపించి యున్నాడు. ఆ పద్యములను మరికొన్నింటినిగూడ నిందుదాహరించుచున్నాడను.

ఉ.
మాఱువడంగలేని యస । మర్ధులసుప్తుల వస్త్రవిద్యలం
దేఱనిపిన్నపాపలవ । ధించెనిషద్ధపుఁ గ్రూరకర్ముఁడై
పాఱుఁ డె వీఁడుపాతకుఁడు ప్రాణభయంబున వెచ్చమార్చుచుం
బాఱెడివీనిఁ గావుముకృ । పా మతి నర్జున సాపవర్జనా.

చ.
వెఱచినవాని దైన్యమున । నేఁదుఱునొందినవాని నిద్రమై
మఱచినవాని సౌఖ్యముగ । మద్యముఁ ద్రావినవానిభగ్నుఁ డై
పఱచినవానిసాధుజడ । భావము వానిని గావుమంచునా
చఱచినవానిఁ గామినుల । జంపుటధర్మముగాదు ఫల్గునా.

- ప్రధమస్కంధము.

క.
ఎఱుఁ గుదుఁ దెఱవాయిప్పుడు
మఱువనుసకలంబు నన్ను । మఱచినయెడలన్
మఱుతునని యెఱిఁగి యెఱుఁగక
మఱవక మొఱయిడిరయేని । మఱియన్యములన్.

క.
ఒఱపగునురమును బిరుదును
నెఱిదోఁ కయు ముఖముసిరియు । నిర్మలఖురముల్
కుఱుచచెవులుఁ దెలిగన్నులు,
దఱుచగుకంఠంబుఁజూప । దగునాహరికిన్.

ప్రాసయతి

ఆ,
చావులేనిమందు । చక్కనమనకబ్బె
ననుచుఁ గడవయసురు । లడచికొనిన
వెఱచి సురలుహరికి మొఱలువెట్టిరిసుధా
పూర్ణఘటముపోయెఁ । బోయెననుచు.

ఆ.
వాలుగంటివాఁడి । వాలారుచూపుఁ
శూలిధైర్యమెల్లఁ. । గోలుపోయి
తఱలియెఱుకలేక । మఱచెగుణంబుల
నాలి మఱచె నిజగ । ణాళిమఱచె.

- ప్రాసము. 

క.
వెఱచుచు వంగుచువ్రాలుచు
నఱమఱిగుబురులకు జనుచు । హరిహరియనుచున్
మఱుగుచు నులుకుచు దిరదిరఁ
గుఱుమట్టపుఁ బొట్టివడుగు । కొంతనటించెన్.

క.
కుఱుగఱులు వలుదనీసలుఁ
జిఱుదోఁకయు బసిఁడి యొడలు సిరిగలపొడలున్
నెఱమొగము నొక్కకొమ్మును
మిఱుచూపులు గలిగివిభుఁడు మీనంబయ్యెన్.

క.
పెఱవాఁడు గురుడటంచును
గొఱగానిపదంబుసూపఁ । గుజనుండును ని
నెఱిత్రోవనడవనేర్చిన
నఱమఱలేనట్టిపదము । నందుదయాబ్ధీ.

ఉఱుకుం గుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచుఁ; బాదంబులం
నెఱయం గంఠము వెన్నుదన్ను; నెగయున్ హేలాగతిన్; వాలముం
జఱచుం; నుగ్గుగఁ దాఁకు; ముంచు; మునుగుం; శల్యంబులుం దంతముల్
విఱుఁగన్ వ్రేయుచుఁ బొంచిపొంచి కదియున్ వేదండ యూధోత్తమున్

ఉఱ కంభోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ
గఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే
న్మెఱయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ
క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్.

మఱియును దనుజుఁడు రామునిఁ
గఱవఁగ గమకించి తెఱపిఁ గానక యతనిం
జుఱచుఱఁ జూచుచు శౌర్యము
పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్

కఱచి పిఱుతివక మఱియును
వెఱవక నిజవదనజనిత విషదహనశిఖల్
మెఱయఁ దన నిడుద యొడలిని
నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్.

అఱువదినాలుగు విద్యలు
నఱువదినాలుగు దినంబు లంతన వారల్
నెఱవాదులైన కతమున
నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా!

ఇట్టివి పోతనకవిత్వమున గనబడుటజేసి యాతఁడు రేఫఱకారముల భేదము గుర్తించినవాడనియును, రేఫఱకారములసాంకర్యమును అంగీకరింపని వాడనియును స్పష్టమగుచున్నది. పోతన రచించిన భాగవతములో నొకటి రెండు స్థలములయందు మాత్రమే యీ దోషము గానబడుచున్నది. దానినీ క్రింద యుదాహరించుచున్నాను.

ఉ.
పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు;"ఘోరకృత్య" మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు;"కావరే" యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.

సప్తమస్కంథము.

క.
పోరుదురు గికురు పొడుచుచు;
దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్;
జాఱుదురు ఘనశిలాతటి;
మీఱుదు రెన్నంగరాని మెఁలకువల నృపా!

చ.
వెఱ మఱలేని మేటి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్క చేఁ
జఱచి ఖగేంద్రుచందమునఁ జక్కన దౌడలు పట్టి కన్నులం
జొఱజొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతో
జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్.

చ.
మఱి యొకనాటి రాత్రి బలమాధవు లుజ్జ్వల వస్త్రమాలికా
ధరులును లేపనాభరణ ధారులునై చని మల్లికాది పు
ష్పరస నిమగ్నమైన మధుపంబుల గీతము వించుఁ దద్వనాం
తరమున వెన్నెలన్ వ్రజనితంబిను లుండగఁ బాడి రింపుగన్.

ఈ ప్రయోగములు ప్రమాదజనితములుగా గాని మతబేధమునగాని లేక యితర కారణమునగాని ప్రయోగింపబడినవేగాని పోతన యుభయమైత్రి పాటించినాఁడుకాడనుట తగదు. వెలిగందల నారపరాజు మున్నగువారు రచించిన భాగములందు రేఫఱకార సాంకర్యము గనబడుచున్నది. వాని నీక్రింద నొసంగుచున్నాడను.

క.
మఱియును ఋష్యాశ్రమ వన
సరి దుపవన నద పుళింద జనపద గిరి గ
హ్వర గోష్ట యజ్ఞశాలా
పుర దేవాయతన పుణ్యభూముల యందున్.

చ.
హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు
స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము
ల్మఱచియుఁ జేయనొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం
బరువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్?

క.
ధర శునకభోగ్యమును నిహ
పరదూరము నైన తనువు పాథేయముగా
నెఱి నమ్మి వస్త్ర మాల్యా
భరణంబు లలంకరించు పామర జనులన్

మ.
తెఱఁగొప్పన్ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో
దర సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్త్రస్థామృతంబున్ ఖగే
శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశశ్రేణి నిర్జించి త
ద్ధరణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే? యుద్ధవా!

క.
పరగగ దర్భోద్ధతులి
ద్దఱు కొడుకులు నీకు బుట్టి। ధరణికివ్రేగై
నిరతము బుధజనపీడా
పరులై వర్తింతు రాత్మ । బలగర్వమునన్.

క.
వరుణుని బలములు దనుజే
శ్వరు తేజము దేరిజూడ । జాలక శౌర్య
స్ఫురణముచెడి యెందేనియు
బఱచెన్ దజ్జలధిమధ్య । భాగమునందున్.

క.
వినుము ఫలారంభుడు కృప
ణుని నడిగిన దన యశంబు । నుం దనమానం
బును జెడుగావున దగనీ
వెనయ వివాహేచ్ఛ దగు । లుటెఱిగెనిటకున్.

క.
ధరణీసురోత్తముడు తా
నరుదుగ దనువారు సెప్పి । నవియెల్లను నే
మఱకందు బ్రీతిసేయ
నిరతము గృహకర్మమట్లు । నెఱపుచు నుండెన్.

చ.
కరువలిబాయ వస్త్రమును । గట్టనెఱుంగవు చూడ్కి దిక్కులన్
బఱచుచు జంచరీకముల । భాతి జెలంగెడు కంధరంబునన్
బొరలెడు ముక్తకేశభర. । ముందుఱుమంగదలంప విప్పుడి
ట్లరుదుగ రత్నకందుక వి । హారముసల్పెడు సంభ్రమునన్.

క.
ధరణీవల్లభనిన్నును
నిరతంబును బుద్ధదేవు । నింగొలచిన యా
తెఱగున గొలిచెదమని భా
సురమతి బోధించిరపుడు । సుమతిం బ్రీతిన్

క.
పరిపూర్ణంబగు భక్తిని
గరమనిశము సంశయాత్మ । కంబయిచాలన్
వఱలిన హృదయగ్రంధిని
నిరసించు విరక్తియుతను । నీషజనించెన్.

చ.
హరిభజనియ మార్గనియ । తాత్మకులై భవదీయమూర్తిపై
వఱలిన భక్తియుక్తులగు । వారలసంగతి గల్గజేయు స
త్పురుషసుసంగతిన్ వ్యస । నదుర్భరసాగరమప్రయత్నతన్
సరసభవత్కధామృత ర. । మా హృదయేశ । మకుంద! మాధవా.

భాగవతము — ఆంధ్రీకరణము.
వేదవ్యాసవిరచితమగు భాగవతమననుసరించి పోతనామాత్యుడొక స్థలమున కొంతవరకు కల్పితమనలను జేర్చుచు, వేరొకయెడకొలదిగా సంకుచితము గావించుచు గ్రంథమును చక్కగాపోషించియాంధ్రీకరించినాఁ డు . ఈతఁడు భాగవతమంతయు నద్వైతపరముగానే రచించి యుండెనని విస్పష్టమగుచున్నది. ఈతఁడు తనయాంధ్రీకరణమునకు శ్రీధరుల వ్యాఖ్యానము నూతగా గొనియున్నాఁడు. ఈ విషయమును ఈ క్రింది నొసంగబడిన వ్యాఖ్యానము రూఢిసేయగలదు.

శ్లో.
నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే
నానావాదానురోధాయ వాచ్యవాచకశక్తయే.

ఈ శ్లోకమునకు శ్రీధరులవా రిట్లువ్యాఖ్యానము గావించియున్నారు.

నమిఇతి. అనంతాయ, అహంకారాపరిచ్ఛేదాత్ అతః సూక్ష్మాయ,
అదృశ్యత్వాత్ అతఏవకూటస్థాయ, ఉపాధికృత వికారాభావాత్ అత
ఏవవిపశ్చితే సర్వజ్ఞాయ॥ నానేతి॥ నానావాదానురోధాయ అస్తి, నాస్తి
సర్వజ్ఞః కించిదజ్ఞః బద్ధః, ముక్తః ఏకః, అనేకః , ఇత్యాదీనానావాదాన్
అనురుణద్ధి మాయయానువర్తతే యస్తస్మైవాచ్యవాచకశక్తయే అభిధానా
భిధేయ శక్తిబేదాదపి నానాత్వేప్రతీయమానాయ;కుత;శాస్త్రయోనయో
వేదాత్మకనిశ్వాసాయ.

పైవ్యాఖ్యానముననుసరించి పోతనరచించిన యాంధ్రీకరణము.

గీ. మూడహుకృతులచే । ముసుగుపడక

నెఱిననంతుడవై దర్శ । సేయరుచివి
గాక సూక్ష్ముడవై నిర్వి । కారమహిమ
దనరికూటస్థుఁడనైన సమ । స్తంబునెఱుగు
నీకు మ్రొక్కెద మాలింపు । నిర్మలాత్మ.

వ.
మరియుఁ గలండులేఁడు,సర్వంబు నెఱుంగునించుక యెఱుంగు బద్ధుండుముక్తుండు, నొకండనేకుండు ననునివి మొదలగుగాఁగల వాదంబుల మాయవలన ననురోధింతువు కావున నానావాదానురోధకుం డవయ్యు నభిధానాభిధేయ శక్తిభేదంబువలన బహుభావప్రతీతుండ వయ్యును, జక్షుషాదిరూపంబువలన బ్రమాణమూలకుండవయ్యు వేదమయనిశ్వాసత్వంబువలన శాస్త్రయోనివయ్యు కొన్నియెడల కావ్యసరణికి సరసముగా నుండని దత్త్వఘట్టములనుగూడ నత్యంతమధురిమ మొలుకునట్లు రచించుటయందు పోతన మిక్కిలి నిపుణుడు.

- సప్తమస్కంథము

శ్లో
మతిర్నకృష్ణేపరతస్స్వతో వామిధోభిపజ్యతగృహవ్రతానాం।
అదాంతగోభిర్విశతాంతమిస్రంపును పునశ్చర్వితచర్వణానామ్॥

ఈశ్లోకమునకు పోతనామాత్యుని తెనుగు.

ఉ.
అచ్చపుఁజీకటింబడి గృ । హవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచుఁబుట్టుచున్ మరల ।జర్వితచర్వణులైనవారికిన్
జెచ్చెరఁబుట్టునే పరులు । సెప్పిననైననిజచ్ఛనైన నే
మిచ్చిననైనఁ గానలకు । నేగిననైన హరిప్రబోధముల్.

మూలము
శ్లో
నతేవిదుస్స్వార్ధగతిం హి విష్ణుం
దురాశయాయేబహిరర్ధమానినః
అంధాయుధాంధైరుపనీయామానా
వాచిస్వతంత్ర్యామురుదామ్నిబద్ధా॥

శ్లో
నైషాంమతిన్తావదురు క్రమాంఘ్రీం
స్సృశత్యనర్ధాపగమోయదర్ధః
మహియనార పాదరజోభిషేకం
నిష్కించనానాం నవృణీతయావత్.

ఉ.
కావనివాని నూతగొని. । కాననివాడు విశిష్టవస్తువుల్
గాననిభంగిఁ గర్మములు । గైకొనికొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుని కొందరట్ల । గందురకించన వైష్ణనాంఘ్రిసం
స్థానరజోభిషిక్తులగు. । సంహృతకర్ములు దానవేశ్వరా.

మరియు పోతనరసోద్దీపకములు కానిపట్లను గూడ దనరచనా చమత్కృుతిచే నత్యంతమనోహరములై యుండునట్లుగా వర్ణించి యుండెను. ఈక్రిందిశ్లోకమును దానికి తెనుగుసేతయు గమనించిన నీ విషయము తెల్లమగును.

సప్తమస్కంధము— పంచమాధ్యాయము.
శ్లో
ఏకదాసుపరాట్పుత్రమంకమారోప్య పాండవ?
ప ప్రచ్ఛకథ్యతాం వత్స । మన్యతే సాధుయద్భవాన్.

దీనికి పోతన్న గారి తెలుగు.
శా.
అంతం గొన్నిదినంబు లేఁగిన సురేంద్రారాతి శంకాన్విత
స్వాంతుండై "నిజనందనున్ గురువు లే జాడం బఠింపించిరో
భ్రాంతుం డేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యాపరి
శ్రాంతిం జూచెదఁ గాక నేఁ" డని మహాసౌధాంతరాసీనుఁడై.

ఉ.
మోదముతోడ దైత్యకులముఖ్యుడు రమ్మని చీరఁ బంచె బ్ర
హ్లాదకుమారకున్ భవమహార్ణవతారకుఁ గామ రోష లో
భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవచింతనామృతా
స్వాద కఠోరకుం గలుషజాల మహోగ్రవనీకుఠారకున్.

వ.
ఇట్లు చారులచేత నాహుూయమానుండై ప్రహ్లాదుండు నరుదెంచిన,

శా.
ఉత్సాహ ప్రభుమంత్రశక్తి యుతమే యుద్యోగ? మారూఢ సం
విత్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులున్ శాస్త్రముల్?
వత్సా! ర" మ్మని చేరఁ జీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుఁ డై
యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపగన్.

క.
అనుదిన సంతోషణములు,
జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్,
తనయుల సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్."

వ.
అని మరియుఁ బుత్రా! నీకెయ్యది భద్రంబైయున్నది చెప్పుమనిన గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.

అష్టమస్కంధము — తృతీయాశ్వాసము.</em<
శ్లో
తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః స్తోత్రం నిశమ్య
దివిజైః సహ సంస్తువద్భిః ఛన్దోమయేన గరుడేనస ఊ
హ్యమానశ్చక్రాయుధోభ్యగమదాశు యతో గజేంద్రః ॥

శ్లో
సొంతస్సరస్యుడుబలేనగృహీత ఆర్తోదృష్టోగరుత్మతిహ
రింఖఉపాత్తచక్రం। ఉతి ప్యసాంబుజకరంగిరిమా
హకృచ్ఛాన్నాలాయరాఖిలగురోభగవన్నమస్తే.

శ్లో
తం వీక్ష్యపీడితమజస్సహసావతీర్య సగ్రాహమాశు
సరసఃకృపయోజ్జహార। గ్రాహాద్విపాటితముఖాదరి
ణాగజేంద్రం సంపశ్యతాం హరిరమాముచదుస్రియాణం.

ఈ మూడుశ్లోకములకు.

మ.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

అను నీ పద్యము మొదలుకొని

శా.
పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్,
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్,
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్,
దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్.

అను పద్యమువఱకును గల ఇరువదిపద్య గద్యములును రచించి యున్నాడు.

నవమస్కంథము — నవమాధ్యాయము.
శ్లో
వ్యవాయకాలేదదృశేవనౌకోదంపతీ ద్విశౌ
క్షుధార్తోజగృహేవిప్రంతత్పత్న్యాహ కృతార్ధవత్
నభవాన్ రాక్షసస్సాక్షాదుక్ష్వాకూణాం మహారధః
మదయంత్యాః పతిర్వీరనాధర్మంకర్తుమర్హసి
సోయంబ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాద్విభో
కధమర్హ తిధర్మజ్ఞ ! వధంపితురివాత్మజః
తస్యసాధోరపాపస్యభ్రూణస్యబ్రహ్మవాదినః.
కథంవధంయధాబభ్రోర్మన్యతే సన్మతోభవాన్
యద్యయంక్రియతే భిక్షస్తర్హిమాంఖాదపూర్వతః.
నజీవిష్యేవినాయేనక్షణంచ మృతకంయథా
ఏనంకరుణభాషిణ్య విలపంత్యా అనాధవత్
వ్యాఘ్రః పశుమివాఖాదత్సౌదాసశ్శాపమోహితః

తెనుగు
క.
ఆఁకట మలమల మాఁడుచు
వీఁక నతం డడవి నున్న విప్ర మిథునముం
దాఁకి తటాలున విప్రునిఁ
గూఁకటి చేఁబట్టి మ్రింగఁ గొనిపోవుతఱిన్.

వ.
అంత నాబ్రాహ్మణునిభార్యపతికి నడ్డంబు వచ్చి యేడ్చుచు నా రాచరక్కసున కిట్లనియె.

మ.
రవి వంశాగ్రణివై సమస్తధరణీరాజ్యాను సంధాయివై
భువనస్తుత్యుఁడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై
వివరంబేమియు లేక నా పెనిమిటిన్ విప్రుం దపశ్శీలు స
త్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ భక్షింపఁగాఁ బాడియే?.

మ.
తండ్రీ! మీకు దినేశవంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుం
డండ్రా మాటలు లేవె? భూమిసుర గోహత్యాభిలాషంబు గై
కొండ్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ
తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ధర్మంబునుం బోఁగదే.

శా.
అన్నా! చెల్లెల నయ్యెదన్; విడువు నీకన్నంబు బెట్టింతు; నా
హృన్నాథున్ ద్విజు గంగికుఱ్ఱి నకటా! హింసింప నేలయ్య? నీ
వెన్నం డింతులతోడఁ బుట్టవె? నిజం బిట్టైన మున్ముట్ట నా
పన్నన్ నన్ను శిరంబు ద్రుంచి మఱి మత్ప్రాణేశు భక్షింపవే.

క.
అని కరుణ పుట్ట నాడుచు
వనితామణి పలవరింప వసుధాదేవుం
దినియె నతఁడు పులి పశువుం
దిను క్రియ శాపంబు కతన ధీరహితుండై.

పోతనామాత్యుఁడు నాచనసోముని హరివంశమును దిలకించి యందు గల పోకడల గొన్నింటిని దనభాగవతమన పొందుపరచియున్నాడనుట క్రిందిపద్యములు నిదర్శనములై యున్నవి.

బమ్మెరపోతన చరిత్రము — ఉత్తరవంశం

మ.
అరిజూచున్ హరిసూచు సూచకములై । యందంద మందారకే
సరమాలామకరంద బిందుసలిల । స్యందంబు లందంబులై
దొరగంబయ్యెద కొంగొకింత దొలగం । దోట్తోశరాసారమున్
దరహాసామృతసారముం గురియుచుం। దన్వంగి కేళీగతిన్.
దశమస్కంథము

మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

నన్నయ తిక్కనాదుల శైలికిని పోతనశైలికిని భేదములు గాన వచ్చుచున్నది. నన్నయాదుల కవిత్వము వ్యాకరణప్రయోగ ఫ్రౌఢిమగల్గి యన్వయకాఠిన్యము గల్గియుండును. పోతనశైలియందు సులభమగు నన్వయమును, బదలాలిత్యమును, శబ్దాలంకారచిత్రములును గలిగి యుండును. మరియు పోతన రచించిన పద్యములలో పాదాంతమునకును, విశ్రమస్థానమునకు పదములు సంపూర్తి జెందుచుండుటచే చదువుట కెంతయు ననుకూలముగానుండును. ఈవిషయనిరూపణమునకై భారత భాగవతములనుండి యుదాహరణము లొసంగుచున్నాడను.

మాలిని
ఏచితల్చిరి తనర్చిన క్రోవుల। నిమ్మగుదావుల జొంపములం
బూచిన మంచియశోకములన్ సుర । పొన్నలబొన్నలగేదగులం
గాచి బెడంగుగబండిన యాసహ । కారములం గదళీతతులం
జూచుచు వీనులకింపెసగన్ వినుచున్ । శుకకోకిలసుస్వరముల్.

కవిరాజవిరాజితము.
చనిచని ముందటనాజ్యహవిర్ధృత । సౌరభదూమలతాతతులం
బెనగినయాకుల కొమ్మలమీద న। పేతలతాంతములైనను బా
యనిమధుపప్రకరంబులజూచి జ । నాధిపుడంత నెఱింగెపో
వనమిదియల్లదె దివ్యమునీంద్రని। వాసము దానగునంచునెదన్.

సీ.
శ్రవణసుఖంబుగా । సామగానంబులు
చదివెడు శుకముల । చదువుదగిలి
కదలక వినుచుండు ।కరులయుగరికర
శీతలచ్ఛాయద । చ్ఛీకరాంబు
కణములచల్లని । గాడ్పాసపడివాని
జెంది సుఖంబున్న। సింహములయు
భూసురప్రవరులు । భూతబలుల్ దెచ్చి
పెట్టునీవారాన్న । పిండతతులు
గడగి భక్షింపనొక్కట । గలసియాడు
చున్న యెలుకపిల్లుల । యొండుసహజ
వైరిసత్వంబులయు సహ । వాసమపుడు
చూచిమునిశక్తి కెంతయు । జోద్యమంది”.
భారతము ఆదిపర్వము ఆ5వకణ్వమహాున్యాశ్రమ వర్ణనము

భాగవతమున,
ఉ.
అందుఁ దమాల సాల వకుళార్జున నింబ కదంబ పాటలీ
చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మా
కంద కుచందనక్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా
కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్”.

క.
పరిపక్వఫలభరానత
తరుశాఖానికర నివసితస్ఫుట విహగో
త్కర బహుకోలాహలరవ
భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్.

క.
అతి నిశిత చంచు దళన
క్షత నిర్గత పక్వఫలరసాస్వాదన మో
దిత రాజశుక వచోర్థ
శ్రుతఘోషము సెలఁగ శ్రవణసుఖదం బగుచున్.”

క.
లలితసహకారపల్లవ
కలితాస్వాదన కషాయకంఠ విరాజ
త్కలకంఠ పంచమస్వర
కలనాదము లుల్లసిల్లఁ గడురమ్యములై..

క.
అతుల తమాల మహీజ
ప్రతతిక్షణజాత జలదపరిశంకాంగీ
కృత తాండవఖేలన విల
సితపింఛవిభాసమాన శిఖి సేవ్యంబై.”

          తృతీయస్కంథము కర్దమాశ్రమవర్ణనము.
మరియు నీతఁడు భాగవతమును ఆంధ్రీకరించుచు నిట్లు నుడివి యున్నాఁడు.

క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.

అని వచించినయట్లు భాగవతమును రచించియుండెను. దశమస్కంధమున శ్రీ కృష్ణావతారఘట్టమును చదువున్నప్పుడు సాధారణముగా సుబోధకముగాను. దానికి వేరుగా నర్ధమును వివరింపవలసిన పని యుండదు.

      భాగవతమున నవరసములనును నుచితరీతిని పోషింపబడియున్నవి.

జగన్మోహనావతారఘట్టము, గోపికావస్త్రాపహరణఘట్టము, రాసక్రీడ మున్నగుతావుల శృంగార రసము చిప్పిలుచుండును. నరసింహావతారఘట్టమున రౌద్రము మూర్తీభవించి యుండుటను గమనింపవచ్చును. ఇట్లే అయ్యైయెడల నాయారసములను బాగుగా పోషించి యున్నాఁడు.

       పోతనవిరచితభాగములందు పద్యాంతము లతిమనోహరములై

యుండును.
ఇందులకు ఉదాహరణములు.
క.
కలఁ డందురు దీనుల యెడఁ,
గలఁ డందురు పరమయోగి గణముల పాలం,
గలఁ డందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో.

        భాగవతషష్టస్కంథము.

 భాగవతములోని యితరభాగముల పూరించినవారెవ్వరును అవలింబింపని పద్ధతులను సింగన యవలంబించియున్నాఁడు.ఈతఁడు తాను భాగవత షష్టస్కంథమును పూర్ణముగా దెనిగించుచుంటి నని వక్కాణించి యున్నాఁడు. ఏకాదశస్కంధములను పూరించినవెలిగందల నారాయణ మున్నగువారు తాము సంపూర్ణముగా స్కంథమును రచించునప్పుడైనను, యిట్లు వక్కాణించియుండలేదు. 

ఇందలి మొదటిపద్యము.

శా.
శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.

ఈపద్యమున నాతఁడు నారాయణుని యభినందించియున్నాఁడు. ఇంతియెగాక నీతఁడు హయగ్రీవస్తుతియును, గణపతిప్రార్థనము మున్నగువానిని గావించియున్నాఁడు. మరియు నితడు బమ్మెర పోతరాజు నిట్లభివర్ణించియున్నాఁడు .

ఉ.
ఎమ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

ఈతఁడు తనకు దివ్యవాణి సాక్షాత్కరించినట్లుగా యీ విధంబున వక్కాణించి యున్నాఁడు.

సీ.
ఉరవడిఁ బ్రాగ్వీథి నుదయించు మార్తాండ;
కోటిబింబచ్ఛాయ గూడినట్లు
హరిహర బ్రహ్మల యాత్మలలో నుబ్బి;
కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు
ఖరకర కర తీవ్ర గతినిఁ గరంగుచు;
హేమాద్రి చెంతఁ బె ల్లెగసినట్లు
ఫణిరాజ ఫణరాజి మణిగణ విస్ఫూర్తి;
సుషిరంపు వెలిఁదల చూపినట్లు
లుట్టిపడ్డట్లు కట్టెఱ్ఱ నూఁదినట్లు
తేజ మెసఁగంగ నా మ్రోల దివ్యవాణి
పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ
జూచి యిట్లని పలికె మంజులముగాను.

ఈతఁడు యితరులవలెగాక దన వంశానుక్రమణికనుగూడ యిట్లు వక్కాణించి యున్నాఁడు.

సీ.
శ్రీవత్స గోత్రుండు శివభక్తి యుక్తుఁ డా;
పస్తంబ సూత్రుఁ డపార గుణుఁడు
నేర్చూరి శాసనుం డెఱ్ఱన ప్రెగ్గడ;
పుత్రుండు వీరన పుణ్యమూర్తి
కాత్మజుం డగు నాదయామాత్యునకుఁ బోల;
మాంబకు నందను లమితయశులు
కసువనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి;
సింగధీమణియు నంచితగుణాఢ్యు.
లుద్భవించిరి తేజంబు లూర్జితముగ
సొరది మూర్తి త్రయం బన శుభ్రకీర్తిఁ
బరఁగి రందులఁ గసువనప్రభువునకును
ముమ్మడమ్మను సాధ్వి యిమ్ములను వెలసె.

ఉ.
ఆడదు భర్తమాట కెదురాడదు వచ్చినవారి వీఁడగా
నాడదు పెక్కుభాష లెడనాడదు వాకిలి వెళ్ళి, కల్ల మా
టాడదు మిన్నకేని సుగుణావళి కిందిరగాక సాటి యే
చేడియ లేదు చూరికుల శేఖరు కస్వయ ముమ్మడమ్మకున్.

క.
ఆ కసువయమంత్రికిఁ బు
ణ్యాకల్పశుభాంగి ముమ్మడమ్మ మమున్న
వ్యాకుల చిత్తుల నిరువుర
శ్రీకర గుణగణులఁ బుణ్యశీలురఁ గాంచెన్.

క.
అంగజసమ లావణ్య శు
భాంగులు హరి దివ్యపదయుగాంబుజ విలస
ద్భృంగాయమాన చిత్తులు
సింగయ తెలగయలు మంత్రిశేఖరు లనగన్.

క.
అందగ్రజుండు శివపూ

    జం దనరినవాడ విష్ణు । చరితామృత ని
ష్యంది పటువాగ్విలాసా
నందోచితమానసుండ । నయకోవిదుడన్.

ఈతఁడు షష్ఠ్యంతములుగూడ వ్రాసియున్నాడు.

క.
శ్రీపతికి మత్పతికి నుత
గోపతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం
తాప నివారణ మతికిని
బ్రాపితసనకాది తతికి బహుతర ధృతికిన్,

భాగవతము నశించినభాగమును పూరించినవారు భాగవతములోని యుత్సన్న భాగముల పూరించినవారిలో సింగన పోతనకవిత్వగమనికలను గమనించియే రచించియున్నాడని దోచుచున్నది. ఈ క్రిందిపద్యములీ విషయమును రూఢిసేయునవిగా నున్నవి.

క.
పుణ్యంబై, మునివల్లభ
గణ్యంబై, కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యా
రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబులలోన్.

క.
మోదం బై పరిదూషిత
ఖేదం బై శాబరీద్ధ కిలికించిత దృ
గ్భేదం బై బహుసౌఖ్యా
పాదం బై యొప్పు వింధ్యపాదంబునకున్.

క.
విడిచితి భవబంధంబుల
నడఁచితి మాయావిమోహ మైన తమంబు
న్నొడిచితి నరివర్గంబులఁ
గడచితి నా జన్మ దుఃఖ కర్మార్ణవమున్.

క.
పుట్టితి వజు తనువునఁ జే
పట్టితివి పురాణపురుషు భజనము పదముల్
మెట్టితివి దిక్కులం దుది
ముట్టితివి మహాప్రబోధమున మునినాథా!

ఇతడును పోతనవలె షష్ఠస్కంథమును అద్వైతపరముగనే తెనిగించెను.ఇందులకు ఉదాహరణములు.

                      షష్ఠస్కంథము

సీ.
అఖిల భూతములందు నాత్మరూపంబున;
నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు
బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును మ;
హత్సేవనీయుఁ డహర్నిశంబు
వందనీయుఁడు భక్త వత్సలుం డత్యంత;
నియతుఁడై సతతంబు నియతబుద్ధి
నాత్మరూపకుఁడగు హరికథామృతమును;
గర్ణ పుటంబులఁ గాంక్ష దీరఁ
గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ
విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి
విష్ణుదేవుని చరణారవింద యుగము
కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర!

వ.
దేవా। రజ్జవునందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబు చేత బ్రహ్మంబైన నీ యందు బ్రబంచభ్రాంతి గలిగెడిని.

వ.
కావున గుణంబులును, గుణియును, భోక్తయును, భోగ్యంబును …. హర్తయు హాస్యంబును నుత్పత్తిస్థితిలయైక కర్తయై సర్వాత్కృష్ణుండైన యప్పరమేశ్వరుండె కాని యన్యంబులేదు.

         ఈతఁడును దనకు సహాయముగా శ్రీధరుల వ్యాఖ్యానమునేయూతగొని యున్నాఁ డు. ఇతఁడు భాగవతములోని యితర భాగముల దెనిగించినవారికంటె నెక్కువవాడని బేర్కొనవచ్చును. 

                       గంగన

ఈతఁడు పంచమస్కంధమును దెనిగించెను. ఈతనికవిత్వము సింగన కవిత్వముకంటె దక్కువయని చెప్పవచ్చును . అయినను యితని కవిత్వము లలితముగను సుకుమారముగను నుండును. ఇతఁడు మూలమును సరిగాననుసరింపలేదు. మూలమున నున్నదానిని చాలవరకు తగ్గించినట్లు గనపడుచున్నది. ఈతని ఆంధ్రీకరణమున కుదాహరణములు.

శ్లో
బాణావిమౌ భగవతశ్శతపత్రౌకాంతావపుంఖరుచిరావతితిగ్మదంతతౌ।
కస్మైయుయుక్షంసివనేవిహరన్న విద్మక్షేమాయనోజడధియాంతవలిక్రమోస్తు.

                     తెనుగు

క.
పొలుపగుచున్న విలాసం
బుల నంగజుబాణములను । బోలెడు నీచం
చల సత్కటాక్షవీక్షణ
ముల నెవ్వని నింతి। చిత్త । మునఁగలచెదవే.

      ఈపద్యమున మూలమునందలి విశేషణములు పెక్కులు కానరావు. 

శ్లో
శిష్యా ఇమేభగవతః పరితః పఠంతి
గాయంతి సామ సరహాస్యమజస్రమీశః
యుష్మచ్ఛిఖావిలులతాస్సుమనోభివృష్టీః
సర్వేభజంత్యషిగణా. ఇవవేదశాఖాః

చ.
చెదరగవేదముల్ చదువు । శిష్యులపైఁదగ బుష్పవృష్టిస
మ్మదమున వంతలోఁగురియు । మాడ్కిని మన్మథసామగానముల్
చదివెడు శిష్యులో యనఁగ । షట్పదపంక్తులు మ్రోయఁ గావడిం
బదపడి మీదరాలు గచ । భారమునందుల జారుక్రొవ్విరుల్.

    రెండవదానియందు మూలార్థరీతి గానుపించదు. పోతనాదుల కవిత్వమునందుగల స్వకపోలకల్పితములగు వర్ణనలు యీతని కవిత్వమున నెందును గానరావు. ఈతడును శ్రీధరులవారి వ్యాఖ్యానమునే సహాయముగా గొనియుండెను. మరియు నీతఁడీ స్కంథమును నద్వైతపరముగనే తెనిగించెను.

                         వెలిగందల నారయ

ఈతడు ఏకాదశద్వాదశస్కందములను రచించెను. ఈ రెండు స్కందము లును మూలమునకు సరిగానుండక మిగుల క్లుప్తీకరింపబడినవి. కొన్నియెడల మూలమునందలి యభిప్రాయములకు విరుద్ధముగా గూడ నుండును.

 ఏకాదశస్కందమున త్రయోదశాధ్యాయమున శ్రీ విష్ణుండు హంస

రూపియైచేసిన తత్త్వోపదేశము. “వస్తునోయదా నానాత్వమాత్మనః ప్రశ్న ఈశ్వరః” అను శ్లోకములు గలవు. వానిని ఆంధ్రీకరించునెడల నైదారుపంక్తుల వచనముతో వదలివైచెను. ఈస్కందమున సంస్కృుతంబునగల భిక్షుతాదులు ఆంధ్రమున లేవు. మొత్తముమీద నీ స్కందమున నాల్గవపాలుమాత్రమే తెనిగింపబడినదని చెప్పవచ్చును. మరియు నీ రెండు స్కందములును వ్రాతప్రతులు పరిశీలించిన నెందును అద్వైతపరముగా నాంధ్రీకరింపబడినట్లు దోపదు కాని యచ్చుప్రతులందు స్పష్టముగా నద్వైతపరముగా దెనిగింపబడినట్లు గాన్పించుచున్నది. వ్రాతపతుల పాఠములను గమనించితిమేని యవి రెండును విశిష్టాద్వైతపరముగా దెనిగింపబడినవనుట తెల్లముగాగలదు.

                పోతన భాషాంతరీకరణము.

పోతన భాషాంతరీకరణము యెంతవఱకుమూలము ననుసరించి యున్నదో తెలుపుటకు మరికొన్ని యుదాహరణము లిచ్చుచున్నాడను.

శ్లో.

ఆత్మారామశ్చమునయో నిర్గ్రంధా అప్యురుక్రమే

కుర్వంతహైతుకీంభక్తి మిత్థంభూతగుణో హరిః

క.
ధీరులు నిరపేక్షులు నా
త్మారాములునైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టి వాఁ, డనవ్యచరిత్రా!

శ్లో
నమః పరస్మై పురుషాయభూయసే

    సదుద్భవస్థాననిరోధలీలయా
గృహీతశక్తి త్రితయాయదేహినా
మంతర్భవాయాననపలభ్య వర్త్మనే

మ.
పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్.

శ్లో
యత్కీర్తనం యత్స్మరణంయదీక్షణం

     యద్వందనం యచ్ఛ్రవణం యదర్హణం
లోకస్య సద్యో విధునోతికల్మషం
తస్మైసుభద్రశ్రవసే నమోనమః

ఉ.
ఏ విభువందనార్చనములే విభుచింతయు నామకీర్తనం
బే విభులీల లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

శ్లో
ఏకస్స్వమాయోజగతస్సిసృక్షయా

     ద్వితీయయాత్మన్యది యోగమాయయా
సృజస్యదః పాసిపునర్గ్రసిష్యసే
యదోర్ణనాభిర్బగవన్ స్వశక్తిభిః.

క.
ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

శ్లో.
దిదృక్షవోయస్యపదసహి మంగళం

     విముక్తిసంగామునయస్సుసాధవః
చఠంత్యలోకవ్రతమవ్రణంవనే
భూతాత్మభూతాస్సుహృదస్సమేగతిః.

ఆ.
ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్యపదము వాఁడు దిక్కు నాకు.

శ్లో
కస్యాంశ్చిత్పూతనాయంత్యాం కృష్ణాయంత్యపిబత్త్ససం

     తోకయిత్వారుదంత్యన్యాపదాహంచ్ఛకటాయతీం
దైత్యయిత్వాజహారాన్యా మేకా కృష్ణార్బభావనాం
కృష్ణరామాయితే ద్వేతుగోపవత్సయితాః పరాః
వత్సయితాన్ గృహీత్వాన్యాభ్రామయిత్వావ్యపాతయత్
కృష్ణాయితాజఘానాన్యాతత్రై కాంతుబకాయితాం
అహూయ దూరగాయద్వత్కృష్ణస్తమనుకుర్వతీం.

సీ.
పూతన యై యొక్క పొలఁతి చరింపంగ;
శౌరి యై యొక కాంత చన్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో;
బండి నే నను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ;
హరి నని వర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ;
బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ
బసుల మనెడి సతుల భరతముఖ్య!

శ్లో
జయతి తేధికంజన్మనా వజ్ర

       శ్రయతయిందిరా శశ్వదత్రహి
దయిత దృశ్యతాందిక్షుతావ కా
స్త్వయిదృతాసవస్త్వాం విచిన్వతే.

క.
నీవు జనించిన కతమున
నో! వల్లభ! లక్ష్మి మంద నొప్పె నధికమై
నీ వెంటనె ప్రాణము లిడి
నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్.

శ్లో.
శరదుదాశయే సాధుజాతస

      త్సరసిజోదర శ్రీమృషాదృశా
సర తనాధతే శుల్క దాసికా
వరదనిఘ్నతో నేహకిం వధః.

క.
శారదకమలోదరరుచి
చోరకమగు చూపువలన సుందర! మమ్ముం
గోరి వెల యీని దాసుల
ధీరత నొప్పించు టిది వధించుట గాదే?.

శ్లో.
ప్రణతదేహినాం పాపకర్శనం

      తృణచరానుగం శ్రీనికేతనం
ఫణిఫణార్పణం తేపదాంబుజం
కృణుకు చేషువః కృంధిహృచ్ఛయం.

ఉ.
గోవుల వెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్ట భుజంగఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద మోపి త
ద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా!.

               పోతన —వర్ణనములు

ఒకచో వర్ణించినవిషయమునే వర్ణించునెడల పోతనయుత్తరోత్తర మెక్కుడు రసవంతముగా నుండునట్లు వర్ణించును.

ఉ.
అందుఁ దమాల సాల వకుళార్జున నింబ కదంబ పాటలీ
చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మా
కంద కుచందనక్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా
కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్.

క.
పరిపక్వఫలభరానత
తరుశాఖానికర నివసితస్ఫుట విహగో
త్కర బహుకోలాహలరవ
భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్.

క.
అతి నిశిత చంచు దళన
క్షత నిర్గత పక్వఫలరసాస్వాదన మో
దిత రాజశుక వచోర్థ
శ్రుతఘోషము సెలఁగ శ్రవణసుఖదం బగుచున్.

క.
లలితసహకారపల్లవ
కలితాస్వాదన కషాయకంఠ విరాజ
త్కలకంఠ పంచమస్వర
కలనాదము లుల్లసిల్లఁ గడురమ్యములై.

క. అతుల తమాల మహీజ
ప్రతతిక్షణజాత జలదపరిశంకాంగీ
కృత తాండవఖేలన విల
సితపింఛవిభాసమాన శిఖి సేవ్యంబై.

క.
కారండవ జలకుక్కుట
సారస బక చక్రవాక షట్పద హంసాం
భోరుహ కైరవ నవక
ల్హార విరాజిత సరోరుహాకర యుతమై.

క.
కరి పుండరీక వృక కా
సర శశ భల్లూక హరిణ చమరీ హరి సూ
కర ఖడ్గ గవయ వలిముఖ
శరభప్రముఖోగ్ర వన్యసత్త్వాశ్రయ మై.

తృతీయస్కందమున జెప్పబడిన యీవర్ణనమును మార్చి పెంచి అష్టమస్కందమున గజేంద్రమోక్షమున త్రికూటమునందలి మహారణ్యము వర్ణించు వచనమున పెంపొందించియున్నాఁడు. ఆ వచనమంతయు నిచ్చట నొసంగిన గ్రంథ విస్తరమగునను తలంపున విరమింపబడియెను.

             పోతన – అంత్యానుప్రాసము
పోతన అంత్యానుప్రాసమును యెక్కువగా వాడియున్నాఁడు. క్రియతోనే పద్యము ప్రారంభమైనను యది చక్కని యంత్యప్రాసతో నలరారుచు చదువుటకు ముద్దులు మూటగట్టుచుండును.

శా,
పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్,
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్,
సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్,
దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్.

మ.
అటఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
నటదిందిందిర వారముం, గమఠ మీనగ్రాహ దుర్వారమున్,
వట హింతాల రసాల సాల సుమనో వల్లీకుటీతీరముం,
జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

మ.
కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్, బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రముఁ, బాలితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్.

మ.
కని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై
దనుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ
తనశృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా
జన చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్.

మ.
కనె నక్రూరుఁడు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ ధేను దో
హన వాటీగతులన్ నలంకృతుల నుద్యద్భాసులం బీత నీ
ల నవీనోజ్జ్వలవాసులం గుసుమమాలాధారులన్ ధీరులన్
వనితాకాములఁ గృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్.

మ.
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం
గలహంసావృతహేమపద్మపరిఖా కాసారకం దోరణా
వళిసంఛాదితతారకం దరులతావర్గానువేలోదయ
త్ఫలపుష్పాంకుర కోరకన్ మణిమయప్రాకారకన్ ద్వారకన్.

మ.
దివిజానీకవిరోధి మ్రొక్కెఁ, గని వాగ్దేవీమనోనేతకున్
సవిశేషోత్సవ సంవిధాతకు, నమత్సంత్రాతకున్, సత్తపో
నివహాభీష్ట వర ప్రదాతకు, జగన్నిర్మాతకున్, ధాతకున్,
వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్.

క.
కనియెన్ నారదుఁ డంతన్
వినయైక విలాసు నిగమ విభజన విద్యా
జనితోల్లాసున్ భవదుః
ఖనిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్.

మ.
కనియెం గృష్ణుఁడు సాధునీరము మహాగంభీరముం బద్మకో
కనదాస్వాద వినోద మోద మదభృంగ ద్వంద్వ ఝంకారమున్
ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల
స్వనవిస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్.

మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్.

ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

ఉత్తరహరివంశమున ఎఱ్ఱాప్రగడ ఈ అలంకారమును వాడి యున్నాడు.

క.
ధీమంతులంతగాంచిరి

   గోమంతము విపినకుసుమ । కుంచితశబరీ
సీమంతము నిర్ఘరకణ
హేమంతము గనకమ । హీమంతంబున్.

క.
చారుశరీరద్యుతిజిత

   శారదనీరదుడు ధీవి । శారదుడు భవో
   త్తారదు డాశ్రితవితతికి
నారదుడు తదీయగృహము । కు నేతెంచెన్.

ఈ అలంకారమునే అనేకవిధములుగామార్చి పోతన వాడియున్నాడు.

క.
భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచితభాషణముల్.

క .
పావనములు దురితలతా
లావనములు నిత్యమంగళప్రాభవ సం
జీవనములు లక్ష్మీ సం
భావనములు వాసుదేవు పదసేవనముల్

క.
మంతనములు సద్గతులకుఁ
బొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంతనపూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతి చింతనముల్.

క.
ధృతిచెడి లోఁబడె మల్లుం
డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్
జితకరికిన్ ధృతగిరికిం
దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్.

క.
స్ఫురితవిబుధజన ముఖములు
పరివిదళిత దనుజనివహపతి తనుముఖముల్
గురురుచి జిత శిఖిశిఖములు
నరహరిఖరనఖము లమరు నతజనసఖముల్.

చ.
చనిచని కాంచిరంత బుధసత్తము లంచిత నిత్య దివ్యశో
భన విభవాభిరామముఁ బ్రపన్నజనస్తవనీయ నామమున్
జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోకపా
లన గుణధామముం బురలలామముఁ జారువికుంఠధామమున్.

చ.
మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.

ఉ,
భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో
ల్లాసముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై
లాసముఁ గాంతి నిర్జిత కులక్షితిభృత్సుమహద్విభాసమున్.

గీర్వాణపదముల — భూయిష్ఠము — సప్తమస్కందము
క.
అడిగెద నని కడువడిఁ జను;
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

క.
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

సింగన కూడ నీ యలంకారమును అనుసరించియున్నాడు.

మ.
కనియెన్ బ్రాహ్మణుఁ డంత్యకాలమున వీఁకన్ రోషనిష్ఠ్యూతులన్
ఘనపీనోష్ఠ వికారవక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్
జన సంత్రాస కరోద్యతాయత సుపాశశ్రేణికా హేతులన్
హననవ్యాప్తి విభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్.

శా.
హాలా ఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో
ఖేలాపాలన యోగ్య భ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో
హేలాలింగన భంగి వేషవతితోఁ నిచ్ఛావతీమూర్తితోఁ
గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై.

  ప్రధమస్కందము- పోతన

మ.
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

మ.
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

మ.
నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

క.
తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.

సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;
జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;
బైనున్న పచ్చనిపటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;
మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

మ.
తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

క.
పలుకుల నగవుల నడపుల
నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.

ఆ.
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగమండపమునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది
దేవుఁ డమరు నాదు దృష్టియందు.

మ.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.

                 షష్ఠస్కందము—సింగన

సీ.
బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని;
కీలలు హరినామ కీర్తనములు;
గురుతల్ప కల్మష క్రూరసర్పములకుఁ;
గేకులు హరినామ కీర్తనములు;
తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య;
కిరణముల్ హరినామ కీర్తనములు;
మధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ;
గేసరుల్ హరినామ కీర్తనములు;
మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల
నలరు బ్రహ్మాది సురలకు నందరాని
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య
ఖేలనంబులు హరినామ కీర్తనములు;

సీ.
ముక్తికాం తైకాంత మోహన కృత్యముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
బహుకాల జనిత తపఃఫల సారముల్;
కేలిమై హరినామ కీర్తనములు;
పుణ్యమూలంబు లనపాయ పోషకంబు
లభిమతార్థంబు లజ్ఞాన హరణ కరము
లాగమాం తోపలబ్దంబు లమృతసేవ
లార్తశుభములు హరినామ కీర్తనములు.

         దశమస్కందము—ఉత్తరభాగము—పోతన

సీ.
కుచకుంభములమీఁది కుంకుమతో రాయు;
హారంబు లరుణంబు లగుచు మెఱయఁ;
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ;
యక కంకణప్రభ లావరింపఁ;
గదలిన బహురత్న కలిత నూపురముల;
గంభీర నినదంబు గడలుకొనఁగఁ;
గాంచన మణికర్ణికా మయూఖంబులు;
గండపాలికలపై గంతు లిడఁగఁ;
గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ;
బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి
వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.

వ.
అప్పుడు.

మ.
పతి యే రూపము దాల్చినం దదనురూపంబైన రూపంబుతో
సతి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా
సుతనున్ రుక్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా
చతురత్వంబున శౌరి యిట్లనియెఁ జంచన్మందహాసంబుతోన్.

మ.
బలశౌర్యంబుల భోగమూర్తి కులరూపత్యాగ సంపద్గుణం
బుల దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌; వారికిన్
నెలఁతా! తల్లియుఁదండ్రియుం సహజుఁడున్ నిన్నిచ్చినంబోక యీ
బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్?.

సీ.
లోకుల నడవడిలోని వారము గాము;
పరులకు మా జాడ బయలు పడదు;
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ;
రాజపీఠములకు రాము తఱచు;
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు;
నిష్కించనుల మేము; నిధులు లేవు;
కలవారు చుట్టాలు గారు; నిష్కించన;
జనబంధులము; ముక్తసంగ్రహులము.
గూఢవర్తనులము; గుణహీనులము; భిక్షు
లైన వారిఁ గాని నాశ్రయింప;
మిందుముఖులు దగుల; రిటువంటి మముబోఁటి
వారి నేల దగుల వారిజాక్షి!.

క.
సిరియును వంశము రూపును
సరియైన వివాహసఖ్య సంబంధంబుల్‌
జరుగును; సరి గాకున్నను
జరగవు; లోలాక్షి! యెట్టి సంసారులకున్.

క.
తగదని యెఱుఁగవు మమ్ముం
దగిలితివి మృగాక్షి! దీనఁ దప్పగు; నీకుం
దగిన మనుజేంద్రు నొక్కనిఁ
దగులుము; గుణహీనజనులఁ దగునే తగులన్?.

చ.
అలికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్
సొలవక కర్ణరంధ్రముల సూదులు సొన్పిన రీతిఁగాఁగ బె
బ్బులి రొద విన్న లేడి క్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్.

వ.
ఇట్లు వ్రాలిన.

మ.
ప్రణతామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే
క్షణ విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో
షణ నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా
రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్.

సీ.
కని సంభ్రమంబునఁ దనువునం దనువుగా;
ననువునఁ జందనం బల్ల నలఁది
కన్నీరు పన్నీటఁ గడిగి కర్పూరంపుఁ;
బలుకులు సెవులలోఁ బాఱ నూఁది
కరమొప్ప ముత్యాలసరుల చి క్కెడలించి;
యురమునఁ బొందుగా నిరవుకొలిపి
తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి;
వదలిన భూషణావళులఁ దొడిగి.
కమలదళ చారు తాలవృంతమున విసరి
పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందుపఱిచి
చిత్త మిగురొత్త నొయ్యన సేదఁదీర్చి
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి.

సీ.
నీరదాగమమేఘనిర్యత్పయః పాన;
చాతకం బేగునే చౌటి పడెకుఁ?
బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు;
కీరంబు సనునె దుత్తూరములకు?
ఘనర వాకర్ణనోత్కలిక మయూరము;
గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ?
గరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ;
మరుగునే శునక మాంసాభిలాషఁ
బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త
మన్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ?
భక్తమందార! దుర్భర భవవిదూర!

           పంచమస్కంధము— గంగన

సీ.
ధరణీశ! మాయచేతను దాఁటఁగారాని;
పదమునఁ బెట్టంగఁబడ్డ జీవుఁ
డెలమిమై గుణకర్మములఁ జేయుచును లాభ;
మాశించి తిరుగు బేహారి మాడ్కి
ఫల మపేక్షించుచుఁ బాయక జీవుండు;
సంసారగహన సంచారి యగుచు
ననవరతము నుండు నా మహావనమందుఁ;
గామ లోభాది తస్కరులుగూడి.
ధరణి విజితేంద్రియుఁడు గాని నరునిఁబట్టి
ధర్మ మనియెడి యా మహాధనమునెల్ల
నరసి గొనిపోవుచుండుదు రనుదినంబుఁ
గాన సంసారమందు నాకాంక్ష వలదు.

క.
అరయఁగ సంసారాటవిఁ
దరలక యా పుత్రమిత్ర దారాదు లనం
బరఁగుచు నుండెడు వృకములు
పరువడి నరబస్తములను భక్షించు వడిన్.

తరలము.
మలసి సంసృతి ఘోరకానన మందిరంబుల నెల్లనుం
జెలఁగి గుల్మలతాతృణాదులచేత గహ్వరమైన ని
శ్చలనికుంజములందు దుర్జన సంజ్ఞలంగల మక్షికం
బుల నిరోధము దన్ను సోఁకినఁ బొందుచుండు విపద్దశన్.

ఆ.
మఱియు నీ గృహస్థమార్గంబునం దెల్ల
విషయములను బొంది విశ్వమెల్లఁ
గడఁకతోడ నిట్లు గంధర్వలోకంబుఁ
గాఁ దలంచి మిగుల మోదమందు.

ఆ.
మరిగి కాననమునఁ గొఱవిదయ్యముఁ గాంచి
యగ్నిఁగోరి వెంట నరుగుమాడ్కిఁ
గాంచనంబు గోరి కలవారియిండ్ల పం
చలను దిరుగు నరుఁడు చలనమంది.

ఆ.
బహుకుటుంబి యగుచు బహుధనాపేక్షచే
నెండమావులఁగని యేగు మృగము
కరణిఁ బ్రేమఁజేసి గురువులు వాఱుచు
నొక్కచోట నిలువకుండు నెపుడు.

ఆ.
మఱియు నొక్కచోట మత్తుఁ డై పవన ర
జోహతాక్షుఁ డగుచుఁ జూపు దప్పి
దిక్కెఱుంగ కొండుదిశ కేగు పురుషుని
కరణిఁ దిరుగు నరుఁడు నరవరేణ్య!.

       వీరభద్రవిజయము.

సీ.

కమలషండము నున్నఁగాఁ జేసి యిరుసుగాఁ; 

గావించి కెందమ్మికండ్లఁ గూర్చి;
తగ నించు మోసుల నొగలుగాఁ గావించి;
కర మొప్పఁ గేదెఁగికాడి వెట్టి;
సంపెంగమొగ్గల చనుగొయ్య లొనరించి;
పల్లవంబులు మీఁదఁ బఱపుఁ జేసి;
చెలువైన పొగడదండలచేత బిగియించి;
యెలదీఁగె పలుపులు లీలఁ జొనిపి;
తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెన వెట్టి;
గండురాజకీరగములఁ గట్టి;
మెఱయ చిగురుగొడుగు మీనుటెక్కము గ్రాలఁ
దేరు బన్ని సురభి తెచ్చె నపుడు.

సీ.
ఖద్యోత బృందంబు గర్వింప వచ్చునే;
పరఁగ దేజః ప్రదీపంబుమీఁద;
పరఁగఁ దేజః ప్రదీపంబు శోభిల్లునే;
యాభీల ఘోర దావాగ్నిమీఁద;
ఆభీల ఘోర దావాగ్ని పెంపేర్చునే;
పవలింటి భానుబింబంబుమీఁద;
పవలింటి భానుబింబంబు వెలుంగనే;
ప్రళయకాలానల ప్రభలమీఁద;
ప్రళయకాలగ్ని కోటిచేఁ బ్రజ్వరిల్లు
మంటఁ గలకంఠఁ బరఁగు ముక్కంటిమీఁద
; వ్రాల నేరదు నీ పెంపు దూలుఁ గాని
జితజగజ్జనసంఘాత చిత్తజాత!”

మ.
బలభేద్యాది సురాళితోఁ బలుకు నా పంతంబు చెల్లింప ను
త్పలగంధీ తలఁపొందడె గాని యతఁ డీ బ్రహ్మాండభాడావళల్
కలఁగం జేయు సదాశివుం డని యెఱుంగం జాలుదుం జాలునే
కలకంఠీరవ! కంబుకంఠి! శివు వక్కాణింప నిం కేటికిన్.

శా.
ఏరా దక్ష! యదక్షమానస! వృథా యీ దూషణం బేలరా?
యోరీ పాపము లెల్లఁ బో విడువరా; యుగ్రాక్షుఁ జేపట్టరా;
వైరం బొప్పదురా; శివుం వలఁపరా వర్ణింపరా; రాజితో
త్కారాతుం డగు నీలకంఠుఁ దెగడంగా రాదురా; దుర్మతీ!

సీ.
కలయ నీరేడులోకముల దొంతులతోడఁ;
బాగొప్ప మూఁడు రూపములతోడ;
మూఁడు మంత్రములతో మూఁడు కాలములతో;
భ్రమయించు పుణ్యపాపములతోడ;
సలలిత ఖేచరాచర జంతుకోటితో;
భూరితేజములతో భూతితోడఁ;
జంద్రానలావనీ జల వాయు గగనాత్మ
తరణులతోడఁ; జిత్రములతోడ;
భర్గదివ్యమహిమ బ్రహ్మాండములు సేయుఁ
గాచు నడఁచుఁ గాని కానరాదు
నిఖిల మెల్లఁ దాన నీవును నేనును
దాన కాన నింద దగదు సేయ.

ఉ.

ఒండొరు సుందరాంబువుల నోలి మునింగియుఁ దేలి తెప్ప లై
యొండొరుఁ బాయ లే కునికి నున్మదు లై నిజ బోధ వీథి నొం
డొండన దెప్ప లై గుణగణోన్నతి కూటమిఁ జేర్చి శంభుఁ డా
కొండలరాజుకూఁతునకుఁ గూరిమి నిట్లనియెన్ బ్రసన్నుఁ డై.

శా.
ఓ వామేక్షణ! యో కురంగనయనా! యో కాంత! నీ యిష్టమై
నీవా నన్నును నేలుకొంటివి సతీ నీ వాఁడ నే నైతి ని
చ్చో వద్దింకను నంది నెక్కి గడఁకన్ శోభిల్లగాఁ బ్రీతితో
రావే పోదము వెండికొండకు మనోరాగంబుతోఁ గన్యకా!

           భాగవతము – భీభత్సము

శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

                 భాగవతము—భక్తి

శా.

అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.

సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే? ;
పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే?
; ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? ;
తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే? ;
తనుకుడ్యజాల రంధ్రములు గాక;.
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.

సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;.
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.

సీ.
సంసారజీమూత సంఘంబు విచ్చునే? ;
చక్రిదాస్యప్రభంజనము లేక;
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక;
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే? ;
హరిమనీషా బడబాగ్ని లేక;
ఘనవిప ద్గాఢాంధకారంబు లడగునే? ;
పద్మాక్షునుతి రవిప్రభలు లేక;.
నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంజనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర.

       భాగవతము — శృంగారము.

శా.
శ్రీకంఠా! నిను నీవ యేమఱకు మీ చిత్తంబు రంజించెదన్;
నాకద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం
తాకారంబు జగద్విమోహనము నీకై చూచెదేఁ జూపెదం;
గైకో నర్హము లండ్రు కాముకులు సంకల్పప్రభావంబులన్.

సీ.
ఒక యెలదోటఁలోనొకవీథి నొకనీడఁ;
గుచకుంభముల మీఁదఁ గొంగు దలఁగఁ
గబరికాబంధంబుఁ గంపింప నుదుటిపైఁ;
జికురజాలంబులు చిక్కుపడఁగ
ననుమానమై మధ్య మల్లాడఁ జెక్కులఁ;
గర్ణకుండల కాంతి గంతు లిడఁగ
నారోహభరమున నడుగులుఁ దడఁబడ;
దృగ్దీప్తి సంఘంబు దిశలఁ గప్ప
వామకరమున జాఱిన వలువఁ బట్టి
కనక నూపుర యుగళంబు గల్లనంగఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ
బంతిచే నాడు ప్రాయంపుటింతిఁ గనియె.

శా.
ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము
న్నే కల్పంబుల యందుఁ గాన; మజుఁ డీ యింతిన్ సృజింపంగఁ దా
లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరఁగా
నే కాంతుండుఁ గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?.

ఆ.
వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల
శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి
తఱలి యెఱుకలేక మఱచె గుణంబు
ల నాలి మఱచె నిజగణాలి మఱచె.

ఆ.
ఎగురవైచి పట్ట నెడలేమి చే దప్పి
వ్రాలు బంతి గొనఁగ వచ్చునెడను
బడతి వలువ వీడి పడియె మారుతహతిఁ
జంద్రధరుని మనము సంచలింప.

మ.
రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్ రోమాంచ విభ్రాజితం
గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల
త్కచ బంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దనకాంత చూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్..

ఆ.
పదము చేరవచ్చు ఫాలక్షుఁ బొడగని
చీర వీడిపడిన సిగ్గుతోడ
మగువ నగుచుఁ దరుల మాటున డాఁగెను
వేల్పుఱేఁడు నబల వెంటఁ బడియె.

మ.
ప్రబలోద్యత్కరిణిం గరీంద్రుఁడు రమింపన్ వచ్చు లీలన్ శివుం
డబలా పోకుము పోకుమీ యనుచు డాయం బాఱి కెంగేలఁ ద
త్కబరీ బంధము పట్టి సంభ్రమముతోఁ గౌగిళ్ళ నోలార్చె నం
త బహిః ప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహునిర్ముక్త యై.

సీ.
వీడి వెన్నున నాడు వేణీభరంబుతో;
జఘన భారాగత శ్రాంతితోడ
మాయావధూటి యై మఱలిచూచుచుఁ బాఱు;
విష్ణు నద్భుతకర్ము వెంటఁదగిలి
యీశాను మరల జయించె మరుం డనఁ;
గరిణి వెన్కను కరి కరణిఁ దాల్చి
కొండలు నేఱులుఁ గొలఁకులు వనములు;
దాఁటి శంభుఁడు చనం దన్మహాత్ము.
నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ
బడిన చోటెల్ల వెండియుఁ బైడి యయ్యె
ధరణి వీర్యంబు పడఁ దన్నుఁదా నెఱింగి
దేవ మాయా జడత్వంబు దెలిసె హరుఁడు.

క.
జగదాత్మకుఁడగు శంభుఁడు
మగిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్
విగతత్రపుఁడై నిలిచెను
మగువతనం బుడిగి హరియు మగవాఁ డయ్యెన్.

ఆ.
కాము గెలువవచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపుటంపఱ గెలువంగ
వశము గాదు త్రిపురవైరి కైన.

సీ.
నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱఁ గాని;
తరలి పోవంగఁ బాదములు రావు;
నీ కరాబ్జంబులు నెఱి నంటి తివఁ గాని;
తక్కిన పనికి హస్తములు చొరవు;
నీ వాగమృతధార నిండఁ గ్రోలనె గాని;
చెవు లన్యభాషలఁ జేరి వినవు;
నీ సుందరాకృతి నియతిఁ జూడఁగఁ గాని;
చూడ వన్యంబులఁ జూడ్కి కవలు;
నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ;
లొల్ల ననుచుఁ బలుకనోడ వీవు
మా మనంబు లెల్ల మరపించి దొంగిలి
తేమి చేయువార మింకఁ? గృష్ణ!

చ.
సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్
సరసిజనేత్ర! మా తపము సంపదఁ జేరితి మెట్టకేలకున్
మరలఁగ లేము మా మగల మాటల నొల్లము; పద్మగంధముల్
మరగినతేఁటు లన్య కుసుమంబుల చెంతనుఁ జేరనేర్చునే?

ఆ.
సవతు లేక నీ విశాల వక్షఃస్థలిఁ
దొళసితోడఁ గూడఁ దోయజాక్ష!
మనుపు మనుచు నెపుడు మాకాంత నీ పాద
కమలరజముఁ గోరుఁ గాదె కృష్ణ!

ఉ.
అత్తలు మామలున్ వగవ నాఱడి కోడక నాథులన్ శుగా
యత్తులఁ జేసి యిల్వరుస లాఱడి పోవఁగ నీదు నవ్వులన్
మెత్తని మాటలన్ మరుఁడుమేల్కొని యేఁచిన వచ్చినార మే
పొత్తుల నొల్లమో పురుషభూషణ! దాస్యము లిచ్చి కావవే.

మ.
మగువల్ చిక్కరె తొల్లి వల్లభులకున్? మన్నించి తద్వల్లభుల్
మగపంతంబు తలంపరే? తగులముల్ మా పాలనే పుట్టెనే?
మగవారాడెడి మాటలే తగవు నీ మాటల్ మనోజాగ్నిచేఁ
బొగులం జాలము; కౌఁగలింపుము మముం బుణ్యంబు పుణ్యాత్మకా

ఉ.
కుండలదీప్త గండమును గుంచితకుంతల ఫాలమున్ సుధా
మండిత పల్లవాధరము మంజులహాస విలోకనంబునై
యుండెడు నీ ముఖంబుఁ గని యుండఁగ వచ్చునె? మన్మథేక్షు కో
దండ విముక్త బాణముల దాసుల మయ్యెద; మాదరింపవే.

సీ.
నీ యధరామృత నిర్ఝరంబులు నేడు;
చేరి వాతెఱలపైఁ జిలుకకున్న
నీ విశాలాంతర నిర్మలవక్షంబుఁ;
గుచకుట్మలంబులఁ గూర్పకున్న
నీ రమ్యతర హస్తనీరజాతంబులు;
చికురబంధంబులఁ జేర్పకున్న
నీ కృపాలోకన నివహంబు మెల్లన;
నెమ్మొగంబుల మీఁద నెఱపకున్న.
నీ నవీన మాననీయ సల్లాపంబు
కర్ణరంధ్రదిశలఁ గప్పకున్న
నెట్లు బ్రతుకువార? మెందుఁ జేరెడువార?
మధిప! వినఁగఁ దగదె యాఁడుకుయులు.

మ.
భవదాలోకన హాస గీతజములై భాసిల్లు కామాగ్నులన్
భవదీయాధరపల్ల వామృతముచేఁ బాఁపం దగుం, బాఁపవే
ని వియోగానల హేతిసంహతులచే నీఱై, భవచ్చింతలన్
భవదంఘ్రిద్వయవీధిఁ బొందెదము నీ పాదంబులాన ప్రియా!.

క.
తరు మృగ ఖగ గో గణములు
కర మొప్పెడు నిన్నుఁ గన్నఁ గానము విన్నం
గరఁగి పులకించు, నబలలు
గరఁగరె నినుఁ గన్న నీదు గానము విన్నన్?.

సీ.
ఈ పంచబాణాగ్ని నేమిట నార్తుము;
నీ మంజువాగ్వృష్టి నెగడదేని?
నీ మన్మథాంభోధి నే త్రోవఁ గడతుము;
నీ దృష్టి నావ యై నిలువదేని?
నీ చిత్తజధ్వాంత మే జాడఁ జెఱుతుము;
నీ హాసచంద్రిక నిగుడదేని?
నీ దర్పకజ్వర మే భంగి నడఁతుము;
నీ నవాధరసుధ నింపవేని?.
నెట్లు నిర్వహింతు? మేలాగు మాలాగు;
కరుణ చేయ వేనిఁ గదియ వేని
మరుఁడు నిర్దయుండు మన నిచ్చునే? యశో
దా కుమార! యువతి ధైర్య చోర!.

సీ.
మానినీమన్మథు మాధవుఁ గానరే;
సలలితోదార వత్సకములార!
సలలితోదార వత్సక వైరిఁ గానరే;
సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే;
ఘనతర లసదశోకంబులార!
ఘనతర లసదశోకస్ఫూర్తిఁ గానరే;
నవ్య రుచిరకాంచనంబులార!.
నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే
గహనపదవిఁ గురవకంబులార!
గహనపదవి గురవక నివాసిఁ గానరే
గణికలార! చారుగణికలార!

సీ.
కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ;
మొనసి పాదాగ్రంబు మోపినాఁడు
సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ;
దృణములోఁ దోపఁదు తెఱవ జాడ
ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాఁ డిక్కడఁ;
గూర్చున్న చొప్పిదె కొమరు మిగులు
నింతికిఁ గెమ్మోవి యిచ్చినాఁ డిక్కడ;
వెలఁది నిక్కిన గతి విశదమయ్యె.
సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ
జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ
దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడఁ
ననఁగి పెనఁగియున్న యంద మొప్పె.

సీ.
ఒక యెలనాగ చెయ్యూఁదినాఁ డిక్కడ;
సరస నున్నవి నాల్గు చరణములును
నొక నీలవేణితో నొదిఁగినాఁ డిక్కడ;
మగ జాడలో నిదె మగువ జాడ
యొక లేమ మ్రొక్కిన నురివినాఁ డిక్కడ;
రమణి మ్రొక్కిన చొప్పు రమ్యమయ్యె
నొక యింతి కెదురుగా నొలసినాఁ డిక్కడ;
నన్యోన్యముఖములై యంఘ్రు లొప్పె.
నొకతె వెంటఁ దగుల నుండక యేగినాఁ
డడుగుమీఁదఁ దరుణి యడుగు లమరె
నబల లిరుగెలంకులందు రాఁ దిరిగినాఁ
డాఱు పదము లున్నవమ్మ! యిచట.

            భాగవతము—వేదాంతము.

సీ.
భూమీశ! విను మయ్య పూర్వకాలమునఁ బు;
రంజనుం డను నొక్క రాజు గలఁడు;
అతని కవిజ్ఞాతుఁ డనుపేరఁ దగిలి వి;
జ్ఞాతచేష్టితుఁ డగు సఖుఁడు కలఁడు;
ఆ పురంజనుఁడు పురాన్వేషియై ధరా;
చక్రంబుఁ గలయంగ సంచరించి
తన కనురూపమై పెనుపొందు పుర మెందు;
వీక్షింపఁ జాలక విమనుఁ డగుచు.
నే పురము లుర్విఁ బొడఁగనె నా పురములు
గామములఁ గోరు తనకు న క్కామములను
సీబొందుటకు వానిని ననర్హములుగఁ దన మ
నమునఁ దలఁచి యొకానొకనాఁ డతండు.

వ.
చనుచున్న సమయంబున హిమవత్పర్వత దక్షిణసానువులందు.

సీ.
వర నవద్వార కవాట గవాక్ష తో;
రణ దేహళీగోపురముల నొప్పి
ప్రాకార యంత్రవప్రప్రతోళీ పరి;
ఘట్టాల కోపవనాళిఁ దనరి
సౌవర్ణ రౌప్యాయస ఘన శృంగంబుల;
రమణీయ వివిధ గేహముల మించి
రథ్యాసభా చత్వరధ్వజ క్రీడాయ;
తన సుచైత్యాపణతతిఁ దనర్చి
మరకతస్పటిక విదూరమణి వినూత్న
మౌక్తికాయుత ఖచిత హర్మ్యములు గలిగి
విద్రుమద్రుమ వేదుల వెలయు నొక్క
పురముఁ గనియె భోగవతినిఁ బోలు దాని..

భాగవతము—రౌద్రము.

సీ.

పంచాననోద్ధూత పావకజ్వాలలు; 

భూనభోంతరమెల్లఁ బూరితముగ;
దంష్ట్రాంకురాభీల ధగధగాయితదీప్తి;
నసురేంద్రు నేత్రము లంధములుగఁ;
గంటకసన్నిభోత్కట కేసరాహతి;
నభ్రసంఘము భిన్నమై చలింపఁ;
బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై;
ఖరనఖరోచులు గ్రమ్ముదేర;.
సటలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి
పట్టె నరసింహుఁ డా దితిపట్టి నధిప!

క.
సరకుగొనక లీలాగతి
నురగేంద్రుఁడు మూషికంబు నొడసిన పగిదిన్
నరకేసరి దను నొడిసిన
సురవిమతుఁడు ప్రాణభీతి సుడివడియె నృపా!

క.
సురరాజవైరి లోఁబడెఁ
బరిభావిత సాధుభక్త పటలాంహునకున్
నరసింహునకు నుదంచ
త్ఖరతరజిహ్వున కుదగ్ర ఘన రంహునకున్.

మ.
విహగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా
గ్రహుఁడై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్.

భాగవతము — యుద్ధవర్ణనము.
సీ.
సమద పుష్పంధయ ఝంకారములు గావు;
భీషణకుంభీంద్ర బృంహితములు
వాయునిర్గత పద్మవనరేణువులు గావు;
తురగ రింఖాముఖోద్ధూతరజము
లాకీర్ణజలతరం గాసారములు గావు;
శత్రుధనుర్ముక్త సాయకములు
గలహంస సారస కాసారములు గావు;
దనుజేంద్రసైన్య కదంబకములు.
కమల కహ్లార కుసుమ సంఘములు గావు;
చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు
కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ?
వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు. ".

వ.
అనిన బ్రియమునకుఁ బ్రియంబు జనియింప డగ్గఱి.

ఉ.
దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ
తో నరుదెంతు" నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్.

వ.
ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబుల గ్రుచ్చి మురాసుర పాశపరివృతంబైన ప్రాగ్జోతిషంబు డగ్గరి.

మ.
గదచేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత
ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్ భంజించి చక్రాహతిం
జెదరన్ వాయుజలాగ్ని దుర్గముల నిశ్శేషంబులం జేసి భీ
ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్.

శా.
ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులున్
నాకారాతుల మానసంబులును భిన్నత్వంబు సెందంగ న
స్తో కాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రే
ఖాకాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణి చైతన్యమున్.

మ.
బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్.

వ.
కవి కలహంబునకు నరకాసురుండుగమకింపం దమకింపగ విలోకించి సంభ్రమంబున.

శా.
వేణిన్ జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ
బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీరసంరంభయై
యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్.

క.
జన్యంబున దనుజుల దౌ
ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ
జన్యవతిఁ జూచి యదురా
జన్యశ్రేష్ఠుండు సరససల్లాపములన్.

క.
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

క.
హరిణాక్షికి హరి యిచ్చెను
సురనికరోల్లాసనమును శూరకఠోరా
సురసైన్యత్రాసనమును
బరగర్వనిరాసనమును బాణాసనమున్.

శా.
ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే
షావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై
తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా
గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్.

క.
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!

పోతన శృంగారవీర రసమూల ప్రకర్షిత.
సీ.
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు;
శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు;
గండమండలరుచిఁ గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు;
బాణజాలప్రభాపటలి నడఁప
శరపాత ఘుమఘుమశబ్దంబు పరిపంథి;
సైనిక కలకల స్వనము నుడుప.
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.

మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

మ.
అలినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో
వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై.

సీ.
బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల;
రణరంగమున కెట్లు రాఁ దలంచె?
మగవారిఁ గనినఁ దా మఱుఁగుఁ జేరెడు నింతి;
పగవారి గెల్వనే పగిదిఁ జూచెఁ?
బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు;
ఖగపతి స్కంధమే కడిఁది నెక్కె?
సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య;
పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె?.
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?.

సీ.
వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ;
బాణాసనం బెట్లు పట్ట నేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ;
గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె?
సరవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే;
నిపుణత సంధించె నిశితశరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి;
యస్త్రమంత్రము లెన్నఁ డభ్యసించెఁ?.
బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే
గతి నొనర్చె సింహగర్జనములు?
ననఁగ మెఱసెఁ ద్రిజగదభిరామ గుణధామ
చారుసత్యభామ సత్యభామ.

శా.
జ్యావల్లీధ్వని గర్జనంబుగ; సురల్‌ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ;
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్.

సీ.
రాకేందుబింబమై రవిబింబమై యొప్పు;
నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై ఘన ధూమకేతువై;
యలరుఁ బూఁబోఁడి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై;
మెఱయు నాకృష్టమై మెలఁత చాప;
మమృత ప్రవాహమై యనల సందోహమై;
తనరారు నింతిసందర్శనంబు;.
హర్షదాయియై మహారోషదాయియై
పరఁగు ముద్దరాలి బాణవృష్ణి;
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.

క.
శంపాలతాభ బెడిదపు
టంపఱచే ఘోరదానవానీకంబుల్‌
పెంపఱి సన్నాహంబుల
సొంపఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్.

వ.
అయ్యవసరంబున గంససంహారి మనోహారిణింజూచి సంతోషకారియుం గరుణరసావలోకనప్రసాదియు మధురవచనసుధారస విసారియుం దదీయసమర సన్నాహనివారియు నై యిట్లనియె.

క.
మగువ మగవారి ముందఱ
మగతనములు సూప రణము మానుట నీకున్
మగతనము గాదు; దనుజులు
మగువల దెసఁ జనరు మగలమగ లగుట హరీ! ".

క.
నరకా! ఖండించెద మ
త్కరకాండాసనవిముక్త ఘనశరముల భీ
కరకాయు నిన్ను సుర కి
న్నరకాంతలు సూచి నేఁడు నందం బొందన్.

వ.

అని పలికి హరి నరకాసుర యోధులమీద శతఘ్నియను దివ్యాస్త్రము బ్రయోగించిన నొక్కవరుసను వారందఱు మహావ్యధజెందిరి మరియును.

మ.
శర విచ్ఛిన్న తురంగమై పటుగదాసంభిన్న మాతంగమై,
యురుచక్రాహత వీరమధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై,
సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో
హరి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్.

వ.

అప్పుడు.

ఆ.
మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు
శస్త్రసముదయముల జనవరేణ్య!
మురహరుండు వరుస మూఁడేసి కోలలన్
ఖండితంబు సేసె గగన మందు.

క.
వెన్నుని సత్యను మోచుచుఁ
బన్నుగఁ బద నఖర చంచు పక్షాహతులన్
భిన్నములు సేసె గరుడుఁడు
పన్నిన గజసముదయములఁ బౌరవముఖ్యా!

వ.

మరియు విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపఁజాలక హత శేషంబయిన సైన్యంబు పురంబుసొచ్చుటం జూచి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతశక్తింగొని గరుడుని వైచె నతండునన విరులదండవ్రేటున జలింపని మద్దోండవేదండంబునుంబోలె విలసిల్లె నయ్యవసరంబున గజారూఢుండయి కలహరంగంబున.

మ.
సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁ డా చక్రాయుధున్ వైవ శూ
లము చేఁబట్టిన, నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో
త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర
త్నమయోదగ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్ధమున్.

శా.
ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో!
తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం గృపం గావఁడే!
చెల్లంబో! తలఁ ద్రుంచె" నంచు నిల నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై.

క.
కంటిమి నరకుడు వడఁగా
మంటిమి నేఁ" డనుచు వెస నమర్త్యులు మునులున్
మింటం బువ్వులు గురియుచుఁ
బంటింపక పొగడి రోలిఁ బద్మదళాక్షున్.

భాగవతము— అద్భుతరసము
శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

భాగవతము — రెండర్థముల పద్యములు.
సీ.
ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు? ;
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు? ;
నా యంతవాఁడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ? ;
బూని ముప్పోకల బోవ నేర్తు;
నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ? ;
నేరుపు లన్నియు నేన నేర్తు;.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.

సీ.
మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ? ;
నేపాటి గలవాడ? వేది వంశ?
మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి?
 ; వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు?
మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు;
మాయఁ గైకొని కాని మలయ రావు;
నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు;
వసుధీశుఁడవు గావు వావి లేదు.
కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు
విడువు; విడువవేని విలయకాల
శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల
గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు.".

సంపూర్ణము.




మూలాలు మార్చు