యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/ఆఖరి పోరాటం
భారతదేశంలో ప్రముఖుడు, అందరిలో గొప్పవాడిగా చలామణి అయ్యే అనంతానంత స్వామి గురించి రహస్యంగా రెండేళ్ళ పాటు పరిశోధన చేస్తుంది సిబిఐ డిప్యూటీ కమీషనరు ప్రవల్లిక. అయితే అతన్ని అరెస్టు చేసేందుకు ఆమె దగ్గర సరైన సాక్ష్యాలు ఉండవు. ఆమె ఇదే విషయాన్ని ఇతర ఆఫీసర్లతో పంచుకుంటుంది. ఒక నాటక ప్రదర్శనలో సూర్యారావు అనే మంత్రిని స్వామి హత్య చేయించబోతున్నాడని ఆమెకు సమాచారం వస్తుంది. ఆమె అక్కడికి వెళ్ళగలిగితే స్వామి నేరాలకు సాక్ష్యం దొరుకుతుంది. కానీ సాక్షాత్తూ సిబిఐ ఛీఫ్ ఆయనకు మహా భక్తుడు. స్వామి ఆయనకి ఇచ్చిన ఒక తాయెత్తులో మైక్రోఫోన్ అమర్చబడి ఉంటుంది. దాని సాయంతో స్వామి ఆ సమావేశంలో జరిగిందంతా వింటాడు. ఇదంతా తెలియని ప్రవల్లిక ఆ నాటకానికి హాజరై, అక్కడ స్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలనుకుంటుంది. ఎప్పటి నుంచో అతని వల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
రవీంద్ర కళాక్షేత్రంలో ఆఖరి పోరాటం అనే నాటకం వేసేది నికుంజ విహారి అనే యువకుడు. ఆ నాటకంలో అతనే మంత్రి పాత్ర వేస్తుంటాడు. అతను అక్కడ సునాదమాల అనే అమ్మాయిని చూసి మనసు పడతాడు. మంత్రి సూర్యారావు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి. అతన్ని అక్కడే హత్య చేసేలా అనంతానంత స్వామి నమ్మిన బంట్లు అయిన లాయర్ పరమేశ్వరం, రామ్ లాల్, వారి అనుచరులు పథకం వేస్తారు. వారు అంతకుముందే అక్కడికి వచ్చి జనాల్లో కలిసిపోయి ఉంటారు. అతన్ని చంపి వారి ప్రభుత్వాన్ని కూలదోస్తే స్వామికి కోటి రూపాయలు వస్తాయి. నికుంజ్ విహారి తన స్నేహితుడైన పద్మాకర్ తో పందెం వేసి సునాదమాలతో మాట్లాడటానికి తానే మంత్రిలా వేదిక మీదకి వస్తాడు. నలుగురు కిల్లర్లలో ఒకడు అతనే మంత్రి అనుకుని తుపాకీతో కాల్చగా అది గురి తప్పుతుంది. అక్కడే ఉన్న ప్రవల్లిక హంతకుడి మీద కాల్పులు జరుపుతుంది. అతను పట్టుబడితే తమకు ప్రమాదమని రెండో హంతకుడు అతన్ని చంపేస్తాడు. జనాల్లో కలకలం రేగి అందరూ బయటకు వెళ్ళిపోతుండే సరికి హంతకముఠా అక్కడ నుంచి జారుకుంటుంది. అక్కడే దాక్కున్న మరో హంతకుడి నుంచి ప్రవల్లికని రక్షించి ఆమెను పరిచయం చేసుకుంటాడు విహారి. ఇద్దరూ కలిసి అతన్ని ప్రాణాలతో బంధిస్తారు.
బాబా ముసుగులో అనంతానంత స్వామి భారతదేశానికే నియంత కావాలని ప్రయత్నిస్తుంటాడు. అతనికి దేశ విదేశాల్లో ఏజెంట్లు ఉంటారు. ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి అంతా తెలుస్తూ ఉంటుంది. అందుకోసం అతను ఇరవై ఏళ్ళపాటు ఒక పథకం రూపొందిస్తుంటాడు. అందులో మొదటి భాగం పూర్తవుతుంది. ఇక మిగిలింది దేశంలో అల్లకల్లోలం సృష్టించి, దైవాంశ సంభూతుడైన తనకు అందరూ కలిసి అధికారాన్నికట్టబెట్టేలా చూడటం. అందులో భాగమే సుస్థిరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పడం. ఫిలిప్ఫీన్స్ సైన్యాధ్యక్షుడు తమ దేశ ప్రధాని స్థానంలో తాను రావాలని పథకం వేస్తుంటాడు. దానికి ఓ అగ్రరాజ్యం సాయం చేస్తుంటుంది. ఆ సాయంతో అతడు ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం అనంతానంత స్వామితో ఒప్పందం కుదుర్చుకుంటాడు.
సూర్యారావును రక్షించినందుకు ముఖ్యమంత్రి ప్రవల్లికను అభినందిస్తాడు. పట్టుబడిని హంతకుడిని విచారించి నిజం కక్కించాలనుకుంటుంది ఆమె. కానీ అనంతానంత స్వామి తనకున్న పలుకుబడి, అధికారాన్ని చూపి ఆమెను భయపెడతాడు. ప్రతి ప్రభుత్వ విభాగంలో అతడి మనుషులు ఉంటారు. తాను రెండేళ్ళపాటు అతి రహస్యంగా కాపాడుకుంటూ వచ్చిన విషయమంతా అతనికి తన అనుచరుల ద్వారా తెలిసిపోతుంది. తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఆమె అరెస్టు చేసిన నేరస్థుడి స్థానంలో ఓ తాగుబోతును జైలులో ఉంచుతారు. దానితో ఆమె బాగా నిరాశ చెందుతుంది. కానీ ఆమె తండ్రి ప్రతాపరావు, మాజీ సైనికుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత ఆమెకు ధైర్యం చెబుతాడు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా పోరాడుతూనే ఉండమని సలహా ఇస్తాడు. విహారి ఒకసారి దారిలో కనిపించిన ప్రవల్లికను ఆమెను ఇంటి దగ్గర దిగబెడతాడు. అక్కడ ఆమె వేసిన కొన్ని ప్రశ్నలు అప్పటిదాకా బాధ్యతలు లేకుండా సరదాగా తిరుగుతున్న అతని కుటుంబం పట్ల అతని బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతాయి. దాంతో అతనిలో కొంత మార్పు వస్తుంది. నెమ్మదిగా కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మొదలుపెడతాడు
సునాదమాల అక్క కొడుకు విష్ణు చదివే స్కూలు బస్సును కొంతమంది దుండగులు దారి మళ్ళించి, సాయంత్రం లోగా ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలనీ, లేకపోతే బస్సులో పిల్లలను ఒక్కొక్కరిని చంపి అసెంబ్లీ ముందు పడేస్తామని బెదిరిస్తారు. ముఖ్యమంత్రికి ఏం చేయాలో పాలుపోదు. ఈలోపే స్వామి ఒక పిల్లాడిని చంపి అసెంబ్లీ ముందు పడేస్తాడు. రాష్ట్రంలో అల్లకల్లోలం మొదలవుతుంది. పిల్లలను కాపాడ్డం కోసం తాను దిగిపోయి సూర్యారావు ముఖ్యమంత్రిని చేయడానికి ఒప్పుకుంటాడు. సూర్యారావు అనంతానంత స్వామికి కోటి రూపాయలు సమర్పిస్తాడు. అతనికి నమ్మిన బంటుగా ఉండటానికి అంగీకరిస్తాడు.
విహారి, ప్రవల్లిక కలిసి ఉగ్రవాదులు మిగతా పిల్లలను దాచి ఉంటే చోటును కనిపెడతారు. ప్రవల్లిక సిబిఐ నుంచి సహాయం తీసుకునేలోపే అనంతానంత స్వామి లాయర్ పరమేశ్వరం సాయంతో తన వారిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. స్వామి ఇచ్చిన సమాచారంతో వారు పిల్లల్ని వదిలి విహారి, ప్రవల్లికలను అపహరిస్తారు. వారిలో ఒకడు అనంతానంత స్వామికి నమ్మిన బంటు అయిన రామ్ లాల్. వారిద్దరినీ ఒక అడవికి తీసుకెళ్ళి చంపేయాలని చూస్తారు, కానీ అక్కడ వారికి మధ్య జరిగిన పోరాటంలో ఇద్దరు హంతకులు మరణిస్తారు. రామ్ లాల్ తప్పించుకుని పారిపోతాడు. విహారి, ప్రవల్లిక ప్రాణాలతో బయటపడతారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో విహారి, ఈ కుట్ర వెనుక ఉన్నది మంత్రి సూర్యారావేననీ, ఇదంతా అతను అనంతానంత స్వామితో కుమ్ముక్కై చేసిన కుట్ర అని చెబుతాడు. కానీ ప్రవల్లిక బాహాటంగా అందుకు అంగీకరించదు. అతనికి కోపం వస్తుంది. కానీ మరుసటి రోజు ముఖ్యమంత్రి అతన్ని తన దగ్గరికి పిలిపించుకుని తనకు ప్రవల్లిక విషయమంతా తెలియజేసిందనీ, ఇది దేశ అంతర్గత భద్రతకే అత్యంత ప్రమాదకరమైన సమస్య అనీ, ప్రధాన మంత్రితో చర్చిస్తున్నానీ చెబుతాడు. మరుసటి రోజు సూర్యారావు మంత్రి వర్గం నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తాడు.
విహారికి ఒక అమ్మాయి ఫోన్ చేసి తానెవరో చెప్పకుండా మాట్లాడిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి సునాదమాలే అని అతని అనుమానం. ఆమెకు ఎదురుపడి అడిగితే మాత్రం తనకేమీ తెలియదని చెబుతుంది. కానీ నిజానికి విహారిని ఇష్టపడిన ప్రవల్లికే అలా చేస్తూ ఉంటుంది.
ఫిలిప్ఫీన్స్ సైన్యాధిపతి రామోన్ అనుకున్నట్టుగా అనంతానంత స్వామి నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి వస్తాడు. అది అనుకోకుండా బార్ కి వెళ్ళిన విహారి గమనించి ప్రవల్లికకి చెప్పి ఆమెను అప్రమత్తం చేస్తాడు. ఆమె మరికొంత మంది సాయంతో స్వామి మీద నేరం మోపి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. కానీ అధికారులను గుప్పెట్లో పెట్టుకున్న స్వామి క్షణంలో, తన ఆశ్రమంలో ప్రవల్లికే ఆయుధాలు దాచమని పురమాయించినట్లు చెప్పి నిజాలను తారుమారు చేస్తాడు. అక్కడున్న భక్తులందరూ ఆమె మీద దాడి చేస్తారు. స్వామి మళ్ళీ ఆమెను బెదిరించి పంపేస్తాడు. మరో వైపు రామోన్ ని అనుసరించిన విహారి సరిగ్గా సరుకు వెళ్ళే సమయానికి గ్రెనేడ్ తో దాన్ని పేల్చేస్తాడు. ఒకవైపు తాను ఓడిపోయినా విహారి చేసిన పనికి ఆమె సంతోషిస్తుంది.
ఒకసారి విహారి తండ్రి గురించి అడిగిన ప్రవల్లిక తండ్రి అతను రాజా నరేంద్ర వర్మ మనవడని తెలుసుకుంటాడు. అప్పుడే ప్రవల్లికకు అనంతానంత స్వామికి కుడిభుజమైన లాయర్ పరమేశ్వరం విహారి తండ్రి అని తెలుసుకుంటాడు. కానీ ఇద్దరూ కలిసి చాలా కాలానికి కలిసిన కుటుంబంలో చిచ్చు పెట్టడం ఇష్టం లేక తండ్రి గురించి వెంటనే విహారికి చెప్పాలని అనుకోదు. ప్రతాపరావు కూతురు మనసులో విహారి ఉన్నాడని తెలుసుకుని అతని తల్లి వర్ధనమ్మతో వెళ్ళి పెళ్ళి సంబంధం మాట్లాడాలని కూడా అనుకుంటాడు. విహారికి మాత్రం ఆమె మనసులో తాను ఉన్నానని తెలియదు. అతను ఇంకా సునాదమాలే తనకు ఫోన్ చేస్తుందని భ్రమపడుతూ ఉంటాడు.
ఒక ప్రక్క ప్రవల్లిక తన ఆశ్రమంలో ఉంటే, మరో ప్రక్క రామోన్ తీసుకువెళుతున్న తమ అక్రమ ఆయుధాలు పేల్చేసిందెవరని అనంత స్వామికి అనుమానం వస్తుంది. విహారిని వెంటాడి అతన్ని నిలదీస్తాడు. ఆ పని చేసింది తనేనని విహారి ధైర్యంగా చెబుతాడు. స్వామి అతన్ని హెచ్చరించి వెళ్ళబోతుంటే అతనితో రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి కారు విపరీతమైన వేగంతో నడుపుతూ బురద గుంటలో పడేలా చేసి తప్పించుకుని వచ్చేస్తాడు. విహారి ఇదే విషయాన్ని ప్రవల్లికతో కూడా చెబుతాడు. స్వామి తనకు జరిగిన అవమానానికి కోపంతో రగిలిపోతాడు. అతని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.
విహారికి ఎలాగైనా బుద్ధి చెప్పమని, అతను చిత్రహింస అనుభవించాలని స్వామి పరమేశ్వరాన్ని కోరతాడు. పరమేశ్వరం తన కొడుకు అని కూడా చూడకుండా, స్వామి భక్తి కోసం ఏదైనే చేసే రకం. స్వామి పరమేశ్వరాన్ని తన భార్య వర్ధనమ్మ దగ్గరకు వెళ్ళమని చెబుతాడు. ఎన్నో రోజుల తర్వాత చనిపోయాడనుకున్న భర్త తిరిగి వచ్చినందుకు ఆమె సంతోషిస్తుంది. పరమేశ్వరం ఒక పథకం ప్రకారం, విహారి వేస్తున్న నాటకంలో తన స్నేహితుడిని కాల్చవలసిన నకిలీ తుపాకీ తీసేసి, నిజమైన తుపాకీ పెట్టి అతన్ని హంతకుడిని చేసి జైలుకు పంపాలనుకుంటాడు. కానీ ప్రవల్లిక ఆ ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.
తన భర్తను తన వద్దకు రప్పించింది స్వామీజీ అని బలంగా నమ్ముతుంది వర్ధనమ్మ. ఆమె స్వామిని దర్శించాలని, కొడుకును కూడా వెంటపెట్టుకుని తీసుకుపోతుంది. అక్కడ విహారికి ఆయన ఒక తాయెత్తు ఇస్తాడు. అందులో ఒక చిన్న మైక్రోఫోన్ ఉంటుంది. పరమేశ్వరం వేసిన పథకం విఫలం కావడంతో స్వామికి తండ్రీ కొడుకులు కుమ్ముక్కయ్యారేమోనని అనుమానంతో అతనికి అది ఇస్తాడు. ప్రతిగా విహారి కూడా అతనికి ఒక చిన్న బహుమానం ఇస్తాడు. దాన్ని స్వామి తీసుకుని తనకు వచ్చే బహుమతుల్లో ఎక్కడో పడేస్తాడు. విహారి స్వామి తనకిచ్చిన తాయెత్తు తీసుకెళ్ళి సునాదమాల బామ్మకిచ్చి, అది భయం పోగొట్టే తాయెత్తు అని నమ్మించి ఆమెకు కట్టిస్తారు.
విహారి ఇంటికి వచ్చి స్వామి ఆశ్రమంలో బాంబు ఉన్నట్లు పత్రికల వారికి ఫోన్ చేసి చెబుతాడు. వారు కొంతమంది స్వామి ఆశ్రమానికి వెళతారు. స్వామికి కూడా ఫోన్ చేసి నాలుగైదు నిమిషాల్లో భవంతిని ఖాళీ చేయమని లేదంటే తాను ఇచ్చిన బహుమతిలో బాంబు పేలిపోతుందని చెబుతాడు. దానికి భయపడి స్వామితో పాటు అందరూ బయటకు పరిగెత్తుతారు. అలా విహారి స్వామీజీని మరోమారు అవమానం పాలు చేస్తాడు. ఇది స్వామీజీకి అతని మీద మరింత కోపం పెంచుతుంది.
మరో వైపు స్వామి దేశంపైన అధికారం చేజిక్కించుకోవడం కోసం సమయం దగ్గరపడేకొద్దీ పరమేశ్వరం పథకం ప్రకారం కొన్ని రాజకీయ హత్యలు జరుగుతాయి. ప్రధానమంత్రి ఈ విషయమై ఆందోళన పడుతుంటాడు. ప్రవల్లిక ప్రధానమంత్రిని కలుసుకుని తాను సేకరించిన సమాచారాన్ని ఆయన ముందు పెడుతుంది. తమకు తెలియకుండా తమ ఆఫీసులో జరిగే రహస్యాలు ఉగ్రవాదులకు ఎలా చేరుతున్నాయనే అనుమానంతో ఒక ట్రిక్ ప్లే చేసి, అది ఎలాగోలా సిబిఐ ఛీఫ్ ద్వారానే జరుగుతున్నాయని తెలుసుకుని అతన్ని ఆ పదవి నుంచి తప్పిస్తుంది. ఈ వ్యవహారం కూడా స్వామిని ఇరుకున పడేస్తుంది. రామ్ లాల్ ని పిలిచి ప్రవల్లిక, విహారిని ఎలాగైనా అడ్డు తొలగించమని ఆదేశాలు ఇస్తాడు.
రామ్ లాల్ ట్రాఫిక్ లో వెళుతుండగా వారిద్దరినీ కాల్చి చంపాలని పథకం వేస్తాడు. కానీ వారి గురి తప్పుతుంది. ఆ క్రమంలో విహారి, ప్రవల్లిక తమ వెంటపడిన ఒక దుండగుడిని పట్టుకుని విచారించి మంత్రి సూర్యారావు ఏ పథకం వేస్తున్నాడో చెప్పమంటారు. వాడు జపాన్ నుంచి ఒక బొమ్మలతో నిండిన ఓడ వస్తుందనీ, చెప్పబోతూ పారిపోవడానికి ప్రయత్నించి రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిపోతాడు. వాడిని పద్మాకర్ తండ్రియైన డాక్టర్ కృష్ణమూర్తి దగ్గర రహస్యంగా ఉంచి చికిత్స చేయిస్తూ తెలివిలోకి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. వాడు అప్రూవర్ గా మారితే తమ రహస్యాలు బయటపడతాయని తెలుసుకున్న స్వామి ఎలాగైనా చంపించాలని ప్రయత్నాలు చేస్తాడు. డాక్టర్ కృష్ణమూర్తిని అతనిని చికిత్స చేసి బతికిస్తే పద్మాకర్ ని చంపుతామని బెదిరిస్తారు. కానీ ఆయన దానికి భయపడకుండా ఆ పట్టుబడ్డ ఉగ్రవాదికి చికిత్స చేయడానికి పూనుకుంటాడు.
డాక్టర్ కృష్ణమూర్తిని లాయర్ పరమేశ్వరం పై విధంగా బెదిరిస్తున్న సమయంలో విహారి ఇంట్లోకి ప్రవేశించి తండ్రి చేస్తున్న కుట్ర అంతా అర్థమవుతుంది. స్నేహితుడిని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అతను చేరుకునే లోపే హంతకులు పద్మాకర్ ని చంపేస్తారు. కృష్ణమూర్తి, విహారి చాలా బాధ పడతారు. విహారి ఇంటికి వెళ్ళి తండ్రిని నిలదీసే సరికి, స్వామి కూడా అక్కడికి వచ్చి వారి కుటుంబంలో కలతలు రేపి విహారిని ఇంట్లోంటి బయటికి వెళ్ళగొడతాడు. విహారి బయటకు వెళుతూ స్వామి సామ్రాజ్యాన్ని మొత్తం కూలదోస్తానని శపథం చేసి వెళతాడు.
కృష్ణమూర్తి చికిత్స చేసిన ఉగ్రవాదిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు విహారి, ప్రవల్లిక. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన విహారి సునాదమాల దగ్గరికి వెళతాడు. సునాదమాల చదువుతున్న కాలేజీలోనే సూర్యారావు కూతురు కూడా చదువుతుందని తెలుసుకున్న విహారి ఆమెకి తండ్రి అసలు రంగు బయటపెట్టి, దేశభక్తి నూరిపోస్తాడు. విహారి ఆమెను అపహరించినట్లు నాటకం ఆడిస్తాడు. సూర్యారావు, జపాన్ విదేశాంగ మంత్రితో ఒక ఒప్పందం చేసుకుంటూ ఉంటాడు. ఈ ఒప్పందం స్వామి పథకంలో ఒక కీలక భాగం. సూర్యారావు కూతురికి హాని జరగకుండా ఉండాలంటే ఆ ఒప్పందాన్ని కొద్ది రోజులు వాయిదా వేయమంటాడు విహారి. సూర్యారావు అలాగే చేయక తప్పదు.
తాను అనుకున్నది అనుకున్నట్లు జరక్కపోవడంతో స్వామికి సూర్యారావు మీద అనుమానం మొదలవుతుంది. సూర్యారావు పరమేశ్వరానికి తన కూతురి అపహరణ గురించి చెబుతాడు. సూర్యారావు దగ్గరకి విహారి డబ్బులు వసూలు చేసే నెపంతో సునాదమాలను పంపించి అతను ఆమె మీద అత్యాచారం చేయబోతున్నట్లు నాటకం ఆడించి, అతన్ని అరెస్టు చేయిస్తారు. తర్వాత అతను బెయిలు మీద విడుదలవుతాడు. సూర్యారావు కూతురు ద్వారా అతను తినే భోజనంలో మత్తు మందు కలిపి అతను స్పృహ కోల్పోయేలా చేసి తన ఆధీనంలో ఉంచుకుంటాడు విహారి. సూర్యారావు పదవి పోవడంతో స్వామికి ఆందోళన మొదలవుతుంది. పరమేశ్వరాన్ని పిలిచి విహారి, ప్రవల్లికను ఎలాగైనా అడ్డుతొలగించమని చెబుతాడు.
ప్రవల్లిక రామ్‌లాల్ గురించి తమ డిపార్ట్‌మెంట్ సంపాదించిన సమాచారాన్నంతా విహారి ముందు పెడుతుంది. ఈలోపు రామ్‌లాల్ ని ఆసుపత్రి నుంచి మాయమైన తమ అనుచరుడిని గురించి ఆరాతీయమని పురమాయిస్తాడు స్వామి. అతను బతికి ఉంటే ఎలాగైనా తమ రహస్యాలు బయటపడిపోతాయి. తాను కట్టిన తాయెత్తుల్లో ఉండే మైక్రోఫోన్ల ద్వారా ఆ సమాచారం బయటపడుతుందని వెతుకుతుంటే, విహారి సునాదమాలకి ఇచ్చిన తాయెత్తు ద్వారా స్వామికి అతను ప్రవల్లిక ఇంట్లోనే దాచినట్లు తెలిసిపోతుంది. ప్రవల్లిక తనను ప్రేమిస్తున్న సంగతి తెలియని విహారి, సునాదమాలను తీసుకెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి పరిచయం చేస్తాడు. వారిద్దరి కోసం ప్రవల్లిక తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది.
ప్రవల్లిక, విహారి దాచి ఉంచిన హంతకుడుని వెతుక్కుంటా సునాదమాలను వెంటాడుతూ వస్తాడు రామ్ లాల్. అతన్ని డిపార్టుమెంటుకు తెలియకుండా దాచినందుకు ప్రవల్లికను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. ప్రవల్లిక ఇంటికి వచ్చేసరికి తన తండ్రి రామ్ లాల్ చేతిలో మరణించి ఉంటాడు. పక్క గదిలో తాము దాచి పెట్టిన సాక్షిని కూడా చంపేసి ఉంటాడు. సునాదమాల మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని విహారి దగ్గరకు వెళుతుంది. అక్కడ వారిద్దరికీ జరిగిన సంభాషణలో విహారికి స్వామి మైక్రోఫోన్ రహస్యం తెలిసిపోతుంది. ప్రవల్లిక తనకు ఉద్యోగం పోయిన సంగతి విహారికి చెప్పి ఇక ఇద్దరూ కలిసి అనధికారికంగా స్వామిని అడ్డుకోవాలని అనుకుంటారు. తన తండ్రిని రామ్ లాల్ ఎంత క్రూరంగా చంపిందీ ఆమె విహారికి వివరిస్తుంది. అతను పట్టలేని కోపంతో కారులో స్వామి ఆశ్రమం వైపు వెళ్ళగా అక్కడే తాగేసి రోడ్డు మీద వెళుతున్న రామ్ లాల్ని కారుతో కాళ్ళపైకి ఎక్కిస్తాడు. అతనికి స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో రెండు కాళ్ళకు బ్యాండేజితో ఉంటాడు. అతని రెండు కాళ్ళు తీసివేయాలని చెబుతారు. అతన్ని బెదిరించి స్వామి రహస్యాలు అన్నీ తెలుసుకుంటారు. అలాగే అతన్ని సూర్యారావుతో మాట్లాడించి అతన్ని కూడా తమ వైపుకి తిప్పుకుంటారు.
జపాన్ నుంచి వచ్చే ఓడలో స్వామికి చెందిన దీవిలో ఆయుధాలు లోడ్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తారు. అవి దేశంలో పలు చోట్ల పేలి అల్లకల్లోలం అవుతుంది. అదే సమయంలో స్వామి కీలక ఉపన్యాసం ఇచ్చి ఇతర దేశాల సాయంతో దేశానికి అధినేత కావాలని పథకం వేస్తుంటాడు. ఈ విషయాలన్నీ సూర్యారావు పత్రికలకి సమాచారం అందిస్తాడు. రామ్ లాల్ తప్పించుకుని స్వామి దగ్గర తలదాచుకుంటాడు. అదే సమయానికి సిబిఐ ఛీప్ అతన్ని అరెస్టు చేయడానికి వస్తాడు. ఈ లోగా స్వామే అతన్ని చంపేస్తాడు.
ప్రవల్లిక, సిబిఐ చీఫ్ కలిసి స్వామికి విహారి, పరమేశ్వరం కలిసిపోయి తనపైన కుట్రపన్నుతున్నట్లు అనుమానం కలుగజేస్తారు. పరమేశ్వరం ఎలాగైనా స్వామి బండారాన్ని బయటపెట్టిన పత్రికలు ఆపాలని చూస్తాడు కానీ అవి స్వామి ఉపన్యాసం అయ్యేసరికి అందరికీ చేరేలా చేస్తాడు విహారి. స్వామి కూడా పరమేశ్వరాన్ని అనుమానిస్తాడు. మరే మార్గం తోచని పరమేశ్వరం వేదిక పైకి ఎక్కి స్వామి గుట్టంతా ప్రజలకు చెబుతాడు. ప్రజలంతా స్వామి మీద దాడి చేస్తారు. స్వామి అక్కడ నుంచి రహస్య మార్గం గుండా తప్పించుకుపోయి, ముఖ్యమైన నాయకులను చంపడానికి తాను ముందుగానే ఏర్పాటు చేసిన మిసైల్ బాంబులు ప్రయోగించడానికి రిమోట్ తన చేతిలో ఉంచుకుని ఉంటాడు. విహారి తనచేతిలో గన్ ఉన్నా అతన్ని ఏమీ చేయలేకపోతాడు. విహారి, స్వామిని రిమోట్ పారేయమని చెప్పి తన చేతిలో ఉన్న గన్ కూడా విసిరేస్తాడు. కానీ స్వామి ఆ రిమోట్ నొక్కి, పక్కన పడేసి హెలికాప్టర్ లో ఎక్కేస్తాడు. ప్రవల్లిక ప్రయోగానికి సిద్ధంగా ఉన్న మిసైల్ కి అడ్డుపడి తీవ్రంగా గాయపడుతుంది. ఆఖరి కోరికగా విహారిని, గన్ తీసుకుని స్వామి వెళుతున్న హెలికాప్టర్ ని పేల్చేయని చెప్పి సంతోషంగా కన్నుమూస్తుంది.