యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/చెంగల్వ పూదండ
కృష్ణ అనే యువకుడు చేయని హత్యానేరానికి జైలు పాలవుతాడు. అతన్ని పసికందుగా ఉన్నపుడే ఎవరో అడవిలో పారేసుకుంటే అక్కడే ఉన్న ఒకామె అతన్ని పెంచుకుంటుంది. కృష్ణ చిన్నతనం నుంచి అడవిలో కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తుంటాడు. కృష్ణ చిన్ననాటి నుంచే పరిచయం అయిన పార్వతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మీద కన్నేసిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకోవడం కుదరదని కృష్ణను హెచ్చరిస్తాడు. కృష్ణ కోపంతో అతని మీద చేయి చేసుకుంటాడు. దాంతో లక్ష్మీ నారాయణ అతని మీద పగ పెంచుకుని కృష్ణ బాబాయి అని పిలుచుకునే వ్యక్తి ద్వారా నమ్మించి మోసం చేస్తాడు. పార్వతి తండ్రిని ముందుగానే హత్య చేసి, పార్వతికి పాము కరిచిందని అబద్దమాడి, కృష్ణను ఆమె ఇంటికి పిలిపించి తెలివిగా అతని మీద హత్యానేరం మోపి అరెస్టు చేయిస్తాడు. ఆ సమయంలో అతన్ని చూడటానికి తాను ప్రేమించిన పార్వతి, పెంచిన తల్లి ఎవరూ రారు. వారు ఏమైపోయారో కూడా అతనికి తెలియదు.
ఈ కథంతా జైలులో తనకు పరిచయమైన విప్లవకారుడు, బందిపోటుగా పేరుగాంచిన ఠాకూర్ బలదేవ్ సింగ్ కి చెప్పుకుంటాడు. ఠాకూర్ మంచి విద్యావంతుడు. పోరాటాలలో ఆరితేరిన వాడు. అతను ఇతనికి చదువు చెప్పి కొన్ని విద్యలు నేర్పిస్తాడు. వ్యక్తిగతమైన గమ్యాలు మాని విశాల ధృక్పథంతో ఆలోచించమని బోధిస్తాడు. కొంతకాలానికి ఠాకూర్ జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించి పోలీసుల చేతిలో మరణిస్తాడు.
పది సంవత్సరాల తర్వాత కృష్ణ సత్ప్రవర్తన కారణంగా జైలు నుంచి విడుదల అవుతాడు. తిరిగి తన ఊరికి వెళ్ళి పెంపుడు తల్లి, పార్వతి కోసం గాలిస్తాడు. కానీ ఎక్కడా వారి జాడ కానరాదు. పార్వతి ఇంటి స్థానంలో లక్ష్మీనారాయణ పెద్ద ఇల్లు కట్టుకుని ఉంటాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడు ఇస్మాయిల్ సాయంతో పార్వతి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయిందని తెలుసుకుంటాడు. అమ్మ వేరే వ్యక్తితో లేచిపోయిందని చెబుతాడు. అది అతనికి నమ్మశక్యం కాదు. అంతకు మునుపే ఠాకూర్ ఒక రహస్య ప్రాంతంలో దాచిన కొంత ధనం గురించి చెప్పి ఉంటాడు. దాన్ని సంపాదించగా అది రాజా నరేంద్రవర్మదని తెలుస్తుంది. అది అతనికి అప్పగించడానికి ఆయన దగ్గరకు వెళ్ళగా అతనికి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి. నరేంద్రవర్మ కుమారుడు, కోడలు అడవిలోనుంచి వెళుతండగా ఠాకూర్ వాళ్ళని అటకాయించి వారిని హతమార్చాడనీ, వారి కుమారుడే తానని తెలుసుకుంటాడు. అందుకు నిరూపణగా అతని దగ్గర ఉన్న లాకెట్ ను పార్వతికి ఇచ్చేసి ఉంటాడు. అందుకని నరేంద్రవర్మ అతన్ని మోసగాడని అనుమానిస్తాడు.
ఇక అక్కడ ఉండలేక వేరే ఊరికి వెళ్ళి ఒక లాడ్జీలో ఉంటాడు. అక్కడికి హైమ అనే వేశ్య ఇతని దగ్గరికి వస్తుంది. ఆమె దగ్గర తాను గతంలో పార్వతికి ఇచ్చిన లాకెట్ ఉంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందని ఆమెను నిలదీస్తాడు. ఆమె నేరుగా ఒక వ్యభిచార గృహానికి తీసుకువెళుతుంది. దాని యజమాని కాంతమ్మ మొదట తెలియదని బుకాయించినా పార్వతి గురించి చెబుతుంది. కానీ ఆమె అక్కడ ఉండదు. హైమ కలుగజేసుకుని దయనీయమైన స్థితిలో ఉన్న పార్వతి దగ్గరకు తీసుకువెళుతుంది. పార్వతి కృష్ణను గుర్తు పట్టి, తనకు ఈ స్థితిని కలగడానికి కారణం లక్ష్మీనారాయణ అని చెప్పి అతని చేతిలోనే కన్ను మూస్తుంది. అదే సమయంలో నరేంద్రవర్మ అనుచరుడైన శంకర్ దాదా అతన్ని అనుసరిస్తూ అతను నిజమైన వారసుడే అని నరేంద్రవర్మకు తెలియజేస్తాడు.
నరేంద్రవర్మ తన మనవడి కోరిక మేరకు అతని ఆధ్వర్యంలోనే అతను పెరిగిన గ్రామంలో విలాసవంతమైన ఇల్లు కట్టిస్తాడు. అతనికి వ్యాపారం చేసుకోమని డబ్బులు ఇస్తాడు. అప్పటికే అక్కడ ధనవంతుడిగా పేరు గాంచిన లక్ష్మీనారాయణ అతను తాను మోసం చేసినవాడే అని తెలియక అతని వ్యాపారాల్లో భాగస్వామిగా చేరతాడు. అతని కొడుకు రవిని అతని దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకొమ్మని చెబుతాడు. కృష్ణ తాను వ్యభిచార గృహం నుంచి రక్షించిన హైమను రవిని ప్రేమించినట్లు నాటకమాడమని చెబుతాడు. ఆమె నిజంగానే అతని ప్రేమలో పడుతుంది. వ్యాపారాల్లో మొదటగా లాభాలు చూపించి లక్ష్మీనారాయణ నుంచి మరింత పెట్టుబడి రాబడతాడు. చివరకు వారు చేసే వ్యాపారాల్లో నష్టం వచ్చి అతని సొమ్మంతా కరిగిపోయేలా చేస్తాడు. అతని అన్నంలో విషం కలిపి అతనికి పక్షవాతం వచ్చేలా చేస్తాడు. అతని కళ్ళ ముందే కొడుకు హైమను పెళ్ళి చేసుకునేలా చేస్తాడు. ఇదంతా చూసి లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకుంటాడు. బాబాయ్ దగ్గరకు వెళ్ళి అతని దగ్గరనే తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయందన్న నిజాన్ని చెప్పించి అతన్ని కూడా హతమార్చి విప్లవ నాయకుడిగా మారి అడవుల్లోకి వెళ్ళిపోతాడు.