యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/లేడీస్ హాస్టల్
రాయన్న ఒక రాష్ట్రస్థాయి క్రికెట్ ఆటగాడు. కష్టపడి పైకి వచ్చినవాడు. కిరణ్మయి ఒక సైకాలజీ విద్యార్థి. ఇద్దరివీ మధ్య తరగతి కుటుంబాలే. వీరిద్దరికీ వివాహం జరుగుతుంది. శోభనం నాటి అర్ధరాత్రి పోలీసులు వచ్చి రాయన్నను అరెస్టు చేస్తారు. కారణం లేడీస్ హాస్టల్లో అపురూప లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. దానికి కారణం ఆమెకు అంతకు ముందు పరిచయం ఉన్న రాయన్న అని పోలీసులు అనుమానిస్తారు.
ఆంధ్రప్రదేశ్ జట్టులో విజయ్ కుమార్ అనే మరో ఆటగాడు ఉంటాడు. విజయ్ కుమార్ కి ఎలాగైనా జాతీయ జట్టుకు ఆడాలనే కోరిక. కానీ సెలెక్టర్లు మాత్రం అతనికన్నా నిలకడగా ఆడే రాయన్నను ఎంపిక చేస్తారు. దాంతో అతని మీద ఈర్ష్యతో అతన్ని ఎలాగైనా తొక్కేయాలని సెలెక్టర్లలో ఒకడైన రాఘవరెడ్డికి లంచం ఇచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.
వెంకటరత్నం అనే లాయరు సాయంతో కిరణ్మయి తన భర్తకు బెయిలు ఇప్పించి అతన్ని జాతీయ జట్టుకు ఆడేలా చేస్తుంది. అక్కడ కూడా రాయన్నను విజయ్ కుమార్ తన కుయుక్తులతో నిరాశపరచాలని చూస్తాడు. కానీ కిరణ్మయి సమయానికి అక్కడికి చేరుకుని అతనికి ప్రోత్సాహం ఇస్తుంది. దాంతో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రాయన్న కీలకమైన ఆట ఆడి తన ప్రతిభను నిరూపించుకుంటాడు.
మరోవైపు కిరణ్మయి తన భర్త నిర్దోషి అని నమ్మి అపురూపలక్ష్మిది హత్యా లేదా ఆత్మహత్యా అని తెలుసుకోవడానికి ఆమె ఉన్న హాస్టల్లో చేరుతుంది. అక్కడ ఆమెకు మరిన్ని నిజాలు తెలుస్తాయి. అపురూపలక్ష్మి నిజానికి అమాయకురాలే అయినా ఆమె రాయన్నను ప్రేమించి ఉంటుంది. కానీ అతనికి మాత్రం ఆమె పట్ల స్నేహమే ఉంటుంది. అతనికి పెళ్ళి నిశ్చయం అయిందని తెలుసుకుని నిరాశ చెందుతుంది. రాయన్న స్నేహితుడు, ధనవంతుడు అయిన రాజారావుకి దగ్గర అవుతుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఆమె తండ్రి అప్పటిదాకా సాంప్రదాయంగా పెరిగిన తన కూతురు అలా ప్రవర్తించడం చూసి కూతురిని మందలిస్తాడు. ఆ అవమానం భరించలేక ఆమె వివరంగా ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఆ లేఖలో తన రూమ్మేటు అనురాధ ప్రస్తావన ఉండటంతో అనురాధ ఆ లేఖను మార్చేసి తాను రాసిన లేఖ ఉంచుతుంది. దాన్ని చూసి పోలీసులు ఆ చేతిరాత ఆమెది కాదని రాయన్నని అనుమానిస్తారు. కిరణ్మయి ఈ నిజాలను తెలుసుకుని పోలీసు ఇన్‌స్పెక్టరుకు చెబుతుంది.
మరోవైపు రాయన్నను ఎలాగైనా దెబ్బతీయాలనుకున్న విజయ్ కుమార్ అతను క్రికెట్ మ్యాచ్ ఆడబోయే ముందు కిరణ్మయి మీద యాసిడ్ దాడి చేయమని రాఘవరెడ్డిని, తన అనుచరులను పురమాయిస్తాడు. కానీ వాళ్ళు అలా చేయకుండా కేవలం ఆమె మీద దాడి చేసినట్లు టెలిగ్రాం ఇస్తారు. భార్య మీద ప్రేమతో రాయన్న మ్యాచ్ ఆడడు అనుకుంటారు, కానీ అతను ఆడటానికి నిశ్చయించుకుని, రికార్డు స్థాయి పరుగులు చేస్తాడు. తాను చేయమన్న పని సరిగా చేయనందుకు విజయ్ కుమార్ రాఘవరెడ్డి మీద ఆసిడ్ పోస్తాడు. రాఘవరెడ్డి చనిపోతూ విజయ్ కుమార్ ని కూడా చంపేస్తాడు.