యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/స్వర భేతాళం
ఈ నవలలో కీలక భాగం భారత న్యాయ చట్టంలో సెక్షన్ 84. నేరస్థుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోతే ఒక హత్య చేసిన నేరస్థుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం కల్పిస్తుందీ చట్టం.
సోమశేఖరం (శేఖరం), పద్మజ భారత రక్షణ విభాగంలో పనిచేసే ఐఏఎస్ క్యాడర్ కు చెందిన ఆఫీసర్లు. పద్మజ అప్పుడప్పుడూ రక్షణ విభాగంలోనే పదవీ విరమణ చేసిన ప్రకాశరావుతో కీలకమైన విషయాలు చర్చిస్తూ ఉంటుంది. పద్మజ చెల్లెలు హిమజ జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటుంది. శేఖరం, పద్మజ ఇద్దరూ కలిసి ఫ్రాన్సు నుంచి భారతదేశానికి వస్తూ మాయమైన భారత్ అనే ఒక నౌక గురించి పరిశోధన చేస్తూ ఉంటారు. ఆ నౌకలో ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి కొన్ని అత్యాధునిక ఆయుధాలు రావలసి ఉంటుంది. నౌకలోని ఆయుధాలు మాత్రం ఎలాగోలా భారతదేశానికి చేరి దేశద్రోహుల చేతిలో పడి ఉంటాయి. పంజాబ్ అల్లర్లలో ఈ ఆయుధాలు వాడినట్లు సిబిఐ నిర్ధారిస్తుంది. శేఖరం, పద్మజను మనసులోనే ఆరాధిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడానికి మాత్రం సందేహిస్తుంటాడు. వీలైతే ఆమెను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ప్రకాశరావు పార్టీలో పద్మజకు ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేసే గిరిధర్ అనే వ్యక్తి పరిచయమవుతాడు. అతని సరదా వ్యక్తిత్వం పద్మజను ఆకట్టుకుంటుంది. కొద్ది రోజుల్లోనే గిరిధర్ ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. ప్రకాశరావు సలహాతో ఆమె అతనితో వివాహానికి అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసిన శేఖరం విచిత్రమైన పరిస్థితుల్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. శేఖరం డైరీలు చూసి అతను తన్ను ఆరాధిస్తున్నాడని తెలుసుకుని పద్మజ చాలా బాధపడుతుంది. శోభనం రోజు రాత్రి గిరిధర్ తనను శేఖరం ఆవహించినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి పద్మజ భయపడుతుంది. కానీ నెమ్మదిగా అతని ప్రవర్తనకు అలవాటు పడిపోతుంది. అతనితో కలిసి ఆఫీసు పని కూడా చేస్తుంటుంది. సాగర్ అనే సిబిఐ ఆఫీసరి హిమజను ప్రేమిస్తూ ఉంటాడు. అతను చేస్తున్న పరిశోధనలో రక్షణ శాఖలో ఉన్న ఒక లేడీ సెక్రటరీ అనుమతితో ఆయుధాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలుస్తుంది. పద్మజ పుట్టిన రోజు నాడు గిరిధర్ శేఖరం ఆవహించిన సమయంలో అందరూ చూస్తుండగా ఆమెను తుపాకీతో కాల్చి చంపుతాడు. చట్టప్రకారం అతను అరెస్టు అయినా కూడా అక్కడే ఉన్న డాక్టర్ రామకృష్ణ గిరిధర్ మానసిక స్థితి సరిగా లేదని సాక్ష్యం చెబుతాడు. దాంతో అతను నిర్దోషిగా విడుదలై అమెరికాలో ఉన్న అక్క దగ్గరికి వెళ్ళిపోతాడు. తన కళ్ళ ముందే అక్కకి జరిగిన అన్యాయాన్ని హిమజ సహించలేకపోతుంది. ఈ విషయాన్ని గురించి పరిశోధిస్తున్న సాగర్ తో చేయి కలుపుతుంది. వారి పరిశోధనలో భారత్ నౌక మాయం వెనుక గిరిధర్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. అతను భారతదేశంలో కొన్ని ఆయుధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్నట్లు సాగర్ కనిపెడతాడు. ఆ కేసులో ఇంకా చరిత్రను తవ్వగా అందులో ప్రకాశరావు పాత్ర కూడా బయటపడుతుంది. ఇదంతా తెలుసుకున్న ప్రకాశరావు హిమజను చంపాలని ప్రయత్నిస్తాడు కానీ ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుని చనిపోతాడు. అమెరికాలో ఉన్న గిరిధర్ ని ఎలా శిక్షించాలా అని ఆలోచిస్తున్న హిమజ, సాగర్ కు అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకిందని తెలుస్తుంది.