ఈ నవలలో రెండు ప్రధాన కథలు ఉంటాయి. ఒకటి వైవాహిక జీవితం సరిగా సాగక, మానసికంగా కుంగిపోయి, శ్రేయోభిలాషుల సలహాతో తన సంసారాన్ని దిద్దుకునే మహిళ కథ. వివాహమై చాలా రోజులైనా కొన్ని లోపాలవల్ల సంతానం కలగని వారిని అడ్డదారుల్లో మోసం చేసే వైద్యులు, అసలు వైద్యమే అవసరం లేని సమస్యలు, ఇంకా మామూలు వైద్యానికి లొంగని రోగాలకు కూడా హిప్నాటిజం పేరుతో తప్పుదోవ పట్టించే నకిలీ హిప్నాటిస్టులు, వారిని నమ్మి సర్వస్వం కోల్పోయే వారి కథ రెండోది.

లక్ష్మి, విష్ణు భార్యా భర్తలు. వారి వివాహ జీవితం అంత సవ్యంగా సాగుతుండదు. విష్ణు ఆఫీసు నుంచి తొందరగా రాకపోవడం వల్ల అతని భార్యకి తమ మధ్య బాంధవ్యం బలహీనమవుతున్నదని అనుకుంటూ బాధ పడుతూ ఉంటుంది. అతనికి ఆఫీసు అయిన వెంటనే స్నేహితులతో సమయం గడిపి ఏ రాత్రి వేళకో ఇంటికి వస్తుంటాడు. ఆమె వేళకు తిన్నదా లేదా, ఆమెకు ఆరోగ్యం బాగుందా లేదా అని కూడా పట్టించుకోకుండా యాంత్రికంగా వ్యవహరిస్తుంటాడు. పెళ్ళయి చాలా ఏళ్ళయినా వారికి పిల్లలు కలగరు. అది మరో పక్క ఆమెను బాధిస్తూ ఉంటుంది. ఆ బాధలను మరిచిపోవడానికి తన భావాలను అక్షరాల రూపంలో రాయడం మొదలు పెడుతుంది. వాటినే ఒక పత్రికకు పంపాలనే ఆలోచన కూడా ఉంటుంది.

ఒకరోజు డేవిస్ కప్ చూడటానికి లక్ష్మిని స్టేడియంకి రమ్మంటాడు విష్ణు. అక్కడ భారతదేశం తరపున ప్రహసిత్ అనే ఆటగాడు ఆడుతుంటాడు. లక్ష్మి అక్కడికి వెళుతుంది కానీ భర్త మాత్రం రాడు. ప్రేక్షకుల్లో లక్ష్మిని చూసి ప్రహసిత్ ఆమె మీద మనసు పారేసుకుంటాడు. ప్రహసిత్ కూడా అందగాడే. వృత్తి రీత్యా డాక్టరు అయినా టెన్నిస్ మీద ప్రేమతో ఆటలో పట్టు సాధించి దేశం తరపున ఆడుతుంటాడు. అతనంటే అభిమానించే అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉంటారు. ప్రహసిత్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక డ్రామా ఆడి ఆమె తనకు ఫోన్ చేసేలా చేసి, ఆమెతో తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. అతనికి ఆమెకు పెళ్ళైన విషయం తెలీదు. లక్ష్మికి ఈ విషయమై ఏం చేయాలో పాలుపోక ఫోన్ పెట్టేసి ఆందోళనకు గురవుతుంది.

లక్ష్మి స్నేహితురాలైన మధూహ ఒక పత్రికాఫీసులో పని చేస్తూ ఉంటుంది. ఆమెకు అనారోగ్యంతో ఉన్న తల్లి, చదువుకుంటున్న చెల్లెలు ఉంటారు. ఆ పత్రిక అంత బాగా నడుస్తూ ఉండదు. ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తారు. లక్ష్మి మధూహకు తెలియకుండా ఆ పత్రికలో ప్రచురించడం కోసం తన రచనలు పంపి ఉంటుంది. అది పంపింది తన స్నేహితురాలు లక్ష్మి అని తెలియక దాన్ని చదువుతుంది. అందులో ఆమె సంసార జీవితంలో తాను పడే బాధలనే కవితాత్మకంగా రాసి ఉంటుంది. ఆమె ఎడిటర్ శాస్త్రి దగ్గరకు వెళ్ళి దాన్ని ప్రచురిస్తే బాగుంటుంది అని చెబుతుంది.

లక్ష్మి పనిచేసిన పత్రికలోనే రాజు అనే వ్యక్తి డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో నడిచే మైండ్ హిప్నో మాగ్నో థెరపీ క్లినిక్ కోసం ఒక ప్రకటన ఇస్తుంటాడు. పరీక్షలో మార్కులు బాగా రావాలన్నా, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగారలన్నా, సంబంధాలు మెరుగుపరుచుకోవలనుకున్నా ప్రతి విషయానికి ఈ థెరపీ సహాయం చేస్తుందని ఆ ప్రకటన సారాంశం. రాజు విశాల్ దగ్గర పనిచేసే సహాయకుడు. లక్ష్మి రాజుని ముందు నుంచే ప్రేమిస్తుంటుంది. ఆ ప్రకటనతో ఆ క్లినిక్ కి ఎంతోమంది పేషెంట్లు రావడం మొదలు పెడతారు.

ఇదే కాకుండా డాక్టర్ విశాల్ సంతానోత్పత్తి కేంద్రాన్ని కూడా నడుపుతూ ఉంటాడు. సంతానం కలగని స్త్రీలు 13-14-15 రోజుల్లో డాక్టర్ని కలుసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టేలా చేస్తారని అతను ప్రకటనలు ఇస్తుంటాడు.

లక్ష్మి రాసిన దానిని శాస్త్రి మొదటగా నిరాసక్తంగా దానిని చదవడం ప్రారంభించినా అది ఆసక్తిగా అనిపించి తమ పత్రికలో వెయ్యడానికి నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టే ఆ నవల పత్రికలో ప్రచురితం అవుతుంది. అది చదివి లక్ష్మి ఆశ్చర్యపోతుంది. కానీ అందులోని విషయాన్ని బట్టి అది తన స్నేహితురాలు లక్ష్మి అని అనుమానం రాదు. ఎందుకంటే ఆమె దృష్టిలో లక్ష్మి, విష్ణులది అన్యోన్యమైన దాంపత్యం. తన నిర్ణయాన్ని గౌరవించిన శాస్త్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది లక్ష్మి. ఆ రచన గురించి ఆమె శాస్త్రితో మాట్లాడటానికి వెళ్ళగా అతను ఆమెకు అదే పత్రికలో ఫ్రీలాన్సరుగా పని చేసే అవకాశం ఇస్తాడు. ప్రహసిత్ టెన్నిస్ ఆడటం మానేయడానికి నిర్ణయించుకున్నాడనీ, కారణం ఎవరికీ తెలియదని దాని కోసం అతన్ని ఇంటర్వ్యూ చేసి ఒక కథనం రూపొందించమని సలహా ఇస్తాడు.

ఒకసారి విష్ణు క్యాంపుకని వెళుతుండగా అతని మీద అనుమానం వచ్చి వెంబడిస్తుంది లక్ష్మి. అతను ఆఫీసులో పనిచేసే మరో అమ్మాయితో గడపడానికి వెళ్ళాడని తెలిసి గుండె చెదిరిపోతుంది. విష్ణు మాత్రం ఏ మాత్రం తొణకకుండా ఆమెను మర్యాదగా అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. ఆమె ఆ షాక్ లో అలాగే ఇంటికి వచ్చి ప్రహసిత్ కి ఫోన్ చేస్తుంది. కానీ వెంటనే కట్ చేసేస్తుంది. ప్రహసిత్ ఆమె ఏదో ఆపదలో ఉందనుకుని ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. ఆమెను ఓదార్చి తిరిగి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అతనికి ఒక బెదిరింపు ఉత్తరం వస్తుంది. ఒక పెళ్ళయిన మహిళ ఇంటికి అలా వెతుక్కుంటూ వెళ్ళడం అంత మంచిది కాదని అతనికి ఒక బెదిరింపు ఉత్తరం వస్తుంది. అదే విషయం మధూహతో చెబుతాడు.

ప్రహసిత్ ఒక సాహిత్య సభకు వెళ్ళి అక్కడ లక్ష్మి రచనల మీద తెలిసీ తెలియక మాట్లాడుతున్న మంత్రిపై చేయి చేసుకుంటాడు. ఆ మంత్రి అంగరక్షకులు అతన్ని తుపాకీ వెనుకభాగంతో పొడుస్తారు. అది అతని ఛాతీకి తగిలి టెన్నిస్ ఆటకు దూరం అవుతాడు. తాను మెడిసిన్ చదివి చాలా రోజులు అయినా పట్టుదలతో తన శిక్షణ అంతా గుర్తుకు తెచ్చుకుని ఒక క్లినిక్ తెరుస్తాడు.

మధూహకి ఒక మేనమామ ఉంటాడు. అతను ఒక పేదరైతు. అతని భార్యకు బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఆమె బతికే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెబుతారు. అప్పుడే అతనికి డాక్టర్ విశాల్ తరపున మాగ్నో హిప్నో థెరఫీ క్లినిక్ గురించి తెలుస్తుంది. ఎక్కడా నయంకాని రోగులకు కూడా అక్కడ చికిత్స చేస్తామని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. లక్ష్మికి కూడా చాలా ఏళ్ళ నుంచి సంతానం కలగకపోవడంతో విశాల్ క్లినిక్ ని సంప్రదిస్తుంది. అక్కడ ఆమెకు డి అండ్ సి చికిత్స (సంతానం కలగడం కోసం స్త్రీలకు చేసే శస్త్రచికిత్స) చేస్తామని చెబుతారు. లక్ష్మికి ఒకవైపు ఇదంతా నకిలీ చికిత్స అని తెలుస్తూనే ఉంటుంది. ఒకసారి ఆమె ప్రహసిత్ తో లక్ష్మి విశాల్ క్లినిక్ లో సంతానం కోసం తీసుకుంటున్న చికిత్స గురించి చెబుతుంది. అతను కూడా దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతాడు. మరో వైపు విశాల్ ఎంతో మంది అమాయకులను మోసం చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. మధూహ ఎలాగైనా వారి బండారాన్ని బయటపెట్టాలని చూస్తుంటుంది.

మధూహ మేనమామ భార్య క్యాన్సరి ముదిరి మరణిస్తుంది. ఆమె చికిత్స కోసం అతను ఉన్న పొలమంతా అమ్ముకుంటాడు. మరో వైపు అతని కొడుకు సోమం కూడా బాగా చదవడం కోసం వారి దగ్గరే చికిత్స తీసుకుంటూ ఉంటాడు. అతనికి కూడా ఏమీ ప్రయోజనం కనిపించదు. అతను కూడా ఏదో నిరాశతో, నిర్లిప్తంగా ఉంటాడు. మధూహ వారికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి శివశంకరం అనే నిజాయితీ పరుడైనలాయరును సంప్రదిస్తుంది. అతను ఇదివరకే అలాంటి కేసులు ఎదుర్కొన్నట్లు, మోసపోయిన వారికి వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు చేసి డబ్బులు వసూలు చేసినట్లు చెబుతాడు. వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చే ఆ సెక్షన్లు వివరిస్తాడు.

శివశంకరం నోటీసు పంపగానే డాక్టర్ విశాల్ అతన్ని తన శత్రువుగా భావించి అతని పీడ ఎలాగైనా వదిలించుకోవాలని పథకం వేస్తాడు. తన కారులో బ్రేకులు తీయించి శివశంకరాన్ని కారుతో గుద్ది, అతనికి చికిత్స చేస్తున్నట్లు నటించి అతన్ని శాశ్వతంగా అవిటి వాడిని చేస్తాడు. పోలీసులతో అమాయకుడిలా నటించి తన స్నేహితుడు కారు నడిపాడని చెప్పి తెలివిగా శిక్ష నుంచి తప్పించుకుంటాడు.

మధూహ విశాల్ చేస్తున్న మోసాల గురించి ప్రహసిత్ తో కూడా చర్చిస్తుంది. అయినా విశాల్ ని ఎలా చట్టానికి పట్టించాలో వారికి అర్థం కాదు. తమకు జరిగిన అన్యాయం కోసం ఆమె పడుతున్న కష్టాల్ని చూసి సోమం చలించిపోయి ఒక నిర్ణయం తీసుకుంటాడు. విశాల్ పైన యాసిడ్ దాడి చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అది పొరపాటున రాజు మొహం మీద పడి అతనికి చూపు పోతుంది. విశాల్ మాత్రం చిన్నపాటి గాయాలతో తప్పించుకుంటాడు. సోమం పోలీసులకు దొరక్కుండా అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు.

మధూహ రాజు మీద జాలి కలిగి అతన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అతనికి కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుసుకుని అందుకు కొంత ఖర్చు అవుతుందని చెబుతుంది. రాజు విశాల్ తో ఏదో రహస్యంగా మాట్లాడి తాము చేసిన బయటపెడతానని బెదిరించి అతని దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. రాజుకి తిరిగి చూపు వస్తుంది. మధూహ విశాల్ క్లినిక్ లో రహస్యంగా ఏదో జరుగుతుందని అనుమానించి దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు లక్ష్మికి సంతానం కలుగుతుందని విశాల్ చెబుతాడు. కానీ అది అబార్షన్ అవుతుంది. కానీ నిజానికి ఆమెకు పిల్లలు కలగరనీ, ఆమెను మోసం చేయడానికి ఏదో మందులు ఇచ్చారని రాజు ద్వారా తెలుసుకుంటుంది మధూహ. ఆమె అదే విషయం లక్ష్మికి చెబుతుంది. తమ రహస్యాలను ఆమె బయటపెడ్తుందని ఆమె మీద బలాత్కారం చేస్తాడు రాజు. ఆమె గర్భవతి అవుతుంది. చివరికి ఆమెకు విశాల్ క్లినిక్ లో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. కృత్రిమ గర్భదారణలో భర్త వీర్యాన్ని కాకుండా మరెవరో వీర్యాన్ని ఎక్కించి తన దగ్గరకు వచ్చిన మహిళలకు గర్భం తెప్పిస్తుంటాడు.

మధూహ భైరవమూర్తి అనే నిజాయితీ గల పోలీసు ఇన్‌స్పెక్టరు సాయంతో అతని మోసాలను బయట పెట్టాలని పథకం వేస్తుంది. ఆ పథకం ప్రకారం తనకు పెళ్ళయి చాలా రోజులయినా సంతానం కలగడం లేదని విశాల్ దగ్గరకు వెళుతుంది. వారి సంభాషణ మొత్తం రికార్డు చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆమె ఆలోచన. కానీ భైరవ మూర్తి ఆలోచనలు వేరుగా ఉంటాయి. అతని మీద కేసు అంత బలంగా ఉండదని ఆలోచిస్తుంటాడు. నిజానికి భైరవమూర్తి విశాల్ చేతిలో ప్రమాదానికి గురైన శివశంకరానికి తండ్రి. న్యాయం వైపు నిలబడ్డందుకు తన కుమారుడికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు. అతన్ని అరెస్టు చేస్తే ఏదోలా బయటికి వచ్చి మరిన్ని మోసాలు చేయగలడని భావించి మధూహను పావుగా వాడుకుని, తెలివిగా విశాల్ ఆమెను రేప్ చేసేలా ప్రేరేపించి, అతన్ని తుపాకీతో కాల్చి చంపుతాడు. చట్టప్రకారం కేసు కూడా ఉండదు. విశాల్ కు సహకరించినందుకు రాజు కూడా జైలుకు వెళతాడు. మరో వైపు లక్ష్మి ప్రహసిత్ సాయంతో నిరాశ, నిర్లిప్తత నుంచి బయటపడి తన భర్తను మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. మధూహ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ప్రహసిత్ ని పెళ్ళిచేసుకుంటుంది.