పదవప్రకరణము

మార్చు

పాండవులు శ్రీకృష్ణుని రాయభారిగా నెన్నుకొనుట.:-

మార్చు

 పాండవులు ధర్మపరులయ్యును మాయాజూదంబున దుర్యోధనునివలన సకలసంపదలును కోల్పోయి, యనుకొనిన ప్రకారము పన్నెండు సంవత్సరము లరణ్యవాసమును, నొక్కయే డజ్ఞాతవాసమును జరిపి, యుపప్లావ్యంబునకు వచ్చియుండిరి. అట్టియెడ ధర్మజుండు తమ్ముల యాలోచనంబు ననుసరించి, తమ కర్ధరాజ్యంబు నిచ్చుటయో, లేక యుద్దమునకు సిద్ధపడుటయో, యేదియైనదియుఁ దెలిసికొను నిమిత్తమై కౌరవుల కడకుఁ దమకు నచ్చినవానినిఁ గార్యాకార్యవిచక్షణ దక్షుని నొకని రాయబారిగాఁ బంపఁదలంచెను. అట్టివాఁడు శ్రీ కృష్ణుఁ డొక్కఁడే యని యెఱింగి యా మహాత్మునకు ధర్మరాజు తమ యభిప్రాయమును దెలియఁజేసెను. కృష్ణుండును, దుష్టరక్షణమున భూభారంబు తగ్గింప నవతరించి యున్నవాఁడగుటవలనను, దనకు భక్తురాలును కేవల మయోనిజ సంభవురాలును - నగు ద్రౌపదీదేవికిఁ గౌరవులు మానభంగ మొనర్చి యున్నందువలనను, దాను ధర్మము నంటియుండు వాఁడు గావున “ధర్మోజయతి” యనువాక్యమును సార్థకంబు సేయవలసిన వాఁడగుటవలనను, నన్నింటికంటెను గౌరవ వంశ నిర్మూలనమునకే తాను యవతారమెత్తి యున్నవాఁడగుటవలనను, నిన్ని కారణములుండుటఁజేసి, తాను గౌరవులకడకుఁ బాండవుల పక్షమున రాయబారిగా నరుగుటకు సమ్మతించెను. ధర్మజుండును గృష్ణునకుఁ జెప్పవలసిన విషయముల నన్నింటినిఁ జెప్పి హస్తినాపురంబున కంపెను.

శ్రీకృష్ణ సందేశము.:-

మార్చు

 కృష్ణుండును హస్తినాపురంబును బ్రవేశించి తన భక్తుండైన విదురునియింట బసచేసి, యొకనాఁడు దృతరాష్ట్రుం డాప్తబంధు పుత్రమిత్రాదులతో నిండుపేరోలగంబుండిన సమయమున రాజానుమతిని గౌరవ సభామందిరంబును బ్రవేశించెను. కృష్ణావతార తత్త్వంబును సంపూర్తిగా నెఱింగినట్టి భీష్మద్రోణాదులాతనికి నమస్కారంబు లొనర్చి పరమాత్మఁగా దలంచుచుండ మూఢులగు దుర్యోధనాదులా మహానీయు నొక యలఁతి మానవునిఁగా దలంపసాగిరి. కృష్ణుండును సభా భవనంబును బ్రవేశించిన కొంతవడికి, నిజాసనంబునుండి లేచి ధృతరాష్ట్రుని గనుగొని యెల్లరును వినునట్లు “మామా! ధర్మమూర్తియగు ధర్మజుని పంపున నేను మీకడకు రాయబారినై వచ్చియుంటిని. పాండవులు సమయభంగ మొనర్పక యనుకొనిన ప్రకార మరణ్యాజ్ఞాత వాసంబుల జరిపివచ్చి ప్రస్తుత ముపప్లావ్యంబున నున్నసంగతి యెల్లరకును తెలిసేయున్నది. ఇదివరకుఁ దెలిసియో తెలియకనో యొనర్చినట్టి తప్పులన్నింటినిఁ బ్రస్తుతము మీరైనను వారైనను బరిగణింపవలదు? ఉభయ వంశములును సర్వశ్రేయంబులఁ బొందియుండు తెఱంగున విచారించి నీ తమ్ముని కొడుకులైన పాండవులకు న్యాయప్రకారముగా రావలసిన యర్దరాజ్యంబు నొసంగుము. ఇందువలన నుభయులకు మేలుఁగలుగును. ఒకవేళ వారికి యర్థరాజ్యంబొసంగక యుద్ధమునకే సంసిద్ధపడెదవేని “ధర్మోజయతి” యను సూత్రమును మాత్రము మఱవకుము. ఎచ్చట ధర్మముండునో యచ్చట భగవంతుఁ డుండును. ఎచ్చట భగవంతుఁడుండునో యచ్చట సర్వశుభములుండును. నీ కుమారు లధర్మపరులగుటవలన నీ సూత్రము వారియందు సమన్వయింపనేరదు. యుద్ధమే సిద్ధమగునేని నీ వంశనిర్మూలనము సిద్ధమని యెఱుంగుము. పాండవులు సామాన్యులుగారు. వారు కేవలము దేవతాంశ సంభూతులు. శాంతమూర్తియగు ధర్మరాజుండొక్క డలిగెనేని సకలభువనంబులును భస్మీభూతంబులుగాఁగలవు. పతివ్రతాశిరోమణియగు ద్రౌపదీదేవి నోటినుండి పరుషవాక్యములు వెలువడినచో, నీ నూర్గురు కుమారులు లొక్కబరి మృతినొందఁగలరు. ఇదియంతయును దధ్యము. నా హితంబును గైకొనక సంధికొడంబడనిచో నేఁ జెప్పిన దంతయు జరిగితీరును. ఓ మూఢదుర్యోదనా? సావధానుండవై వినుము. నీ మూలమున నీ వంశ క్షయమగు కాలము దాపరించుచున్నది. ఇప్పటికిని మించిపోలేదు. మదీయ హితవాక్యానుసారము పాండవుల కర్థరాజ్యంబు నొసంగి వారితో స్నేహభావమున మెలంగుము. భీష్మద్రోణకర్ణాశ్వత్థాములుండిరిగదా యని యుద్ధమునకు సిద్ధుడవగుచుంటివేమో యది యెంతమాత్రమును దగదు. వేయిమంది కర్ణులున్నను ఒక్కపార్థునితో సమానులుగాఁజాలరు. “ధర్మోజయతి” యను సూత్రమెంతమాత్రమును నిరర్థకంబుఁగానేరదు. చక్కగా విచారించుకొను” మని తెలియఁబలికి తన యాససంబంధిష్టించెను. కృష్ణుని హిత ప్రబోధనమునకు భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ విదురాదులెంతయును సంతసించిరి. కాని దుర్యోధనున కది వినుటకుఁ గూడ హేయముగాఁ దోచెను. అందువలన, నచ్చోట నుండజాలక శకుని కర్ణ దుశ్శాసనాదులతోఁ గలసి సభనుండి లేచిపోయెను.

శ్రీ కృష్ణుండు విశ్వరూపంబును దాల్చుట.:-

మార్చు

 కృష్ణుని హితప్రబోధమునకు ధృతరాష్ట్రుఁడేమి చెప్పునో విందామని సభికులెల్లరును నిశ్శబ్దముగా నుండిరి. కాని దృతరాష్ట్రుఁ డేమియు బదులుసెప్పక మౌనము వహించి యుండెను. అట్టియెడ సభనుండి లేచి పోయిన దుర్యోధనాదులు శ్రీకృష్ణపరమాత్మను బంధింపవలయు నని ప్రయత్నించుచుండిరి. ఆ సమయమునఁ గృష్ణుని కనిష్ఠ సోదరుండగు సాత్యకి కౌరవుల దురభిప్రాయమును గుర్తించి సభికులెల్లరు వినునట్లు కృష్ణునితో “అగ్రజా! నిన్ను బంధించుటకు దుర్యోధనాదులు ప్రయత్నించుచున్నారు. ఆజ్ఞయయ్యెనేని వారల నిప్పుడే మదీయ నిశితకరవాలంబున కెరజేసెద” నని పలికెను. ఆ మాటలకు భీష్మద్రోణాదులు నివ్వెరపడిరి. “కౌరవవంశ క్షయకాలము సమీపించుచున్నదని సభికులందరును దలంపసాగిరి. అట్టియెడ శ్రీకృష్ణుం డాసనంబుననుండి లేచి “సభికులారా! వింటిరిగద? దుర్మార్గప్రవర్తనుడగు సుయోధనుడు నన్ను బంధింపఁదలచి యత్నించుచుండెనట. కానిండు, ఓ మూఢదుర్యోధనా? సకలమానవబంధవిముక్తండనగు నన్నే బంధింపఁదలచితివా? కౌరవవినాశకాల మిప్పుడే దగ్గఱించుచున్నది. రమ్ము. ఇదో చేతనగునేని నన్ను బంధింపు” మని విశ్వరూపంబును దాల్చెను. ఆ విశ్వరూపంబున అష్టదిక్పాలకులును, బ్రహ్మ రుద్రేంద్రాదులును, సకల ఋషీశ్వరులును, భీష్మద్రోణాదులును, కౌరవులును, బంచపాండవులును, వేయేల; పంచభూతాత్మకంబైన విశ్వంబంతయుఁ గానుపించుచుండెను. అట్టి విశ్వరూపంబును గాంచి భీష్మద్రోణాదులు పులకాంకిత గాత్రులై శ్రీకృష్ణభగవానునిఁ గీర్తింపదొడంగిరి. సభయంతయు జయధ్వానములతో నిండిపోయెను. ప్రకృతియంతయు నానందరస కల్లోల సముద్రంబున మునింగి యుండెను. ఎచ్చోట నాలకించినను “ఓం, ఓం, ఓం, ఓం” అను ప్రణవ మంత్రధ్వనులు వినవచ్చుచుండెను. అట్టియెడ ధృతరాష్ట్రుండును హరికృపాలబ్ధదృష్టివలన నామహాత్ముని విశ్వాకారమునుగాంచి, తిరిగి యంధత్వము నొందిన వాఁడై యా యనంతాకారునితో “మహాత్మా! విశ్వరూపంబు నుపసంహరింపుము. వినాశకాలము దాపరించుచున్నప్పుడు నీవుమాత్రమేమిచేయఁగలవు? నా వంశక్షయమగు నని నాకుఁ జక్కగాఁ దెలియును. ఇంక నీ వరిగి యుద్ధప్రయత్నమున నుండు” మని చెప్పెను. కృష్ణుండును ధృతరాష్ట్రుని వాక్యానుసారము తనవిశ్వరూపంబు నుపసంహరించి, దుర్యోధనాదు లవనతవదనులై తన్నుఁ జూచుచుండ, భీష్మద్రోణ విదురాదులు తనవెంటనడువ, సభాభవనమును వీడి యందఱి వలన వీడుకోలువడసి పాండవులవద్ద కరిగెను. నాటనుండి యుభయ పక్షములవారును యుద్ధప్రయత్నముల సేయందొడంగిరి.

బలరాముఁడు సూతునిఁజంపితిరిగి బ్రతికించుట.:-

మార్చు

  ‘కౌరవులును బాండవులును రాబోవు మహాయుద్దంబునకు సన్నద్ధులగుచుండఁ గృష్ణుండెట్లు బాండవులపక్ష మవలాభించు ననియుఁ దాను ద్వారకయందే నిలచియున్న నిజశిష్యుండగు దుర్యోధనునకుఁ దోడుగా నరుగవలసివచ్చునేమో యనియు, నుభయులు దనకుఁ గావలసిన వారగుటవలన నెవ్వరిపక్షము నవలింబింపఁ గూడదనియుఁ’ దలంచి బలరాముండు తీర్థయాత్రా నెపంబున ద్వారకానగరంబును విడిచి పుణ్యతీర్థంబుల సేవింప నరిగెను. అట్లరుగుచు నెడనెడ ననేక పుణ్యతీర్థంబుల యందవగాహన మొనర్చుచు దేవర్షి పితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబుల నాచరించుచుఁ దుదకు నైమిశారణ్యంబునుఁ జొచ్చెను. అప్పుడచటనున్న మునులందఱును దమతమ యాసంబులనుండి డిగ్గి పూజించియుండ,సూతుండు మాత్రము నిజాయసనంబునుండి లేవక, ప్రత్యుత్థాన నమస్కారవిధుల నడపక యుండుటవలన బలభద్రుం డతని యెడఁ గినుకవహించి, ‘సూతుని దురభిమానియు, విద్యాగర్వంబున నొడలెఱుంగక యున్నవాఁడనియు’ నెద భావించి, దుష్టజన శిక్షణార్థం బవతరించిన తన యట్టివాని కాతని యెడ నుపేక్షసేయుట పాడిగాదని హస్తంబుననున్న కుశాగ్రంబునే యాయుధంబుగాఁగొని యాతని వధించెను. అప్పుడచ్చట నున్న మును లందఱును హహారవంబులతోడ నాతనిఁజూచి “మహాత్మా’ మేమీతనికి బ్రహ్మాసన మిచ్చియుండుటవలన నీ రాక నెఱింగియు నాసనంబునుండి దిగుట యధర్మంబు గావున నటుసేయకుండె. సర్వజ్ఞండవగు నీవును యుక్తాయుక్తంబుల విచారింపక యీతనిని వధించి బ్రహ్మహత్యాదురితంబు నందితివి. కావునఁ బ్రాయశ్చిత్తంబుఁ గైకొనుము. నీవే ధర్మంబు దప్పిన నింక భూమిపై ధర్మమునకుఁ దావుండునా? యని యనేకవిధములఁ బలుక బలరాముండును దామసంబునఁ దానొనర్చినపనికిఁ జింతించి, “యైననేమాయె” నని తన యోగమాయా ప్రభావంబువలనఁ దిరిగి సూతునిఁ బునర్జీవితునిఁగా నొనర్చెను.

బలరాముడు పల్వలుండను రక్కసుని సంహరించుట.:-

మార్చు

 మునులందఱు నాతండొనర్చిన పనికి సంతోషించి యతని పాపంబు దొలంగెనని వచించిరి. అట్టిమేలు దనకుఁ గూర్చినందులకు మునుల యెడ నాతండు గరుణవహించి “మునులారా! నన్ను బ్రహ్మహత్యా దోషంబునుండి విముక్తినిఁగాఁజేసి కాపాడితిరి. ఇట్టిమేలుఁ గూర్చిన మీకు నేనును మేలుసేయనున్నాఁడ. ఏమివలయునో తెల్పుఁ” డని పలుక వాఱంద ఱేకగ్రీవముగా “మహాత్మా! ఇల్వలుని పుత్రుం డగు పల్వలుండను రక్కసిఱేఁడు మా సవనవాటికలను బాడుసేయుచు మమ్మనేకవిధముల బాధించుచున్నవాడు. వానినింబట్టి వధించి మారు మేలొనఁగూర్పు” మని యాతనితో విన్నవించిరి. బలదేవుండును దనకు దుష్టశిక్షణం బవశ్యక కర్తవ్యంబు గావున, స్మృతిమాత్రంబున నిజాయుధంబులఁ బడసినవాఁడై తత్ప్రాంతారణ్యంబున నున్న పల్వలుని గుహ కరిగి వాని నెదిర్చి వినోదార్థంబుగాఁ గొంతకాలము రణమొనర్చి, తుదకుఁ దన హలాయుధంబున నాతనిని రెండుగాఁ జీల్చివైచి మునిగణంబుల సంతోషపెట్టినవాఁడై తాను యథేచ్ఛం జనియెను.

శ్రీకృష్ణుడు పార్థునకు భగవద్గీతోపదేశంబు నొనర్చుట.:-

మార్చు

 కురుక్షేత్రమునఁ గురుపాండవబలంబులు యుద్ధంబునకు సన్నద్ధంబులై యుండెను. కృష్ణుండు యుద్ధంబున జోక్యంబు గలిగించుకొనక పార్థునకు సారథ్యంబుమాత్రంబు నెరుపుట కంగీకరించి పాండవపక్షము నవలింబించెను. యుద్ధము ప్రారంభమయ్యెను. కురుబలంబులకు భీష్ముండు నాయకత్వము వహించెను. పాండవ బలంబులకు దృష్టద్యమ్నుం డాధిపత్యమును గైకొనెను. అట్టియెడ యుద్ధము ప్రారంభమైనదని యనుటయేగాని యర్జునుండు మాత్రము, “తాను రాజ్యభోగానుభవంబునకై, పిన్ననాటినుండి తన్నుఁ బెంచి పెద్దవానిఁగాఁజేసిన భీష్ముని, విద్యాబుద్ధులఁ గఱపి తన్నంతవానిగా నొనర్చిన ద్రోణుని, మరియుఁ దనకుఁ గావలసిన స్వబంధులను, గరుణావిహీనుఁడై, జంపఁజాల” నని కృష్ణునకుఁ దెలియఁ జేయుచు, విరక్తిభావమును వహించి విల్లునమ్ములను విడచి చింతానిమగ్నుఁడయ్యెను. అప్పుడు సకలవిషయరహస్యవేత్త యగు శ్రీకృష్ణుం డాతనిఁజూచి “పార్థా! శోకమోహముల కిది యదనుగాదు. నీవు క్షత్రియుండవు. క్షత్రియులకు ధర్మశాస్త్రోక్తమైన యుద్ధంబుకన్న నితరమగు ధర్మ మేదియునులేదు. అట్టియెడ, నీవు కులధర్మము నెంతమాత్రము నతిక్రమింపఁగూడదు. కావున నీకన్నివిధముల యుద్ధమొనర్చుటయే ధర్మమగుచున్నది. వెండియు రాజులకు యుద్ధమే స్వర్గసమానము. అట్టియుద్ధమును నే రాజులు పొందుచున్నారో యట్టివారు స్వర్గసుఖ భోగానుభవు లగుచున్నారు. అర్జునా! ధర్మతత్వంబును దెలిపెద వినుము. ఎప్పటికైనను దేహములు నశించును గాని వానియందుండునట్టి యాత్మ నశింపనేరదు. ఈ యాత్మను ‘నేను జంపుచున్నా’ నని తలంచువాఁడును, ‘నావలనఁ జంపఁబడు‘ నని భావించువాఁడును, కేవల మజ్ఞానుండగుచున్నాడు. అన్నింటియందును సద్రూపముగా నుండునట్టి యీ యాత్మకు, నాశమునొందుట, మాఱురూపమును బొందుట, పుట్టుట, పెరుగుట, క్షీణించుట యనునవి యెంతమాత్రమును లేవు. ఎల్లప్పుడీ యాత్మ యొకే స్వరూపమున నిలచి యుండును. పంచభూతంబు లీయాత్మను బాధింపఁజాలవు. ఆత్మ నిత్యుండు - అవ్యయుండు - వికారరహితుండు - శుద్ధుండు - ఒక్కండు - వాగగోచరుండు - అచ్యుతుండు. కావుననే పాంచభౌతికంబు లగు దేహంబులు నశించుచున్నను, నీ యాత్మ నశించుటలేదు. సుస్థిరుం డగుటవలననే, యొక దేహమును విడిచి మఱియొక దేహమును ప్రవేశింపఁగలుగుచున్నాఁడు. పార్థా! ఒకఁడొకనిచిచేత నింకొకనిఁ జంపించుచున్నాఁ డనియు, నొకఁడు మఱియొక దేహమును బ్రవేశింపఁ గలుగుచున్నాఁడనియు, నొకఁడు మఱియొకనిఁ జంపుచున్నాఁడనియు జెప్పుట కెంతమాత్రమును వీలులేదు. చంపుటకును జంపించువాఁడవును నీవు గానేరవు. నీవు కేవలము నిమిత్తమాత్రుఁడవు. కావున యుద్ధమునకుఁ గడంగుము. ఇదిగో! సర్వమును దిలకింపు” మని తత్త్వోపదేశానంతరము దివ్యదృష్టి నొసంగెను. అర్జునుఁడు దివ్యదృష్టితోఁ దిలకించి నంతనే, కురుబలంబంతయు యమభటుల మూలఁబునఁ బ్రాణంబులఁ గోలుపోవుచుండెను. అంతఁ బార్థుండు సర్వమును గ్రహించినవాఁ డై యుద్దమునకుఁ గడంగెను.

కురుక్షేత్ర సంగ్రామము.:-

మార్చు

 కురుక్షేత్ర సంగ్రామంబు సుమారు పదునెనిమిది దినముల వఱకు జరిగెను. యుద్ధము సమాప్తి నొందునప్పటికిఁ గురువంశం బంతయును, బాండవుల బలంబు లన్నియును నశించెను. తుదకు బాండవులు మాత్రము మిగిలిరి. అట్టియెడ, ద్రోణుని పుత్రుఁడగు నశ్వత్థామ కౌరవబలంబులోని వాఁడగుటవలనఁ దన తండ్రి చావునకును, దుర్యోధనాది కౌరవ వినాశంబు కొఱకును మిగుల దుఃఖించి పాండవుల యెడఁ గినుక వహించినవాఁడై “అపాండవమగుఁగాక” యని నారాయణాస్త్రమును బ్రయోగించెను.

శ్రీకృష్ణుండు త్తర గర్భంబునకుఁ బ్రాణదాన మొసంగుట.:-

మార్చు

 ఆయస్త్రజ్వాలలవలన నుత్తర గర్భంబులోని పిండము గూడ మృతి నొందనుండెను. అప్పుడు కృష్ణుం డా యస్త్రంబు బారినుండి పాండవుల రక్షించి యుత్తర గర్భస్థమగు పిండమునకుఁ బ్రాణదానం బొసంగెను. ఇట్లు పాండవుల రక్షించి యుద్ధానంతరము ధర్మరాజునకుఁ బట్టాభిషేక మొనర్చెను. ధర్మజుండును ధర్మంబు దప్పక రాజ్యపరిపాలనంబు సేయఁదొడంగెను. కృష్ణుండు వారికిఁ దోడుగా నుండెను.