యదువంశము/మూడవ ప్రకరణ
మూడవ ప్రకరణము
మార్చుబలరాముని జననము:-
మార్చుదేవకీదేవి యేఁడవ గర్భంబును దాల్చిన వెంటనే విశ్వరూపుండైన హరి గర్భస్థఁడగు జీవునకుఁ గంసునివలన హానిసంభవించునని యెఱింగి, తన్ను నమ్మియున్న యాదవులకు మేలొనర్పఁదలంచినవాఁడై యోగమాయాదేవినిఁ జేరఁబిలిచి “దేవీ! వసుదేవుని భార్యలలో నొకతెయైన రోహిణియను కాంత కంసునివలన నెట్టియాపదను బొందక నందగోకులమున సురక్షితముగా నున్నయది. ప్రస్తుతము దేవకీదేవిగర్భస్థమై యున్నపిండ మాదిశేషునియంశమున వృద్ధింబొందుచున్నయది. కావున నీ నేర్పుకొలంది ప్రయత్నించి యా పిండమునుగొని రోహిణీదేవి గర్భమునఁ జొనిపిరమ్ము. అష్టమగర్భంబున నేనామెకుఁ బుత్రుఁడనై పుట్టెదను. నీవును యశోదయను పొలతికిఁ బుత్రికవై పుట్టుము. జనులందఱును నిన్ననేక విధంబుల ననేక నామంబులలోఁ బూజింపఁగలరు” అని చెప్పి పనిచిన వెంటనే మాయాదేవియుఁ దన యోగమాయ వలన నెవ్వరికిఁ దెలియనిచందమున దేవకీదేవి గర్భమునుకొనివ రోహిణీదేవి గర్భమున నుంచెను. అంత రోహిణియు గర్భంబును దాల్చినదై యొక్క కుమారునిఁ గనెను. ఆపసిపాపఁడు బలముఁ గలవాడగుటవలన, బలభద్రుఁడనియు,లోకరమణుఁడగుటవలన, రాముడనియు, గర్భ సంకర్షణమున సంకర్షణుఁడనియు మున్నగునామములతోఁ దేజరిల్లఁజొచ్చెను.ఈ విధముగాఁ గృష్ణావతారమునకు ముందే నంద గోకులమున బలరామోత్పత్తి యయ్యెను. మాయాదేవియు శ్రీహరి వాక్యానుసారము యశోదగర్భమును జొచ్చెను.
శ్రీకృష్ణునిజననము.
మార్చుదేవకీదేవి యేడవగర్భమేమైనది ఎవ్వరికిఁ దెలుయకున్నందువలనఁ బౌరులందఱును గడుపు దిగెనని యనుకొనసాగిరి. ఇట్లు కొన్నిదినములు గడుచునప్పటికి, దేవకీదేవి అష్టమగర్భంబును ధరించెను. ఈ యష్టమ గర్భమేగదా తన్ను సంహరించునదియని కంసుఁడు గడు జాగరూకతతోఁ దనవారినిఁ గాపుంచెను. పాపము! వసుదేవునకుఁ బుత్రునెట్లు గాపాడవలయునో తెలియకుండెను. భారమంతయును భగవంతునియందే నిలిపి యాతని చరణసరసీజములే తమకు దిక్కని నమ్మి యారాధించుచు నా దంపతులు దినములు గడుపుచుండ నొకనాటిరాత్రి శ్రీహరి వసుదేవునకుఁ బ్రత్యక్షమై తన్నేమార్గమునఁ గాపాడవలసినదియుఁ దెలియఁజేసి యదృశ్యుండయ్యెను. అప్పటికే దేవకీదేవికి నీళ్ళాడు ప్రొద్దులగుటవలన నొకనాఁటినడురేయినిఁ దారలు, గ్రహంబులు మొదలగునవి యన్నియును శుభగతిని నుండ నామె యొక్క శిశువును గనెను. పిండోద్భవమైన వెంటనే యొరులకుఁ దెలియకుండఁ బూలవానలు గురిసెను. దేవదుందుభులు మ్రోగెను. సురకాంతల నృత్యగీతములు విజృంభించెను. మఱియొకదెస, బ్రహ్మాదిసకల దేవతలును నారదాది సర్వమునీంద్రులును, గైలాసాది సకలభువనంబులును, నాతనిఁగీర్తింపఁదొడంగిరి. ఆహ! ఏమి యా పాపని సౌందర్యము! దేహము నీలవర్ణము. కన్నులు పద్మములు. కంఠహారము కౌస్తుభము. మోము పూర్ణేందుబింబము. అవిఇవి యననేల? సర్వవిధముల శ్రీహరినిఁ బోలియుండెను. ఆపాపని సహజతేజఃపుంజమువలన నా పురిటిఇల్లు చక్కగాఁ బ్రకాశింపఁజొచ్చెను. అట్టి శిశువును వసుదేవుఁడు గాంచి శ్రీహరియే తనకుఁ బుత్రుండయ్యెనని తలంచి, పుత్రానురాగమును బొందక, కేవలము భక్తి పరవశుఁడై యాపాపనికి బ్రదక్షిణపూర్వకనమస్కారం బొనర్చి, ముకుళిత కరకమలుండై “దేవా! సర్వమును నీ యందిమిడియున్నది. నిజముగ నీవు సర్వాత్ముఁడవు. సర్వమయుఁడవు. సర్వేశ్వరుఁడవు. గుణవికారరూపరహితుడవు. జననమరణాదులు నీకుఁ గలుగనేరవు. నీవే పరబ్రహ్మవు. నీ యాజ్ఞలేనిదే తృణమైనను గదలఁజాలదు. భూభారమును తొలగించుటకై నీవిట్లు రూపంబునుగొని యుద్భవించితివేగాని, నీకు రూపోత్పత్తులుగలవా?” యని యిట్లనేకవిధంబులఁ బ్రార్థింపఁదొడంగెను. దేవకీదేవియుఁ బుత్రవ్యామోహంబును బొందక, పరబ్రహ్మస్వరూపంబైన యాశిశువును బలువిధంబుల నుతిసేయసాగెను. ఈ విధముగా సకలమునకు శ్రీహరిజన్మక్రమము తెలిసియుండ మాయాదేవి యోగనిద్రవలన రక్కసకులంబున కెంతమాత్రమును దెలియకుండెను. ఆహా! పరాత్పరుని తత్త్వంబు నెవ్వరు గుర్తింపగలరు?
కృష్ణుండు గోకులమును జేరుట:-
మార్చువసుదేవుఁడు పుత్రరక్షణము తనకుఁ గర్తవ్యమై యుండుటవలన భక్త్యావేశము నణంచుకొని, రక్షణోపాయమును, హరివలన నింతకుమున్నే యెఱింగి యున్నవాఁడగుటవలన, నా పసిబిడ్డను జంకనిడుకొని గోకులమునకు బయలుదేఱెను. యోగనిద్రవలనఁ గావలివారలా సమయంబున శరీరంబులు మైమఱచియుండిరి. వసుదేవున కప్రయత్నముగ నినుపసంకెల లూడిపోయెను. అప్పుడాతండు సప్పుడుగాకుండ మెల్లన నడుగులిడుచు మొగసాలలం గడచి యచిరకాలంబుననే పురంబును నిర్గమించి యమునానదీ సికతాతలంబును సమీపించెను. అచ్చోట యమునయు మురళీగానముచేత ముందు తన్నాబిడ్డ మోహింపఁజేయనుండెనని మేలుదలంచెనో యనునట్లు వసుదేవునకు మార్గమునొసంగెను. అతండును, ననాయాసముగా నదినిదాటి వ్రేపల్లెకుంజని యందు నందునిమందిరంబును ముందుగఁజొచ్చి యందమందనిద్రం బొందియున్న యశోదను డాయంజని, యామెకుఁ దెలియకుండ నప్పుడే పుత్రికారూపంబునఁ బుట్టియున్న మాయాదేవినిఁ దానుగైకొని యాయవ్వశయ్యపైఁ దన పసిగందును బరుండఁబెట్టి మరల నింటికి బయలుదేరెను. ఈ వృత్తాంతమంతయు నొరుల కెంతమాత్రమును దెలియకుండెను. వసుదేవుండట్లు బయలుదేఱి యధాప్రకారముగా నదినిదాటి కారాగృహంబునుజొచ్చి యాయాడు శిశువును దన కాంతకొసంగెను.
టీక- డాయంజని = దరిజేరెను
మాయాదేవి.:-
మార్చుపసిపాపయైన మాయాదేవిని, నత్తెఱంగునఁ గొనివచ్చి, వసుదేవుఁడు నిజసతీమణి పురిటి మంచముపై నుంచినంతనే యాబాలిక, రక్కసకులమును మేల్కొలుపుటకో యనునట్లు యేడువఁ దొడంగెను. ఆరోదనధ్వనుల నాలకించి కావలివారలు మేల్కాంచి సర్వము నెప్పటివిధమున నుండుటఁ గని హానియేమియుఁ గలుగలేదను నమ్మకముఁ గలవారై, శిశువు కలిగిన సమాచారము నప్పుడే కంసునకుఁ దెలియఁజేసిరి. అతఁడు నీయష్టమగర్భంబేగదా తన్ను సమయించునది యని రోషకషాయితనేత్రుండై దిగ్గన శయ్యనుండి డిగ్గి, వెండ్రుకలు ముడివీడఁ దాల్మి నశింపఁ బైచీర తొలఁగిపోవఁ దత్తరంబునఁ బురిటి గృహంబును జొచ్చి, యేడ్చుచున్న యాపసిగందును దన నిశితకర వాలంబున కెరఁజేయుటకై, చేపట్టి భయంకరమైన యావాడివాలును పైకెత్తెను. అట్టియెడ దేవకీదేవి పెద్దపెట్టున యేడ్చుచు నాతనికడ్డంబు వచ్చి “అన్నా! అష్టమ గర్భంబునఁగలుగు పుత్రుఁడుగదా నీప్రాణంబులఁ గొనునని యాకాశవాణి పలికినది? నాయష్టమగర్భంబు బాలిక గాని బాలుండుగాడు. ఈ యాడుబిడ్డవలన నీకేమిభయము? దీనిని విడిచిపెట్టుము. అయ్యో! ఇదివఱకే నాకుఁగలిగిన యార్గురుకొడుకులను బట్టి దయాశూన్యుండై వధించితివి. ఇప్పుడీ యాడుబిడ్డనుగూడ నిష్కారణముగా వధింపనుంటివి. నాకుఁ బుత్రలాభము లేకపోయినను, బుత్రీలాభమునైనఁ బొందనిమ్ము. అన్న! ఈ యాడుబిడ్డ నిన్నేమిచేయఁగలదని భయపడెదవు? ఇదియేనా నీకుఁగలపౌరుషము?
అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.”
అని యీ విధముగా ననేకవిధంబుల నాతనిఁ బ్రార్థింపఁజొచ్చెను. కాని యామె ప్రార్థనంబుల నాతని కఠిన హృదయ మెంతమాత్రమునుఁ గరుగలేదు. అతని నిశ్చితాభిప్రాయ మణుమాత్రమైనను మారలేదు. బలవంతముగా నా శిశుహంతకుడు - ఆదుర్మార్గుడు - ఆ కఠినహృదయుఁడు - ఆపసిపాపను దల్లిఱొమ్మునుండి గైకొని వెక్కివెక్కి యేడ్చుచున్నను దయలేనివాఁడై పుడమిపయిం బడవైచెను. కాని యాపసిపాప పుడమిపయిం బడక, విచిత్రగతి గగనంబున కెగసి విశ్వరూపంబును దాల్చినదై,లచూచువారలాశ్చర్యపడ నందఱును వినునట్లు “కంసా! నీవెంత యత్నించినను దైవవిధిని దప్పించుకొనజాలవు. నిన్ను సమయించువాఁడిదివఱకే పుట్టిపెరుగుచున్నవాఁడు. క్రూరకర్మమని యెంచక సోదరిబిడ్డల నార్గురినిఁ జంపిన పాపము నిన్నుఁ గుట్టికుడుపక మానునే?” యని పలుకుచు నంతరిక్షంబున నదృశ్యమై పోయెను.కంసుఁడు హతాశుఁడైపోయెను. అచ్చటనున్నవారందఱును విభ్రమచేతస్కులై యుండిరి.
దేవకీవసుదేవుల చెఱవిముక్తి:-
మార్చుమాయాదేవి పలికినపలుకులు సెవులకు ములుకులై సోకఁ గంసుఁడు కొంతవడికిఁ దెప్పరిల్లి తానొనర్చిన దంతయు నిష్ఫలమైపోయెంగదా యని విరక్తిభావముఁగలవాఁడై మఱందియైన వసుదేవునిఁగాంచి “మహాత్మా! నేను నీయెడ మహాపరాధమును గావించితిని. నేను గేవలము పాపుఁడను; బాలఘాతకుఁడను; క్రూరుండను; దుష్టచిత్తుండను; దయాశూన్యుఁడను; బ్రాహ్మణ హింసాపరాయణుండను. పాపమనక యశాశ్వతంబగు నీ శరీర రక్షణార్ధమై నీ యార్గురు కొమరులను బట్టివధించితిని. అయినను దైవవిధిని, దప్పించు కొనఁజాలనైతిని. ప్రాణులందఱును దమ పూర్వజన్మకర్మానుసారము వృద్ధిక్షయములకును, జననమరణంబులకును లోనంగుచుందురు. దేహధారులెందును స్వతంత్రులుగారు. రక్షించుటకును శిక్షించుటకును గర్మప్రధానమగుచున్నది. కాని వ్యక్తిప్రధానమగుటలేదు. యా శిశుసంహారమునకు వారివారికర్మయే ప్రధానంబు గాని నేనెంతమాత్రమును గర్తనుగాఁజాలను. ఆత్మకెన్నండును బగసెలుములులేవు. అవి కర్మవలననే కలుగుచున్నవి. ఈ తాత్పర్యంబును గుర్తెఱింగి నన్ను క్షమింపవలసినది” యని యాతనిపాదములపై వ్రాల వసుదేవుఁడును గంసుని మనఃపూర్వకముగా క్షమించెను. కంసుండును దేవకీవసుదేవులను జెఱనుండివిముక్తులజేసి తాను నిజమందిరంబున కరిగెను. దేవకీవసుదేవులును శాంతచిత్తులై యుండిరి.