సర్వదర్శన సంగ్రహం/చార్వాక దర్శనం
1.1 భూమ్యాది పంచభూతాల సృష్టికర్త, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, అనంత జ్ఞనానికి మూలం, నిశ్చలానందమునకు భాండాగారం, ముక్తికి ఆకారస్వరూపుడైన శివుడిని నేను ఆరాధిస్తున్నాను.
1.2 ఆగమములన్నింటినియు తెలిసిన సర్వజ్ఞ గురువు, సంపూర్ణ దర్శన శాస్త్ర సముద్రాన్ని దాటినవాడు, ఆత్మకు అంతరార్థం తెలిపి సర్వులను చరితార్థులు చేసిన సారంగపాణి తనయుడు, నిఖిల శాస్త్రవేత్త అయిన విష్ణువుకు నేను సేవ చేస్తున్నాను.
1.3 సర్వదర్శన సంగ్రహమును అత్యంత శక్తిమంతుడైన మాధవుడు, శ్రేష్థమైన పాల వంటి కౌస్తుభుడు, అదృష్టసాగరుడైన శయనుడు రచించిరి.
1.4 శ్రీమత్స్యాయన మాధవాచార్యప్రభువు సాధువుల సంతోషం కోసం ప్రాచీనపండితుల దుర్బోధ శాస్త్రాల ఆలోచన చేస్తూ ఈ సర్వదర్శన సంగ్రహం అనే గ్రంథం వ్రాశాడు. సాధువులు మానసిక మాత్సర్యమును పరిత్యజించి ఈ గ్రంథము యొక్క తాత్పర్యమును శ్రవణము చేయవలెయును. విచిత్ర పుష్పమాలను చూచి ఎట్లు అసౌకర్యము కలుగదో, దీనిని వినుట వలన కూడా వారికి అసౌకర్యము కలుగదు అని బోధపడుతోంది.
1.5 పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడని ఎలా తెలిసింది? బృహస్పతి మతాన్ని అనుసరించిన నాస్తికశిరోమణి అయిన చార్వాకుడు, "ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు" అనే వాదాన్ని వ్యతిరేకించాడు. "జీవించినంతకాలం సుఖంగా జీవించు, ఏ జీవి మృత్యువాత పడకుండా తప్పించుకోలేడు; ఒక్క మారు ఈ శరీరము భస్మమైపోయిన తర్వాత, తిరిగి రావటం ఎవరు చూశారు?" అన్న సత్యం జగమెరిగిన తర్వాత ఈ చార్వాక మతాన్ని ఖండించటం అసాధ్యమైపోయినది.
1.6 ఏ వర్గం లోకులు అయితే లౌకికవాక్యాలను స్వీకరించి నీతి/కామశాస్త్రం లోని కామాన్ని మరియు అర్థాన్ని మాత్రమే పురుషార్థాలుగా పరిగణించారో, ఇతర పరలోక అంశాలన్నింటినీ ధిక్కరించారో వారే చార్వాక మతస్థులు. అందుకే చార్వాక మతాన్ని లోకాయతం అనే మరొక పేరు సార్థకమైపోయినది.
1.7 భూమ్యాది నాలుగు భూతాలే తత్వస్వరూపాలు. ఈ భూతచతుష్టయముతోనే దేహము ఉత్పన్నమౌ అవుతుంది. ముడిపదార్థాలు కలిపితే మాదకశక్తి ఎలా ఉత్పన్నమౌతుందో, పిమ్మట అటులనే భూతచతుష్టయములతో చైతన్యము ఉత్పన్నమై దేహము యొక్క పరిణతికి దోహదపడుతుంది. ఈ సర్వభూతాలు వినాశనమవగనే మనిషి కూడా వినాశనమౌతాడు. అటు పిమ్మట అతనికి పునర్జన్మ అంటూ ఉండదు.
1.8 చైతన్యముతో కూడిన దేహమే ఆత్మ అని పూర్వానుభవంతో తేటతెల్లం అవుతోంది. దేహమే లేని ఆత్మకు ఉనికి ఉన్నదని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇతర మతవిశ్వాసాల ప్రకారం దేహం లేని ఆత్మ అనెడిది ఏ మాత్రం ప్రామాణ్యత కలిగి ఉన్ననూ, సాక్ష్యాధారాలు లేని మూలాన అనుమానాది మతాలలో దీనికి కించిత్తు ప్రామాణ్యత కూడా లేదు. ఈ (అనుమానాది) మతములు జ్ఞానాధారాలే కాని అనుమితిపై ఆధారపడినవి కావు.
1.9 ఈ మతానుసారము కామముతో కూడుకొన్న సుఖములే పురుషార్థములు. స్త్రీసాంగత్యంలో ఉన్న సుఖము వలన దు:ఖము సంభవిస్తుంది, కావున దీనిని పురుషార్థము గా పరిగణించలేము అన్న వాదనను త్రోసిపుచ్చవచ్చును. ఒక వేళ స్త్రీ సాంగత్యములో దు:ఖమున్నచో, ఆ దు:ఖమును పరిత్యజించి కేవలం సుఖమును అనుభవించవచ్చును కదా? చేపను భుజించువాడు ముందు దాని పొలుసులను, అందులో ఉన్న ముళ్ళను తొలగించి మాంసమును మాత్రము భుజిస్తాడు. ధాన్యమును భుజించువాడు ముందు దానిలోని పొట్టును తొలగించి, ధాన్యమును మాత్రము భుజిస్తాడు. అలాగే స్త్రీ సాంగత్యంతో దు:ఖము వచ్చినచో, కేవలం సౌఖ్యమును స్వీకరించి దు:ఖమును వదిలివేయాలి. అంతేగానీ, దు:ఖము యొక్క భయముచే సుఖాన్ని వదులుకొనటం సముచితం కాదు. మృగాలున్న దేశాలలో ధాన్యానికి రక్షణ ఉండదన్న భయంతో పంట సాగు చేయకుండా ఏమైనా ఉంటున్నారా? మనం స్వీకరించే ఆహారం కోసం వచ్చే భిక్షకుల భయంతో, మనం వంట చేయకుండా ఏమైనా మానుకొంటున్నామా? లేదే? కావున ఏ వ్యక్తి అయిననూ ఈ ప్రకారం సుఖాన్ని వదులుకొంటే అతను పశువు తో సమానం, మూర్ఖుడికి ఏ మాత్రం భిన్నం కాదు అని తప్పితే మరేం చెప్పగలం?
1.10 ఐహిక భోగాలలో/భౌతికవాద సుఖములలో దు:ఖము పొంచి ఉన్నది అందుకే వీటిని పరిత్యజించాలి అనుకొనటం మూర్ఖత్వం. బుద్ధిమంతుడెవ్వడూ ధాన్యములో పొట్టు/మురికి ఉన్నదని, తెల్లని పౌష్టికరమైన వరిని సేవించటం మానుకొనడు.
1.11 పరలోకమున సుఖమే లేదనుకొందాం. అటులైన ప్రాచీన విద్వాంసులు ఏ విధంగా ధనవ్యయముతో కూడుకొన్న, మిక్కిలి శారీరక శ్రమతో కూడుకొన్న అగ్నిహోత్రాది యజ్ఞాలలో నిమగ్నమయ్యారు? మీ ఈ అభ్యంతరం ఆమోదయోగ్యం కాదు. ఎందుకనగా అగ్నిహోత్రాదులు కేవలం (బ్రాహ్మల) బ్రతుకుదెరువు కొరకు సృష్టించబడినవి. వేదాలలో ఉన్నవన్నీ సత్యదూరాలు, పరస్పర వైరుధ్యాలు, ఉటంకించటాలు. పైగా తమను తాము వైదిక పండితులు అని చెప్పుకొనేవారు తమకై తాము/ఒకరికొకరు వినాశాన్ని కొని తెచ్చుకొనేవారు. కర్మ కాండను అనుసరించువారు జ్ఞానకాండను, జ్ఞానకాండను అనుసరించువారు కర్మకాండను దూషిస్తారు. కేవలం వారి ధనదాహం తీర్చుకొనుటకే ప్రాచీన ధూర్తబ్రాహ్మలు అగ్నిహోత్రాది యజ్ఞాలు చేయనిదే పరలోక సౌఖ్యమును పొందలేమని వదంతులు సృష్టించారు. అంతిమంగా వేదాలు మాత్రం దుష్టులను సంతుష్టులు చేసేవి మాత్రమే. అందుకే బృహస్పతి - "వేదాలు, యజ్ఞోపవీతాలు మరియు భస్మలేపనాలు ఇవన్నియు బుద్ధిహీనుల, పురుషులు కాని వారి బ్రతుకుదెరువు కొరకే." అన్నాడు.
1.12 ఈ కాలంలో దు:ఖమే నరకము, ప్రజాదరణ పొందిన రాజుయే పరమేశ్వరుడు, దేహత్యాగమే మోక్షము అను సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. దేహమే ఆత్మ. ఈ మతాన్ని అంగీకరిస్తే, నేనే కుశుడను, కృష్ణుడను అవ్వగలను అనే అభిప్రాయం ఇందు మూలంగా కలుగవచ్చును. దేహము, ఆత్మ విభిన్నమైనచో "తెల్లని వారు కుశులు, నల్లని వారు కృష్ట్ణులు" అని చెప్పలేం. శిరస్సు లేని రాహువు, రాహువు కాడు. కానీ శరీరరము లేని రాహువు శిరము, రాహువుగానే పరిగణించబడును. (ఆత్మ లేని శరీరము శరీరము కాదు, కానీ శరీరము లేని ఆత్మ, ఆత్మగానే పరిగణించవచ్చును కదా?)
1.13 వీటన్నింటి సారాంశం ఒక్కటే. "ఈ సృష్టిలో భూమి, జలము, వాయువు మరియు అగ్ని; ఈ నాలుగు భూతాలు మాత్రమే కలవు. వీటివల్లనే చైతన్యం ఉత్పన్నమవునే కానీ భగవంతుడి వల్ల కాదు.
1.14 మాదక కణాలు కలిసినపుడు ఎట్లు మాదకశక్తి ఉత్పన్నమౌనో ఈ నాలుగు భూతాలు కలిసినపుడు అట్లు చైతన్యం ఉత్పన్నమవుతుంది.
1.15 లావుగా ఉండటం, సన్నగా ఉండటం వంటివన్నీ ఒకే శరీరానికి సంబంధించినవి. ఊబకాయం, కృశకాయం ఇవన్నియు ఒకే శరీరంలో ఉంటాయి. కావున ఆ శరీరమే ఆత్మ, వేరేదీ కాదు. 'నా శరీరం' వంటి పదాలు కేవలం అలంకారప్రాయాలే."
1.16 "ఒక వేళ అనుమితికే గనుక బలమైన సాక్ష్యం లేకపోయినచో నీ మనస్సులోని కోరికే నిజమయ్యేది. కానీ బలమైన సాక్ష్యం ఉన్నది. లేదు అని అనుకొంటే, పొగను చూచి తెలివైన వారు నిప్పు ఉన్నదని అనుకోవాలి? తీరమున ఫలములున్నవని తెలియగనే ఫలములను ఆశించిన వ్యక్తి చలనములో వేగము ఎందుకు వస్తుంది?" అని వ్యతిరేకులు అందురు. ఇదంతయు ఊహాత్మకత యొక్క అతిశయోక్తి. అనుమితిని ఆమోదించేవారు చిహ్నాన్ని జ్ఞానకారకంగా అంగీకరిస్తారు. ఈ చిహ్నం అల్పమైనదానిలో కలిగి ఉండినదై, అధికమైనదానికి సంబంధించినదై ఉండాలి. ఈ సంబంధం (అమోదించబడినను, విభేదించబడినను) బేషరతుదై ఉండాలి. ఈ సంబంధానికి దాని ఉనికి వలన అనుమితిని కలిగించే శక్తి ఉండదు. ఎందుకంటే చక్షువాది ఇంద్రియాలు జ్ఞానమును అనుభూతికి లోనయితేనే గుర్తిస్తాయి కానీ ఉనికి వలన గుర్తించలేవు కనుక. ఇది అసలు జ్ఞానమే కాదని మొదట తెలిపెదము. జ్ఞానము రెండు రకాలు. బాహ్య జ్ఞానము మరియు అంతర్గత జ్ఞానము. బాహ్య జ్ఞానము పంచేంద్రియాల వలన కలిగితే, అంతర్గత జ్ఞానము మనస్సు వలన కలుగుతుంది. పంచేంద్రియాలు దేనినైతే అనుభూతి చెందుతాయో వాటిని గుర్తించి, జ్ఞానాన్ని అందించగలగటం సాధ్యమే కావున మొదటిది (బాహ్య జ్ఞానము) అవసరం లేదు. అయిననూ భూతభవిష్యత్ కాలాల విషయానికి వస్తే, ఇటువంటి అనుభూతి సాధ్యపడకనే పోవచ్చును. ఏ సార్వత్రిక ప్రతిపాదన అయితే (మధ్యమ విషయం మరియు అధిక విషయాల మధ్య) ఏ మార్పుకీ లోనుకాని సంబంధాన్ని పెనవేసుకుని ఉండాలో ప్రతి సందర్భంలోనూ దానిని తెలుసుకొనుట అసాధ్యం కావచ్చును. సార్వత్రిక ప్రతిపాదన యొక్క ఈ జ్ఞానాన్ని సాధారణ తరగతియే దాని వస్తువని కూడా చెప్పలేం, ఎందుకంటే అలా అయినచో, ఈ ప్రత్యేక సందర్భంలో ఏ మార్పుకీ లోనుకాని సంబంధం యొక్క ఉనికినే సంశయించవలసి వస్తుంది. అంతర్గత అవగాహన కూడా జ్ఞానానికి దోహదపడదు. ఒక బాహ్య వస్తువుపై స్వతంత్రంగా మనసు ప్రతిస్పందించగలదని చెప్పలేం. ఎందుకంటే తార్కికులు చెప్పినట్లు "పంచేంద్రియాలు వస్తువులను నిర్వచిస్తాయి. కానీ మనసు వీటిపై ఆధారపడి ఉంటుంది."
1.17 సార్వత్రిక ప్రతిపాదనకు అనుమితి జ్ఞానమూలం కాజాలదు. ఎందుకంటే ఒక అనుమితిని ధృవీకరించాలంటే మరో అనుమితి కావాలి గనుక, ఆ మరో అనుమితి ధృవీకరణకు ఇంకో అనుమితి కావాలి గనుక. ఈ గొలుసుకట్టు అనుమితులు ఇలా కొనసాగుతూనే ఉంటాయి కనుక. అంతమాత్రాన సాక్ష్యాధారాలు/ఋజువులు జ్ఞానం యొక్క సార్వత్రిక ప్రతిపాదనలు కాజాలవు. కనడ లోని వైశేషిక సిద్ధాంతంలో ఇవి (సాక్ష్యాధారాలు/ఋజువులు) అనుమితిలోనే చర్చించబడినది. సాక్ష్యాధారాలు/ఋజువులు పాత అడ్డంకియైన అనుమితి యొక్క పురోగతిని మించలేవు. అనుమితి అనేది వయోవృద్ధుడు చేసే ఒక సంజ్ఞ వంటిది. సాక్ష్యాధారాలు/ఋజువులు ఏమాత్రం అనుభవం లేని ఒక బాలుడి వంటివి! (అనుమితి ముందు సాక్ష్యాధారాలు/ఋజువులు ఏ పాటివి? అనుమితి ఇచ్చే సమాచారం సాక్ష్యాధారాలు/ఋజువులకు అసలు అర్థం అవ్వవు. - అన్నది ఉద్దేశ్యం.) ఎవరో, నిప్పుకు-పొగకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిపినంత మాత్రాన మనం కూడా దానిని ఆమోదించాలని లేదు. సాక్ష్యాధారాలు/ఋజువులు సార్వత్రిక ప్రతిపాదనకు జ్ఞానమూలాలు అనుకొంటే; ఏ వ్యక్తికైతే మరొక వ్యక్తి అనుమితికి (నిప్పు) మరియు వ్యాప్తికి (పొగ) అవినాభావ సంబంధం ధృవీకరించలేకపోతాడో అప్పుడు ఆ వ్యక్తికి అనుమితి/వ్యాప్తులకు అర్థమే గోచరించదు. అంటే, అనుమితి అంటేనే కేవలం మాటలమూటలని తేలుతోన్నది. పోలిక ఒకాదానిని మరొకదానితో కొలుస్తుందే కానీ సార్వత్రిక ప్రతిపాదన యొక్క జ్ఞానాన్ని మాత్రం అందించలేదు. కనుక దీనిని కూడా జ్ఞానమూలంగా పేర్కొనలేము. అలాగే అవినాభావ సంబంధం (సార్వత్రిక ప్రతిపాదన) నిర్వచించినట్లు షరతులు లేకపోవటం అనునది కూడా తెలుసుకొనటం అసాధ్యం. అన్ని షరతులు అనుభూతి చెందే వస్తువులుగా ఉండటం అసాధ్యం కనుక. అనుభూతి లేకుండా ఉండటం కూడా ఒక అనుభూతే. అనుభూతి చెందలేని విషయాలను మనం అనుభూతి పొందకుండా ఉండాలి కనుక.
1.18 అందుకే ఇక్కడ కూడా మనకు అనుమితి తప్పితే వేరే గత్యంతరం లేదు. సాక్ష్యాధారాలు/ఋజువులు, పోలిక ఇవేవీ అనుమితి అనే అడ్డంకిని తప్పించుకోలేవు. షరతు అనే పదానికి నిర్వచనం "ప్రధాన విషయానికి వ్యతిరేకంగా గానీ, సమానంగా గానీ ఉండెడిది; మధ్యమ విషయానికి నిత్యం సంబంధం ఉండవలసిన అవసరం లేనిది " అనేది మనం ఒప్పుకుని తీరాలి. శబ్దం యొక్క అశాశ్వతత్వాన్ని (సృష్టించటం, జాడీ యొక్క ప్రవర్తన, పరీక్షించలేకపోవటం) ధృవీకరించటానికి పూర్తి నిర్వచనంలో మూడు అబద్ధపు షరతులను నిరోధించటానికి ఈ మూడు వేర్వేరు నిబంధనలు - " నిత్యం మధ్యమ విషయానికి సంబంధం ఉండవలసిన అవసరం లేనిది", "నిత్యం ప్రధాన విషయంతో సంబంధం ఉండవలసినది", "నిత్యం ప్రధాన విషయంతో ఉన్న సంబంధం చే గుర్తించబడేది" అవసరం. ఇది సమాసమములోని ప్రారంభంలో ఒక పరిశోధకుడు శ్లోకరూపంలో కూడా చెప్పెను.
1.19 అయితే ఇక్కడ షరతు యొక్క జ్ఞానము షరతు లేకపోవటం అనే జ్ఞానాని కంటే ముందే రావాలి. షరతు యొక్క జ్ఞానము ఉన్నపుడే, ప్రతిపాదన యొక్క షరతు యొక్క జ్ఞానము సాధ్యపడుతుంది. అనగా, ప్రధాన విషయం, మధ్యమ విషయం మధ్య ఉన్న సంబంధం యొక్క జ్ఞానము, ఏదేని షరతు లేకున్ననూ, ఆ తేడాను గ్రహించగలిగేలా ఉండాలి. మరొకవైపు షరతు యొక్క జ్ఞానము, అవినాభావ సంబంధము యొక్క జ్ఞానము పై ఆధారితమై ఉంటుంది. అలా మన వ్యతిరేకులకు మనం తుమ్మబంక లాగా మన తర్కాన్ని తిరగలి తిప్పినట్లు అక్కడే తిప్పుతాం. కావున ప్రతిపాదన యొక్క సార్వత్రికత లో ఉన్న అసాధ్యత వలన అనుమితిని ధృవీకరించటం కూడా అసాధ్యమౌతోంది. అది వరకు ఉన్న అవగాహన వలన, లేదా ఆ అవగాహనలో ఉన్న తప్పిదం వలన, లేదా అదివరకు కలిగిన ఫలితాల వలన జరిగిన నిర్ధారణ వలన; మణిమంత్ర ఔషధాది ప్రయోగాలలో ఎలా ఏది కోరితే అదే చూస్తామో; పొగను చూడగనే నిప్పు అనే నిర్ధారణకు వచ్చే సందర్భంలో మనసు కూడా మనల్ని అలా తప్పటడుగు వేయిస్తుంది. విధి అనేది లేదని, అనుమితితోనే ఇటువంటి వాటిని నిరూపించగలమని, దీనిని బట్టి తెలుస్తుంది. అయితే వ్యతిరేకులు అదృష్టాన్ని నమ్మకపోతే ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలకు కారణమే దొరకదు అని వాదిస్తారు. ఈ వాదన సరియైనదిగా మనం అంగీకరించలేం. ఎందుకంటే ఈ ప్రక్రియలు వస్తువుల (విషయాల)లో ఉన్న వాటివాటి ఆకస్మిక మరియు ప్రాకృతిక స్వభావాలను బట్టే ప్రవర్తిస్తుంటాయి గనుక. ఈ వస్తువుల (విషయాల) స్వభావాలు జగత్తు యొక్క విచిత్రాలుగా అంగీకరించవలసిందే. "అగ్ని వేడిగా ఉంటుంది. నీరు చల్లగా ఉంటుంది. ప్రొద్దుటే వీచే పిల్లగాలి తాజాగా ఉంటుంది. ఈ వైవిధ్యం ఎవరిచే ప్రాప్తించినది? వాటి స్వభావరిత్యా మాత్రమే సిద్ధించినది."
1.20 ఇదంతా బృహస్పతి కూడా తెలిపెను. "స్వర్గం, నరకం, మోక్షం, ఆత్మ మరియు పరలోకఫలాలు; ఇవేవీ లేవు. వర్ణాశ్రమ భేధాలతో చేసే క్రియల వలన తర్వాతి కాలంలో వాటి వల్ల ఫలితాలు కలుగుతాయన్నది కూడా ఒట్టి మాటే!"
1.21 అగ్నిహోత్రాలు, యజ్ఞయాగాలు, మూడు వేదాలు, యజ్ఞోపవీతాలు, శరీరములోని భస్మలేపనము. ఇవన్నీ బుద్ధి లేని వారిపై రుద్దటం ద్వారా, అమానుషుల జీవనోపాధి కొరకు సృష్టించబడినవి.
1.22 జ్యోతిష్టోమాది యజ్ఞంలో ఏ పశువునైతే వధిస్తారో అది స్వర్గానికేగుతుందని తెలిపెదరు. ఇదే సత్యమైతే ఏదో ఒక యజ్ఞం చేసి మీ తల్లిదండ్రులను కూడా కాళికి బలివ్వచ్చు కదా? అలా చేస్తే వారికి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది కదా?
1.23 చనిపోయిన వ్యక్తి పేరుపై శ్రాద్ధం నిర్వహించటం వలనే అతని ఆత్మ శాంతించేటట్లయితే మనం దూరప్రదేశాల ప్రయాణానికి వెళ్ళినపుడు కూడా భోజనం ఎందుకు తీసుకువెళ్ళటం? వంటలన్నీ ఇంట్లోనే వండేసి నివేదించేస్తే ఆ భోజనం దానంతకై అదే మనకు ఆకలి వేసినపుడు మన ఆకలిని తీరుస్తుంది.
1.24 స్వర్గంలో ఉన్న వారి ఆత్మలకు శాంతి, భూమిపై వారి శ్రాద్ధాలతోనే జరిగేటట్లైతే, ఇంటి పై కప్పుపై ఉన్న వారి ఆకలిని క్రింది అంతస్థు నుండే తీర్చవచ్చు కదా?
1.25 జీవించినంత కాలం సుఖంగా జీవించు అప్పు తీసుకునైనా నేతిని సేవించు. ఒక్కమారు ఈ దేహం కాలి బూడిదైన తర్వాత అది తిరిగివచ్చునా?
1.26 ఈ దేహాన్ని విడిచి పరలోకము వెళ్ళగలిగినవారు, వారు ప్రేమించే బంధువుల, స్నేహితుల దేహాలలోకి ఎందుకు తిరిగిరారు?
1.27 వేదాల కర్తలు ముగ్గురు. వారే విదూషకులు, దొంగలు మరియు రాక్షసులు. పండితులుగా చెప్పుకొనే వీరు, వీరి నానా రకాల జర్ఫరి, తుర్ఫరి వంటి వాక్యాలతోనే వేదాలను నింపేశారు.
1.28 అశ్వమేథ యాగం చేసేవాడు ధర్మపత్నిని త్యజించి తలను నరికివేయాలి. ఇవన్నీ విదూషకులు రచించారు. స్వర్గ నరకాది విషయాలు ధూర్తులు రచించారు. ఏయే శాస్త్రాల్లోనైతే మద్యమాంసాలు నైవేద్యంగా సమర్పించాలని రాయబడ్డాయో, వాటిని రాక్షసులు రచించారు. తమను తాము పండితులుగా చెప్పుకొనే వీరందరూ ఈ రచనలను తమ పొట్ట నింపుకోవటానికి చేశారు. చార్వాకుడు ఇటువంటి వారిని, వీరి రచనలనే ఖండించాడు. సర్వప్రాణులకు జ్ఞానుగ్రహాన్ని ప్ర్రాప్తింపజేసేందుకు కృషి చేసి ఈ మతాన్ని విస్తరింపజేశాడు. ఈ చార్వాక మతాన్నే అందరూ అనుసరించాలి. ఇదే అన్ని మతాలలోకెల్లా శ్రేష్ఠమైన మతము.
చార్వాక దర్శనము ఇంతటితో సమాప్తము