సామెతలు - అం
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
ఇక్కడ "అం" అక్షరంతో మొదలయ్యే కొన్ని సామెతలు, వాటి వివరణలు ఇవ్వబడ్డాయి.
రచయితలు గమనించండి : క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
మార్చు- అర్ధం
సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు.
ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు.
- వాడుక
మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది
అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
మార్చుఅంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
మార్చుఅంచు డాబే కాని, పంచె డాబు లేదు
మార్చుపంచె అంచులో ఉన్న డాబుసరి (గొప్పదనం) మిగతా పంచెలో లేదు అని అర్థం. పైకి అన్నీ తెలిసినవారిలా కనపడుతూ లోపల మాత్రం విషయపరిజ్ఞానం లేని వాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.
అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
మార్చుతన వాస్తవ పరిస్థితితో నిమిత్తం లేకుండా, విపరీతముగా ఖర్చు చేసేవాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి.
అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
మార్చునిజానికి ఒక పెద్ద పుస్తకం చేత ఉండటానికీ, పంచాంగం చెప్పడానికీ సంబంధమే లేదు. కానీ, ఈ విషయం తెలియని అవివేకి ఆ పెద్ద పుస్తకం చేతబట్టిన వానిని పంచాంగం చెప్పలేని అనసమర్ధునిగానే పరిగణించును. ఇది వాని అవివేకానికి పరాకాష్ఠ. ఈ సామెత అట్టివాని అవివేకాన్ని గుర్తుచేస్తూ వాడుకలో ఉంది. అంతలావున్నావు తేలు మంత్రం తెలియదా అన్నట్టు .... ఈ సామెత కూడాను/
అంతంత కోడికి అర్థశేరు మసాలా.
మార్చుఒక వస్తువును పొందుటకు దాని యొక్క వాస్తవమయిన విలువ కన్నా ఎక్కువ ఖర్చుచేసి ఆ వస్తువును సొంతం చేసుకొనేవాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.
అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పు
మార్చుఅంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
మార్చుఈ సామెత అర్థాన్నిచ్చే మరో సామెత మొరిగే కుక్క కరవదు. అనగా, ఏ విధముగా నయితే ఉరుము పెద్దగా శబ్దము చేసినప్పటికీ అన్ని వేళలా పెద్ద వర్షము కురియదో, అదే విధముగా బయటకు గంభీరముగా యున్నను అందరు వ్యక్తులు లోపల ధైర్యముగా ఉన్నట్లు కాదు.
అంతా మనమంచికే.
మార్చుదీనికే మరొక రూపం కూడా ఉంది.. ఏది జరిగినా మన మంచికే! అని. సాధారణంగా, ఏదన్నా చెడు జరిగి ఎవరన్నా బాధపడుతున్నప్పుడు ఇలా సర్ది చెప్పడం జరుగుతుంది. దిని వెనక ఒక కథ కూడా ఉంది.
అనగా అనగా ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక తెలివైన మంత్రి. మంత్రి చక్కని సలహాలతో రాజును సమస్యలనుండి తప్పిస్తూ ఉంటాడు. ఒకనాడు పండ్లు తింటుండగా కత్తివాటుకు పొరపాటున రాజుగారి వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి "అంతా మన మంచికే" అన్నాడు. వేలు తెగి బాధ పడుతుంటే, ఈయనేమిటి అంతా మంచికేనంటాడు అని రాజుకు కోపం వచ్చింది! ఎలాగైనా మంత్రికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.
ఆ తరువాత రోజు అందరూ కలసి వేటకి వెళ్తారు. రాజు, మంత్రి దారి తప్పి పోతారు. రాజు మంత్రిని ఒక బావిలోకి (నూతిలోకి) తోసి "ఏది జరిగినా మన మంచికే, నువ్వు చెప్పిందే గదా" అని వెటకారంగా అని వెళ్ళిపోయాడు. కానీ దురదృష్టవశాత్తూ, రాజును ఒక అటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. ఇంతలో అతని వేలికి ఉన్న గాయాన్ని చూసి బలి ఇవ్వడానికి పనికిరాడు అని వదిలేసారు.
వేలు తెగినపుడు మంత్రి అన్న మాట గుర్తుకు వచ్చి, రాజు అతనిని బావినుండి వెలుపలికి తీసాడు. రాజు "నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?" అని అడిగాడు. అప్పుడు మంత్రి "నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతోపాటు నన్నూ పట్టుకునేవాళ్ళు. అప్పుడు మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవారే కదా ప్రభూ" అని బదులిచ్చాడు.
అందుకే అంటారు - "అంతా మన మంచికే", "ఏది జరిగినా మన మంచికే"
అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
మార్చుఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది.
అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
మార్చుబంగారం కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ క్లిష్టపరిస్థితుల్లో ఆ బంగారమే అక్కరకొచ్చి ఆదుకుంటుంది. ఈ విషయాన్నే, కొన్ని వస్తువులపై పెట్టిన ధనము లేదా శ్రమ, కేవలం వాటి యొక్క ప్రాథమిక వినియోగమునకే కాక, అవసరమును బట్టి ఇతరత్రా కూడా పనికివచ్చును అని సామెత ద్వారా చెప్పుచున్నారు.
అందని ద్రాక్ష పుల్లన
మార్చుఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి, "ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి?" అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు.
అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
మార్చుపెళ్ళయిన ఆడపిల్ల పుట్టంట అందరి కాళ్ళకి మ్రొక్కి, చివరకు అత్త వారింటికి చేరుకుంటుంది. ఈ విషయాన్నే చమత్కారంగా, ఒక ముప్పు తప్పించుకోటం కోసే ఏవేవో ప్రయత్నాలు చేసి, చివరికి ఆ ముప్పు తప్పించుకోలేనివాణ్ణి ఉద్దేశించి ఈ సామెత చెబుతారు.
అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
మార్చునలుగురికీ నీతులు చెప్పే వాడు తానే తప్పులు చేస్తే, ఆతణ్ణి ఉద్దేశించి ఈ సామెత వాడతారు.
అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
మార్చుశ్రీవైష్ణవులు బ్రాహ్మణులలో ఒక తెగ. బ్రాహ్మణులు మాంసం భుజించరు. అందరూ వైష్ణవులే - శాకాహారులే - ఉన్న చోట బుట్టలో ఉన్న రొయ్యలు మాయమయ్యాయి. ఉన్నవాళ్ళలోనే ఎవరో తీసి ఉండాలి, అంటే వారిలో ఎవరో ఒకరో, కొందరో మాంసాహారులై ఉండాలన్న మాట. కానీ ఆ విషయం ఎవరూ ఒప్పుకోరు. అలాగే, ఎక్కడైనా ఒక తప్పు పని జరిగినప్పుడు అక్కడ వున్నవారంతా 'నేను కాదంటే నేను కాదు' అని అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తప్పు జరిగిపోయింది, అక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు ఆ పనిచేసి ఉండాలి. చేసినట్లు ఎవరూ ఎవరూ ఒప్పుకోవడం లేదు - అందరూ శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలు మాత్రం మాయమయ్యాయి.
బ్రాహణులు మాంసాహారం తినరు. అక్కడున్న వారందరు బ్రాహలే. కాని రొయ్యలు మాయమైనాయి. అంటే ఆ బ్రాంహలల్లో ఎవరో ఒకరు రొయ్యలను తస్కరించారని అర్థం వచ్చే టట్లు ఈ మాట పుట్టింది. ఇలాంటిదే ఇంకొకటి కూడా ఉంది. అది. "అందరూ బ్రాంహలే కాని గంప కింది కోడి మాయం అయినది.
అందితే జుట్టు అందకపోతే కాళ్లు
మార్చుఅవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది.
అందితే తల, అందకపోతే కాళ్లు
మార్చుఈ సామెత అర్థమే కలిగిన మరో సామెత అందితే జుట్టు అందకపోతే కాళ్లు
అంధుడికి అద్దం చూపించినట్లు
మార్చుకొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన.
అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాడొకడు
మార్చుబద్దకానికి ప్రతీకగా ఈ సామెతను వాడుతారు. తాగేదే అంబలి అయినా తాగేటప్పుడు మీసాలు అడ్డురాకుడదని మీసాలు లేపమన్నాడు అనే దానికి ఈ సామెత వాడుతారు. ఏమి లేకపోయినా బద్ధకం మాత్రం బాగా ఉందని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
- ↑ లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం